Tuesday, November 1, 2022

జానపదకళారూపం—పోటు వేషాలు 2

 పోటు వేషాలు

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



పగటివేషాలు సూదిరిగానే 'పోటు వేషాలు' విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. జానపదకళారూపాలలలో రహస్యాలను దాచుకున్న కళా ప్రదర్శనగా ఈ పోటు వేషాలు ప్రసిద్ధి చెందాయి. బీభత్సరసానికి చెందిన ఈ జానపదకళా ప్రదర్శన సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. బళ్ళాలతోను, రంపాలతోను, గొడ్డళ్ళతోను, కత్తులతోను ఎదుట మనిషిని పొడిచినట్లు, రక్తం చిందుతున్నట్లు అత్యంత సహజంగా కనిపిస్తూ గగుర్పాట్లును కలిగిస్తాయి. అందుకే వీటిని ఖూనీ పోటు వేషాలని కూడా పిలుస్తారు. ఈ కళారూప రహస్యాలు విశ్వ బ్రాహ్మణులకే తెలుసు అంటారు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ,మూలపేట, అమీనాబాద గ్రామాలు ఈ కళారూపానికి ప్రసిద్ధి "ఆశ్వీయుజ పౌర్ణమికి దేవాంగులు, పద్మశాలీలు తమ కులదేవత గౌరమ్మను నిలుపుకుంటారు. కార్తీక పౌర్ణమి వచ్చేవరకు నెలరోజుల పాటు సంబరాలు చేస్తారు. నెలరోజులూ రోజులో చేపు కడుతూ చివరి రోజు గౌరమ్మను సాగనంపుతూ ఈ ఖూనీ పోటు వేషాలు కడతారు. ఈ పోటు వేషాలలో బాడితివేషం, రంపం వేషం, బొడ్డులో బళ్ళెం, పక్క బళ్ళెం, జబ్బకత్తి వేషాలు చూపరులను కట్టిపడేస్తాయి. బళ్ళాలు, కత్తులు శరీరాలలోనికి.

దిగబడినట్లు అత్యంత సహజంగా కనిపిస్తాయి. ఈ వేషాలకు మేకప్ విద్య తెలిసిన పాలంకి బాల సూర్యనారాయణ (బాబి ) ఉప్పాడ వారిని అడిగితే చాలా విషయాలు తెలియజేసారు..?


పూర్వం అనకాపల్లి ప్రాంతం ఈ కళాప్రదర్శనకు ప్రసిద్ధి చెందినదని అంటారు. అమీనాబాద గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు కమ్మరి భీమన్న ఈ కళకు సంబంధించిన రహస్యాలు తెలుసుకుని తన కుటుంబస్థుల సహకారంతో వేషాలు కట్టించేవాడు. కమ్మర భీమన్న శిష్యులు బొమ్మకంటి శరభయ్య, సుబ్బారావు, వెంకటరత్నం అనే అన్నదమ్ములు వీటిని తెలుసుకుని మరింత ఆధునీకరించారు. అతి తక్కువ మందికి మాత్రమే ఈ రూపంలో లోతుపాతులు తెలియడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. నల్ల కళ్లద్దాలు, తలపాగలు, ఆశ్చాదనలేని శరీరాలతో ఈ వేషాలను పురుషులే వేస్తారు.


 ప్రదర్శన రోజున ప్రదర్శనకారులను రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి వీరికి వేషాలు కడతారు.  ఈ కళాకారుల వేషధారణ ప్రత్యేకముగానే ఉంటుంది. తెల్ల నిక్కరుగాని, గళ్ళపంచెలుగాని కట్టుకుంటారు. ముందు వెనుక వ్రేలాడ కాశీకోర ఉంటుంది . నల్ల కళ్ళద్దాలు, బుర్రమీసాలు పెట్టుకుంటారు. తలకు రంగు రంగుల తలపాగాలు ధరించి అరనామాలు పెట్టుకుంటు ముఖానికి భీకరంగా కనిపించేట్టు నామాలు పెట్టుకుంటారు. మెడలో పులిగోరుల దండలు, జబ్బు కడియాలు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద పొడవైన వెదురు లేక రేకు గడలకు చివరన పెద్ద బళ్లాలు, కత్తులు అతికబడివుంటాయి. వీటిని అమర్చుకొనుటలోనే వుంది ఈ కళా ప్రదర్శనలోని రక్తి అంతా . బాడితి వేషం నడినెత్తిలో గుచ్చుకుని గెడ్డం క్రిందకు దిగబడినట్లు వుంటుంది. బొడ్డు బళ్ళెం. పక్కబళ్ళెం అచ్చుం శరీరం నుండి దూసుకుపోయినట్లుగానే భ్రమింపజేస్తాయి. రంపపు వేషం మరింత ఆశక్తి కరంగా వుంటుంది. మధ్యలో మనిషిని నిలబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు రంపాన్ని పట్టుకుని ఆడిస్తూ వుంటే రంపం శరీరం మధ్య నుండి కదులుతున్నట్లు కనిపిస్తూ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ప్రదర్శన కారులు నెమ్మదిగా ఒక్కొక్క అడుగూ వేస్తూ కదులుతుంటారు.


