Sunday, September 4, 2022

విశాఖ 1757

 నాడు విసిగపటం...నేడు విశాఖపట్నం

265 సంవత్సరాల క్రితం పట్టణ పరిస్థితులు మ్యాప్‌ల ద్వారా నిక్షిప్తం

విసిగపటం పేరిట 1777లో జాన్‌ సీటన్‌ ప్రణాళిక రూపకల్పన



పట్టణం మధ్య గుండా ఉప్పుటేరు ప్రవాహం

కోటవీధి ప్రాంతంలో పెద్ద కోట...దాని చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు

1800 చివరిలో పోర్టు ఏర్పాటుకు ప్రణాళిక

అప్పట్లో విశాఖకు వాల్తేరు శివారు ప్రాంతం

అక్కడే సంపన్నులు, ఐరోపా వాసులు, జమీందార్లు నివాసం

1870లో కలెక్టరేట్‌, క్వీన్‌ మేరీస్‌ పాఠశాల ఏర్పాటు

తీరంలో మద్యం ప్రియుల కోసం కాంగీ హౌస్‌

కైలాసగిరిపై న్యాయమూర్తి ఈసీజీ థామస్‌ నివాసం

ఐరోపా, ఫ్రెంచి ప్రాచీన భాండాగారం నుంచి వివరాల సేకరణ

మెల్‌బోర్న్‌కు చెందిన జాన్‌క్యాసిల్‌ ఘనత

విశాఖలో జన్మించి, తొమ్మిదేళ్ల ప్రాయంలో తల్లిదండ్రులతో కలిసి ఆస్ర్టేలియాకు వలస

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నేటి విశాఖపట్నం...ఒకనాటి విసిగపటం ఎలా ఉండేది?, ఇప్పుడు మనకు కనిపిస్తున్న బ్యాక్‌ వాటర్‌ ప్రవాహం అప్పుడు ఎలా ఉంది? హార్బర్‌ నిర్మాణం తొలినాళ్ల డిజైన్‌ ఏమిటి? ఎవరు గీశారు?....ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మ్యాపులు, చిత్రాల రూపంలో ఫ్రెంచ్‌ పురావస్తు భాండాగారంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని 'జాన్‌ క్యాసిల్‌' అనే ఆస్ట్రేలియన్‌ వాసి సేకరించారు. వాస్తవానికి ఆయన పూర్వీకులు ఉద్యోగం నిమిత్తం ఇంగ్లండ్‌ నుంచి విశాఖ వచ్చారు. ఐదు తరాలు ఇక్కడే ఉన్నాయి. క్యాసిల్‌ 1957లో విశాఖలో జన్మించారు. ఆయనకు తొమ్మిదేళ్ల వయస్సులో ఆ కుటుంబం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వలస వెళ్లింది. విశాఖకు ఎంతగానో ప్రేమించే క్యాసిల్‌...విసిగపటం...వైజాగపటం...అదేనండీ మన విశాఖపట్నం...చారిత్రిక ఘనతను చాటే అనేక విశేషాలను సేకరించారు.

యాభై ఏళ్ల క్రితం విశాఖ నగరం ఎలా ఉండేది?...ఎవరైనా చెబితే వినేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతారు. అటువంటిది 265 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో...తెలిపే మ్యాపులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం వన్‌టౌన్‌ ఏరియా, దాని చుట్టుపక్కల ప్రాంతం, సముద్రం, కొండలు, ఊరు మధ్య నుంచి పారే ఉప్పుటేరు, రోస్‌హిల్స్‌పై మసీదు, దాని వెనుక ఫెర్రీ... మరికొంత దూరంలో డాల్ఫిన్‌ నోస్‌...ఇలా ప్రతి ఒక్కదాని స్థితిగతులు కళ్లకు కట్టినట్టు వివరించే మ్యాపులను ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు గీయించారు. ప్రస్తుతం తీరానికి చేరువగా నగరంలో అత్యంత కీలకంగా వున్న వాల్తేర్‌ ప్రాంతం అప్పట్లో విశాఖకు ఎంతో దూరమైనదిగా భావించేవారు. ప్రస్తుత విశాఖపట్నాన్ని అప్పట్లో ఫ్రెంచి పాలకులు 'విసిగపటం'గా పిలిచేవారని మ్యాపులు వెల్లడిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరం నుంచి విశాఖలో పాలన సాగించేందుకు అవసరమని భావించి ఈ మ్యాపులను ఆంగ్లేయులు, ఫ్రెంచి పాలనలో కొందరు నిపుణులు రూపొందించారు. ఆ తరువాత రెండు దేశాల మధ్య ఆధిపత్యంలో ఆంగ్లేయులది పైచేయి అయ్యింది. ఈ నేపథ్యంలో విశాఖలో అనేక మార్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు మ్యాపులు తయారుచేయించేవారు. విశాఖ అభివృద్ధికి మూలస్తంభమైన పోర్టు నిర్మాణానికి 1800వ సంవత్సరం చివరిలోనే ప్రతిపాదించారు. ఇలా అనేక మ్యాపులను ఐరోపా, ముఖ్యంగా ఫ్రెంచి ప్రాచీన భాండాగారం నుంచి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన జాన్‌క్యాసిల్‌ సంపాదించారు. అక్కడ భాండాగారాల్లో అనేక పుస్తకాలు, పాత దస్త్రాలు, గజిట్‌లను ఎన్నో ఏళ్లు పరిశోధించి వాటిని గుర్తించి విశాఖకు చెందిన హెరిటేజ్‌ స్థలాల సంరక్షణ ఉద్యమకారిణి జయశ్రీ హట్టంగడికి పంపారు. ఆయన ప్రస్తుతం ఇంజనీరింగ్‌ బోయింగ్‌ అండ్‌ క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి, పదవీ విరమణ అనంతరం ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రసంగాలు చేస్తున్నారు. విశాఖ అంటే మక్కువ చూపే క్యాసిల్‌ చివరిగా 2019లో ఇక్కడకు వచ్చారు. విశాఖకు సంబంధించి ఆయన సేకరించిన మ్యాపుల వివరాలు...

