Sunday, August 21, 2022

5 జీ

 ఇప్పుడు బస్సులు.. రైళ్లు, విమనాలు.. రాకెట్లు.. జాకెట్లు...'' అని.

ఇంకొన్ని నెలలు గడిస్తే దేశంలోనూ ఇలాంటి డైలాగులే వినిపిస్తాయి. కాకపోతే కొంత మార్పుతో..

ఎలాగంటే... ''ఆపేయ్‌.. ఆపేయ్‌.. ఎప్పుడో 4జీ కాలం నాటి ఇంటర్నెట్టూ..

స్ట్రీమింగ్‌ సర్వీసున్నూ. ఇప్పుడు సెకనుకు 20 గిగాబైట్ల 5జీ'' అని!!

:::గిళియారు గోపాలకష్ణ మయ్యా

అవును. ఇదే వాస్తవం. మొబైల్‌ ఫోన్లలో సరికొత్త తరం.. విప్లవం మన ముంగిట్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం దాదాపుగా పూర్తవడంతో మునుపెన్నడూ చూడని వేగం, సౌకర్యాలతో ఇప్పుడున్న నాలుగో తరం మొబైల్‌ టెక్నాలజీని తోసిరాజని వినూత్నమైన 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఏమిటీ 5జీ? ఎలా పనిచేస్తుంది?ఎందుకు దీనికంత క్రేజ్‌? మనకొచ్చే లాభాలేమిటి?

1979లో తొలి తరం మొబైల్‌ ఫోన్‌ వచ్చిన తరువాత ఈ నలభై ఏళ్ల కాలంలో టెక్నాలజీ ఎంత మారిపోయిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కళ్లముందు ప్రత్యక్షంగా తార్కాణాలు కనిపిస్తునే ఉన్నాయి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసి ఆపరేటర్‌ కాల్‌ కలిపేదాకా వేచి చూడటమన్న ఫిక్స్‌డ్‌ లైన్‌ టెలిఫోన్‌ టెక్నాలజీకి బ్రేక్‌ వేసి వైర్‌లెస్‌ పద్ధతిలో మొబైల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు కేవలం మాటలు... అది కూడా అరకొరగా వినిపించేవి. ఇప్పుడు స్పష్టమైన హై డిఫినిషన్‌ వీడియోలూ అరచేతుల్లోని స్మార్ట్‌ఫోన్లలోకి ఇమిడిపోయాయి.

వినోదం, వ్యాపారం, విద్య అన్నీ ఈ స్మార్ట్‌ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. అయితే.. వేగం, సౌకర్యం అన్న రెండు అంశాల విషయంలో మనిషి దాహం అంతులేనిది. సెకనుకు గిగాబైట్‌ వేగంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగల 4జీతో తప్తి పడలేదు. అంతకంటే వేగం, మరింత ఎక్కువ సౌకర్యాలు... వాటితోనే అనేకానేక ఇతర లాభాలను ఆశిస్తూ ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో 5జీ మొబైల్‌ టెక్నాలజీని ఆవిష్కరించారు. మూడేళ్ల క్రితం కొన్ని దేశాల్లో ప్రయగాత్మకంగా 5జీ సేవలు మొదలయ్యాయి కూడా. ఈ ఏడాది అక్టోబరుకల్లా భారత్‌లోనూ 5జీ సేవలకు రంగం సిద్ధమైంది.

4జీ ఎల్‌టీఈ కంటే భిన్నం....
5జీ మొబైల్‌ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్న 4జీ ఎల్‌టీఈ కంటే పూర్తిగా భిన్నమైంది. 4జీ ఎల్‌టీఈ కేవలం ఒకే శ్రేణి రేడియో తరంగాలతో పనిచేస్తే.. 5జీ ఏక కాలంలో మూడు రకాల తరంగాలతో పనిచేయగలదు. గిగాహెర్ట్‌›్జకంటే తక్కువ పౌనఃపున్యమున్న తరంగాలు మొబైల్‌ ఫోన్‌ సంకేతాల పరిధి ఎక్కువగా ఉండేందుకు సాయపడతాయి. భవనాల గోడల గుండా సులువుగా సంకేతాలు ప్రయాణం చేయగలవు. తక్కువ లాటెన్సీ (సంకేతాలు మొబైల్‌ఫోన్‌ నుంచి సెల్‌ టవర్‌కు చేరేందుకు పట్టే సమయం), ఎక్కువ వేగం (సెకనుకు గిగాబైట్‌ వరకూ) ఇవ్వగల మిడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను కూడా 5జీలో వాడతారు. చివరగా సెకనుకు పది గిగాబైట్ల వేగం ఇవ్వగల హైబ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ తరంగాలూ ఈ కొత్త టెక్నాలజీలో భాగం కావడం గమనార్హం. 4జీలో లాటెన్సీ గరిష్టంగా 98 మిల్లీసెకన్లయితే 5జీలో ఇది మిల్లీ సెకను కంటే తక్కువ. డౌన్‌లోడింగ్‌ వేగాలు చూస్తే 4జీలో 1సెకనుకు 100 మెగాబైట్ల నుంచి ఒక గిగాబైట్‌ వరకూ ఉంటుంది. 5జీలో 1సెకనుకు కనీసం పది గిగాబైట్ల నుంచి గరిష్ఠంగా 20 గిగాబైట్ల వరకూ ఉంటుంది. అంతేకాదు.. ఇప్పటి నెట్‌వర్క్‌లో ఒక్కో మొబైల్‌ టవర్‌ ద్వారా 200 నుంచి 400 మందికి సేవలందితే.. 5జీలో వంద రెట్లు ఎక్కువ మంది సులువుగా అందుకోగలరు.

