Friday, January 10, 2020

మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలు


మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలు
(  జనశ్రీ)
  

జాంథానీ చీర కట్టుకోని మగువలు, కొత్తపల్లి కొబ్బరి మామిడి తినని భోజనప్రియులు మనదేశంలో లేరంటే  అతిశయోక్తి కాదు.  ఆ చీర తయారీ గొప్పదనం, కొబ్బరి మామిడి తీయదనం అటువంటిది మరి.ఈ గొప్పదనం  మా ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలదే. హైదరాబాదు- సికిందిరాబాదు ,
న్యూఢిల్లీ- ఓల్డ్ ఢిల్లీ  జంట నగరాలు లాగా ఉప్పాడ- కొత్తపల్లి గ్రామాలు  జంట గ్రామాలు. తెల్లారితే సుప్రసిద్ధులు ఖరీదైన కార్లలో జాంథానీ చీరలకోసం బారులు తీరే మా ఊళ్ళు ఉప్పాడ-కొత్తపల్లి గ్రామాలు. ఈ ఊరి వాడిని అయినందుకు నేను ఎంతో గర్విస్తాను.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సుప్రసిద్ధ పట్టణం కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో,ప్రసిద్ద పుణ్యక్ష్రేత్ర పట్టణం పిఠాపురానికి 10  కిలోమీటర్ల దూరంలోనూ, బంగాళాఖాతం సముద్రపు ఒడ్డున కొలువుదీరిన గ్రామాలు ఇవి . పొడవైన బీచ్ రోడ్డును కలిగి సాగర ప్రేమికులను ,యాత్రికులను పలకరిస్తూ పులకరింప చేస్తాయి. నా బాల్యపు గుర్తులు  ఎన్నో మధురమైన స్మృతులుగా ఈ ఉప్పాడ కొత్తపల్లి గ్రామం ఇచ్చింది. ఈ గ్రామాల పేర్లు తలుచుకోగానే మదిలో వెల్లువగా పొంగుకు వస్తాయి తీపి జ్ఞాపకాలు.
ఉప్పాడలొ పెదబజారు లోని పురాతన ఇల్లు
నిజానికి ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలు చిన్న గ్రామాలైన ఉప్పాడలో అమీనాబాద్,  మాయా పట్నం, కొత్తపట్నం, సుబ్బంపేట , కొత్తపల్లిలో రవీంద్ర పురం, కుతుకుడుమిల్లి, వాకతిప్ప చిన్న గ్రామాలు కలిసిపోయి పెద్ద గ్రామాలుగా కనిపిస్తూ ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలుగా పిలవబడుతూ ఉన్నాయి.సుమారు 10 వేల మంది వివిధ వర్ణాల వారు నివసిస్తూ ఉన్నా ఎటువంటి భేషజాలు లేకుండా జీవిస్తారు. ఉప్పాడలో బెస్తవారు , నేతవారు, కొత్తపల్లిలో నేతవారు, రైతులు ఎక్కువగా నివసిస్తూ  ఉంటారు. 
బోసు బొమ్మ సెంటరు వద్ద పెద్దబ్బాయి కీళ్ళీషాపు
మా తల్లిగారు స్వగ్రామం  ఉప్పాడ లోని అమీనాబాద్. ఇదే గ్రామంలో ఉపాధ్యాయురాలిగా చాలాకాలం పని చేశారు .మా తండ్రిగారు హెల్త్ సూపర్వైజర్ గా ఈ గ్రామాలలోనే సుదీర్ఘ కాలం పని చేశారు కూడా. నా బాల్యమంతా ఈ గ్రామంలోనే గడిచింది, ఒక రకంగా నేను అదృష్టవంతుణ్ణి పఠనాశక్తి నా తల్లి నాకిచ్చిన వరమైతే .నా తండ్రిగారు సాంఘిక సేవా , సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించారు. అందుచేత నా మిత్రులందరులో నేను ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉండేవాడిని. మరో రకంగా నేను అదృష్టవంతుణ్ణి కూడా. నా బాల్యపు రోజుల్లో  టీవీ ,సెల్ ఫోన్లు లేవు. నేను పూర్వకాలపు గుర్తులకి ,ఆధునిక ప్రపంచ పోకడలకి మధ్యలో పుట్టాను. అందుచేత నా బాల్యం         పల్లె పరిసరాలతోను, వృద్ధుల అనుభవాలతోను, గ్రంధాలయ పుస్తకాలతోను, పల్లెటూరి ఆటలతోనూ గడిచిపోయింది. ఇందులో నన్ను చరిత్ర ,సాహిత్యం అంశాలు బాగాఆకర్షించాయి. అందుచేత నేను ఈ వ్యాసం
