Sunday, May 29, 2022

గుంటూరు శేషేంద్ర శర్మ

 నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశు త్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు'' (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేషేంద్ర శర్మ ఈ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన కవి.



ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీరు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి అని చెప్పిన శేషేంద్ర 1927 అక్టోబర్‌ 20న నెల్లూరులోని తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. బీఏ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. జర్నలిజం పట్ల మక్కువతో తాపీ ధర్మారావు వద్ద 'జనవాణి'లో ఉద్యోగం చేశారు. కానీ సాహిత్యం ఆయనను వెంటాడటంతో అన్నిటినీ వదిలి కవిత్వాన్ని ప్రేమించడం ప్రారంభించారు.

ఆయన కవిత్వంలో ప్రాచీన, ఆధునిక ధోరణులు అందంగా ఇమిడి పోతాయి. ప్రగతి శీలతనూ, ప్రాచీన భారతీయ అలం కార శాస్త్రాల్నీ, మార్క్స్‌ ఫిలాసఫీనీ ఏక కాలంలో జోడించి ఈ దేశానికి అవసర మైన విలువైన సాహిత్య సిద్ధాంతాన్ని ఆయన 'కవిసేన మేనిఫెస్టో' పేరిట మనకు అందించారు. 'షోడశి- రామా యణ రహస్యాలు' పేరుతో వాల్మీకి సుందర కాండకు అద్భుతమైన తాంత్రిక భాష్యాన్ని అందించిన శేషేంద్ర మేఘదూతానికీ, వాల్మీకి రామాయణానికీ మధ్య ఉన్న సంబం ధంపై జర్మనీ ఇండొలాజికల్‌ యూనివర్సిటీలో అపురూపమైన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.

'ఇద్దరు రుషులు- ఒక కవి' శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వంపై విశిష్టమైన పరిశోధనా వ్యాసాన్ని రాశారు. 'స్వర్ణ హంస' పేరుతో నైషధంపై లోతైన విమర్శ చేశారు. 'నా దేశం- నా ప్రజలు', 'మండే సూర్యుడు', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'నీరై పారిపోయింది', 'సముద్రం నా పేరు', 'పక్షులు', 'శేష జ్యోత్స్న' పేరిట అద్భుతమైన కావ్యాల్ని ఆయన రచించారు. 'కాలరేఖ' పేరిట సాహితీ వ్యాసాల్నీ వెలువరించారు. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నోబెల్‌ సాహిత్య పురస్కారానికి నామినేట్‌ అయిన రెండో భారతీ యుడు శేషేంద్ర. తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్‌ ఇవ్వగా... పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 'రాసేందు' బిరుదును ప్రదానం చేసింది. 'కామోత్సవ్‌' పేరిట ఆయన రాసిన సీరియల్‌ నవల తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది.




'ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను' అని చెప్పిన శేషేంద్ర కవిత్వాన్ని ఆధునిక, సంప్రదాయ కవులు ఇరువురూ ఇష్టపడ్డారు. చాలాచోట్ల శేషేంద్ర కవిత్వంలో నన్నయ్య తచ్చాడుతారనీ, పెద్దన, శ్రీనాథుడిని ఆయన ఉపాసించినట్లున్నారనీ, విశ్వనా«థ, జాషువా, రాయప్రోలు, కృష్ణశాస్త్రి వంటివారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయనీ పుట్టపర్తి ఆయన 'రుతుఘోష'కు రాసిన ముందుమాటలో అన్నారు. ''నీది మంచి పద్యమా, లేక ఫ్రెంచి మద్యమా, కవిరేవ విజనాతి, కవిదేవ సుధాగీతి, శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం'' అని శ్రీశ్రీ ప్రశంసించారు.

'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందీ' అని 'ముత్యాల ముగ్గు' కోసం ఆయన ఒకే ఒకపాట రాసినా అది సినీ సాహితీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. సంస్కృత భాషా సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలో లోతైన పరిజ్ఞానం ఉన్న శేషేంద్ర ఫ్రెంచి కవిత్వం, గ్రీకు విషాదాంత నాటకాలు, మార్క్సిస్ట్‌ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళిదాసు, భవభూతి, టి.ఎస్‌. ఇలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్, రేంబో, శ్రీశ్రీ, ప్లేటోల సమన్వయం శేషేంద్ర!

