Wednesday, January 15, 2020

మా ఊరి కథలు 2 ( జనశ్రీ ) మా ఊరి నవాబు నాగూర్

మా ఊరి కథలు 2 ( జనశ్రీ )

మా ఊరి నవాబు నాగూర్

                     1950 ప్రాంతంలో ఉప్పాడ  సముద్రం హోరు ఎలా వుండేదంటే  ఇంటిలోనే కెరటం విరిగి పడిందా అనేంతగా వుండేది. క్రొత్తగా పొరుగూరు నుండి వచ్చిన చుట్టాలు ఆ శబ్దానికి హడలిపోయేవారు. ఎందుకంటే ఆరోజుల్లో చాలా నిశ్శబ్దంగా  ఉండేది ఊరంతా. వాతావరణ కాలుష్యం కానీ      శబ్ద కాలుష్యం గానీ ఉండేది కాదు. అందువల్ల కెరటాల చప్పుడే కాదు పిఠాపురం పేసింజరు రైలు కూత కూడా వినబడేది ఉప్పాడ వరకూ. ఉప్పాడ ఊరు నిండా తాటాకులు ఇళ్ళు ఉండేవి. అక్కడక్కడ  మాత్రమే బంగ్లా ఇళ్లు ఉండేవి.  మత్స్యకారులు అందరూ  పెద్దగా  సంపాదన లేకుండా  పేదరికంలోనే ఉండేవారు ఆ రోజుల్లో.




గంపల అప్పయ్యమ్మ, భూలోక మ్మ ఉప్పు చేపల వ్యాపారం చేసేవారు ఉప్పాడలో.  ధవళేశ్వరం, నక్కపల్లి ప్రాంతాలలో ఉప్పు చేపలు , ఎండు చేపలు పట్టుకెళ్లి వ్యాపారం చేసేవారు. వీళ్ళ కొడుకు గంపల అప్పారావు  గంపల అప్పారావు కు ఒకే ఒక్క కొడుకు నాగూరు .  ఇతనే మన కథా నవాబు .

తెల్లటి మల్లె పువ్వు లాంటి బట్టలు వేసుకుని మెడలో బంగారం గొలుసు, రెండు చేతులకూ ఉంగరాలు , నోట్లో రెడ్ హిల్స్  సిగరెట్  , అల్లంత దూరం వినబడే జావా బండి హారన్ ఉప్పాడ రోడ్డు మీద 1960 ప్రాంతంలో నాగూర్ హవా  పరిగెత్తింది.  ఉప్పాడలోని వారందరూ  నాగూర్ ని సెలెబ్రేటిగా చూసిన రోజులవి. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ ఆ రోజుల్లో  గంపల నాగూర్ .
ఉప్పాడ చేపల వ్యాపారానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చింది నాగూర్ అంటే ఎవరూ కాదనలేని సత్యం.
చిన్న చిన్న  ఉప్పు చేపలు,ఎండు చేపల వ్యాపారం చేసుకునే మత్స్యకారులుకు రొయ్యల వ్యాపారం నేర్పి ఉప్పాడ మత్స్యకారుల జీవితదశాదిశలను మార్చిన గొప్ప వ్యాపారి  నాగూరు.  ఉప్పాడ నుండి సీతారామాంజనేయ బస్సు సర్వీస్ , అలాగే ఎల్లాజి బస్సు సర్వీస్  లు ఉప్పాడ రొడ్లమీద దుమ్ము రేపుకుంటా కాకినాడ పోయిన రొజులవి. వాటిమీద కాకినాడ వెళ్ళి ఉప్పు చేపలు ,ఎండు చేపలవ్యాపారం చేసిన నాగూర్ కి పూరిలోని సాంబాబు (య.స్ . ఆర్ .సి చౌదరి ) రొయ్యల వ్యాపారంలోని కిటుకులన్ని నేర్పాడు. నాగూరు పిఠాపురం రైల్వే స్టేషన్లో బొగ్గు ఇంజను పై నడిచే పేసింజరు రైలు ఎక్కి తెల్లారేక పూరిలో దిగేవాడు.  నాగూరు జట్టీలు ఇక్కడనుండి కొన్ని తెరచాపనావల్లో  సరుకులు నావల్లో నింపుకుని సముద్రం మీద 5 నుండి 10 రొజుల్లో పూరి చేరుకునేవారు. సాంబాబు(య.ఆర్ .సి చౌదరి ) బర్ఫ్ నుండి మద్రాసు,కలకత్తా నగరాలకు 40 కౌంటు రొయ్యలు ఎగుమతి అయ్యేవి. అవి నాగూరుకు చెందిన నావల్లో పడ్డావే ఎక్కువ ఉండేవి. నాగూరు ప్రక్కనే దాసరి బంగారయ్య, సూరాడరాజారావు, చొక్కా సత్తిబాబు వుండేవారు. మంచి మిత్రులు కూడా.నాగూరు సరదాలన్నీ వీళ్ళతోనే. పూరిలో వేటగాళ్ళు చేపలవేటకు పోయి వచ్చే వరకూ స్నేహితులలో పేకాటలో గడపడం, అప్పుడప్పుడూ మెడ్కాల్ బ్రాంది తో పార్టీ చేసుకొనేవాడు. పార్టీల్లో పావురం వేపుడు మందులో నంజుకు వుండవలసిందే. ఇలా అక్టోబరు నుండి జూలై వరకు పూరీలో వుండి వస్తువుండేవాడు. అలా 10 సంవత్సరాలు పూరీలో వ్యాపారం జరిగింది.
ఉప్పాడ వస్తే జావా లేదా బుల్లెట్ పై స్నేహితులను తీసుకుని కాకినాడ సినిమాలకు పోయేవాడు మన నాగూరు.
ఉప్పాడలో చిన జజారు చివరన బర్ప్ పెట్టి  మద్రాసుకి , కలకత్తాకు  40  కౌంటు రొయ్యలు ఊప్పాడ నుండే  ఎగుమతి వ్యాపారం ప్రారంబించాడు. ఆ తరువాత ఇంటిదగ్గరే బర్ప్ పెట్టాడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. పెద్దబ్బాయి కిళ్ళికొట్టు వీధి చివర భూలోకమ్మ భవనం అనే పేరు మీద మేడ కట్టాడు. దానినే ఆ తరువాత ఊరోళ్ళందరూ నాగూరూ మేడ అనేవారు. చీపూరు బుల్లబ్బాయి పొలం దగ్గర నాలుగెకరాలు  భూమి కొన్నాడు. డబ్బులు చేతిలో బాగా ఆడడంతో ఐసు ప్యాక్టరీ కట్టాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటివరకూ ఐసు అనాకాపల్లి లేదా పూరీలనుండి లారీల్లో తెచ్చుకునేవారు. ఓ ప్రక్క చిన్న చిన్న వ్యాపారులు పుట్టుకురావడంతో ఐసుకు ఉప్పాడలో  డిమాండ్ ఏర్పడీంది.
 ఐసు ప్యాక్టరీ కడదామనుకునేలోగా సినిమా థియేటర్ అయితే బాగుంటుందని మిత్రుల దగ్గర నుండి ఉప్పు అందడంతో ఉప్పాడలో శ్రీనివాస థియేటర్ కు రాయి పడింది. మిత్రులమధ్య పొరపొచ్చాలతో ఆ ప్రక్కనే ధనరాజు థియేటర్ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగాయి.
ఏదైతేనో నాగూరు సినిహాలు టూరింగు టాకీస్ గా
ప్రారంబమయ్యింది 1974 లో. మొదటి సినిమా కన్నడ కంఠీరవ  రాజ్ కుమార్ శ్రీ కాళహస్తి మహత్యం.
నాగూరు జీవితంలో విలాసాలు ఓప్రక్క దానధర్మాలు ఓ ప్రక్క ఎలా చెప్పుకునే వారికి అలాగ ఓ వెలుగు వెలిగింది. నాగూరు పేరు మోత మోగింది ఉప్పాడ చుట్టు ప్రక్కల.నాగూరుకు చిన్నాన్న కొడుకు  గంపల రమణ అయినా ఒకే తల్లిబిడ్డలుగా కనిపిస్తారు ఊళ్ళో వాళ్ళకు.