రాయగతున్న
అడుగు అడుగుకో చర్చ్
బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క గ్రామంలో అత్యధిక చర్చిలు కలిగిన గ్రామంఏదైనా వుందంటే అది ఉప్పాడ అనే అంటాను. ఎందుకంటే 120 చర్చిలు ఉన్నాయి .కొత్తపల్లి గ్రామంతో కలుపుకుంటే 140 వరకు ఉండవచ్చు. రికార్డు కావచ్చు కూడా . ఈ గ్రామాలలో ఇన్ని చర్చిలు ఉండటానికి కారణం తెలుసుకోవాల్సిందే మరి.
1885 సం॥  ప్రాంతంలో బ్రిటిష్ వారు పిఠాపురం మార్కెట్ వీధుల్లో వాక్య ప్రకటన చేస్తూ ఉంటే  నాగులాపల్లికి చెందిన కొందరు గ్రామస్తులు  పిఠాపురం సంత కోసం వెళ్లి ఆ క్రీస్తు వాక్యానికి ఆకర్షితులై మొదటగా క్రీస్తును నమ్ముకున్నారు.వారే నాగులపల్లిలో ఓ చర్చిని  నిర్మించడం కూడా జరిగింది. పిఠాపురం క్రిస్టియన్ మెడికల్ సెంటర్ నుండి  మిషనరీలు  కొత్తపల్లిలో ఆసుపత్రి ఒకటి,  ఉప్పాడలో బడి ఒకటి ప్రారంభించాలని తలంచి నాగులాపల్లిలో ఐదవ తరగతి చదివి  క్రైస్తవ మతం స్వీకరించిన తాతపూడి హనోకు ,భార్య  మరియమ్మలను అమీనాబాద్ గ్రామం నందు1930 లొ ఉపాధ్యాయులు మరియు భోదకులుగా  నియమించారు.
         1930  లో మొట్టమొదటి క్రైస్తవమత భోదకుడు హానోకు
1904  లో నాగులా పల్లి లో జన్మించిన తాతపూడి హనోకు  మేన్ విత్ ద లాంప్  అని పేరు తెచ్చుకున్నాడు. మరియమ్మను వివాహమాడిన హనోకుకు 5 కుమారులు ఒక కూతురు.
హనోకు ఉప్పాడ ప్రాంతానికి మొదటి టీచరు, మొదటి క్రైస్తవుడు 1966 లో పరలోక పిలుపు అందుకున్నారు
ఈలోగా 1950 ప్రాంతంలో వేట్లపాలెం నుండి వచ్చిన   ఏసుదాసు అనే క్రైస్తవభోదకుడు నిరక్షరాస్యులైన బెస్తవారి మధ్య తిరుగుతూ క్రైస్తవ మతం బోధించసాగాడు. మాటతీరు వాక్య పరిచర్య బెస్తవారి హృదయాలను చూరగొనడంతో క్రైస్తవమతాన్ని  మొత్తం గ్రామస్తులందరూ  స్వీకరించారు. ఎంతగా అంటే  ఇంటింటికి ఒక చర్చి కట్టుకునేలా.యేసూ ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చ్,  బేతేలు బాప్టిస్ట్ చర్చ్, ఫుల్ గోప్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ , క్రీస్తు గలలియ సంఘం  వంటి చర్చలు వెయ్యి మందికి పైగా విశ్వాసులను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న ప్రతీ క్రైస్తవ మతబోధకుడిని ఉప్పాడకు వచ్చి వాక్య పరిచర్య చేయించనిదే ఇక్కడ క్రైస్తవ సంఘకాపరులకు నిద్రపట్టదు .అలా నేను ప్రసిద్ద భోదకులను అందరినీ చూసాను.