1757లో విశాఖను ఫ్రెంచి సైన్యం స్వాధీనం చేసుకునే సమయంలో ఫ్రెంచి, బ్రిటీష్‌ సైన్యాలకు చెందిన అధికారులు మ్యాపులు గీశారు. వాటి ఆధారంగా రాబర్ట్‌ ఓర్మ్‌ అనే చరిత్రకారుడు ఒక మ్యాపు రూపొందించారు. ప్రస్తుతం కోట వీధి వున్న ప్రాంతంలో పెద్ద కోట ఉండేది. దానిచుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి. 1757లో ఫ్రెంచి సేనాని డి.బుస్సీ నేతృత్వంలో విశాఖను స్వాధీనం చేసుకునే సమయంలో ఇక్కడ రక్షణ వ్యవస్థలు అంత పటిష్ఠంగా లేవని గుర్తించారు. అప్పట్లో ఫ్రెంచి పాలకులు విశాఖను 'విసిగపటం'గా పిలిచేవారు. కోటకు దూరంగా డాల్ఫిన్‌నోస్‌, వాటి మధ్యన శాండ్‌ హిల్‌, మిలట్రీ స్థావరాలు, ఆయుధగారం, కవాతు చేసే ప్రాంతం, అక్కడే కొండపై మసీదు వున్నట్టు ఈ మ్యాపుల ద్వారా తెలుస్తోంది.

విశాఖపట్నం పరిస్థితులపై 1783లో జాన్‌ సీటర్‌ అనే వ్యక్తి మరో మ్యాప్‌ రూపొందించారు. ప్రస్తుత కోటవీధి ప్రాంతంలో గల కోటకు ఎడమ వైపున గార్డెన్‌ హౌస్‌ పేరుతో ఒక భవనం నిర్మించారు. 1800వ సంవత్సరం తరువాత విశాఖ జిల్లా ఏర్పాటైంది. 1870 దశకంలో కలెక్టర్‌ కార్యాలయం, తరువాత క్వీన్‌ మేరీస్‌ పాఠశాల ఏర్పడ్డాయి. కోటకు కుడి వైపున ఆస్పత్రి, మిలట్రీ మెస్‌ ఉండేవి. తరువాత పట్టణంలో అనేక మార్పులు రావడంతో 1843 నాటికి పాలనా భవనాల విస్తరణ, ఆయుధాలు నిల్వ చేసే ప్రాంతం, కోర్టు సముదాయం ఏర్పడ్డాయి. తీరంలో మద్యపాన ప్రియుల కోసం 'కాంగీ హౌస్‌' అని ఒకటి ఉండేది. కొండలపై నుంచి వచ్చే వర్షపునీటి ప్రవాహం కోసం సముద్రం వరకు వాగు తరహాలో కాలువ ఏర్పడింది. ప్రస్తుతం వున్న జ్ఞానాపురంతోపాటు ఎయిర్‌పోర్టు వరకు బ్యాక్‌ వాటర్‌ వచ్చేదని అనేక పరిశోధనల్లో తేలింది.

- వ్యాపార కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందే క్రమంలో బ్రిటీష్‌ పాలకులకు నౌకాయానంపై శ్రద్ధ పెరిగింది. 1875లో నౌకాశ్రయం నిర్మాణంపై జీఎల్‌ నరసింగరావు అనే వ్యక్తి ఒక మ్యాప్‌ రూపొందించారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ సూచనలతో విశాఖలో బ్యాక్‌ వాటర్స్‌, సముద్రం కోత నివారణకు గ్రోయిన్స్‌ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. సంపన్నులు, ఐరోపా వాసులు, జమీందార్లు ప్రధాన పట్టణానికి దూరంగా వుండే వాల్తేర్‌ ప్రాంతంలో నివసించేవారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది జమీందార్లు లాసన్స్‌ బే కాలనీలో బంగ్లాలు నిర్మించుకున్నారు. కైలాసగిరిపై న్యాయమూర్తి ఈసీజీ థామస్‌ నివాసం ఉండేవారు. ఈ కొండను స్థానికులు థామస్‌ హిల్‌ అని పిలిచేవారట. 1900వ సంవత్సరానికి కొన్నాళ్లు ముందుగా రైల్వే భవనం నిర్మించి పోర్టుకు అనుసంధానంగా రోడ్లు వేశారు. పోర్టు నుంచి పట్ణణం మీదుగా టౌన్‌ కొత్త రోడ్డు, అక్కడ నుంచి చినవాల్తేర్‌ మీదుగా విజయనగరం వరకు రోడ్డు విస్తరించారు. ఆర్కే బీచ్‌లో వున్న స్కాండిల్‌ పాయింట్‌ పట్టణానికి చివరిగా ఉండేది.





No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...