Wednesday, November 2, 2022

తప్పెటగుళ్ళు —జానపదకళారూపం 8

 తప్పెటగుళ్ళు

రచన జనశ్రీ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



ఆంధ్రదేశాన హృద్యమైన కళారూపాలలో "తప్పెటగుళ్ళు" ఒకటి. అమ్మవారి జాతర్లలోను, దేవుళ్ల ఊరేగింపులలోను, పండగ సంబరాలలోను  ఈ కళారూపం, ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కళారూపం ప్రదర్శించే కళాకారులు10 నుండి 30 మంది వరకూ వలయంగా నిలబడి రేకుతో చేసిన హృదయాకారపు వాయిద్యాలను  చాతికి కట్టుకొని వాయిద్యాన్ని రెండు చేతులతో వాయిస్తూ సున్నితంగా చిందులువేస్తూ నృత్యం చేస్తుంటే చూసి తీరవలసిందే. మధ్యలో ప్రధాన గాయకుడు వేగంగా తిరుగుతూ పాడుతుంటే ముప్పైమంది వంతలు తమ గొంతు కలుపుతూ ఓ పద్ధతి ప్రకారం పాటకు అనుగుణంగా తప్పెటగుళ్ళు వాయిస్తూ ఉండడం ఈ కళారూపం ప్రత్యేకత. కిర్లంపూడికి చెందిన నర్రికింతాడ సన్మరావు తప్పెటగుళ్ళ కళారూపాన్ని దేశ విదేశాలలో ప్రదర్శిస్తూ తప్పెటగుళ్ళ నవయుగ వైతాళికునిగా మన్ననలు పొందుతూ వుండడం ఆనందించదగ్గ విషయం..


ఈ కళారూపం పుట్టుక మానవుని ఉనికి, సంకేతాల మనుగడుకు సంబంధించినదనడం అతిశయోక్తికాదు, తప్పెటగుళ్ళ ప్రాచీన చరిత్రను పరికిస్తే ఆ విషయం తేట తెల్లంకాకపోదు. పూర్వం మానవుడు తనకు దగ్గరలోని జంతువులను మచ్చిక చేసుకొని వాటిని మందలు. మందలుగా అడవికి తోలుకు పోతూ ఉండేవాడు. ఆ సందర్భంలో తన తోటివారిని గుర్తించడానికి, తన ఉనికి తెలపడానికి కొన్ని సంకేతాలను ఉపయోగించేవాడు. అందులోని సంకేతమే శ్రీరామామో యోరామా రామయ్య, హరరామ రామారామయ్య ఇది కోల సంబరం కళారూపంలోనూ కనిపిస్తుంది. తప్పెటగుళ్ళకు ఈవంత ప్రధానమయినది కూడానూ. జంతు కాపరులు తమ మందలను తోలుకొని క్షేమంగా ఇల్లు చేరుకున్న తరువాత వారి కులదేవత గావు గంగాలమ్మకు జాతర చేయడం వారికి

ఆనవాయితీ. వీటిని గావు సంబరాలంటూ ఈనాటికీ ఆచరిస్తూనే ఉన్నారు. వాయిద్య పరికరాలకు ఓ ఆకారం దాల్చని సమయంలోనే జంతు కాపరులు తమ గుండెల మీద చేతులలో తప్పెటలు కొడుతూ పరవశించి, ద్విపదల రూపంలో తమ భావాలను వ్యక్తీకరించేవారు. అపుడు వారికి తెలియకుండానే ద్విపద రూపంలో గొప్ప సాహిత్యాన్ని అందిస్తున్నామని అలా వారు చేసిన నృత్యమే తప్పెటగుండె కాలక్రమంలో వాయిద్యాలు,తోడవడంతో తప్పెటగుళ్ళుగా పిలబడుతూవుంది.

