Saturday, November 5, 2022

ఎలుగుబంట్లు జానపదకళారూపం 10

ఎలుగుబంట్లు

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com




మన జానపద కళారూపాలలో జంతు రూపాలు కలిగిన జానపద కళారూపాలకు పెద్ద పీటే  ఉంది. దేవతల సంబరాలలో ఈ జతురూప కళా ప్రదర్శనలు ముమ్మరంగా జరుగుతూ ఉంటాయి. జంతు రూప జానపదకళా ప్రదర్శనలలో పులి వేషం తరువాత చెప్పుకోదగింది ఎలుగుబంట్ల వేషమే. సత్తెమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ, దానమ్మ, గొంతేలమ్మ ఇవే కాకుండా ఉత్సవాలలోనూ ఈ ఎలుగుబంట్లు వేషం కనిపిస్తుంది. శక్తి వేషానికి అనుబంధంగా ఈ ఎలుగుబంట్ల వేషం వేస్తుంటారు. ఎలుగుబంట్లు ముఖాలను పోలిన ముసుగులు తయారు చేసుకొని తమ ముఖాలకు తొడుగుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు చేసే శృంగార హాస్య కళాసారమే ఈ ఎలుగు బంట్లు జానపద కళారూపం, ఈ కళా వేషాలు ఎక్కువగా యువకులే వేస్తుంటారు..దసరా వుత్సవాలకు ఆ తొమ్మిది రోజులూ రకరకాల వేషాలను ప్రదర్శిస్తారు. అలాగే సంక్రాంతి దినాలలో కూడ విచిత్ర వేషాలను ధరించి ఇంటింటికి తిరిగి ప్రజల నానంద పరిచి, వారి నుండీ ధాన్యాన్నీ, డబ్బులనూ వసూలు చేసుకుంటారు.


సంబరం ప్రారంబానికి ముందు ఇద్దరు వ్యక్తులు ఎలుగు బంట్ల ఆకారంలో చెక్కతో మలచబడిన ముఖాలను తమ ముఖాలకు తగిలించుకుంటారు. ఇప్పుడు మనం మాస్కులు అంటున్నాం అలాంటివన్నమాట .అవి చెక్కతో తయారై ఉంటాయి. ఎలుగు బంట్ల వెంట్రుకల మాదిరి నలుపురంగు వేసిన జనపనార పీచుతో తయారుచేసి పూర్వం ఎలుగుబంట్ల చర్మంలా వాడేవారు. ఇప్పుడు ఉతకడానికి వీలుగా ఉంటే చవకరకపు ఊలుతో చేసిన వాటిని కూడా ధరిస్తారు. వీటి ఖరీదు ప్రస్తుతం ఎలుగుబంటి ఒక దానికి ఆరువేల రూపాయల వరకు అవుతుంది.
            ఎలుగు బంట్ల వేషం వేసేవాడు 'తాసా' వాయిద్యం మధ్యగాని, హోరెత్తే డప్పుల మోత మధ్యగాని ఎలుగుబంట్ల మాదిరిగా గంతులుచేస్తూ. తమలో తామే గిల్లికజ్జాలు పెట్టుకుని కొట్టుకుంటూ నవ్వు పుట్టించే విధంగా ప్రదర్శన మొదలు పెడతారు. అప్పటికప్పుడే పరిసరాల నుండి సన్నివేశాలను సృష్టించుకుంటారు. అందులో ఒక ఎలుగుబంటి పరిసరాలు గమనిస్తుంది. పక్కన గంప ఒకటి దొరికితే అందులోనికి రాళ్ళను ఎత్తుతుంది. దానిని తీసుకుపోయి తోటి ఎలుగుబంటి తల మీద పోస్తుంది. ఆ ఎలుగుబంటి గంగిర్లెత్తినట్లు నటిస్తూ పిల్లి మొగ్గలు వేసుకుంటూ జనాలలోకి పోతుంది. ఆ సన్నివేశంతో జనం నవ్వులతో కూడిన హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తారు. ముఖ్యంగా చిన్ని పిల్లలు, ఆడవారు ఈ -ప్రదర్శనకు ఆకర్షితులౌతుంటారు. ఇలా సాగిపోయే ప్రదర్శన శృతి మించిన హాస్యం, శృంగార సన్నివేశాలలోకి దిగి కడుపుపుబ్బా నవ్విస్తాయి.ఇలా రోడ్డువెంట జరుగుతూ వెడుతుంటుంది ప్రదర్శన. గొల్లప్రోలుకు చెందిన మల్లారపు ఇశ్రాయేలు, నేకూరి వీరబాబు ఈ జానపదా కళారూపం ప్రదర్శించడంలో మంచి అనుభవఙ్ఞులు.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...