శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి
నిరంతరం తిరిగే రాట్నాలు, చేపల వలలు, సముద్రపు అలలు నింపుకున్న వాడ ఉప్పాడ. చూడచక్కని చేనేత చీరలోని వెండి జరీ జాంధానీ జాడ ఉప్పాడ. అనేకానేక చారిత్రకాంశాలను దాచుకున్న మౌన కడలి గర్భం ఉప్పాడ. భారతావనిలో శైవమతం బాగా ప్రాచుర్యం పొందిన
నాటి రోజుల నుండి ఉప్పాడ చరిత్రలో తన పేరును ఘనంగానే లిఖించుకుంది. వీరనాట్యం శైవ మతానికి చెందిన జానపద కళారూపం. ఈ నాట్యాన్ని బాగా ఆదరించిన వారు దేవాంగులు. అనాదిగా దేవాంగులు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తూవున్నారు. చేనేత రంగానికి సొగసులద్దిన దేవాంగులు శైవ మతారాధికులు. ఈనాటికి వీర కుమారులను ఆహ్వానించి తమ ఇండ్లలో జరిగి శుభకార్యాలకు వీరనాట్యం కట్టించుకోవడం పరిపాటి.
పురాణ ఇతిహాసంలో దక్షుని సంహారానికి పోయిన వీరభధ్రులకు చెందినది వీరనాట్యం. ఇది అతిప్రాచీనమైనది కావడంతో దేవాంగులు యొక్క ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. ఇటీవల ఉప్పాడ సముద్ర గర్భం నుండి ఉద్భవించినదిగా చెప్పబడుతున్న శివలింగం, వినాయక రూపు కలిగిన శిల ఉప్పాడనందు పరిడవిల్లిన శైవమత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. పురాతన ఉప్పాడ గ్రామాలు ఐదు నుండి ఆరు గ్రామాల వరకు సముద్రగర్భంలో కలిసిపోయాయని పెద్దలు చెబుతూ ఉంటారు.25 సంవత్సరాల క్రితం ఉన్న ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసి పోవడం వ్యాసకర్త కనులారా చూసినదే. ఏనాడో మహా పూజలందుకుని శిధిలమైన శివాలయము నుండి మౌన ముద్ర దారియై అనేక సంవత్సరాలు కడలి ఒడిలో నిలిచి భక్తులను కనువిందు చేయడానకా ! అన్నట్లు గంగపుత్రుల క్రొత్తవలలో నుండి దరికి చేరిన శివలింగ రూపం ఆశ్చర్య అనుభూతులకు లోను చేస్తూ ఆధ్యాత్మిక తీరాలకు చేర్చడం ఒకింత ఆశ్చర్యమే.
ఉప్పాడ నందు శైవమతం ఉచ్చస్డితిలో ఉండేదనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సతీసమేతుడైన భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి రూపంలో ఈనాడు మనకు కనిపించే ఉప్పాడ సముద్రపు ఒడ్డున గల ఆలయం ఐదువందల సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన సన్నిధి రాజ వంశస్థులు అభివృద్ధి చేసినదే. అదీ సముద్రగర్భంలో కలసి పోయి మూలవిరాట్టు క్రొత్తగ నిర్మించిన ఆలయంలో పూజలందుకుంటుంది.
సన్నిధిరాజు వంశానికి చెందిన శ్రీ సన్నిధి రాజు జగ్గరాజు కవి 16- 17 శతాబ్దాల మధ్య ఉప్పాడలో నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగ్గకవి శివుని వృత్తాంతంతో కూడిన "చోగాడి కలాపం" ( బహుశా భక్తకన్నప్ప కథ అయ్యుండవచ్చు ) అనే కురవంజి (వీధి నాటకం) ని రచించి ఉప్పాడకు ఆంధ్ర తెలుగు సాహిత్యంలో చోటు కల్పించడం ఆనందించవలసిన విషయం. 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు గొప్పగాప్రదర్శితమైన వీధి నాటకం కురవంజి. 18 19 శతాబ్దాలలో అదే యక్షగానం అయ్యింది. ఈనాడు కలాపం రూపంలో దర్శనమిస్తున్న పురాతన వీధి నాటకం కురవంజి. ”జీవ ఎరుకల కురవంజి” అనే వేదాంత కురవంజినికూడా రచించిన జగ్గకవి ఉప్పాడ లో శైవమతానికి గల ప్రాముఖ్యతను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు అనడంలో సందేహం లేదు.