           తప్పెటగుళ్ళు జానపద కళారూపం యాదవకులస్థుల సొత్తు. ఈ కళారూపం ప్రదర్శించే కళాకారుల ఆహార్యం ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం పెద్దగోచీ ముందు వెనుక క్రురాజ్ లేదా కాశీకోక ఇప్పుడు ఎర్రనిక్కరు. ఆ నిక్కరుకు ముందు వెనుక ఎర్రరంగు వ్రేలాడుతూ కాశీకోక ఉంటుంది. కాళ్ళకు గజ్జెలు కాని, ఇనుపందెలు కాని ఉంటాయి. నడుముకు పెద్ద పెద్ద మువ్వలు కట్టుకుంటారు. పొట్టి చేతుల బనియిను ఉంటుంది. తలకి ఎరువు లేదా పసుపు తుమాలు చుట్టుకుంటారు. తప్పెట వాయిద్యానికి సహకారంగా ఇతర వాయిద్యాలను కూడా ఉపయోగిస్తారు. జముకు కాని, డప్పుకాని, మద్దెల కాని ఉపయోగించడం వలన ప్రదర్శన మరింత రక్తికడుతుంది. తప్పెట గుళ్ళలో ప్రధానంగా పాటలు, కథలు వైష్ణవ పరంగా ఉంటాయి. గోపాల కృష్ణుని రాసలీలలు, కృష్ణలీలలు తాలూకు పాటలు ఎక్కువగా ఉంటాయి: రామాయణ, భాగవత నందు గల కొన్ని ఘట్టాలను వీరు చెబుతుంటారు. తప్పెటలను వివిధ రీతుల గతులలో

వాయిస్తూఉంటారు. ఈ జానపద కళ సంగీతం, నృత్యం, అభినయం, వాచికం, ఆహార్యం  సంపూర్ణ సమాహార కళ ఇది అనడం అతిశయోక్తికారు. పురుషులే ఈ ప్రదర్శనను చాలా కాలం వరకూ ఇచ్చేవారు. శ్రీకాకుళానికి చెందిన శ్రీమతి బంగారమ్మ బృందం వారి రాకతో దీనిని మహిళలు ప్రదర్శించినట్లయ్యింది. బంగారమ్మ ఈ కళారూపానికి సర్కస్ ఫీట్లు వంటివి ఒకరిపై ఒకరు ఎక్కడం మోకాళ్ళపై ఇద్దరు లేదా

ఎంత మందినైనా కూర్చుండ బెట్టుకుని వాయించడం వంటివి ప్రవేశపెట్టి శభాష్ అనిపించుకుంది. -ఈ తప్పెటగుళ్ళ ప్రదర్శనలో ప్రతిభా ప్రదర్శనలు, అద్భుత విన్యాసాలు తోడవడంతో ఈ కళారూపం ఇప్పటి వరకూ మనగలుగుతుంది. ప్రస్తుతం ఈ కళారూపాన్ని శ్రీ హితాడ సన్యాసిరావు (కిర్లంపూడి) వంటి కళాకోవిదులు తమదైన బాణిలో నవీకరించడంలో దీనికి దేశీ విదేశాలలో గుర్తింపు వచ్చింది. ఈనాడు. వీరి ప్రదర్శనలలో పౌరాణికగాథ రాకుండా సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని కళారూపం ప్రదర్శిస్తున్నారు.. ఇందులో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, నిరక్షరాస్యత, మధ్యపాన వ్యతిరేకత. దేశీయ సమైక్యత, మధర్ థెరిసా వంటి గాధ లు జోడించడంతో ఈరూపకం ప్రజలు, ప్రభుత్వం నుండి నీరజనాలు అందుకుంటుంది. న్యూఢిల్లీ వారి సాంగ్స్ అండ్ డ్రామా డివిజన్ ఈ కళారూపానికి మెరుగులు దిద్దుతుంది. హృదయాలను పులకరింపజేసి, ఆలోచింపజేసే ఇటువంటి కళారూపాల ద్వారానే ఈనాడు మానవుడి నడవడికను, పురోగాభివృద్ధిని తీర్చి దిద్దుతున్నారు. ఈనాటి ఎలక్ట్రానిక్  యుగంలో ఇటువంటి కళారూపాలు వెనుక బడినా ఈ కళారూపాలను అనువైన బాణిలో ప్రజల మధ్యకు పంపితే సామాజిక దురలవాట్లను పోగొట్టి మరలా మనకు మంచి నడవడిక నేర్పుతాయనడం అతిశయోక్తి కాదు. ఇటువంటి కళారూపాలను అందరూ ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...