Wednesday, November 2, 2022

బుర్రకథ — జానపదకళారూపాలు 4


బుర్రకథ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



మన తెలుగు వారి జానపద కళాఖండాలలో బుద్ధకథ స్థానం అపూర్వమైనది. ఇది అచ్చమైన ప్రజాకళ .ఆది నుండి తెలుగు నేలపై  తెలుగు వాడి పౌరుషాన్ని రగిలిస్తూ ఆడవారి కళ్ళవెంట నీరు ఒలికిస్తూ రసజ్ఞులైన ప్రేక్షకులను  ఉర్రూతలూగించి వినోదాన్ని అందిస్తూ వస్తుంది. గత ఏభై సంవత్సరముల నుండీ ఈ బుర్రకథ కొత్త పుంతలు తొక్కుతూ విజ్ఞానాన్ని వెదజల్లే ప్రాధాన సాధనంగా కూడా మలచబడి నిలబడింది. ఈ బుర్రకథను జంగమ కథలని, పదములని, తందాన కథలని దీనికి పేర్లు కలవు. కథ చెప్పి కథకుడు తన చేతినందు సొరకాయతో కాని గుమ్మడి బుర్రతో చేసినా తంబూరాను,శారద వంటి వాద్యములు వాయిస్తూ ఆ శబ్దాలలో కూడిన గానములు గల కథలను పాడటం వలన దీనికి బుర్రకథలని పేరు వచ్చింది. రామచంద్రాపురం నందుగల బుర్రకథ చెప్పే ప్రఖ్యాత బుర్రకథ కథకులు శ్రీ గొర్రెల రాము తమ అనుభవాలను విశేషాలను ఇలా తెలియజేస్తున్నారు.


13వ శతాబ్దానికి ముందే ఉన్న 'బాలనాగమ్మ' తంబూరా పాటే కాలక్రమేణా బుర్రకథగా రూపాంతరం చెందినది. ఒకనాడు ఇది ఒక జాతివారికి బిక్షాటనకు ఆలంబనగా ఉండేది. ఇద్దరు స్త్రీలు, లేదా పురుషులు తంబూర వాయిస్తూ అందె మ్రోగిస్తూ  గుమ్మం, గుమ్మానికి తిరుగుతూ కథను పాడుతూవుంటే తెలుగంటి వారు చేటలతో బియ్యం తీసుకువచ్చి వారి జోలెలో వేస్తూ ఉండేవారు. ఈ బుర్రకథను భిక్షక స్థాయి నుండి దీని స్దాయిని పెంచి నాట్యాది విషయాలు జోడించి గజ్జె కట్టించి, బల్లనెక్కించి, పూలదండలు వేయించి పండితుల ఆదరణను తెచ్చిన గౌరవం శ్రీ నాజర్ కు చెందుతుంది. ఆంధ్రదేశంలో ప్రజానాట్యమండలి వారు కూడా ఈ బుర్రకథకు ఊపు యివ్వడంతో వాడవాడలా బుర్రకథ ధళాలు వెలిశాయి.


బుర్రకథలో ముగ్గురు కళాకారులుంటారు. ప్రధాన కథకుడు కాక ఇద్దరు వంతలు ఉంటారు. కథకుడు దోవతి కట్టుకుని పొడవైన అంగరఖా ధరిస్తాడు. తలకు ఎర్రని రుమాలు చుట్టుకుంటారు. వంతలు కాళ్ళుకు గజ్జెలు కట్టుకుంటారు. కధకుడు వాళ్ల గజ్జెలు లయబద్ధంగా మ్రోగిస్తూ భుజాన తంబూర మీటుతూ ఎడమచేతిలో అందెను మ్రోగిస్తూ కథ చెబుతుంటే వంతలు ఐదు ప్రక్కలా నిలబడి మెడలో డక్కీలు లేదా బుర్రలు వంటివి వేలాడదీసుకుని కథకుని అడుగులో అడుగు కదుపుతూ తందానతాన అని వంత కలుపుతారు. ఈ బుర్రకథలో ఒక వంత హాస్యం: పలికిస్తే, మరో వంత రాజకీయం చెబుతూ వుంటాడు.