    జాంథాని చీరల సొగసులు

జైపూర్ మహారాణి ముచ్చటపడిన చీర జాంథానీ చీర.  వస్త్ర ప్రపంచాన్ని  నివ్వెరపర్చిన చీర ఇది. అతి ఖరీదైన చీర కావడంతో ఆ రోజుల్లో జైపూర్ మహారాణి తప్ప ఎవరూ ఈ చీరలు ధరించేవారు కాదు.  గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఈ జాంథానీ చీర గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనితో
రోజూ ఆకలితో మల మల లాడిన చేనేత పరిశ్రమ
విమానాల్లో తిరుగుతూ వస్త్ర వ్యాపారాన్ని తారాస్థాయికి చేర్చింది . జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చీర ఇక్కడే తయారయింది. సుమారు లక్ష రూపాయల పైబడిన ఖరీదైన చీరలు ఆర్డర్ పై నేస్తారు ఇక్కడ. పర్షియన్ పదం జాంథానీ.  అంటే పూలగుత్తి లేదా  ఫ్లవర్ వాజ్ అని అర్థం. చీర మొత్తం చేతిలోనికి తీసుకొని చూస్తే  పూలబొకే పట్టుకున్నట్లుగానే ఉంటుంది.

            
       

    జాంధానీ జిలుగుల చీర

అతి సున్నితమైన  దారాల మధ్య డిజైన్లు నేయవలసి  రావడంతో చిన్న చిన్న  సుతిమెత్తని వ్రేళ్ళుకలిగిన 14 సంవత్సరాల లోపు చిన్న పిల్లలను ఈ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది. నిజానికి ఈ పరిశ్రమను మెచ్చుకోక తప్పదు. మా ఊరిలో కులమతాలు, కులవృత్తులను  కూలద్రోసి ఆర్థిక భరోసా కల్పించింది. అన్ని వర్గాలవారు గొప్పగా బ్రతుకుతున్నారు ఇప్పుడు. ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలను ఈ జాంథానీ వస్త్ర పరిశ్రమే ప్రపంచానికి పరిచయం చేసింది. రొబ్బి వారి పట్టు వస్త్రాలు కూడా  పేరెన్నిక గన్నవే. ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలలో దాదాపు 200 బట్టల దుకాణాలు ఉన్నాయంటే నాకు నిజంగా నమ్మశక్యంగా లేదు ఇప్పటికీ.

      కొత్తపల్లి కొబ్బరి మామిడి

వేసవి వచ్చిందంటే ఆవకాయ కోసమని, అసలు సిసలు మామిడిపండ్ల రుచిని చూడడం కోసం అని కొత్తపల్లి కొబ్బరి మామిడిని తలచుకోని ఆంధ్రుడు ఉండడు . ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడితో అప్పుచేసైనా  సరే  ఆవకాయపచ్చడి పెట్టుకొని తీరవలసిందే .కొత్తపల్లి కొబ్బరి మామిడి  పుల్ల పుల్లని మామిడి కాయగా ఉన్నప్పుడు పండిన తర్వాత అద్భుతమైన తీపిని సంతరించుకోవడం ఈ కొబ్బరి మామిడి ప్రత్యేకత.  కొత్తపల్లి  ఊరి పేరునే కలిగిన కొబ్బరి మామిడి
రకం ఈ గ్రామానికి చెందినదే.ఈ కొత్తపల్లి గ్రామం  నుండే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రిలకూ ప్రతీ సంవత్సరం  రావువారి కుటుంబాలు బుట్టలు ,బుట్టలు మామిడి పండ్లు ఢిల్లీకి పంపేవారు.
నెహ్రూ గారికి చాలా ప్రీతిపాత్రమైన మామిడి ఫలమిది. ఇక్కడి గ్రామాలవారు బంధువులకు ,ప్రముఖులకు ప్రతీ సంవత్సరం కొత్తపల్లి కొబ్బరి మామిడి పండ్లు అడిగినా అడగకపోయినా పంపించడం  ఆనవాయితీగా వస్తుంది.
అందమైన సాగరతీరం ఉప్పాడ బీచ్ రోడ్
బీచ్ రోడ్డు దాదాపు ఇటు తుని నుండి అటు కాకినాడ వరకు 40 కిలోమీటర్లు ఉంటుంది .ఉప్పాడ బీచ్ రోడ్డు అయితే సముద్రాన్ని అనుకుని ఉండడంతో ప్రయాణీకులకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది .దాదాపు కాకినాడ వరకు పది కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు యాత్రికులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది .  తుఫాను వస్తే చాలు టివీ లన్ని మా ఉప్పాడ కెరటాల పొంగునే చూపిస్తాయి. ఇక్కడ సాగర దృశ్యాలను  ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించడానికి ఉదయం నాలుగు గంటల నుండే బీచ్ రోడ్డులో ఫోటోలు తీస్తూ హడావుడిగా తిరుగుతూ కనిపిస్తూవుంటారు. తూర్పు వైపున సూర్యోదయం అవుతూ ఉంటే ఆ సూర్యోదయ కాంతిలో తెరచాప పడవలు పయనిస్తూ ఉండే దృశ్యాలు చూడడానికి కన్నులు చాలవు . తుఫాను వస్తే అన్ని టి.వి చానళ్ళు ఉప్పాడ బీచ్ రోడ్డు పై పారే సముద్ర కేరటాలను చూపించ వలసిందే. అది చూసి దూరాన ఉండే బందువులు ఇక్కడివారి యోగ క్షేమాలు అడుగుతూ వుండండం నిత్యకృత్యం.
 