ఈ ప్రదర్శనలు మధ్యాహ్నం నుండి వీధుల వెంబడి ప్రారంభమవుతాయి. వీటిని జనం విరగబడి చూస్తుంటే ఈ వేషాల నందుగల ట్రిక్కులను ప్రదర్శన తిలకించేవారు కనిపెట్టకుండా ఉండటానికి 'కోడిగాడు" అనే హాస్య పాత్ర అల్లరిచేస్తూ వుంటుంది. ఈ కోడి గాడి వేషం నవ్వు పుట్టిస్తుంది. చేతిలో కోడి, నల్లని గొడుగు, చిన్న జబ్బల చలికోటు, గొట్టంఫేంటు, తలపాగా, నల్ల కల్లద్దాలు పెట్టుకున్న కోడిగాడు జనం మీదకు తనచేతిలోని కోడిని ఆడిస్తూ ప్రదర్శన కారులపై దృష్టి పడకుండా చేస్తాడు. ప్రతీ పాత్రకు పరమార్ధమున్నట్టే ఈ కోడిగాడి పాత్రకు పరమార్ధముంది. ప్రదర్శన పూర్తవగానే కోడిగాడు తన చేతిలోని కోడిని కళాకారులకు దిష్టి తీసి గౌరమ్మకు సమర్పిస్తాడు.

భీభత్సరసాన్ని పూర్తి స్థాయిలో ప్రతిబింబించే ఈ కళారూపం ప్రదర్శిస్తున్నప్పుడు చిన్న పిల్లలు జడుసుకోకుండా ఇంట్లో పెట్టి తల్లులు గడియ పెట్టడం, కిటికీ సందుల నుండి ఆడవారు భయం భయంగా చూడడం ఈ కళా ప్రదర్శన సహజత్వానికి ఉదాహరణలు. పోటు వేషాలకు రక్తం కారుతున్నట్లు తిలకంరంగు అద్దడం మరింత సహజత్వాన్ని చేకూరుస్తుంది. ప్రదర్శనకు ప్రజలే విరాళాలు అందిస్తారు. ప్రతీ ప్రదర్శనకు ఈ రోజుల్లో, ఏడు, ఎనిమిది వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కొన్ని రోజుల క్రితం వరకూ తుని, పిఠాపురం, పందలపాక, రేలంగి, కాట్రేనికోన వంటి గ్రామాలలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు.


ఈ కళారూపం రహస్య కళారూపం కావడంతో వేషాలు వేసుకున్న వారు, వీరికి వేషం అమర్చిన వారికి తప్ప ఇతరులకు ఈవిద్య తెలియక పోవడంతో ఈ కళారూపం అంతరించిపోయే ప్రమాదంలో పడింది. వేషాలు ధరించిన వారి దగ్గర వేషం తాలూకు రహస్యాలు ఇతరులకు తెలపనని ప్రమాణం చేయించుకోవడం వలన కూడా ఇది మరుగున పడుతుంది. ఈ కళారూపం రహస్యాలు తెలిసిన వారు ప్రస్తుతం వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. వారిలో శ్రీ ఏడిద రత్నాకరరావు, ఆశపు సూర్యారావు, ఉన్నారు. ఈ కళారూపం ప్రదర్శించి పేరు సంపాదించిన వారిలో వడిగే మల్లికార్జున్, మలిపెద్ది అప్పులరాజు. సిద్ది సూర్యారావు, గుంటూరు స్టాలిన్ తదితరులు ఉన్నారు. ఇటువంటి అపురూప కళారూపాలను విడియో రూపంలో నిక్షిప్తం చేసి భావితరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది











.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...