Sunday, June 27, 2021

శ్రీనివాస పిళ్ళై


 శ్రీనివాస పిళ్లై తండ్రి మునియపిళ్లై. ఆనాడు మదరాసులోని అత్యంత ధనవంతుల్లో ఒకడు. 1807లో కరువు వచ్చినపుడు వారిని ఆదుకునేందుకు ఈస్టిండియా కంపెనీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో తొమ్మిది మంది దేశీయు లున్నారు. అందులో మునియపిళ్లై ఒకరు. తండ్రి సంపాదించిన ఆస్తిలో చాలా వరకు శ్రీనివాస పిళ్లై విద్యావసరాలకు వెచ్చించిండు.

శ్రీనివాస పిళ్లై జూలై 5, 1849లో వీలునామా రాస్తూ చెంగల్పట్‌ జిల్లా మణిమంగంళం తాలూకాలో తమ 'మేట తొడుకాడు' ఎస్టేట్‌లో ఉన్న 1500ల కానీలు (ఒక కానీ 1.322 ఎకరాలకు సమానం) భూమిని పచ్చియప్ప చారిటీస్‌ ట్రస్ట్‌కు రాసిచ్చిండు. అంతేగాకుండా ఇందులో ఎనిమిదోవంతు ఫండ్స్‌ని పేద బ్రాహ్మణేతర విద్యార్థులకు స్కాలర్‌షిప్‌గా ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. ఆ మేరకు ఆయన కుటుంబంలోని వారు అర్హులైన వారిని ఎంపిక చేసేవారు. దేశంలో బ్రాహ్మణేతరుల విద్య కోసం పాటుపడిన మొదటి వ్యక్తి శ్రీనివాసపిళ్లై. వారి కోసం ఏకంగా ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి దానితరపున కింది కులాల వారి విద్యకు కృషి చేసిండు. ఇది అప్పటికి విప్లవాత్మక చర్యగా గుర్తించాలి.

అవును పేద బ్రాహ్మణేతర విద్యార్థులకు అవార్డులివ్వాలని 1849లోనే శ్రీనివాస ప్ళి వీలునామా రాసిండు. పిళ్లై కూడాబ్రాహ్మణేతరుడే. బహుజనుడు. శ్రీనివాస ప్ళి 21 జనవరి 1804 నాడు మదరాసులో జన్మించిండు. దిగవల్లి శివరావు ఈయన 1852లో చనిపోయిండని కాశీయాత్ర చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి పిళ్లై 27 మార్చి 1853 నాడు చనిపోయిండు. ఈయన యాదవ కులంలో జన్మించిండు.

ఇట్లా ఒక సంపన్న యాదవ కులంలో పుట్టి చదువుకొని, 1830వ దశకంలోనే పేదవారి విద్యాభ్యాసం కోసం అహరహం కృషి చేసిండు. వితంతు వివాహాలను ప్రోత్సహించిండు. గాజుల లక్ష్మీనరసు శెట్టి, ఎం.వెంకట్రాజులు నాయుడు, తదితరులతో కలిసి మదరాసు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలకు ఊత మిచ్చిండు. ఇంకా చెప్పాలంటే 1830-1853 మధ్య కాలంలో శ్రీనివాస పిళ్లై లేకుండా మదరాసులో ఎలాంటి ప్రజాహిత సామాజిక, రాజకీయ కార్యక్రమం జరగలేదంటే అతిశయోక్తి కాదు. బహుశా మొత్తం భారతదేశంలో కింది కులాల వారి విద్య కోసం పరితపించిన వారిలో శ్రీనివాస పిళ్లై మొదటి వాడు. ఆయనకు నివాళి.

సంగిశెట్టి శ్రీనివాస్‌

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...