ఫోని తుఫానుకు ఉప్పాడ బీచ్ రోడ్డు పైకి వచ్చిన కెరటం
సినీ పరిశ్రమ ఈ ప్రాంతం యొక్క అందాలను గుర్తించింది.
అనేక సినిమాల షూటింగులు శరవేగంగాజరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో జయప్రద మొట్టమొదటి సినిమా నాకూ స్వతంత్రం వచ్చింది  ఇక్కడ రూపుదిద్దుకున్నదే. కొత్తపల్లి గ్రామానికి చెందిన యువదర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీస్ సినిమా షూటింగ్ వైష్ఞవతేజ హీరోగా జరుపుకుంటోంది ప్రస్తుతం.ఇప్పుడిప్పుడే ఇక్కడ మా
ఊరి కళాకారులు సినీ పరిశ్రమలో స్థిరపడుతూ
ఉన్నారు . ప్రేమికులు,యువకులు యాత్రికులు,
చిన్నలు, పెద్దలు ఎవరైతేనేమి ఉప్పాడ సముద్రం
దగ్గర ఫోటో దిగాల్సిందే .ముఖానికి కొట్టే కెరటాల
చిరుజల్లుల .అనుభూతిని ఆస్వాదించాల్సిందే.
వేసవివిడిది మా కొత్తపల్లి హైస్కూలు
1950 లో నిర్మించిన ఈ పాఠశాల అతి పురాతనమైనది. చుట్టుప్రక్కల గ్రామాలలోని వేల మంది విద్యార్థులకు విద్యను అందించిన ప్రసిద్ధి  చెందిన పాఠశాల ఇది .మా చిన్నతనంలో ఈ జిల్లా పరిషత్ హైస్కూలు ఓ గొప్ప వేసవి విడిదిగా ఉండేది. గ్రామంలోని ప్రతి కుర్రవాళ్ళు  చదరంగము ,క్యారం బోర్డు ,క్రికెట్ ,వాలీబాలు ఆడుకుంటావుండేవారు. పెద్దవాళ్ళయితే కుర్చీలు వేసుకుని  పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వుండేవారు.కళాకారులు పాటలు ప్రాక్టీస్ చేస్తూ సంగీత వాయిద్యాలు ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఈ పాఠశాల 1600 మంది విద్యార్థులతో కళకళలాడుతుంది .మూడు అంతస్తుల్లో కొత్తగా కట్టిన ఈ పాఠశాల చూడడం ఓ మధురానుభూతి. ఈ పాఠశాలలను ప్రభుత్వం వారు త్వరలో బాలురు బాలికల పాఠశాలల ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
ఆశ్చర్యపరిచే కత్తిపోటు వేషాలు
కార్తీకమాసం వచ్చిందంటే గౌరమ్మ సంబరాలు మాఊళ్ళలో ఘనంగా చేస్తారు . ఈ సందర్భంగా నెల రోజులపాటు మా ఊరిలో  జరిగే వీరనాట్యం ఓ ప్రక్క మరో ప్రక్క కత్తిపోటు వేషాలు అలరిస్తాయి.  కత్తిపోటు ప్రదర్శన గ్రామంలో వీధి వీధి తిరుగుతూ వుంటే పిల్లలు భయ బ్రాంతులకు గురవ్వడం, కొత్తగా తిలకించేవారు ఆశ్చర్యచకితులవ్వడం పరిపాటి. రకరకాలైన  దేవతామూర్తులు , ప్రసిద్ధి చెందిన వీరుల యొక్క వేషాలు వేస్తారు. ఇవే బండ్లమీద వేషాలు  అంటారు.
  కత్తిపోటు వేషాలు వీటి ముందు నడుస్తూ ఉంటాయి. కంఠంలోకి బల్లెం గుచ్చటం,పెద్ద కత్తితో  భుజాన్ని నరకడం ,
ఒక మనిషికి అటూ ఇటూ నిలబడి ఆ మనిషి కడుపులోంచి రంపాన్ని  దూర్చి ఇద్దరూ రంపపు కోత కోయడం, ప్రక్కలోబల్లె పోటు ,బుగ్గల్లో అటు ఇటు కత్తులు దూర్చుకోవడం, గొడ్డలి తలమీద నుండి గొంతులోకి వచ్చేలా చేసే "గొడ్డలి వేటు" అద్భుతంగా ప్రదర్శిస్తారు మాఊరిలో. స్కూలు ఎగ్గొట్టి పిల్లలు ఈ వేషాలు చూస్తూ పరుగులు తీయడం బలే ముచ్చటగా ఉంటుంది.