బుర్రకథ ద్విపద, మంజరీద్విపదల శైలిలో బుర్రకథ రచన ఉంటుంది. శ్రీ నాజర్ గారు యక్షగాన పద్దతిని ఇందులో చొప్పించడంతో  నవ్యత వచ్చి ప్రజలకు చేరువయ్యింది. కమ్యూనిస్టు ఉద్యమాలలోను స్వాతంత్య్ర ఉద్యమాలకు కొత్త ఊపిరిలూదిన ఈ జానపద కళారూపం. సంగీతం, నాట్యం, అభినయం, వాచకంలతో నిండిన సర్వకళా సమాహారం అనడంలో అతిశయోక్తిలేదు. నవరసాలను సమ్మోహనంగా ప్రదర్శించడానికి ఈ కళారూపం దీనికిదే సాటి.


వినరా భారత వీర కుమారా విజయము మనదేరా" అంటూ విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు కథను బుర్రకథా కళారూపంలో విని తీరవలసిందే. వీరబొబ్బిలి, పల్నాటి యుద్ధం, నేతాజీ, బాపూజీ, అంబేద్కర్, బెంగాల్ కరువు, వీర యోధుల కథలు, వంటివి ఈ బుర్రకథలో గానం చేస్తుంటారు. ప్రస్తుతం అభిమన్యు, క్రీస్తు జీవితం, వంటి నాటికే అదరణ లభిస్తూ వుంది. ఈ బుర్రకథను ఎందరో కళాకారులు తమ కళాన నైపుణ్యంలో విశిష్టత చేకూర్చొరు. వారిలో శ్రీ నాజర్ , జూనియర్ నాజర్, నిట్టలబ్రదర్స్, గొర్రెల బ్రదర్స్,  లూక్ బాబూరావు మాస్టారు, దిండి బ్రదర్స్,

బెనర్జీ దళం ఒకరేమిటి 150 దళాల వరకు ఈ బుర్ర కథను నమ్ముకుని జీవించారు.. వాడవాడలా వినిపించిన బుర్రకథ ముప్పై సంవత్సరాల నుండి తన ప్రజాదరణను కోల్పోతూ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నా కథకులు పాత కథలనే చెప్పడం వేషధారణలో లోపాలు, నవ్యతలేని హాస్యం, కథచెప్పే శైలిలో ఇప్పటికీ నాజర్ గారినే అనుసరించడం ప్రేక్షకులకు ముఖం మొత్తిందనకోవచ్చు. బంగిమలు ప్రధానకారణంగా కూడా కనిపిస్తూ వుంది. నేడు ప్రభుత్వ కార్యక్రమాలలో బుర్రకథను ఉపయోగించడంతో కొంత వరకూ ఈ కథ తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది. బుర్రకథకులు తమ కథలను మార్చుకుని, వాణిజ్య ప్రకటనలకు, అక్షరాస్యతకు, వైద్య, విద్య రంగాలకు ప్రచారం చేస్తూ జీవనం సాగిస్తూ వున్నారు. పట్టుమని 20 దళాలు కూడా లేని ఈ బుర్రకథ కళారూపం కలకాలం బ్రతకాలంటే బుర్రకథకులు నవ్యతలను ఆవిష్కరించడమే కాకుండా ప్రజలు కూడా మన సంస్కృతి చిహ్నాలైన కళారూపాలను  కళను ఆదరించవలసిన అవసరము ఉన్నది. శ్రీ నాజర్ గారికి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం బుర్రకథ కళకు గుర్తింపు రావడమే కాకుండా  ఒక గొప్ప కళగా భారత ప్రభుత్వం గుర్తించినది అనడానికి మంచి నిదర్శనం.


ఆంధ్రుల పౌరుషాగ్నులు వెదజల్లే వీర గాథలే కాకుండా, స్వాతంత్యోద్యమ స్ఫూర్తిని దేశమంతా రగిలించడంలో బుర్రకథ చురుకైన పాత్రను పోషించింది. నేడు ఈ బుర్రకథ శాస్త్రవేత్తల జీవితగాధలు, ఎయిడ్స్ వంటి సామాజిక అంశాలను ప్రజలకు తన దైనశైలిలో వినిపిస్తూ జనజాగృతికి మూలస్థంభంగా నిలవడం ముదావాహం. రేడియో, దూరదర్శన్ వంటి ప్రచార సాధనాలే కాకుండా సాంగ్ డ్రామా డివిజన్-న్యూఢిల్లీ వారు కూడా ఈ బుర్రకథ ప్రాచుర్యాన్ని తెలియజేస్తూ బుర్రకథ పురోభివృద్ధికి ఇతోధికంగా సహకరించడం ఆనందదాయకం.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...