Friday, November 4, 2022

కోల సంబరం జానపదకళారూపాలు 9

 కోలసంబరం

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com


యావత్తు ఆంధ్రదేశమునందు మారుమూల ప్రాంతాలకి పరిమితమై ఆ ప్రాంత ప్రజల హృదయాలలో చెరగని స్థానం సంపాదించిన కొన్ని జానపద కళారూపాలలో "కోలసంబరం" ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం దగ్గర వెల్ల గ్రామం ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతం ఆ గ్రామంలో 20 దళాల వరకు కోలసంబరం ప్రదర్శనను ఇచ్చేవి ఉన్నాయి. అందులో చిక్కాల కోటయ్య చిల్కాల కామయ్య జట్లు, గీతా  పెద్దరావు జట్లు, సుబ్బారావు జట్టు ప్రసిద్ధి చెందినవి. వీరి శిష్యులు, కోలసంబరం కళాకారులు వీరబోయిన చంద్రరావు, వాసంశెట్టి నారాయణలను కలువగా వారు కోలసంబరం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేసారు.

ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన దేవాలయాలు అడుగడుగునా అనేకం కనిపిస్తాయి. ఈ ఆలయ చరిత్రలకు సంబందించిన పౌరాణిక గాధలు ,చారిత్రక గాధలు ఓ ప్రక్క ఉంటే జానపదుల నోళ్లలో వేరే కథలు ప్రచారంలో ఉన్నాయి. జనపదంగా మారిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఈ కోలసంబరం, మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో ఆకాశరాజు కూతురు పద్మావతిని పెండ్లాడడం. తిరుపతిలో కలిగ దేవతలుగా నిలిచిపోవడం అనే గ్రంధస్దమైన కథ. ఈ కోలసంబరం కథలో ఏడుగురు అన్నదమ్ములలో చివరివాడు  శ్రీ వెంకన్న తిమ్మరాజు, పెరిందేవిలు ఇతని తల్లిదండ్రులు సుదీర్ఘమైన కధతో ఆసక్తికరంగా సాగే ఈ కోలసంబరం బీబీనాంచారిని, మంగమ్మను శ్రీనివాసుడు పెండ్లాడడమే ప్రధాని ఇతివృత్తం. ఈ కథలు గ్రంధస్థం కాలేదు. పూర్తిగా జానపదాలుగానే మిగిలిపోయాయి. ఇందులో పొన్నాడ, బెండపూడి వంటి గ్రామాలలో వెంకన్న అన్నలు ఉండేవారని వింటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఓ రోరి వెంకన్న ఓరి వెంకన్న అని పాడుతూ కోల త్రిప్పుతూ పచ్చని కొబ్బరాకుల పందిరి క్రింద ఎక్కడైనా పాట వినిపించిందంటే అక్కడ కోలసంబరం చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. శ్రీరామా రామదాసు రామయ్య, హరి రామా రామ రామయ అయోధ్యరామా అంటూ వంత పాడుతుంటే సందడి సందడిగా ఉంటుందీ ప్రదర్శన . తిరుపతికి వెళ్ళి వచ్చిన వారు దీపారాధన రాత్రి ఈ కథను ఇంటిదగ్గర చెప్పించుకుంటారు. కొత్త ఇళ్ళలోనికి దిగేవారు ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా కూడా ఈ కథ చెప్పించుకుంటుంటారు.

కోల సంబరం ప్రదర్శించే కళాకారులు వేషధారణ బహుచిత్రంగా వుంటుంది. ముఖానికీ, గుండెలమీదా, భుజాలమీద పెద్ద నామాలు దిద్దుకుంటారు . ఇద్దరు నూనె గుడ్డలు వెలిగించిన కోలలు తిప్పుతుంటారు. ఈకోలలో వేసే నూనె ఒక ప్రదర్శనకు 3 నుండి 4కేజీల వరకూ అవసరమవుతుంది. అన్ని కేజీలు నూనెను ఇస్తామని ఇంటి గలవారు మొక్కుకుంటారు కూడాను. ఇద్దరు పెద్ద పెద్ద ఇత్తడి సిబ్బితాళాలు వాయిస్తూ వంత పాడుతూంటారు. మధ్యలో ఒక ఒక చేతితో వెండి తొడుగులు చేయించిన పేముబెత్తం, మరొక చేతిలో నెమలి ఈకల కట్ట పట్టుకుని ఉంటాడు. మధ్యలోని వ్యక్తిని గురువు అంటారు. ఇతను వెనకకూ ముందుకూ నడుస్తూ వెంకన్నబాబు కథను పాట రూపంలో పాడుతూ ఉంటాడు. * అప్పుడప్పుడూ కోల త్రిప్పే వారిలో ఒకడు హాస్యగానిగా మారి హాస్యం చెపుతుంటే ప్రజలు పగలబడి నవ్వుతూ భక్తితోను ఆసక్తితోను
వినోదిస్తూ ఉంటారు.
పేదరికంలో మగ్గిపోతున్న ఈ కళాకారులలో నిరక్షరాస్యత కూడా తాండవిస్తూ వుంది. ఈ కోలసంబరాన్ని ప్రదర్శించే కళాకారులు వెల్ల గ్రామములోనే కాకుండా రామచంద్రపురం, గంగవరం, కురుకూరు, తాళ్ళపాలెం, కొవ్వాడ దగ్గర రేపూరు గ్రామాలనుందు కూడా ఉన్నారు. ప్రభుత్వ దృష్టిలో పడని ఈ కళారూపాన్ని బావి తరాల వారికి అందించవలసిన అవసరం అందరిపైనా ఉంది. ప్రభుత్వం వారు ఈ కళారూపాన్ని ఆడియో వీడియో రూపాలలో భద్రపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. కళాకారులను గుర్తించి ఆర్థిక అవసరాలు తీర్చగలిగితే ఇటువంటి కళారూపాలు దికాలాల పాటు పదిలంగా ఉండగలుగుతాయి.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...