Friday, January 10, 2020

నేను రాను పల్లెటూరి పిల్ల (జనశ్రీ)


నేను రాను పల్లెటూరి పిల్ల (జనశ్రీ)

అవును నేను పల్లెటూరి అబ్బాయినే
అవును నేను అబ్బు గాడినే
అమెరికా పోయినందుకు నాకేం ఫోజు లేదు.
ఉగాది వస్తుంది వస్తావా అని అడుగుతూ ఉంటావ్
ఆస్తమాను ఓ పల్లెటూరి పిల్ల !
ఓ మాట  అడుగుతా
నిజం చెప్పు దాచకుండా
సూటు బూటు నీకు గొప్ప కావచ్చు
అవి సూట్ కేస్ అంత బరువుగా తోస్తాయి నాకు
నేను వస్తే పల్లెటూరి పిల్ల పొద్దున్నే లేస్తాను
నాకు నువ్వు కలువ పువ్వులా ఉండే
బ్రహ్మ జెమ్ముడు పూలు చూపించాలి మరి
పోగులు పోగులుగా పేర్చి శిలా పెంకు డబ్బులతో పూలు కొనుక్కునే పిల్లల ఆటలు చూపించాలి మరి
లేత తాటాకు తో సీతమ్మోరి పళ్ళు కలిపి
తమలపాకులా నమలి నమిలి నోరు పండిందో లేదో అని ఒకరి నోరు ఒకరు చూసుకునే పిల్లల సరదాలు చూపించాలి మరి
రెడ్డి గారి చింతతోపులో దోర ముగ్గిన  చింత బొట్లను దొంగచాటుగా రాళ్లతో కొట్టి  రాల్చి
రాలిన బొట్లను లటుక్కున పట్టుకు పారిపోయే పిల్లల గుంపులను చూపిస్తావా మరి వస్తాను
వస్తాను గాని పల్లెటూరి పిల్ల మామిడి తోట దగ్గరకు
రమ్మంటే రాను నాకు తెలుసు
నేను వస్తే  అక్కడకు రమ్మంటావూ అని
అల్లంత దూరంలో ఉండగానే తెలిసిపోతుంది నాకు ఝూంమ్మంటున్న  కందిరీగల రొద
అక్కడ కందిరీగల గుంపులు ఉంటాయి
అవును పల్లెటూరి పిల్ల అలాగే ఉన్నాయా కందిరీగలు
తరిమేశారు రా మీరు
కందిరీగల జాడ ఎక్కడా కనబడడం లేదు.
నువ్వు విసుక్కున్నా నన్ను ఇసుక దిబ్బ దగ్గరకు తీసుకుపోవాలి మరి
అక్కడ కుర్రాళ్ళ గుంపులు ఉంటాయి
భుజాలకు వెదురు బద్దల బాణాలు తగిలించుకొని
ఇసుక దిబ్బలకు  అటు కొందరు ఇటు కొందరు 
తెల్లదొరల తో యుద్ధం చేస్తున్న
అల్లూరి సీతారామరాజులా ఫోజులు పోతున్న 
కుర్రాళ్ల గుంపులను చూపిస్తావా మరి పల్లెటూరి పిల్ల.
చౌదరి గారి రైస్ మిల్లు దగ్గర ధాన్యం తిని ఉన్నపళంగా గుంపుగా ఎగిరిపోయే పిచ్చుకల గుంపులను చూపిస్తావా మరి
మన ఊరి బడి దగ్గర చెట్టు తొర్రలో  అందమైన రామచిలుకలు చూపిస్తాం అంటే రాక చస్తానా మరి
బుల్లబ్బాయి చేలోని కాలువల్లో గాలంతో చేపలు పట్టుకునే కుర్రాళ్ళను చూపిస్తే చాలు నాకు
ఆ కాలువలో పరిగెత్తుకు వచ్చి దూకి బుటకలేసే పిల్లలును చూపించినా చాలు నాకు.
ఊరి చివర పొలిమేరల్లోకి నన్ను రమ్మని పిలవకు
నాకు భయం అక్కడ రాబందుల గుంపులు ఉంటాయి
చచ్చిన గొడ్లను పీక్కు తింటుంటాయ్
భయంగా ఉన్నా వాటిని చూస్తుంటే భలే సరదాగా ఉంటుంది పల్లెటూరి పిల్ల !
అవునూ ఇప్పుడవి  ఎక్కడా కనబడటం లేదంట !
నువ్వు నన్ను తాటాకు ఆట ఆడటానికి రమ్మంటే నేను రాను నాకు కోపం  చిర్రెత్తుకొస్తుంది మరి
పోలేరమ్మ గుడి దగ్గర  గాడిదల మందలు ఉంటాయి
పాపం అవి ఏమి చేశాయని వెధవ కుర్రాళ్ళు వాటితో  తోకలకు  తాటాకు కట్టి మంట పెడతారు. గాడిదలు గాండ్రించి పరిగెడుతుంటే ఎగురుతూ వెనకాలే పోతారు
అవును పల్లెటూరి పిల్లా
ఇంకా గాడిద మందులు అలాగే ఉన్నాయా ?లేవా?
వాటితో సెల్ఫీ దిగి నాకు ఒకటి పంపు
నువ్వు వాటిని చూపిస్తే వచ్చేస్తాను.
తూనీగల గుంపులు, గొల్లభామలు, బావురు పిల్లిలు, నత్తలు, చేలలోని ఎండ్రకాయలు, వెలగపండ్లు ,సీమ చింతకాయలు ,గచ్చకాయలు, గురివింద గింజలు,
ఉప్పర బుట్టలు, ఒక్కటి మిస్ అవకుండా చూపిస్తాను
అంటే ఆగకుండా వచ్చేస్తాను సుమా
అయినా మొన్న వచ్చాను కదా మరలా రమ్మంటావేం పల్లెటూరి పిల్ల
నీకు నాకు -పెద్ద తేడా ఏముంది
అమెరికాకు నీకు పెద్ద తేడా ఏమీలేదు
కందిరీగలు ఏవి అంటే  అందరి చేతుల్లోనూ సెల్ఫోన్లు చూపించావు
తూనీగలు ఏవి అంటే అందరి ఇళ్ళల్లోని టీవీలు చూపించావు.
గాడిదల మందులు ఏవి అంటే హీరో హోండాలను చూపించావు
చింత బొట్టలు ఏవి అంటే పిజ్జాలు బర్గర్లు చూపించావు
ఎందుకు రావాలి చెప్పు నేను
అమెరికా పిల్లకు నీకు తేడా ఏముంది
నువ్వు మారిపోయావు
మీ దగ్గర అన్ని మాయమైపోయాయి
నేను రాను ....రమ్మంటే రాను
ఉగాది వస్తే మాత్రం ఏముంది గొప్ప
కవితా గానం చేసే కవులు కూడా
కవితా గానం వినకుండా సెల్ఫోనే చూసుకుంటున్నారు
నేనురాను పిల్ల ....నా పూర్వీకుల జాడలన్నీ మాయమైపోతున్నాయి
నేను ఒంటరి వాడిని అయిపోతున్నాను
పల్లెటూర్లలో అమ్మ జాడులు ఉండేవి
అమ్మ లేని చోట నేను ఉండలేను
నేను రాను పిల్లా నేనురాను
సిద్దాంతపు బెన్ జాన్ సన్
9908953245


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...