Wednesday, November 30, 2022

కాంతారా

 ముఖ్యంగా కన్నడ సినిమా పరిశ్రమలో అయితే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క బెంగళూరులోనే 20 వేల షోలు నడిపించారంటే సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 17వేల షో లతో కే జి ఎఫ్ 2 పేరిట రికార్డు ఉండేది.. ఈ సినిమా రికార్డు ఎవరూ బీట్ చేయలేరు అనుకున్నారు. కేవలం ఆరు నెలల్లో ఆ రికార్డు బ్రేక్ అయింది. అయితే చాలామంది కూడా కాంతారా సినిమాలో వరాహ రూపం ఎపిసోడ్ కు కనెక్ట్ అయ్యారు. రిపీటెడ్ గా థియేటర్లలోకి వెళ్తున్నారు. కానీ ఈ సినిమాని అంత ఆషామాషీగా తీయలేదు. దీని వెనుక బోలెడు కథ ఉంది. అన్నింటికీ మించి మన పురాణాల్లో ఉన్న నీతి దాగి ఉంది.

Kantara Movie

దేవుళ్ల గురించి కొత్తగా చెప్పారు

కాంతారా సినిమా ప్రారంభంలోనే ఒక రాజు ఒక రాయిని చూసి తన్మయత్వం పొందుతాడు. ఆ రాయి మరెవరో కాదు కంజుర్లీ దేవ.. తులు నాడు ప్రాంతంలో ప్రజలు విశిష్ట దైవంగా కొలుస్తారు. అయితే ఈ దేవుడికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం పార్వతి దేవి కైలాసంలో ఒక వరాహాన్ని పెంచుకుంటూ ఉండేది. అయితే అది తన చేష్టలతో కైలాసాన్ని చిందరవందర చేసేది.. ఇది ఒకసారి శివుడు ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయనకు ఇబ్బంది కలిగించింది. దీంతో శివుడు ఆ వరాహాన్ని చంపేస్తాడు.. ఈ ఘటనతో పార్వతి చాలా బాధపడుతుంది.. అయితే శివుడు తన తపోశక్తితో వరాహాన్ని మరలా బతికిస్తాడు. తన సేవకుడిగా ఉండాలని భూమి మీదికి పంపిస్తాడు. అలా భూమి మీదకి వచ్చిన వాడే కంజుర్లి దేవ. వరాహరూపంలో ఈ దేవుడు ఉంటాడు. అయితే ఈ సినిమాలో శివపాత్రధారి వరాహాన్ని చంపినప్పుడల్లా అతడి తల్లి కొడుతుంది. వరాహాన్ని వేటాడేందుకు వెళ్లినప్పుడల్లా 'ఓ' అని వింత శబ్దం వస్తుంది.. శివకు వచ్చే కలలో కూడా వరాహ రూపం కనిపిస్తుంది.

గుళిక దైవ

ఒకసారి కైలాసంలో బూడిదలో ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని పార్వతి దేవి శివుడికి ఇస్తుంది. ఆ శివుడు దానిని భూమి మీదకు విసిరేస్తాడు. దాని నుంచి గుళిక దైవ పుడతాడు.. ఆ గుళిక దైవ ను శ్రీమహావిష్ణువు సేవలో తరించాలని శివుడు ఆదేశిస్తాడు. కానీ గుళిక దైవ విష్ణువు సేవలో ఉండకుండా చిందరవందర చేస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీమహావిష్ణువు గుళిక దైవను నెలవుల సంఖ్య తక్కువగా ఉన్న మహిళకు జన్మించాలని శపిస్తాడు. అయితే ఆమె 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు.. గుళిక దైవ తాను ఎలా బయటకు రావాలని తల్లిని అడుగుతాడు.. అందరి పిల్లలాగే నువ్వు బయటికి వస్తావని ఆమె బదులిస్తుంది. తర్వాత గుళిక దైవ తల్లి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన ఆకలితో ఉంటాడు. ఏది కనిపిస్తే అది తింటాడు. చివరకు మహావిష్ణువు ప్రత్యక్షమై తన చిటికెన వేలు ఇస్తే దానిని తిని తన ఆకలిని సంతృప్తి పరచుకుంటాడు.

Kantara Movie

పార్వతి దేవి సేవకుడిగా ఉంటాడు

తులునాడు ప్రాంతంలో శివలింగం రూపంలో పార్వతి దేవి అవతరిస్తుంది. అయితే తనను కన్న బిడ్డ లాగా చూసుకున్న పార్వతి దేవికి సేవకుడిలా ఉండేందుకు గుళిక దైవ కూడా భూమి మీద అవతరిస్తాడు. అయితే ఈ సినిమాలో మొదటి సీన్ లో చూపించే ఆ రాయి మీద త్రిశూలం ఉంటుంది..ఆ రాయి మరెవరో కాదు గుళిక దైవ.. అయితే ఆ రాయిని తనకు ఇవ్వాలని రాజు కోరినప్పుడు… దైవం పూనిన వ్యక్తి ఇలా అంటాడు ' ఈరోజు నువ్వు ఇచ్చిన భూమిని మళ్లీ నీ వారసులు తిరిగి అడిగితే రక్తం కక్కుకుని చచ్చిపోతారు. అది కూడా క్షేత్రపాలకుడి చేతిలో' అని హెచ్చరిస్తాడు. దీంతో రాజు కూడా దానికి సమ్మతిస్తాడు.. రాజు వారసులు తిరిగి ఆ భూమిని దక్కించుకునేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతారు.. అటవీవాసులను చంపుతారు.. ఈ క్రమంలో గుళిక దైవ శివ పాత్రధారిని పూనినప్పుడు అదే విషయాన్ని చెప్పి, తాను క్షేత్ర పాలకుడైన గుళిక దేవను అని చెప్పి చంపేస్తాడు. తర్వాత మాయమవుతాడు.

ఎన్నో పోలికలు

ఈ సినిమాలో శివపాత్ర ధారికి శివుడికి ఎన్నో పోలికలు ఉన్నాయి. శివుడు ముక్కోపి అయినట్టు… ఇందులో శివ పాత్రధారి కి కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. అదే సమయంలో ఎప్పటికీ మత్తులో ఉంటాడు. ఆ మత్తులోనే గురువను చంపిన విషయం తెలుసుకుంటాడు. కంజుర్లి దైవ , గుళిక దైవ మాదిరే ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. చివరకు భూత కోల ఆడి రాజు వారసుడిని చంపేస్తాడు. అయితే ఇందులో శివ వేటకు వెళ్ళిన ప్రతిసారి ఒక రకమైన అరుపు వినిపిస్తుంది. ఆ అరుపే గుళిక దైవ హెచ్చరిక. అయితే ఈ సినిమాలో శివ పాత్రధారి క్లైమాక్స్ లో మాయమవుతాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2 లో చూపిస్తారు కావచ్చు. మొత్తానికి హిందూ మైథాలజీ ఆధారంగా సినిమా తీయడం, దానిని ఇప్పటి నేటివిటీ కి కనెక్ట్ చేయడం మాత్రం గొప్ప విషయం.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...