Tuesday, November 1, 2022

జముకుల కథ జానపదకళారూపాలు 1

 జముకుల కథ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



అతి ప్రాచీనమైన జానపదకళారూపం జముకులకథ. 'జముడు' అనేది వాయిద్యం ఈ కళారూపానికి ప్రాణం వంటిది. ఖంగుమని మ్రోగి హుషారెత్తించే లయతో పలికే ఈ వాయిద్యం వాయించాలంటే చాలా సాధన చేయాలి . జముకుల కథ చెప్పడానికి ముగ్గురు కళాకారులు అవసరమవుతారు. మధ్యలో ఆడ వేషం వేసుకుని ప్రధాన గాయకుడు ఉంటే ఇటు కుడివైపు అనపకాయతో చేసిన తంబూరా వాయిస్తూ, ఒకరు, ఎడమవైపు జముకు వాయిస్తూ ఒకరు ఉంటారు. విశాఖ జిల్లాలో ఈ జముకుల కథ ప్రసిద్ది చెందినప్పటికి రాజమండ్రి జిల్లాకు చెందిన  కళాకారుడు తాతపూడి సుబ్బారావు ముఖ్యులైతే,  పెదపూడి మండలం ఎ. పి. త్రయం గ్రామానికి చెందిన వేమగరి సుందరరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. జముకు వాయించడంలో ఈయనకు ఈయనే సాటి.తానా సభలలో జముకు వాయించిన ఘసాపాటి.


ఈ జముకుల కథ పదకొండవ శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లు గమనించగలము. పాల్కూరి సోమనాధుని పండితారాధ్య చరిత్రలో ఈ జముకుల కథ ప్రస్తావన కనబడుతుంది. రాజులు తమ సైన్యాలను ఉత్సాహపరచడానికి ఈ జముకుల కథను చెప్పించేవారు. ఈ కథలో వీర, కరుణ, శృంగార రసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సారంగధర కథను వింటే జముకుల కథలోనే వినాలి. రాజులేనప్పుడూ సారంగా రారాదా పోరాదా సారంగా అంటూ సారంగధరుణ్ణి ప్రేరేపించడం వగైరా కీర్తనలు ఓ ప్రత్యేకమైన బాణీలలో పాడుతూ ఉంటే వినితీరవలసిందే. కన్యక కథను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలివారు అనేక చోట్ల ప్రదర్శించారు. కన్యక కథను పీసా లక్ష్మణరావు, తవిటయ్య , ముదిలి నరసింహారావు , మిక్కినేని రాధాకృష్ణమూర్తి, శ్రీ కర్నాటి వారు  ఇంకా  ప్రమీలా సిస్టర్స్ ప్రదర్శించి ప్రసంశలు పొందారు.


జముకును కుంభంలా వుండే చెక్కతోకాని, రేకుతో కాని చేస్తారు. ఒకవైపు గొడ్డు మాంసానికి చెందిన ఓపలుచని పొరను ఉపయోగించి మూస్తారు. దాని నుండి ఎద్దు నరాన్ని జముకు లోపల అతికి ఒక చిడతకు అతుకుతారు. ఎడమ చేతితో చిడతను లాగి వదులుతూ ఉంటే. కుడిచేతిని కుంచం లోపలకు పెట్టి ఆ నరాన్ని మీటుతూ ఉంటే అద్భుతమైన మనోహరమైన శబ్దం పుడుతుంది. తంబూర తంతి వాయిద్యానికి ప్రత్యేక బాణీలో పాడే జానపద గీతానికి ఈ జముకు శబ్దం తోడై కూర్చున్న వారిని లేచి అడేలా చేస్తుందీ జముకు వాయిద్యం.

జముకుల కథ చెప్పేవారు అనుభావంగా ఈ కథను చెబుతుంటారు. తాతలు దగ్గర నేర్చుకున్న కథనే యధాతథంగా చెబుతూ అతి పవిత్రంగా ఈ వృత్తిని చేపడతారు. ఇందులో నాటక ప్రక్రియకు చెందిన సంవాదాలు ఎక్కువ. ద్విపద రూపంలో కథాగానం సాగుతుంది. అమీనాబాద గ్రామానికి చెందిన ఏడిద చిట్టోడు, రేడియో జముకుల కథకులు సామర్లకోట వాస్తవ్యులు మాలు సూర్యారావును కదిలించగా కన్నీళ్ళ పర్వంతమయ్యారు. పూర్వం జాతరలలోను, ఉత్సవాలలోనూ ప్రజాదరణ పొందిన ఈ కథకు ప్రోత్సాహం కరువైయ్యిందని విచారించారు. 

కథకుడు పాత్రకు సంబంధించిన ప్రధాన పాత్ర వేషం ధరించి జముకు కథ చెబుతాడని ఆయన చెబుతూ కొన్ని విశేషాలను తెలియజేసారు. జముకుల కథను ఆరోజుల్లో మహాభారత కథ మూడున్నర నెలలు, రామాయణ కథ రెండున్నర నెలలు కథాగానం చేసేవారు. ఇందులో నృత్యం, సంగీతం, అభినయం, హాస్యం అన్ని కలసిన సమాహార కళ ఇది. ఈ జముకుల కథనే మార్పుచేసి శ్రీ నాజర్ బల్లనెక్కించి బుర్రకథగా మలిచారు. బుర్రకథకు మూలం ఈ జముకుల కథే ముందు చెప్పుకున్నట్టే కథకుడు ఆడవేషం కట్టడం ఈ జముకుల కథలోని విశేషం. అతి ప్రాచీనమైన ఈ జముకుల కధను పూర్వం పేట ప్రజలు అపూర్వంగా ఆదరించారు. దూరదర్శన్ల రాకతో ఈ జముకుల కథకు ప్రాచుర్యం తగ్గింది. అయినా ప్రస్తుత కళాకారులు తమ కథలను సామాజిక అంశాలవైపు మళ్ళించి, ఎయిడ్స్, కరోనా,  బాలకార్మిక నిర్మూలన, ఆరోగ్యసూత్రాలు, వాణిజ్య ప్రకటనలుగా మలిచి మనుగడ సాగిస్తున్నారు. మన ప్రాచీన కళను కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నారు.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...