Wednesday, November 2, 2022

గంగిరెద్దులాట— జానపదకళారూపం 5

 గంగిరెద్దులాట

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దుల ప్రదర్శన ఆ పండగకు మరింత శోభనిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. వాకిటిల్లో తీర్చి దిద్దిన రంగవల్లులపై నుంచి గంగిరెద్దులు ముస్తాబై నడిచి వెళుతుంటే తనువు పులకరించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. రాజులు, జమిందార్లు "పోషణలో వర్ధిల్లిన ఈ కళారూపం ప్రస్తుతం నిరాదరణకు గురై పట్టెడు మెతుకుల కోసం ఈ కళారూపం ప్రదర్శించబడటం శోచనీయం. కళాకారులు దుర్భర జీవితాన్ని గడుపూతూ ఉండటం హృదయాలను కదిలించకమానదు.


కళారూపం ఆవిర్భావం గురించి పురాణాలలో ప్రస్తావన వుంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని తన ఉదరంలో భంధించగా పరమేశ్వరుని విముక్తి కావించటానికి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి విష్ణువు సన్నాయి ధరించి బ్రహ్మడోలు వాయిద్యం చేబూని ముందుకు ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు. ప్రదర్శన తిలకిస్తున్న గజాసురుని నంది తన వాడియైన కొమ్ములతో పొట్టను చీల్చి పరమేశ్వరుని బయటకు రప్పించినట్లు పురాణగాథ. ఈ సందర్భంలోనే తన అనుచరులైన ఒక గుంపునకు ఈ ప్రదర్శన చేసుకొనడానికి శివుడు అనుమతి ఇచ్చాడని అప్పటినుండి వంశాను గతంగా ఈ కళారూపాన్ని అంటి పెట్టుకుని ఉన్నామని గంగిరెద్దుల వారు చెబుతుంటారు.. గంగిరెద్దు ఆటనే వృత్తిగా స్వీకరించిన వీరిని గంగిరెద్దోళ్ళుగా పిలుస్తూ ఉంటారు. వీరిని పూజ గొల్లలని కూడా పిలుస్తారు. వీరు తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి, జగ్గంపేట, మాధవపట్నం, గెద్దనాపల్లి, విరవ, కందరాడ, కాకినాడ, హుకుంపేటలో సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నారు.కాని 50 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని కలిగి వున్నాయి.వీరి వేషధారణను పరిశీలిస్తే ఎత్తైన విగ్రహం కలిగి కోరమీసాలు, బుర్రమీసాలు పెంచి ఈ కళారూపానికి తగిన అలంకరణ చేసుకుంటారు. ధోవతి చేతులనిండా చొక్కా  , నల్లని కోటు ధరించి తలకు జరీ అంచు ఉత్తరీయాన్ని చుట్టుకుంటారు. డోలు, శృతి బూరలు, లేదా సన్నాయి చేత పట్టుకొని సుస్వరాలతో వీనుల విందు చేస్తారు. వీరి గళం నుండి వినిపించే సాహిత్యమంతా అనుచానంగా అందుకొన్నదే. వీరి సాహిత్యంలో కొన్ని కథలలో బొబ్బిలికథ,సీతాదేవికథ నివాసం వంటివి ఉన్నాయి..


ఇక గంగిరెద్దుల ముస్తాలు చెప్పనక్కరలేదు. వీటి అలంకారంలో మువ్వలు, చిరుగంటలు, కొమ్ములకు, కుచ్చులు, మూపురంపైన చిలకల బొంతీలు, కాళ్ళకు గజ్జెలు వంటివి అలంకరిస్తారు. శ్రావ్యంగా సన్నాయి మోగిస్తూ, డోలు వాయిస్తే గంగిరెద్దులు చేసే విన్యాసాలు నేత్రపర్వంగా ఉంటుంది. దీనినే గంగిరెద్దులాట అని కూడా అంటారు. "అయ్యగారికి దన్నం పెట్టూ... డూ డూ బసవన్నా అంటూ గంగిరెద్దులాడించే వాడి గుండెలపై కాలు ఆనించి లయబద్ధంగా తన శరీరాన్ని ఊపుతూ గంగిరెద్దులు చేసే నృత్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుగు కాళ్లను ముక్కాలి పై వుంచి గంగిరెద్దు నిలబడి చేసే విన్యాసం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. గంగిరెద్దుకు రాముడు, లక్ష్మణుడు అని పేర్లు పెట్టి పిలిస్తే రాముడు అంటే పెద్ద ఎద్దు, లక్ష్మణుడూ అంటే చిన్న ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇది చూసే వారు సంబ్రమాశ్చర్యాలకు లోను కాకమానరు.  గంగి రెద్దులా తలాదించడం అనే జాతీయం ఇక్కడి నుండి వచ్చినదే. ఆధునిక మోజులో పడిన తెలుగువారు పట్టణ నాగరికత వ్యామోహంలో పడ్డవారు ఈ గంగిరెద్దులవారి పట్ల నిరాదరణ చూపడం ఫలితంగా ఇది కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఏమైనా అందరికి శుభం కలగాలని దీవెనెలు అందించే ఈ గంగిరెద్దులోళ్ళు ప్రస్తుతం కడుపునిండని పరిస్థితుల్లో వుండడం విచారకరం. వీరి ఆదరణకు ప్రభుత్వం చేయూత నివ్వడంతో పాటు ఈ కళారూపాల్ని భద్రపరుచుకోవలసిన అవసరం ఎంతో వుంది.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...