ఉప్పాడ సముద్ర స్నానాలు

మాఘమాసంలో ఉప్పాడలో మాఘపౌర్ణమినాడు సముద్ర స్నానాలు ఆచరించడానికి ఇంటిలో అందరం వెళ్ళే వాళ్ళం. మా ఉప్పాడ-కొత్తపల్లి పరిసరప్రాంత ప్రజలకు ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పిఠాపురం నుండి కుంతీమాధవస్వామి తెల తెలవారతుండగా వచ్చి సముద్రస్నానమాచరిస్తాడు, తిరిగి వెడుతూ ఊప్పాడ లోని శ్రీ భ్రమరాంబికా మల్లేశ్వర స్వామిని దర్శించి వెళతాడు .తరువాత నుండి భక్తులు స్నానాలు ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా జరిగే తీర్దం ఎంతబాగుంటుందో.దూరపుచుట్టాలు ఈ స్నాననాలకు రావడంతో తీర్ధం ఎప్పుడు వస్తుందా చుట్టాలు ఎప్పుడు వస్తారాని ఎదురు చూసేవాళ్ళం చిన్నప్పుడు.
                     ఆధునిక చారిత్రిక నేపథ్యం      
   వాకతిప్ప పంచాయితీ ఆఫీసులో
                ఉన్న ఆనాటి   గాంధీ విగ్రహం
కొత్త పల్లి లోని రామాలయం దగ్గర గాంధీ విగ్రహం ఉండేది. గాంధీ వచ్చి స్వాతంత్ర్యపొరాట  సమయంలో ఉత్తేజితమైన  ఉపన్యాసం ఇచ్చారని  చెబుతారు. జిల్లాకి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చెలికాని రామారావు గారు ఈ కొత్త పల్లి మండలంలో కొండెవరం గ్రామానికి చెందినవారే. పిఠాపురం సంస్థానాధీశుల ఏలుబడిలో సుదీర్ఘకాలం ఉన్నాయి ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలు. రావు వారి  వంశీకుల పూర్వపు కట్టడాలు కొత్తపల్లి గ్రామంలో ఇప్పటికీ కనిపిస్తాయి.
కొత్తపల్లిలో రామాలయం దగ్గర రావు మురళీగారి ఇల్లు
ప్రస్తుతం ఈ గ్రామాలు పిఠాపురం నియోజక  వర్గంలో ఉన్నాయి.  హైస్కూలుకి కూతవేటు దూరంలో  రవీంద్రపురం వెనుక వీదుల నుండి ఎండపల్లికి వెళ్ళే మార్గంలొ చేలమధ్య
ౌఓ చారిత్రక కట్టడం వుండేది. దానిని స్వరంగమార్గం అనేవారు..  పూర్వం పిఠాపురం మహారాణులు ఈ స్వరంగ మార్గం ద్వారా వచ్చి సముద్రస్నానం ఆచరించే వారంటారు . ప్రస్తుతం  సంరక్షణలేక రైతులు ఆక్రమించి పూర్తిగా నాశనం చేసారు. అక్కడ ఒక్క శివలింగం మాత్రమే మిగిలింది. దాని మీద శిలాఫలకం పిఠాపురం దివానం గారి సతీమణి
ఙ్ఞాపకార్దం నిర్మించినట్లుగా శాసనం మీద రాతలు
కనిపిస్తున్నాయి.స్వరంగమార్గాన్ని పూడ్చివేసినట్లుగా రైతులు చెబుతుండడం అధికారుల నిర్లక్ష్యానికీ నిదర్శనం.
                పిఠాపురం దివాను గారి శిలాఫలకం
అపార మత్ససంపద ఉప్పాడ సొంతం
మా ఉప్పాడ చేపల వ్యాపారానికి చాలా ప్రసిద్టి .వందలాది నావలు,పడవలు,బోట్లు ద్వారాచేపల వేట జరుగుతూ వుంటుంది. నేపాల్ ,చైనా, జపాన్, బర్మా ,సింగపూర్ దేశాలకు  రొయ్యలు ఎగుమతి చేస్తూ వుంటారు. ఇంకా స్థానికంగా అలివి ద్వారా జరిగే చేపలవేట చూసి తీరవలసిందే. కొన్ని రకాల రొయ్యలు ఉప్పాడ దగ్గర తప్ప మరోచోట దొరకవంటారు. వాటి రుచే వేరని నాన్ వెజ్ ప్రియులు చెబుతూ లొట్టలు వేస్తారు. మా ఇంటికి ఎవరు వచ్చినా సొరపిట్టి, పీతలకూర అడిగి మరీవండించుకునేవారు. మాగ, వంజరం, కానా గిడతలు,పండుకప్ప,కండాయిలు కట్టచేపలు,జీలా పీతలు ఇక్కడ బాగా దొరుకుతాయి.
         శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి
       