''కవికి సామాజిక స్పృహ కావాలి. కానీ వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాద రూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లం దరి మీదా ఉంది'' అన్న మాటలు ఆయన కాలానికి అతీతంగా నిలుస్తాయి. ''కళ్ళు తుడుస్తాయి/ కమలాలు వికసిస్తాయి/ మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా''- అంటూ గజల్స్‌ కూడా రాసిన శేషేంద్ర కవిత్వంలో ఉర్దూ సాహిత్య పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. 'ఎప్పుడు ఆకు రాలి పోతుందో గాలికే తెలియదు' అంటూ 30 మే 2007న శేషేంద్ర రాలిపోయారు. ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించకపోవడం ఒక బాధగా మిగిలిపోయింది.

నలభై ఐదు సంవత్సరాలక్రితం.. అంటే 1977లో బహుముఖీన దిశల్లో పతనమౌతూ అనేకానేక రుగ్మతలతో సతమతమౌతూ చేవను కోల్పోతున్న తెలుగు వచన కవితను తిరిగి పునరుజ్జీవింపజేయ టానికి 'కావ్యాన్ని ఒక శాస్త్రం'గా పరిగణించాలని ప్రతిపాదిస్తూ 'కవిసేన' అన్న ఒక సంస్థను స్థాపించారు గుంటూరు శేషేంద్రశర్మ.


ఆ సందర్భంగా 'కవిసేన మేనిఫెస్టో'ను ఆవిష్కరిస్తూ ఇలా అన్నారు: ''చరిత్రలో ఎప్పుడూ కవుల అవిరళ కృషే మానవత్వాన్ని నిలబెడ్తూ వచ్చింది... ఏ తరానికి ఆ తరం కొత్త కవుల్నీ, కొత్త భాషనీ, కొత్త విలువల్నీ, ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించుకుంటుంది. కవి గొంతు ఒక శాశ్వత నైతిక శంఖారావం. విశిష్టంగా చెప్పబడిన మాటే కవిత్వం కాగలదు. ఆ మాటకే మనిషిని మార్చే శక్తి ఉండగలదనేది అక్షరసత్యం. దీనిని ఈ తరం కవులు పాటిస్తే కవిత్వానికి మంచి రోజులు వస్తాయి''.

అందరికీ తెలిసినా క్రమంగా మరుగునపడిన ఈ పరమ సత్యాన్ని శేషేంద్ర మళ్ళీ అప్పటి యువకవులకు మననం చేయించాడు. ఈ నలభై ఐదేండ్ల కాలం గడిచిన తర్వాత అప్పటి యువకవులు ఇప్పుడు వయసుమళ్ళిన కవులుగా పరిణామం చెంది, వెనక్కి తిరిగి 'నడచి వచ్చిన దారి'ని చూసుకుంటే, శేషేంద్ర స్వప్నించిన, ఆశించిన మనిషిని మార్చగలిగిన క్షిపణితుల్య మహోదాత్త కవిత్వమేదీ తెలుగు నేలపై మొలకెత్తి, వినూత్న అక్షరవృక్షమై వర్ధిల్లలేదని అర్థమవుతుంది. అందుకుభిన్నంగా, అతిసులువుగా అందు బాటులోకి వచ్చిన మధ్యమాలవల్లనో, తొందరపడికూస్తున్న కోయిలలవలె prematured కీర్తి చాపల్యాలవల్లనో, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, జూమ్‌ మీటింగ్‌, ఆన్‌లైన్‌ వర్చువల్‌ పత్రికలు... ఇలా అంతా మిథ్యామయమై అస్తవ్యస్త 'మిథ్యా కవిత్వాన్ని' టన్నులు టన్నులుగా కవిత్వంపేర కుమ్మరిస్తున్నారు. ఈ కవిత్వంలో ప్రయోజనమూ, రసాత్మకతా, రంజకత్వం, ఆత్మానందాన్ని అందివ్వగల విశిష్టత, గాఢ తాదాత్మ్యతను యోగపర్చగల విలక్షణత... ఇవేవీ కానరావట్లేదు సరికదా, తామేది రాసినా 'ఇదే కవిత్వం' అని దబాయించగల దౌర్జన్యం మాత్రం కనబడ్తోంది. పత్రికలు కూడా విధిలేక పేజీలను నింపే ఒక 'ఫిల్లర్‌ ఐటమ్స్‌'గా కవిత్వాన్ని కుమ్మరిస్తున్నాయి.