లోటుపాట్లూ లేకపోలేదు...
5జీ టెక్నాలజీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఉన్న వాటిని తొలగించి కొత్త బేస్‌స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. టెక్నాలజీ ఎంత విజయవంత మవుతుందనేది ఈ లోపాలను అధిగమించడంలో ఉంటుంది. ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాలు అత్యధికంగా మొబైల్‌ నెట్‌వర్క్‌లోకి చేరుతూండటం వల్ల భద్రత, వ్యక్తిగత గోప్యత వంటివి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు హ్యాకర్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మన దేశంలో ఎందుకాలస్యం..?
అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ సౌదీ అరేబియా వంటి దాదాపుగా 72 దేశాల్లో 1950 వరకు నగరాల్లో 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. 2019లోనే దక్షిణ కొరియా 5జీ సేవల్ని ప్రారంభించింది. మన దేశంలో 2020లోనే 5జీ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో టెలికమ్యూనికేషన్‌ శాఖ 5జీ స్పెక్ట్రమ్‌ వేలం వేయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంతేకాకుండా 5జీ నెట్‌వర్క్‌కు కావాల్సిన ఫైబర్‌ నెట్‌వర్క్‌ లైన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గత ఏడాది నాటికి కేవలం దేశంలో 30% ప్రాంతాల్లో ఈ ఫైబర్‌ నెట్‌వర్క్‌ లైన్లు పూర్తయితే, మరో 70 శాతం మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. టెలికాం సంస్థలన్నీ పూర్తి స్థాయిలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ లైన్లు వెయ్యాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అంచనా. అందుకే ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

టెక్నాలజీతో మన బుర్రలు మందగిస్తాయా?
5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మనుషులకు పని తగ్గిపోతుంది. అయితే దీనివల్ల మన బుర్రలు మందగిస్తాయని కొందరి వాదన. ఒకప్పుడు 30 నలభై ఫోన్‌ నెంబర్లను అలవోకగా గుర్తుంచుకోగలిగేవాళ్లమని... మొబైల్‌ ఫోన్లు వచ్చిన తరువాత అది సాధ్యం కావడం లేదని తమ వాదనకు ఆధారంగా కొందరు వ్యాఖ్యానిస్తూంటారు. ఇందులో నిజం కొంతే. ఎందుకంటే అవసరం లేని విషయాలపై దృష్టి పెట్టకపోవడం మెదడుకు ఉన్న సహజ లక్షణం. అలాగని మనం మెదడును వాడుకోవడం లేదని కూడా అనుకోనవసరం లేదు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా మునుపటి స్థాయిలో ఫోన్‌ నెంబర్లు గుర్తు పెట్టుకోవడం కష్టమేమీ కాదు. మునుపటితో పోలిస్తే మన పరిచయాలు.. ఫోన్‌ నెంబర్ల సంఖ్య ఎంత పెరిగిందో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు... మొబైల్‌ఫోన్ల వల్ల మన బుర్ర మందగిస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.

విమానాలకు 5జీతో ముప్పు?
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు మొదలైన సందర్భంగా కొంత గందరగోళం ఏర్పడింది. పలు దేశాలు అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నారు. 5జీ మొబైల్‌ సర్వీసుల కోసం ఉపయోగించే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ, విమానాల్లో ఎత్తును సూచించేందుకు వాడే రేడియో ఆల్టీ మీటర్‌ వాడే ఫ్రీక్వెన్సీ దాదాపు ఒకే స్థాయిలో ఉండటం వల్ల సమస్యలు వస్తాయని గుర్తించడం ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరిలో వెరిజాన్‌, ఏటీ అండ్‌ టీ టెలికామ్‌ సంస్థలు అమెరికాలో తమ 5జీ సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంలో ఈ విషయాన్ని గుర్తించారు.

5జీ సంకేతాల కారణంగా రేడియో ఆల్టీమీటర్‌ ఇంజిన్‌ తాలూకూ బ్రేకింగ్‌ వ్యవస్థను ప్రభావితం చేసి విమానాలు ల్యాండింగ్‌ మోడ్‌లోకి వెళ్లకుండా చేస్తుందని.. దీనివల్ల విమానాలు రన్‌వే పై ఆగకపోవచ్చునని అమెరికా ప్రభుత్వ సంస్థ ఎఫ్‌ఏఏ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. రేడియో తరంగాలను ఫిల్టర్‌ చేసే పరికరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని అంచనా. ఈ ఏడాది చివరికల్లా బోయింగ్‌ ఇంజిన్‌ కలిగిన విమానాలు ఈ రేడియో ఫిల్టర్లను అమర్చుకోవాలని ఫెడరల్‌ ఏవియేష¯Œ ఏజెన్సీ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ

తొలి తరం...(1జీ) 1979
మొట్టమొదట వైర్‌లెస్‌ పద్ధతిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది జపాన్‌కు చెందిన నిప్పాన్‌ టెలిగ్రాఫ్‌ అండ్‌ టెలిఫోన్‌ (ఎన్‌టీటీ) టోక్యో నగరంలో ప్రారంభించింది. 1979లో మొదలు కాగా.. 1984 నాటికి జపాన్‌ మొత్తం 1జీ నెట్‌వర్క్‌ విస్తరణ జరిగింది. అమెరికాలో 1980లో, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 1985లో 1జీ సేవలు మొదలయ్యాయి. గరిష్ట వేగం సెకనుకు కేవలం 2.4 కిలోబైట్స్‌ మాత్రమే. మాటలు మాత్రమే ఉన్న మొబైల్‌ సర్వీస్‌ ఇది.

రెండో తరం... (2జీ) 1991
యూరోపియన్‌ దేశం ఫిన్లాండ్‌లో 1991లో మొదలైంది రెండో తరం మొబైల్‌ సర్వీస్‌. గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ (జీఎస్‌ఎమ్‌) ప్రమాణాలతో డిజిటల్‌ సిగ్నలింగ్‌ ఆధారంగా మాటలు మాత్రమే ఉన్న ఈ సర్వీస్‌ లాభం ఏమిటయ్యా అంటే.. సామర్థ్యం, వేగం రెండూ 1జీ కంటే ఎక్కువ అని చెప్పాలి. బ్యాండ్‌విడ్త్‌ను చూసుకుంటే 30 - 200 కిలోహెర్ట్‌›్జమధ్యలో ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు పంపుకునేందుకు కూడా అవకాశం లభించింది. కాకపోతే ఈ ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్‌ల వేగం గణనీయంగా తక్కువ. 2జీ నెట్‌వర్క్‌ ద్వారా అత్యధిక వేగం సెకనుకు 64 కిలోబైట్స్‌ మాత్రమే.