సముద్రంలో కలసిపొయిన చౌడేశ్వరీ సమేత రామలింంగేశ్వర  పురాతన ఆలయం
నిరంతరం తిరిగే రాట్నాలు, చేపల వలలు, సముద్రపు అలలు నింపుకున్న వాడ ఉప్పాడ. చూడచక్కని చేనేత చీరలోని వెండి జరీ  జాంథానీ జాడ ఉప్పాడ. అనేకానేక చారిత్రకాంశాలను దాచుకున్న మౌన కడలి గర్భం ఉప్పాడ. భారతావనిలో  శైవమతం బాగా ప్రాచుర్యం పొందిననాటి రోజుల నుండి ఉప్పాడ చరిత్రలో తన పేరును ఘనంగానే లిఖించుకుంది. వీరనాట్యం శైవ మతానికి చెందిన జానపద కళారూపం. ఈ నాట్యాన్ని బాగా ఆదరించిన వారు దేవాంగులు. అనాదిగా దేవాంగులు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తూవున్నారు. చేనేత రంగానికి సొగసులద్దిన
దేవాంగులు శైవ మతారాధికులు. ఈనాటికి వీర కుమారులను ఆహ్వానించి తమ ఇండ్లలో జరిగే  శుభకార్యాలకు వీరనాట్యం కట్టించుకోవడం పరిపాటి.
               మత్సలింగేశ్వరస్వామి లింగ దర్శనం
               సముద్రంలొ వలలకు దొరికిన శివలింగం
పురాణ ఇతిహాసంలో దక్షుని సంహారానికి పోయిన వీరభధ్రులకు చెందినది వీరనాట్యం. ఇది అతిప్రాచీనమైనది కావడంతో దేవాంగులు యొక్క ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. ఇటీవల ఉప్పాడ సముద్ర గర్భం నుండి ఉద్భవించినదిగా చెప్పబడుతున్న శివలింగం, వినాయక రూపు కలిగిన శిల  ఉప్పాడనందు పరిడవిల్లిన శైవమత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. పురాతన ఉప్పాడ గ్రామాలు ఐదు నుండి ఆరు గ్రామాల వరకు సముద్రగర్భంలో కలిసిపోయాయని పెద్దలు చెబుతూ ఉంటారు.25 సంవత్సరాల క్రితం ఉన్న ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసి పోవడం వ్యాసకర్త కనులారా చూసినదే. ఏనాడో మహా పూజలందుకుని శిధిలమైన శివాలయము నుండి మౌన ముద్ర దారియై అనేక సంవత్సరాలు కడలి ఒడిలో నిలిచి భక్తులను కనువిందు చేయడానికా ! అన్నట్లు గంగపుత్రుల క్రొత్తవలలో నుండి దరికి చేరిన శివలింగ రూపం ఆశ్చర్యానుభూతులకు లోను చేస్తూ ఆధ్యాత్మిక తీరాలకు చేర్చడం ఒకింత ఆశ్చర్యమే.
జగ్గకవి కురవంజి
ఉప్పాడ నందు శైవమతం ఉచ్చస్డితిలో ఉండేదనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సతీసమేతుడైన భ్రమరాంబికా మల్లేశ్వర స్వామి రూపంలో ఈనాడు మనకు కనిపించే ఉప్పాడ సముద్రపు ఒడ్డున గల ఆలయం  ఐదువందల సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన సన్నిధిరాజు(రాజులు కారు పురోహితులు) వంశస్థులు అభివృద్ధి చేసినదే. అదీ సముద్రగర్భంలో కలసిపోయి మూలవిరాట్టు క్రొత్తగా నిర్మించిన ఆలయంలో కొలువు తీరింది.
                        
