Wednesday, November 2, 2022

హరికథ జానపదాకళారూపాలు3

 హరికథ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



ఈ జానపద కళారూపం  నా సొంతం అని తెలుగువాడు గర్వంగా చెప్పుకొని సంబర పడే కళారూపం హరికథ.  బహుముఖ ప్రచారం కలిగి ఇంచుమించు అన్ని ప్రాంతాలలోను, హరికథ వ్యాపించి వున్నది. హరికథ కళారూపం పంచ ప్రాణజన్యం. అంటే సంగీతం, సాహిత్యం... అభినయం ,నృత్యం  సమతూకపు సమాహార కళ అన్న మాట . భక్తి గురించి ప్రధానంగా భోదించడమే ప్రాణంగా తొలుత హరికథ పుట్టింది. ఇది పేరులో తెలిపినట్లు హరి (విష్ణు) కథలను ఎక్కువగా గానం చేయడం లక్షణంగా కలిగి ఉండేది. అయితే కాలక్రమేణా సమస్త పురాణగాథలూ ఈ హరికథా గానంలో చోటు చేసుకున్నాయి. 20 వ శతాబ్దం వచ్చేప్పటికి ఇతర ఇతిహాస, చారిత్రక, సాంఘిక గాథలు కూడా హరికథాంశాలుగా రూపుదిద్దుకున్నాయి.


ఈ హరికథా గానం ఉనికి పన్నెండవ  శతాబ్దం పండితారాధ్య చరిత్రనందే కనిపిస్తుంది. అయితే అప్పుడు యక్షగాన రూపంలో బహుముఖ పాత్రలలో పలువురు వ్యక్తులు నిర్వహిస్తే హరికథలో అన్ని పాత్రలను ఒకే వ్యక్తి పోషిస్తాడు. కీర్తనలు, కృత్యాలు, తోహారాలు, మిత్రాలు, వచనాలు, శ్లోకాలు, దండకాలు, దరువులు కందార్థాలు అన్నీ తానే చెబుతారు. తెలుగుభాషలో హరికథా రూపంలో సంపూర్ణ రూపంలో వెలువడిన తొలి హరికథ 'ఆధ్యాత్మిక రామాయణం' అంటారు. దీని రచయిత మునిపల్లె సుబ్రహ్మణ్యకవి .క్రీ॥శ 17వ శతాబ్దానికి చెందిన ఈయన రామాయణ గాధ అంకం 104 కీర్తనల్లో చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలే హరికథగా రూపుదిద్దాయి. అందులో చేరి వినవే శౌరి చరితము గౌరీ సుకుమారి గిరి వర కుమారి ఇలా ఆయన శ్రీరామ జననం, బాల్య క్రీడలు తదితర ఘట్టాలు వినసొంపుగా రచించారు. శివలీలలు, సక్కుబాయి, మీరాబాయి, జయదేవ వంటి భక్తుల గాధలు అదనంగా వచ్చాయి. జాతీయోధ్యమ కాలంలో జాతీయ భారతం, ఝూన్సీరాణి, రాణా ప్రతాప్ , వీర శివాజీ, నెహ్రూ, తిలక్ , భగత్ సింగ్, బెంగాల్ కలుపు కథలను గానం చేయసాగారు.


హరికథ చెప్పే కథకుడు కాళ్లకు గజ్జెలు, చేతిలో బిడలేలు ముంజేతికి సింహ తలాటం, మరుగురులు, భుజాలకు దండ కడియాలు, నుదుట కుంకుమబొట్టు, గిరజాల తల (ఉంగరాల జుట్టు), మధ్యలో పాపిడి, వెనుక సిగముడి, మెడలో పూలదండలు, పట్టుపంచి, జరీ కండువా, వేసుకుంటాడు. ఇతనికి ఇరువైపులా మృదంగం, ఫిడేలు ఉంటే వెనకవైపు శృతికోసం హర్మోనీ సహా వాయిద్యాలుగా ఉంటాయి. కొందరు కంజెరను గానీ, అగ్గిపెట్టెల వాయిద్యం కూడా ఏర్పాటు చేసుకుంటారు. హరికథ కళాకారుడు అభినయ సమయంలో స్వేచ్చగా తిరగడం అవసరమవుతుంది. సహా వాయిద్య కారులూ హరికథకులు ఇరువైపులా వేదికమీదే కూర్చుంటారు.