మాటలకు వీడియోలు తోడైన మూడో తరం... (3జీ) 2001
మాటలకు... డేటా తోడైన మూడో తరం మొబైల్‌ సర్వీసులు 2001లో ఎన్‌టీటీ డోకోమో ద్వారా ప్రారంభమయ్యాయి. వినియోగదారులందరికీ ఒకే రకమైన ప్రమాణాలతో, అత్యధిక సామర్థ్యంతో డేటాను ప్రసారం చేయడంతోపాటు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ వేగం ఉండేలా ఇందులో జాగ్రత్తలు తీసుకున్నారు. మొబైల్‌ఫోన్ల ద్వారా వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, స్ట్రీమింగ్‌ సౌకర్యాలు కూడా దీంతోనే అందుబాటులోకి వచ్చాయి. 3జీ గరిష్ఠ వేగం సెకనుకు మూడు మెగాబైట్లు కావడం గమనార్హం.

స్మార్ట్‌ఫోన్ల శకానికి నాందీ పలికిన నాలుగో తరం... (4జీ) 2009
యూరోపియన్‌ దేశం స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్, నార్వే రాజధాని ఓస్లోలలో 2009లో తొలి 4జీ సర్వీసులు మొదలయ్యాయి. లాంగ్‌టర్మ్‌ ఎవల్యూషన్‌ (ఎల్‌టీఈ), 4జీ ప్రమాణాల పుణ్యమా అని మాటల్లో స్పష్టత, లాటెన్సీ (నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయ్యేందుకు ఫోన్‌ లేదా పరికరానికి పట్టే సమయం), ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ వంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇంకోలా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్లు, హ్యాండ్‌హెల్డ్‌ పరికరాల శకం మొదలైందన్నమాట. సోషల్‌మీడియా, నాణ్యమైన స్ట్రీమింగ్‌ సేవల హవా మొదలైందీ ఇప్పటి నుంచే. గరిష్ఠవేగం సెకనుకు 15 నుంచి 20 మెగాబైట్లు.

అన్నింటా వేగం.. 5జీ (2019)
డేటా ట్రాన్స్‌ఫర్, అప్‌లోడ్‌/డౌన్‌లోడ్‌ వేగాలు 4జీ కంటే కనీసం పది రెట్లు ఎక్కువ వేగవంతమైన మొబైల్‌ సర్వీసు ఈ ఐదో తరం క్లుప్తంగా 5జీ. ''మీరు కాల్‌ చేస్తున్న వినియోగదారుడు నెట్‌వర్క్‌ పరిధికి ఆవల ఉన్నాడు'' అన్న సందేశం అస్సలు వినిపించదంటే అతిశయోక్తి కాదు. తక్కువ యాంటెన్నాలతో ఎక్కువమందికి కనెక్షన్లు ఇచ్చేందుకూ వీలు కల్పిస్తుంది ఇది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ల్యాప్‌టాప్‌లతోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోవలోకి వచ్చే పరికరాలకూ డేటా సామర్థ్యం అలవడటం వల్ల అనేకానేక లాభాలు ఉంటాయని అంచనా. 2019లో పాశ్చాత్యదేశాల్లో ప్రయోగాత్మంగా మొదలైన ఈ కొత్త మొబైల్‌ టెక్నాలజీ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది.

►2024 నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 65 శాతం మందికి 5జీ సేవలు అందుతాయని ఎరిక్‌సన్‌ మొబైల్‌ రిపోర్ట్‌ చెబుతోంది.

►2019లో 5జీని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సష్టించింది.

10 కోట్లు...
ప్రస్తుతం దేశంలో 5జీ సామర్థ్యమున్న స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారి సంఖ్య

50 కోట్లు...
2027 నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు

97 కోట్ల 96 లక్షల 27 వేల కోట్ల రూపాయలు!!
2035 నాటికి 5జీ టెక్నాలజీ కారణంగా అందే వస్తు, సేవల విలువ.

మూడు కోట్ల 58 లక్షల 42 వేల కోట్ల రూపాయలు!!
రానున్న 15 ఏళ్లలో కేవలం 5జీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు అందే మొత్తం.

ఆరోగ్యం.. ఆనందం... సౌకర్యం...

చిటికెలో రొబోటిక్‌ సర్జరీలు...
5జీతో వచ్చే మెరుపు వేగం అమెరికా వైద్యుడు అనకాపల్లిలో ఉన్న రోగికీ శస్త్రచికిత్స చేయడాన్ని సుసాధ్యం చేస్తుంది. కనురెప్ప మూసి తెరిచేలోపు గిగాబైట్ల సమాచారం ఖండాలు దాటగలవు కాబట్టి... అత్యవసర పరిస్థితుల్లోనూ సులువుగా ప్రపంచంలోని ఏమూలన ఉన్న నిపుణుడినైనా సంప్రదించవచ్చు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలకు శ్రీకారం చుట్టగల టెలిమెడిసిన్‌ విస్తృత వాడకంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తుంది ఈ టెక్నాలజీ. అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చునని అంచనా.

కొత్త అనుభూతుల లోకం...
ఇంటర్నెట్‌ అంటే ఇప్పటివరకూ మనకు దృశ్య శ్రవణ అనుభూతులను మాత్రమే ఇచ్చేది. అయితే 5జీ రాకతో స్పర్శ కూడా అనుభవంలోకి వస్తుంది. హ్యాప్టిక్స్‌ అని పిలిచే ఈ కొత్త అనుభవం ఎన్నో లాభాలు తెచ్చిపెట్టనుంది. సమాచారం మెరుపువేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి... అమెరికాలో ఓ వైద్యుడు మెడికల్‌ రోబో ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న రోగికి శస్త్రచికిత్స చేయగలడు. వీడియోగేమ్‌లు, సినిమాల ద్వారా స్పర్శతోపాటు అనేక ఇతర ఇంద్రియ జ్ఞానాలను ఎక్కడికైనా ప్రసారం చేయవచ్చు. 5జీతో రేడియో ఫ్రీక్వెన్సీల్లోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్‌కు అనుసంధానమైన అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోతుంది.

