Monday, November 30, 2020

కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం


 కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం




వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

బాలసాహితీ రచయిత

9908953245


జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన మండలం తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /. యాదవులు,మత్య్సకారులు నివశిస్తా ఉన్నారు.1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బల్లోజి బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో 

ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది. బల్లోజిబాబా చరితార్దుడు అనడంలో సందేహం లేదు. 

1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా.ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి,వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి.ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి(గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు. ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి.

చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జంమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి.అడవిలోకి వెళ్ళడానికి బయపడేవారు. తేనెటీగల ఝంకారంచేస్తూ గుంపులు గుంపులుగా అడవి అంతా పెద్ద శబ్దం చేస్తూ ముసురుతూ వుండేవి.

            చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు  తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేది. జమిందారులు మహా ఇష్టంగా తినేవారు. 

    తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది.  ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు.కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు,తుమ్మచెట్లు,అడవి ఎద్దులు,గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి. పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం.


తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి?

మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా,పూరి,మచిలీపట్నం,యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850  తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు.



 


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...