గజ్జె కట్టి, చిరుతలు వాయిస్తూ, సంగీత సాహిత్యాలను రెండింటిని మేళవించి పండిత పామరులను రంజింప చేసిన కళాకారులు ఈ తెలుగు గడ్డమీద ఎందరో ప్రసిద్ధి చెందారు. వారిలో 1854 సంవత్సరంలో విజయనగర ప్రాంతంలో ఇజ్జాడ అనే గ్రామంలో జన్మించిన శ్రీ మద్దజ్ఞుడు ఆదిబట్ల నారాయణదాసుగారు ఒకరు వీరు హరికథా పితామహా గానకళా ప్రపూర్ణ, లయ బ్రహ్మ, స్వర్ణ శిల్పి, హరిదాస జగద్గురు అనే బిరుదంతో పిలబడేవారు. 1853 నుండి 1945 సంవత్సరం వరకు హరికథా రంగంలో నారాయణడి కాలం స్వర్ణయుగంగా వర్ధిల్లింది. శ్రీ ఆదిబట్ల వారు హరికథకు విశేషమైన ప్రాచుర్యాన్ని తీసుకువచ్చారు. వీరి దగ్గర అనేక మంది శిష్యులుగా చేరి ఆంధ్రదేశమంతా హరికథ గానంలో పామరులను సైతం ఉర్రూతలూగించారు. వారిలో మన ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన పుచ్చల భ్రమర్ధాసుగారు, శ్రీ నల్లమిల్లి బసివిరెడ్డి భాగవతార్, కొమ్మూరు బాల బ్రహ్మానందదాసు, భమడిపాటి సూర్యనారాయణదాసు, వడియ్య దాసుగారు , గాజుల దాసుగారు, అచ్చమాంబ భాగవతారిణి, శార్వాణీ భాగవతారిణి, సలాది భాస్కరరావు తదితరులు కలరు. ఈ కళారూపాన్ని మహిళలలూ ప్రతిభావంతంగా కథాగానం చేస్తున్నారు.


పల్లెల్లో వర్షాకాలం పనుబాటులు పూర్తయిన తరువాత ఈ హరికథా కాలక్షేపంతోనే కాలం గడిపే వారు ఆనాటి ప్రజలు, వీరికి సర్వ విజ్ఞానం అందించే ఉపాధ్యాయులుగా హరికథకులు ఉండేవారు. ఆనాడు ఈ హరికథా దాసుల హరికథా గానం లేనిదే  పండగలు, ఉత్సవాలు  ముగిసేవి కావు . ఈ హరికథ గురువులను భక్తి శ్రద్ధలతో గౌరవించేవారు. హరికథాగానం ప్రారంభమవుతుందంటే ఊరిలోని ముత్తెదువలందరూ పళ్ళు ఫలహారాలు ఉంచిన పళ్ళాలు తీసుకుని వేదికపై ఉంచి హరిదాసుకు నమస్కరించి కూర్చునేవారు. హరికథాగానంలో రామాయణ, భాగవ, భారత గాథలలోని చక్కని పిట్టకథలను జోడించి హరిదాసులు చెబుతుంటే అర్ధరాత్రి దాటినా జనం కదలకుండా కూర్చుని వినేవారు. 'ఓరోరి గణపతి రాదా నీకు ఉండ్రాళ్ళు పోసేదా రారా అంటునో తాండవ నృత్య హారీ గజానన, ధిరుకిట దిమికిట బాజా మృదంగ అంటూనో గణపతి ప్రార్ధన మొదలెట్టి "పవమానా సుతుడు పుట్టు పాదారా విందములకు అని మంగళం పాడే వరకూ అందరూ పరవశులై వింటూ కూర్చొనేవారు. మధ్యలో ప్రేక్షకులతో చిరు భజన కీర్తన అందుకుని హరిదాసు అందరిచేత భజనలు కూడా చేయించేవారు.


దాదాపు 40 రోజుల పాటు ఈ హరికథా గానం జరిగేది శిష్యులతో వచ్చిన హరిదాసులు ఆ వూరిలోనే ఉండిపోయేవారు. వీరి హరికథాగానం మధ్యలో ఊరిలోని పెద్దలు కానుకలను పోటీ పడి చదివించే వారు. 'శ్రీమద్రమారమణ గోవిందో హరి' అని హరిదాసు వాడే ఊతపదం మన ఆంధ్రదేశమున ఎంత ప్రాచూర్యం పొందిందో తెలియనిది కాదు. ఊరి మధ్య దేవాలయం వద్ద పచ్చని పందిరి వేసి ఆ పందిరి క్రింద బల్లలు చేసి, పైన రెండు పెట్రోమాక్స్లెట్లు తగిలించి హరిదాసు కథ చెబుతుంటే భోజనాలు ముగించుకుని కూర్చోడానికి గోనెసంచులు తెచ్చుకొని యింటిల్లపాది వినే ఈ హరికథ మన సంసత్కృతిలో ఒక భాగం. మన జానపద కళారూపాలలో ఆణిముత్యం. ఇటుంటి హరికధను నేడునూ. రసరమ్యంగా కథాగానం చేస్తున్న కళాకారులు పెండెం ధర్మారావు, ముమ్మిడివరం వారు కూడా ఉన్నారు. ఈ హరికధలో శిక్షణ ఇవ్వడానికి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో హరికథా శిక్షణా పాఠశాల కూడా ఉండటం ఆనందించవలసిన విషయం.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...