డ్రైవర్‌ అవసరం లేని వాహనాలు...
డ్రైవర్లు అవసరం లేని వాహనాలు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నాయి కానీ... 5జీ విస్తత వాడకంలోకి వస్తే ఇవి సర్వవ్యాప్తమవుతాయి. వేగవంతమైన డేటా ట్రాన్స్‌మిసబిలిటీ కారణంగా వాహనాల్లోని సెన్సర్లు, కెమెరాలు, మైక్రోప్రాసెసర్లు పరిసరాల్లోని ఇతర వాహనాలతో సంభాషించగలవు. తద్వారా ప్రమాదాలు కనిష్ఠస్థాయికి చేరతాయి. వాహనాల మధ్య సంభాషణ సాధ్యమైన కారణంగా రహదారిపై ముందు వెళుతున్న వాహనం ఏదైనా ప్రమాదాన్ని శంకిస్తే లేదా ట్రాఫిక్‌ సమస్య ఎదుర్కొంటే ఆ విషయాన్ని వెనుకన వస్తున్న వాహనాలకు ప్రసారం చేయడం ద్వారా ట్రాఫిక్‌ జామ్‌లను నియంత్రించగలవు.

ఫ్యాక్టరీలు నడుస్తాయి....
దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌కు జరిగిన వేలంలో కొంత భాగాన్ని అదానీ గ్రూపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే అదానీ గ్రూపు టెలిఫోన్‌ సేవలు అందించే అవకాశం తక్కువ. బదులుగా ఇండస్ట్రియల్‌ అంటే ఫ్యాక్టరీలు నడిపేందుకు 5జీని వాడుకుంటున్నారు. ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాలు (ఐఓటీ)లకూ 5జీ ఉపయోగపడుతుంది కాబట్టి.. సెన్సర్లు, రోబోల ద్వారా మొత్తం ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చక్కబెడతారన్నమాట. ఫ్యాక్టరీలేం ఖర్మ... భవిష్యత్తులో ఇళ్లు, భవనాలు కట్టేందుకూ 5జీ ఆధారిత రోబోలు పనికొస్తాయంటే ఆతిశయోక్తి ఏమీ కాదు. పనిచేయాల్సిన ప్రాంతాన్ని కచ్చితంగా మ్యాప్‌ చేయగలడం, ఇతర రోబోలు, పరికరాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వేగంగా, సురక్షితంగా భవన, వాహనాలు మాత్రమే కాకుండా... ఏ వస్తువునైనా అసెంబుల్‌ చేయడం సాధ్యమవుతుంది.

కృత్రిమ మేధకు ఊపు....
లాటెన్సీ అతితక్కువగా ఉండటం, డేటా ప్రసార వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల కృత్రిమ మేధతో పనిచేసే అల్గారిథమ్‌లను మెరుగైన నాణ్యతతో నడిపించవచ్చు. అంటే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ నిర్ణయాలు తీసుకోవడం మరింత వేగంగా జరుగుతుందన్నమాట. దీనివల్ల అత్యంత కీలకమైన విషయాల్లోనూ మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు సురక్షితంగా జరిగిపోతాయి. ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ అంటే.. మానవుల అవసరమే లేకుండా డ్రోన్లు, సెన్సర్లు, కెమెరాలు, స్వతంత్రంగా వ్యవహరించే కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌లు కలిసికట్టుగా మన కోసం వ్యవసాయం చేస్తాయి. ఎప్పుడు ఏ కీటకనాశినిని వాడాలి? నీరెప్పుడు అందించాలి? కలుపుతీతకు సమయమేది? వంటివన్నీ తనంతట తానే వాతావరణ, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేందుకు 5జీ వీలు కల్పిస్తుంది.

5జీ టెక్నాలజీలో 'మేకిన్‌ ఇండియా'కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో ప్రత్యేకమైన 5జీ ఎకోసిస్టమ్‌ ఏర్పడనుంది.టెక్నాలజీలు, పరికరాలు ఇండియా కేంద్రంగా రూపొందనున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌లో సంస్కరణలు కూడా 5జీ టెక్నాలజీకి దోహదపడతాయి. - కె.జి.పురుషోత్తమన్, కేపీఎంజీ.

కోవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించడం ఎక్కువైంది. 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే టెలిమెడిసిన్‌తోపాటు ఆరోగ్య రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వేగవంతమైన, సురక్షితమైన టెక్నాలజీ కారణంగా వైద్యం అందించే పద్ధతులు కొత్తపుంతలు తొక్కుతాయి. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో, దేశ భద్రత, నిఘా వ్యవస్థల్లోనూ 5జీ కీలకపాత్ర పోషించనుంది. 5జీ ద్వారా కేవలం వీడియోలను చూసి విశ్లేషించడం మాత్రమే కాకుండా.. గుట్టుగా ఫేస్‌ రికగ్నిషన్‌ చేసేందుకూ ఉపయోగపడుతుంది. భారత్‌లో 5జీ ఆధారిత టెక్నాలజీలు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కషి చేస్తున్న స్టార్టప్‌లకు క్వాల్‌కామ్‌ ఇండియా తనవంతు సహకారం అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు 5జీ హ్యాకథాన్, స్టార్టప్‌ హబ్‌లలో చురుకుగా పాల్గొంటున్నాము. క్వాల్‌కామ్‌ డిజైన్‌ ఇన్‌ ఇండియా ఛాలెంజ్, ఇన్నొవేషన్‌ ఫెలోషిప్, యాక్సలరేటర్‌ సర్వీసస్, ఇన్నొవేషన్‌ ల్యాబ్స్‌ వంటి కార్యక్రమాలతో 5జీ టెక్నాలజీల వద్ధికి ప్రయత్నిస్తున్నాం. - రాజెన్‌ వగాడియా, వైస్‌ ప్రెసిడెంట్, క్వాల్‌కామ్‌ ఇండియా.