వ్యాసం, కవిత, కథ, నవల, సాహిత్య విమర్శ, నాటకం, మంత్ర తంత్ర శాస్త్రాల వంటి అనేక ప్రక్రియలన్నింటినీ స్పృశించి తనదైన ఒక ప్రత్యేక ముద్రను తెలుగు పాఠకులకు అందించిన శేషేంద్ర ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసనపట్టి తనదైన శిల్పసౌందర్యంతో ప్రసంగించినా, పుస్తకాలను వెలయించినా అపురూప వైదుష్యాన్ని చివరిదాకా ప్రదర్శించిన ఋషి. కవి ఎవడైనా కవిత్వ సృజనను ఒక తపస్సుగా స్వీకరిస్తూ, కవిత్వాన్ని ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎందుకు రాయాలి, ఎవరికోసం రాయాలి.. అన్న ఆత్మస్పృహతో, సోయితో, బాధ్యతగా రాయాలని చెబుతూనే, చలోక్తిగా ''నువ్వు ఆకలి కవిత్వం రాసినా, ఆవకాయ కవిత్వం రాసినా అందులో కేవలం కవిత్వం మాత్రమే ఉండాలి'' అని చెప్పాడు. కవిత్వ నిర్వచనంవంటి లోతైన విషయాన్ని ప్రస్తావిస్తూ శేషేంద్ర ఇలా అన్నాడు: ''కవిత్వంలో అనుభూతే సర్వధాప్రధానం. అనుభూతిలోంచే కవిత్వం.. అంటే అలంకారాలు, బింబాలు, ప్రతీకలు, మార్మిక వ్యక్తీకరణలు, నైరూప్య శబ్ద విన్యాసాలూ, శబ్దశిల్పమూ, అభివ్యక్తి శిల్పమూ వాక్యాన్ని రసాత్మకం చేస్తూనే నర్తించే నృత్య భంగిమల వంటి ముద్రలతో రూపుదిద్దుకుని అంతిమంగా విశిష్టమైన భావం, విశిష్టమైన భాష, వ్యక్తీకరణ తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు''.

కవిసేన ఆవిర్భవాన్ని ఒక చారిత్రక వైజ్ఞానిక ఉద్యమంగా అభివర్ణిస్తూ శేషేంద్రశర్మ తను లక్ష్యించిన యువకవులను ఉద్దేశ్యించి ''తమ్ముడూ నీ గొంతులో గంధకపు గనులు న్నాయి సుమా, నీవు చేసే ప్రతి పద్యమూ ఒక తుపాకీ, నీ పద్యం మోసే ప్రతి వాక్యమూ ఒక శతఘ్ని, నీకు తెలుసు... మొదటి నీటిబొట్టే సముద్రం కాదని. ఐతే సమూహిస్తున్న కవిసేన సముద్రాన్ని సృష్టించేవరకు నిద్రపోదని. నువ్వు ఒక్కో వాక్యశకలాన్ని ఒక్కో పిస్టల్‌లా పట్టుకుని నడవాలి యుద్ధంలో గమ్యాన్ని ముద్దాడేవరకు'' అని దిశానిర్దేశం చేశాడు స్పష్టంగా, అర్థవంతంగా ప్రతి కవిసేన సైనికున్నీ ఒక సత్యాగ్రహిగా సంబోధిస్తూ.

కవిసేన మానిఫెస్టోలో 'ఆశయాలు-నియమాల'ను పొందుపరుస్తూ శేషేంద్ర: ''కవిసేన ఒక కవుల పార్టీ, కవికి రాజకీయాలు కావాలేకాని రాజకీయ పార్టీలు కాదు'' అంటాడు. అసలు సామాజిక చైతన్యం అంటే ఏమిటి వంటి కీలక భావనలను విపులంగా బోధపరుస్తూ ''ఇప్పటి వర్తమాన సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో కవులు సంఘటితమై ఒక 'వైజ్ఞానిక నాయ కులశక్తి'గా కవిసేన రూపొందాలని ఆకాంక్షించాడు శేషేంద్ర. యువకవుల పైన అచంచలమైన విశ్వాసంతో 'కవిసేన మేనిఫెస్టో' గ్రంథాన్ని 'ఎవరు నా ఆశాకిరణ పుంజమో ఆ యువతరానికి' అంటూ అంకితం చేశాడు. ఒక ప్రత్యేక కవితరాన్ని సృష్టించాడు. వాళ్ళిప్పటికీ తమ స్వంత గొంతుతో, అస్తిత్వంతో తమదే ఐన మార్గంలో పయనిస్తూనే ఉన్నారు.

(నేడు శేషేంద్రశర్మ 15వ వర్ధంతి సందర్భంగా 'కవిసేనమేనిఫెస్టో' మూడవ ముద్రణ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా...)

రామా చంద్రమౌళి



No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...