       బ్రమరాంబికా మల్లేశ్వరస్వామి మూలవిరిట్టు
సన్నిధిరాజు వంశానికి చెందిన శ్రీ సన్నిధిరాజు జగ్గరాజు కవి 16- 17 శతాబ్దాల మధ్య ఉప్పాడలో  నివసించినట్లు
చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగ్గకవి శివుని
వృత్తాంతంతో కూడిన చోగాడి కలాపం" (
బహుశా భక్తకన్నప్ప కథఅయ్యుండవచ్చు )
అనే కురవంజి (వీధి నాటకం) ని రచించి ఉప్పాడకు ఆంధ్ర తెలుగు సాహిత్యంలో చోటు కల్పించడం ఆనందించవలసిన విషయం. 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు గొప్పగా ప్రదర్శితమైన వీధి నాటకం కురవంజి. 18 19 శతాబ్దాలలో అదే యక్షగానం అయ్యింది. ఈనాడు కలాపం రూపంలో దర్శనమిస్తున్న పురాతన వీధి నాటకం కురవంజి. ”జీవ ఎరుకల కురవంజి” అనే వేదాంత కురవంజిని కూడా  రచించిన జగ్గకవి ఉప్పాడ లో శైవమతానికి గల ప్రాముఖ్యతను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు అనడంలో సందేహం లేదు.
మహాకవి శ్రీనాథుడు 15వ శతాబ్దం తొలినాళ్ళలో ఉప్పాడలో సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ పండితుల ఉవాచ. మన జిల్లాలోని పది సంవత్సరాలపాటు ఉన్నా రాజమహేంద్రపుర రాజుల దర్శన భాగ్యం కలగలేదు శ్రీనాధుడికి. బెండపూడి సంస్థానాధీశుల సహచర్యంతో ద్రాక్షారామం నందే ఉండి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ  భీమ ఖండాన్ని రచించే ముందు పిఠాపురంలోని మహారాజు దర్శనం అనంతరం  పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని  దర్శించి ఉప్పాడ  మాఘపౌర్ణమి సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఉప్పాడ సముద్ర స్నానాలకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది మరి. ఉప్పాడ పరిసర గ్రామాలు కూడా వేలాది సంవత్సరాల చరిత్ర కలిగి మనల్ని పలకరిస్తూ ఉంటాయి.
బషీర్ బీబీ ఉరుస్ ఉత్సవం
ఉప్పాడను అనుకున్న పొన్నాడ గ్రామం వెయ్యి సంవత్సరాలకు పూర్వం మహమ్మదీయుల ఏలుబడిలో " పొన్నాడ షెహర్ గా"  పిలవబడేది. దానికి ఆనవాళ్లుగా ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాలు ముస్లిం పేర్లు కలిగి ఉన్నాయి. అమీనాబాద్, అమర్ వల్లి ( అమరవల్లి ), మెహదీపట్నం ( మాయా పట్నం ) . పొన్నాడ నందు ప్రసిద్ధి చెందిన ముస్లీంసోదరి  "బషీర్ బీబీ "   నివసించేదని అడిగిన వారికల్లా తన బంగారాన్ని అరువుగా ఇచ్చి కష్టాలలో ఆదుకునేదని  , బషీర్ బేబీ సౌందర్యానికి ముగ్ధుడైన ఢిల్లీ పాదుషా  చెరపట్టాలని తలచి పొన్నాడ పైకి దాడి చేసిన వెంటనే  మహా అపురూప సౌందర్యవతి అయిన బషీర్ బీబీ తనకు తానుగా తను నివసిస్తూ ఉన్న భవనాన్ని భూమిలోనికి కూరుకుపోయేలా  శపించుకుని జీవసమాధి అయిపోయిందని జనాల నాలుకలపై నానుతున్న చారిత్రక కధనం. ఆ వెంటనే ఉప్పాడ సముద్రం సునామీలా విరుచుకుపడి ఢిల్లీ పాదుషా సైన్యాలను ముంచి వేసిందని అందుకే బషీర్ భీభీ  ఆలయం చుట్టూ ఇసుక మేటలు ఇంకా కనిపిస్తున్నాయని అంటారు.
   