Friday, August 19, 2022

అరకు ప్రదేశాలు

 అరకు ప్రాంతము చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు,లోతైన లోయలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలు

Andhra Ooty Araku Valley: ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే పర్యాటకులు అరకు చూడకుండా వెళ్లరు. ఆంధ్రా ఊటీగా పిలుచుకునే అరకు, విశాఖపట్నానికి సుమారు 115 కీ.మీ దూరాన, ఆంధ్రా - ఒడిశా సరిహద్దు కు సమీప ప్రాంతములో వుంది. అరకు ప్రాంతము చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు,లోతైన లోయలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలు మరియు ప్రకృతి ప్రసాదించిన ఎన్నెన్నో అందాలతో చూడదగ్గ పర్యాటక ప్రదేశం.

అరకు చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు..

ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం,
శ్రీ వేంకటేశ్వరాలయం, పద్మాపురం గార్డెన్స్
రణజిల్లెడ వాటర్ ఫాల్స్, చాపరాయి జలపాతం
మత్స్యగుండం, అనంత గిరి మౌంటెన్
బొర్రా గుహలు, కవిటి వాటర్ ఫాల్స్
అనంతగిరి వాటర్ ఫాల్స్, తాడిగుడ వాటర్ ఫాల్స్
టైడా జంగిల్ బెల్స్ మొదలైనవి తప్పకుండా చూడాలి.

అరకు బస్ స్టాండ్ కు సమీపంలో ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, శ్రీ వేంకటేశ్వర ఆలయం ఉంటాయి. అరకు లోయ - అరకు రైల్వే స్టేషన్ రోడ్డు కు సుమారు మూడు కీ.మీ లోపలకి పద్మాపురం ఉద్యాన వనం ఉంది. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్‌ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తాయి అరకు లోయకు ఉత్తరం దిశగా. సుమారు ఏడు కీ.మీ దూరాన రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కలవు. అరకు - పాడేరు రోడ్డు మార్గంలో చాపరాయి జలపాతం ఉంది. అరకు గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో గల చాపరాయి జలపాతం చూడగలం. బండరాయి వంటి చాపరాతి మీదగా నీటి ప్రవాహం జాలువారుతుంది. ఇక్కడ బొంగు చికెన్ ఫేమస్. విశాఖపట్నం నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా అరకు చేరుకోవచ్చు. ఇక్కడ పర్యాటకులు బసచేయడానికి పలు లాడ్జిలు వున్నాయి.

Monday, August 15, 2022

ప్రసంగాలు

 రెండు దృక్పథాల మంచి మేళవింపులవి..

గత శతాబ్దిలోనే ఘనమైన ఉపన్యాసాలవి...

దశాబ్దాలు గడిచినా విస్మరించలేని హెచ్చరికలవి..

75 ఏళ్ల నాడు నెహ్రూ, అంబేడ్కర్‌ ఆ ప్రసంగాల్లో

ఆశించినది నెరవేరినదెంత? విస్మరించినదెంత?

అమృత మహోత్సవ వేళ ఆ అమృతవాక్కులు

ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం!

ఆధునిక ప్రపంచ అనుభవాలను, వలసపాలన విషాదాలను మనస్సులో ఉంచుకుని వందల ఏళ్ల తర్వాత ఏకమైన జాతి సాధించాల్సి లక్ష్యాలను ఆ ప్రసంగాలు కళ్లకుకట్టాయి. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత రాజ్యాంగ రచనా సంఘం సారథి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 75 ఏళ్ల కిందట చేసిన ప్రసంగాలను ఇప్పటికీ దేశదేశాల్లో ఆలోనాపరులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి రాజ్యాంగ సభ సభ్యులనుద్దేశించి నెహ్రూ చేసిన (ట్రిస్ట్‌ విత్‌ డెస్టిని) ప్రసంగాన్ని.. మరో రెండేళ్ల తర్వాత 1949 నవంబరు 25న అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్తులో చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి మనసుపెట్టి చదివితే జీవితంలో మరిచిపోలేం. ఒక జాతిని, ఒక నాగరికతను పొగడ్తలతో ముంచెత్తిన ఉపన్యాసాలేవి గొప్పవి అనిపించుకోలేవు.

అహింసతోనూ లేక అతి తక్కువ హింసతోనూ మరే ఇతర దేశం చూడని చాకచక్యంతోనూ మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నాం. ప్రపంచంలో ఏదేశమూ ఒక్కసారిగా ఇవ్వనన్ని ప్రాథమిక హక్కులనూ స్త్రీపురుష సమానత్వ హక్కులనూ మన రాజ్యాంగ రూపకర్తలు ఇచ్చారు. అంతమాత్రాన మన సమాజానికి ఆ హక్కులను పరిరక్షించే, నిజాయితీగా అమలుచేయగలిగే శక్తి ఉందని ఆ ఇద్దరూ భావించలేదు. అందుకే మనకెన్నో సవాళ్లు, ప్రతికూలతలు ఉన్నాయని హెచ్చరించారు. వ్యక్తిపూజ, సంకుచిత మతతత్వం, కులతత్వం జాతీయవాదాల గురించి తస్మాత్‌ జాగ్రత్త ఆనాడే చెప్పారు. అమృత మహోత్సవ కాలంలోనూ ఇంకా అవే పెనుప్రమాదాలుగా ఉండటం వారి భవిష్యద్దార్శనికతకు నిదర్శనం.

వ్యక్తిపూజతో నియంతృత్వం

భారత్‌లోనే ఆ జాడ్యం ఎక్కువ!

ప్రజాస్వామ్యంలో.. ఫలానాది తప్పని చెప్పేందుకు, దాని పరిష్కారానికి ఆ అంశంపై విస్తృత చర్చ జరగాలన్నది అంబేడ్కర్‌ నిశ్చితాభిప్రాయం. అలాగే రాజకీయాల్లో వ్యక్తి పూజ నియంతృత్వానికి దారితీస్తుందని 1949లోనే హెచ్చరించారు. వేల సంఖ్యలో కులాలున్న దేశం ఓ జాతిగా ఎలా ఆవిర్భవిస్తుందని ప్రశ్నించారు. దేశం కంటే మతాన్ని మిన్నగా భావిస్తే మన స్వాతంత్ర్యాన్ని శాశ్వతంగా కోల్పోతామని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో కులమతాలకే ప్రాధాన్యం. వాటి ప్రాతిపదికన పార్టీలే పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల బరిలోనూ నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలు సైతం కులసమీకరణల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ చేస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటులో, చట్టసభల్లో సమగ్ర చర్చలే లేకుండా పోయాయి. అసమ్మతిని ప్రభుత్వాలు సహించలేకపోతున్నాయి. ఆరోగ్యకరమైన చర్చ ఆవశ్యకత గురించి అంబేడ్కర్‌ ఆనాడే నొక్కిచెప్పారు.