మహాకవి శ్రీనాథుడు 15వ శతాబ్దం తొలినాళ్ళలో ఉప్పాడలో సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ పండితుల ఉవాచ. మన జిల్లాలోని పది సంవత్సరాలపాటు ఉన్నా రాజమహేంద్రపుర రాజుల దర్శన భాగ్యం కలగలేదు శ్రీనాధుడికి. బెండపూడి సంస్థానాధీశుల సహచర్యంతో ద్రాక్షారామం నందే ఉండి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ భీమ ఖండాన్ని రచించే ముందు పిఠాపురంలోని మహారాజు దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉప్పాడ సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఉప్పాడ సముద్ర స్నానాలకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది మరి. ఉప్పాడ పరిసర గ్రామాలు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగి మనల్ని పలకరిస్తూ ఉంటాయి.
ఉప్పాడను అనుకున్న పొన్నాడ గ్రామం వెయ్యి సంవత్సరాలకు పూర్వం మహమ్మదీయుల ఏలుబడిలో " పొన్నాడ షెహర్ గా" పిలవబడేది. దానికి ఆనవాళ్లుగా ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాలు ముస్లిం పేర్లు కలిగి ఉన్నాయి. అమీనాబాద్, అమర్ వల్లి ( అమరవల్లి ), మెహదీపట్నం ( మాయా పట్నం ) . పొన్నాడ నందు ప్రసిద్ధి చెందిన ముస్లీంసోదరి "బషీర్ బీబీ " నివసించే దని అడిగిన వారికల్లా తన బంగారాన్ని అరువుగా ఇచ్చి కష్టాలలో ఆదుకునే దని , బషీర్ బేబీ సౌందర్యానికి ముగ్ధుడై న ఢిల్లీ పాదుషా చెరపట్టాలని తలచి పొన్నాడ పైకి దాడి చేసిన వెంటనే మహా అపురూప సౌందర్యవతి అయిన బషీర్ బీబీ తనకు తానుగా తన నివసిస్తూ ఉన్న భవనాన్ని భూమిలోనికి కూరుకుపోయేలా శపించుకుని జీవసమాధి అయిపోయిందని జనాల నాలుకలపై నానుతున్న చారిత్రక కధనం. ఆ వెంటనే ఉప్పాడ సముద్రం సునామీలా విరుచుకుపడి ఢిల్లీ పాదుషా సైన్యాలను ముంచి వేసిందని అందుకే బషీర్ భీభీ ఆలయం చుట్టూ ఇసుక మేటలు ఇంకా కనిపిస్తున్నాయని అంటారు. ఇప్పటికీ భవనం పై అంతస్తు మసీదులా మనల్ని పలకరిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బషీర్ బిభీ ఆలయం కులమతాలకు అతీతంగా పూజలందుకుంటుంది. దేశం నలుమూలల నుండి వచ్చే ముస్లిం సోదరులే కాకుండా, చుట్టుపక్కల హిందూ సోదరులు కూడా తమ ఇళ్లల్లో ఆడపడుచులకు శుభం జరగాలని ఇక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఉప్పాడ లో అనుకున్న కొండెవరం గ్రామంలో 1758లో జరిగిన కొండెవరం యుద్ధం లేదా చందుర్తి యుద్ధం గా పిలవబడే యుద్ధం మొట్టమొదటి భారత సంగ్రామంగా చరిత్రలో లిఖించబడింది. ఫ్రెంచి వారు ,పెద్దాపురంరాజులు ఒక ప్రక్క, ఆంగ్లేయులు విజయనగరం రాజులు ఒక ప్రక్కగా ఉండి చేసిన మహా యుద్ధం చెందుర్తి మహా యుద్ధం. అప్పటికి ఈ కొండ వరం గ్రామం ,చందుర్తి గ్రామాం పిఠాపురం మహారాజుల ఏలుబడిలో ఉండేవి. ఆనాటి నుండే పిఠాపురం రాజులు వెలుగు లోనికి రావడం ప్రారంభమైంది. బొబ్బిలి రాజుల ఆడపడుచు పిఠాపురం రాజును వివాహం చేసుకోవడంతో రావు వారి వంశీకులు ఉప్పాడ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉప్పాడ కొత్తపల్లి ,గొర్స వంటి పలు గ్రామాలలో ఆలయాలు నిర్మించి ధర్మకర్తలుగా కొనసాగి పునీతులైనారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉప్పాడ గ్రామం శతాబ్దాల అలల మధ్య నుండి తన ఆనవాళ్లను అప్పుడప్పుడూ బయలు పరచడం విశేషం.
వ్యాసకర్త ( జనశ్రీ )
సిద్దాంతపు బెన్ జాన్ సన్
ఉప్పాడ కొత్త పల్లి
9908953245
|
Friday, January 10, 2020
శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి
Subscribe to:
Post Comments (Atom)
భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార...
-
మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తప ల్లి గ్రామాలు ( జనశ్రీ) జాంథానీ చీర కట్టుకోని మగువలు, కొత్తపల్లి కొబ్బరి మామిడి తినని భో...
-
నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశు త్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు'' (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేష...
No comments:
Post a Comment