        పొన్నాడ దగ్గర  ఆనాటి ఇసుకమేటలు
ఇప్పటికీ భవనం పై అంతస్తు   మసీదులా మనల్ని పలకరిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బషీర్ బిభీ (ఆలయం కాదు మసీదు కాదు అది భవంతి మాత్రమే అయినా మసీదులా పూజలందుకుంటుంది) కులమతాలకు అతీతంగా పూజలందుకుంటుంది. దేశం  నలుమూలల నుండి వచ్చే ముస్లిం సోదరులే  కాకుండా, చుట్టుపక్కల హిందూ సోదరులు కూడా తమ ఇళ్లల్లో ఆడపడుచులకు శుభం జరగాలని ఇక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పిభ్రవరి నెలలో ఉరుస్ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.
కొండెవరం యుద్దం
ఉప్పాడను అనుకున్న కొండెవరం గ్రామంలో 1758లో జరిగిన కొండెవరం యుద్ధం లేదా చెందుర్తి యుద్ధంగా పిలవబడే యుద్ధం మొట్టమొదటి భారత సంగ్రామంగా చరిత్రలో లిఖించబడింది. ఫ్రెంచి వారు ,పెద్దాపురంరాజులు ఒక ప్రక్క, ఆంగ్లేయులు , విజయనగరం రాజులు  ఒక ప్రక్కగా ఉండి చేసిన మహాయుద్ధం చెందుర్తి యుద్ధం. 
     కొండెవరం  యుద్దంలో పాల్గొన్న బ్రిటీష్ సేనలు
                చిత్రం  నాగరాజు డ్రాయింగ్ మాస్టారు
అప్పటికి ఈ కొండె వరం గ్రామం ,చెందుర్తి గ్రామం పిఠాపురం మహారాజుల ఏలుబడిలో ఉండేవి. ఆనాటి నుండే పిఠాపురం రాజులు వెలుగు లోనికి రావడం ప్రారంభమైంది. బొబ్బిలి రాజుల ఆడపడుచు పిఠాపురం రాజును వివాహం చేసుకోవడంతో రావు వారి వంశీకులు ఉప్పాడ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉప్పాడ కొత్తపల్లి ,గొర్స వంటి పలు గ్రామాలలో ఆలయాలు నిర్మించి ధర్మకర్తలుగా కొనసాగి పునీతులైనారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉప్పాడ గ్రామం శతాబ్దాల  అలల మధ్య నుండి తన ఆనవాళ్లను అప్పుడప్పుడూ బయలుపరచడం విశేషం.
                          

వ్యాసకర్త (  జనశ్రీ )
సిద్దాంతపు బెన్ జాన్ సన్
ఉప్పాడ కొత్త పల్లి


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...