Wednesday, November 2, 2022

జంగందేవర — జానపదకళారూపాలు 7

 జంగం దేవర

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com




తెలుగు నేలపై మనలను అలరిస్తున్న జానపద కళారూపాలను లోతుకంటా పరిశీలిస్తే జనపదుల యొక్క జీవన స్థితిగతులు, వారిలోని రాగద్వేషాలు, జీవనంలోని ఆటుపోట్లను నిశితంగా పరిశీలించగలం.జంగందేవర జానపదకళారూపం చాలా ప్రాచీనమైనది. భారతీయ సనాతన సంప్రదాయాల్లో అంతర్లీంగా కలిసిపోయింది జంగందేవర కళారూపం. జంగం అని మనం తలచుకోగానే మన కళ్ళముందు నిలిచేది జంగం దేవర రూపం. దేవర వేషం బుడిగెజంగం తెగకు చెందిన వారే కడుతున్నారు. ప్రధానంగా తరతరాలనుండి యాచక జీవనం గడుపుతూ సంచారులుగా ఈ జంగందేవరలు గడపడం వీరి జీవన విధానం .


జంగం దేవర వృత్తి కళ చాలా పురాతనమైనది. ఇది శైవమతానికి చెందినది. ఈ జంగం దేవరలు మనకు కార్తీక పౌర్ణమి నుండి సంక్రాంతి వరకు పల్లెల్లో ప్రతి ఇంటి ముందు తెలతెలవారుతుందనగా నిలబడి శంఖం ఊదుతూ, చేతిలోని గంట వాయిస్తూ భీకర రూపంలో కనిపిస్తుంటారు. ఈ జంగం దేవర'వేషం' మగవారే కడతారు. వీరి యొక్క వేషధారణ ఆసక్తికరంగా ఉంటుంది. ఆజానుబాహుడైన జంగం తలపై పాగాను ధరిస్తాడు. అది  మామూలు తలపాగా కాదు, ప్రత్యేకంగా మలచబడి ఉంటుంది. రంగు రంగుల గుడ్డలతో తలపాగా తయారు చేస్తారు. అందులో ఇత్తడి రేకులతో తయారు చేసిన సర్పాకారాలను అలాగే ఇత్తడి రేకులతో చేసిన పూలను అమర్చుతారు. నుదురుకు విభూదిని నామాలుగా పెట్టుకుంటారు.నామాల మధ్యలో సింధూరం బొట్టు పెడతారు. 

జంగం దేవర తన మెడలో తరతరాలనుండి వస్తున్న లింగకాయను సంప్రదాయంగా వేసుకుంటారు. దీనిని వారు  అత్యంత పవిత్రంగా చూసుకుంటారు. వీరి ప్రదర్శనలో ఈ లింగకాయ చాలా ప్రధానమైనది. ఈ లింగకాయ వెండితో చేసి ఉంటుంది. ఇది ఒకరి నుండి ఒకరికి వారసత్వంగా వస్తుంది. మెడలో రుద్రాక్ష మాలలు ఉంటాయి. వంటిపై పాతకోటును వేసుకొని దానిపై రంగు రంగుల వస్త్రాలతో తయారు చేసేకున్న విలువు అంగీని వేసుకుంటారు. చంకలో ఒక జోలిని వ్రేలాడేసుకుంటారు. మరొక చంకకు కంచుతో చేసిన బరువైన గంటను వ్రేలాడేసుకుంటారు. చూడడానికి భీకరంగా కనిపించే ఈ జంగందేవర  తమ ఇంటముందుకు వచ్చి శంఖం ఊదగానే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చినట్లు భావించిన ముత్తయిదవులు వీరి జోలెలో బియ్యం వేసి సంభావనలు ఇచ్చి పంపిస్తుంటారు. ఈ జంగందేవరలు ముందుగా నిర్ణయించుకున్న గ్రామాలలో యాచన చేస్తారు. ఒకరి గ్రామాలలోనికి మరోకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరు. రైతుల ఇండ్లకు వెళ్ళి వారి ఇచ్చే పంట ఫలాలలను స్వీకరించి వారిని పొగడ్తలతో స్తుతించి వారి వారి గోత్రనామాలతో పొగుడుతారు. వారకి బిక్ష వేయగానే సహజరీతిలో పొగడ్తలతో ముంచెత్తి శివ ప్రాసిస్త్యాన్ని కూడా చదువుతారు. వీరి శంఖం ఊదడం ఆశ్చర్యం కల్గిస్తుంది. గుక్క తిప్పుకోకుండా ఎంతసేపైనా వీరు ఊదగలరు. వీరి చేతిలో ఒక కర్ర కూడా ఉంటుంది.జంగం దేవరలు ఎంత దూరమైనా కాలినడకనే పోతూ ఉంటారు. వీరు ఒకరకమైన పిల్లన గోవిని ఊదుతుంటారు మనకు దొరికే పిల్లనగ్రోవి కాదు. ప్రత్యేకంగా స్వరాలను అది పలుకుతుంది దానికి అందంగా జూలుతో ఉన్న గుడ్డలను కట్టి అందంగా తయారు చేస్తారు. దీనిని నిలువుగానే ఊదుతారు. వీటి నుండి పలికే రాగాలు మనకు వీనులు విందుగా వినిపిస్తాయి. ఈ జంగం దేవర వేషం కట్టేప్పుడు చాలా నియమనిష్టలతో

ఉంటారు. వీర జంధ్యాన్ని కూడా వేసుకుంటారు. జంగం దేవరలు శైవ ఆరాధీకులు ఉండే ప్రాంతాలలోనే యాచన సాగిస్తూ ఉంటారు. శివరాత్రి సందర్భాలలో రాష్ట్రం నలుమూలలా ప్రసిద్ధ ఆలయాల దగ్గర తీర్ధాలు, స్నానాల రేవులు, సముద్ర తీరాలు, గోదావరి ప్రాంతాలలోను వీరు కనిపిస్తుంటారు. వీరు పిండ ప్రధానం.

చేయడం కత్రువులను నిర్వహించడం నదిలోని నీటిని జ్యోతులలో వెలిగించి వదలడం చేస్తుంటారు. వైష్ణవ సంప్రదాయ కుటుంబాల వారు పిలిచి వీరిచే కర్మ కాండలు చేయించుకుంటారు. వీరు శవయాత్రలలో పాల్గొని, దహన కాండలు కూడా నిర్వహిస్తుంటారు. భారతీయ సనాతన సాంప్రదాయాలతో ముడివడిన అపురూప జానపద కళారూపం జంగం దేవరను ఆదరించవలసిన అవసరం  మనందరికి ఉంది.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...