''రాజ్యాంగ సభ వివిధ వర్గాల గుంపుగా.. సిమెంటు లేని పేవ్‌మెంట్‌గా.. అక్కడో రాయు, ఇక్కడో రాయిగా వేసి ఉన్నట్లుగా ఉంటే ముసాయిదా కమిటీ కర్తవ్య నిర్వహణ (రాజ్యాంగ రచన) చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రతి సభ్యుడూ, ప్రతి వర్గం తాము చెప్పిందే చట్టమని అనుకుని ఉంటే నానా గందరగోళం చోటుచేసుకునేది. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్న నిబంధనను సభ్యులంతా పాటించి ఉంటే రాజ్యాంగ సభ కార్యకలాపాలు నిస్సారంగా ఉండేవి. పార్టీ క్రమశిక్షణ.. రాజ్యాంగ సభను 'జీ హుజూర్‌' సభ్యుల గుంపుగా మార్చి ఉండేది. ముసాయిదా కమిటీలో కామత్‌, పీఎస్‌ దేశ్‌ముఖ్‌, సిధ్వా, ప్రొఫెసర్‌ సక్సేనా, పండిట్‌ ఠాకూర్‌, దాస్‌ భార్గవ, కేటీ షా, పండిట్‌ హృదయనాథ్‌ కుంజ్రూ వంటి రెబెల్స్‌ ఉన్నారు. వారు లేవనెత్తిన అంశాలన్నీ సైద్ధాంతికమైనవి. అయితే వారి సలహాలను నేను ఆమోదించలేదు. అంత మాత్రాన వారి సూచనలకు విలువ లేకుండా పోదు. రాజ్యాంగ సభకు వారు చేసిన సేవా తగ్గిపోదు'' అని అంబేడ్కర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కృతజ్ఞతకూ హద్దులు..

దేశానికి జీవితాంతం సేవచేసిన మహనీయుల పట్ల కృతజ్ఞత చూపడం తప్పు కాదని.. కానీ దానికీ హద్దులున్నాయని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు.

''ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి కృతజ్ఞత చూపించాల్సిన పనిలేదు.. ఏ మహిళా తన శీలాన్ని పణంగా పెట్టి కృతజ్ఞత చెప్పనక్కర్లేదు.. స్వేచ్ఛను పణంగా పెట్టిన ఏ దేశమూ గొప్పది కాదు'' అని ఐరిష్‌ దేశభక్తుడు డేనియల్‌ ఓకానెల్‌ చెప్పిన మాటలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ విషయంలో మన దేశం ఇతర దేశాల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

''భారత రాజకీయాల్లో భక్తి, వ్యక్తిపూజలది కీలక పాత్ర. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా ఉండదు. మతంలో భక్తి అనేది మోక్షానికి మార్గం కావచ్చు. కానీ రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తిపూజ అనేది పతనానికి.. అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది..'' అని హెచ్చరించారు.

నిజమైన జాతి..

భిన్న కులాలు, వర్గాలు కలగలసిన భారత్‌ ఆటోమేటిగ్గా ఓ జాతిగా ఆవిర్భవిస్తుందన్న ఆలోచన మంచిది కాదని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. అమెరికా పౌరులు తమ దేశాన్ని ఐక్య రాజ్యం(యునైటెడ్‌ నేషన్‌)గా పేర్కొనలేదని.. సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా)గా నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. ''సంయుక్త రాష్ట్రాల ప్రజలే తమను తాము ఓ జాతిగా పరిగణించనప్పుడు.. భారతీయులు తమను ఓ జాతిగా భావించడం ఎంత కష్టం? కొందరు రాజకీయ ప్రేరితులు.. 'భారత ప్రజలు' అన్న భావనను నిరసించిన విషయం నాకు గుర్తుంది. వారు 'భరత జాతి' అనిపించుకోవాలనుకున్నారు. అయితే మనల్ని మనం జాతిగా భావించడం అంటే మాయలో పడినట్లే! వేల కులాలుగా చీలిపోయిన ప్రజలు ఒక్క జాతిగా ఎలా అవుతారు? సామాజికంగా, మానసికంగా మనమింకా ఓ జాతి కాలేదన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అప్పుడే జాతిగా ఆవిర్భవించాల్సిన అవసరాన్ని గ్రహిస్తాం. అయితే ఈ లక్ష్యాన్ని గ్రహించడం అమెరికాలో కంటే ఇక్కడే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ కులాల్లేవు. ఇక్కడ ఉన్నాయి. జాతిగా ఆవిర్భవించాలనుకుంటే ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలి'' అని పేర్కొన్నారు

దేశం కంటే మతం ఎక్కువ కాదు..

దేశం కంటే మతం గొప్పదని భావించడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి నాడే విశదీకరించారు. ''స్వజనుల ద్రోహం, మోసం కారణంగానే భారత్‌ స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. కులం, మతం అనే అనాది శత్రువులకు తోడు.. భవిష్యత్‌లో విభిన్న, పరస్పర విరుద్ధ రాజకీయ భావాలు కలిగిన రాజకీయ పార్టీలను చూడబోతున్నాం. దేశం కంటే మతమే మిన్నగా భావిస్తే మన స్వాతంత్య్రం మళ్లీ ప్రమాదంలో పడుతుందనేది మాత్రం నిశ్చయం. అంతేకాదు.. స్వాతంత్ర్యాన్ని ఎప్పటికీ కోల్పోతాం కూడా'' అని స్పష్టం చేశారు.

సామాజిక ప్రజాస్వామ్యం..

సామాజిక ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదన్నారు. ''సామాజిక ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన విలువలుగా గుర్తించే జీవన మార్గం. ఇది త్రిమూర్తుల కలయిక వంటిది. ఇందులో దేనిని వదిలేసినా ప్రజాస్వామ్య లక్ష్యాన్నే ఓడిస్తుంది'' అని చెప్పారు.

ప్రజాస్వామ్యం ఉండాలంటే..

''రక్తపాత విప్లవాలను విడనాడాలి. సత్యాగ్రహం, శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ వంటి పద్ధతులు మానుకోవాలి. అరాచక విధానాలను ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది'' అని పేర్కొన్నారు.

మతతత్వానికి దూరంగా ఉండాలి

బ్రిటిష్‌ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు దీర్ఘకాలం క్రితం శపథం చేశామని.. ఇప్పుడు నవ భారత సేవకు పునరంకితమవుతామని మరోసారి ప్రతినబూనాలని నెహ్రూ ఆనాడు పిలుపిచ్చారు. స్వతంత్ర భారతం మతతత్వానికి.. సంకుచితత్వానికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ''అర్ధరాత్రి 12 గంటలు కొట్టినప్పుడు.. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉన్న వేళ.. భారతదేశం నవ జీవితంలోకి, స్వాతంత్య్రంలోకి అడుగుపెట్టింది. చరిత్రలో ఇలాంటి క్షణం అరుదుగా వస్తుంది. పాత నుంచి కొత్తలోకి అడుగుపెట్టినప్పుడు.. ఒక శకం ముగిసినప్పుడు.. సుదీర్ఘకాలం ఓ జాతి ఆత్మను అణచివేసినప్పుడు.. కొత్త గొంతుకొకటి జీవం పోసుకుంటుంది. దేశసేవకు, భారత ప్రజలకు.. మొత్తం మానవాళి సేవకు అంకితమవుదామని ప్రతిన బూనేందుకు ఇది అనువైన సమయం'' అని తెలిపారు.

విలువలు మరవొద్దు..

చరిత్ర మలుపుల్లో భారత్‌ తన అన్వేషణను ప్రారంభించిందని.. శతాబ్దాల ప్రయాణంలో ఎన్నో విజయాలు, వైఫల్యాలు చవిచూసిందని.. అదృష్ట దురదృష్టాల్లో ఏనాడూ తన అన్వేషణ ఆపలేదని.. అలాగే తన విలువలనూ మరచిపోలేదని నెహ్రూ పేర్కొన్నారు.

''మనం పండుగ చేసుకుంటున్న ఈ విజయం.. గొప్ప విజయావకాశాలకు ఆరంభం దిశగా ఓ అడుగు మాత్రమే. ఈ అవకాశాలను చేజిక్కించుకోగల సత్తా, తెలివిడి మనకున్నాయా? భావి సవాళ్లను ఎదుర్కోగలమా? స్వాతంత్య్రం, అధికారం.. బాధ్యతను తీసుకొస్తాయి. ఈ గురుతర బాధ్యత స్వతంత్ర భారత పౌరులకు ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన ఈ (రాజ్యాంగ) అసెంబ్లీపైనే ఉంది. స్వేచ్ఛావాయువులు పీల్చకముందు.. మనం అన్ని రకాల బాధలూ అనుభవించాం. విషాద స్మృతులతో మన హృదయాలు బరువెక్కి ఉన్నాయి. ఈ బాధల్లో కొన్ని ఇప్పటికీ ఉండి ఉండొచ్చు. అయినా గతం గతః. ఇప్పుడు భవిష్యత్‌ మనవైపు చూస్తోంది. సంకుచిత, విధ్వంసక విమర్శలకు.. అసూయాద్వేషాలకు.. పరస్పర ఆరోపణలకు ఇది సమయం కాదు. భరత సంతతి స్వేచ్ఛాయుతంగా జీవించే స్వతంత్ర భారత సమున్నత సౌధాన్ని మనం నిర్మించాల్సి ఉంది'' అంటూ భవిష్యత్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు.

వెలుగులు నింపిన గాంధీజీ..

స్వాతంత్య్రం సముపార్జించిన ఈ రోజున మన ఆలోచనలన్నీ దీనికి కారణమైన స్వేచ్ఛాశిల్పి, జాతిపిత మహాత్మాగాంధీ చుట్టూ తిరుగుతున్నాయని.. ఆయన స్వాతంత్య్రమనే దివిటీని చేపట్టి మన చుట్టూ ఉన్న అంధకారాన్ని పారదోలి వెలుగులు నింపారని నెహ్రూ గుర్తుచేశారు. పెనుగాలులు వీచినా... తుఫాన్లు సంభవించినా ఈ దివిటీని ఆరిపోనివ్వకూడదన్నారు. ''సామాన్యుడికి, రైతులు, కార్మికులకు స్వేచ్ఛ, అవకాశాలు కల్పించేందుకు.. పేదరికం, అవిద్య, వ్యాధులపై పోరాడి అంతం చేయడానికి.. పురోగమన ప్రజాస్వామిక దేశ నిర్మాణానికి.. ప్రతి పురుషుడికి, మహిళకు న్యాయం, సంపూర్ణ జీవితం అందించే ఆర్థిక, సామాజిక, రాజకీయ సంస్థల సృష్టికి కఠోర శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రతిజ్ఞకు సంపూర్ణంగా కట్టుబడి ఉండేదాకా మనకెవరికీ విశ్రాంతి లేదు'' అని నెహ్రూ స్పష్టం చేశారు.

అసమానతలను రూపుమాపాలి..

భారత్‌కు సేవ చేయడం అంటే.. కోట్లాది బాధితులకు సేవ చేయడమేనని.. దీనర్థం పేదరికం, అజ్ఞానం, అవకాశాల అసమానతలను రూపుమాపడమేని నెహ్రూ చెప్పారు.

''కన్నీళ్లు, బాధలు ఉన్నన్నాళ్లూ మన కృషి ముగిసినట్లు కాదు. మన కలలను సాకారం చేసుకోవడానికి కఠోరంగా శ్రమించాలి. ఈ కలలు భారత్‌ కోసమే కాదు... అన్ని దేశాలు, ప్రపంచం మొత్తం కోసం కూడా. శాంతిని విభజించలేం. అలాగే స్వేచ్ఛను కూడా. ఇప్పుడున్న వసుధైక ప్రపంచంలో పురోభివృద్ధిని, విపత్తులను కూడా వేర్వేరుగా చూడలేం'' అని అన్ని దేశాలకూ హితవు పలికారు.




ఈ తార అస్తమించకూడదు..

''దీర్ఘ సుషుప్తి, పోరాటం తర్వాత మేల్కొని.. స్వేచ్ఛగా, స్వతంత్రంగా భారత్‌ మళ్లీ సగర్వంగా నిలబడింది. చరిత్ర మనకు కొత్తగా మొదలైంది. మనమెలా జీవిస్తామో, ఎలా వ్యవహరిస్తామో ఇతరులు దానిని చరిత్రగా రాస్తారు. ఇది మనకు విధిరాసిన క్షణం. భారత్‌కే కాదు.. మొత్తం ఆసియాకు, ప్రపంచానికి కూడా. ఒక కొత్త తార ఉదయించింది. ఇది తూర్పున పొడిచిన స్వేచ్ఛ అనే తార. ఇది అస్తమించకూడదు. ఈ ఆశ అంతరించకూడదు. మేఘాలు మనల్ని కమ్మేసినా, మన ప్రజల్లో అత్యధికులు బాధల్లో మునిగిపోయినా, క్లిష్టమైన సమస్యలు చుట్టుముట్టినా స్వేచ్ఛను ఆస్వాదిద్దాం. అయితే ఈ స్వేచ్ఛ బాధ్యతలను, భారాలను తీసుకొస్తుంది. స్వేచ్ఛాయుత, క్రమశిక్షణ స్ఫూర్తితో వాటిని మనం ఎదుర్కోవాలి''

జెండా పరిణామక్రమం

 


భారత రాజ్యాంగ సభ 1947 జూలై, 22న స్వరాజ్ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్న మార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడు ధర్మ చక్రాన్ని గ్రహించారు.

జెండా పరిణామ క్రమం ఇదీ.


మొదటి జెండా: -

1960 ఆగస్టు 7న కలకత్తా నగరం పార్సీ బగాన్ లో ఎగరవేశారు. ఈ పతాకంలో పైనుంచి కిందికి ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు పార్టీలు ఉండేవి. ఆకుపచ్చ పట్టీలో 8 రాష్ట్రాలకు గుర్తుగా 8 కమలం పూలు, పసుపు పచ్చ పట్టీలో "బందే వందేమాతరం" అని ఉండేవి. ఎరుపు రంగు పట్టీలో ఎడమ వైపు చంద్రుడు, కుడి వైపు సూర్యుడిని ఉంచారు.


భికాజీ కామా పతాకం: -

1907లో మొదటి దానికి కొంచెం మార్పులు చేసి భికాజీ కామా రెండో జెండా రూపొందించాడు. దీనిని అదే సంవత్సరం పారిస్ లో భారతీయ విప్లవకారుల మధ్య ఎగురవేశారు. పై పట్టిలో ఎనిమిదికి బదులుగా ఏడు కమలం పూలు, ఎరుపు స్థానంలో కషాయాన్ని ఉపయోగించారు. పైనుంచి కిందికి కాషాయం, పసుపుపచ్చ, ఆకుపచ్చ రంగులు వరుసగా ఉంటాయి.


హోమ్ రూల్ పతాకం: -

హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా అనిబిసెంట్, లోకమాన్య తిలక్ కొత్త జెండా రూపొందించారు. ఇందులో ఒక రంగు తర్వాత మరో రంగు వచ్చే ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ పట్టిలను కలిగి ఉన్నాయి. వీటిపై సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలు ఉండేవి. పైభాగంలో ఓ మూలన చంద్రరేఖ, మరో మూలాన యూనియన్ జాక్( బ్రిటిష్ ఇండియా పతాకం) ఉండేవి.


గాంధీజీ త్రివర్ణ పతాకం: -

1921లో మధ్యలో చరఖా గుర్తుతో త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ ప్రతిపాదించాడు. ఇందులో వర్ణాలు ప్రధాన మతాలకు ప్రతీకలుగా ఉండాలనుకున్నాడు. తర్వాత రంగులు లౌకికవాదం ప్రతిబింబించేలా ఉండాలని భావించాడు. ఈ పతాకంలో దిగువన ఉన్న ఎరుపు త్యాగాన్ని, మధ్యలో ఉన్న ఆకుపచ్చ ఆశను, పైన ఉన్న తెలుపు శాంతికి ప్రతీకలు.


పింగళి వెంకయ్య పతాకం: -

ప్రస్తుత పతాకానికి చాలా దగ్గరగా ఉన్నది 1923లో ఉనికిలోకి వచ్చింది. దానిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించాడు. ఇందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. తెలుగు భాగంలో చరఖా ఉండేది. దీనిని 1923 ఏప్రిల్ 13న నాగపూర్ లో ఎగరవేశారు. దీనికి స్వరాజ్ పతాకం అని పేరు పెట్టారు.






భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో తిరంగా (హిందీ: तिरंगा) లేక ట్రైకలర్ (English: Tri-color) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా[N 1] 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం.
చట్టప్రకారం జెండా ఖద్దరుతో తయారుచేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా మహాత్మా గాంధీ ఖద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారుచేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌కే హక్కు ఉంది. ఈ కమీషన్‌ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగించిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది.

భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. 2002లో నవీన్ జిందాల్ అభ్యర్థన పరిశీలిస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సాధారణ పౌరులు జెండాను వాడుకునేందుకు వీలుగా కోడ్‌ను సవరించమని భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దాన్ని అనుసరించి భారతీయ కేంద్ర మంత్రివర్గం కోడ్‌ను పరిమితంగా వాడేందుకు సాధారణ పౌరులకు వీలునిస్తూ సవరించింది. 2005లో మరోసారి కోడ్‌ను సవరించి కొన్ని రకాల దుస్తుల మీద ఉపయోగించడం సహా మరికొన్ని అదనపు వాడుకలను అనుమతించారు. జెండాను ఎగురవేయడం, ఇతర జాతీయ, సాధారణ జెండాలతో కలిపి భారత జాతీయ పతాకాన్ని వాడేప్పుడు అనుసరించాల్సిన విధానాలకు ఆ కోడ్ వర్తిస్తుంది.




 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...