ఇలా పట్టిందల్లా బంగారం తరుణంలో నాగూరు  ఒక ఆపదొచ్చి పడింది.  నాగూరుకి ఇద్దరు అబ్బాయిలు ఉమ ఒక్కగాని ఒక అమ్మాయి. ఉమపుట్టిందే కాని టి.బి మహ్మమ్మారి పీక్కుతినేసింది.  జబ్బు నయంకావడానికీ తిప్పని చోటూ లేదూ వెళ్ళని నగరమూ లేదు. చివరకి 4 సంవత్సరాలప్పుడు చనిపొయింది ఉమ.  తన పొలంలోనే  ఉమ నిలువెత్తు బొమ్మ చేసి ఆలయంలా కట్టి మనోవేదన తగ్గించుకుంటానికి ప్రయత్నించాడు మన నవాబు నాగూరు. ఆ రోజుల్లొ అదో సంచలనం గుడి కట్టడం.

జల్సా జీవితం గడుపుతున్న నాగూరిని ఈ సంఘటన క్రుంగదీసింది. మెడ్కాల్ బ్రాంది , రెడ్ హిల్స్ సిగరెట్టు దగ్గరకు చేరడం ప్రారంబమయ్యింది. ఇంతలో దివిసీమ ఉప్పెన బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేసేసింది. ఉప్పాడ ప్రాంతంలో రొయ్యల పడేవి కావు. వ్యాపారం సన్నగిల్లింది.
200 తెరచాప పడవులు ,వేటగాళ్ళను ఒక్కక్కరికీ 5000  జీతం ఇచ్చి పూరీలో రొయ్యల వేటకు బయలు దేరాడు.
పూరీ లోను సేమ్ సీన్ రొయ్యలు లేవూ  వ్యాపారమూ లేదు. అప్పులు చేసి వేటగాళ్ళ జీతాలు చెల్లించ వలసి వచ్చీంది. ఉన్నది ఊడ్చుకుపోయింది.



వేటగాళ్ళమీద 7 లక్షలు వదిలేయవలసి వచ్చింది. నాగూరు
మెల్లగ మెడ్కాల్ బ్రాందికీ, రెడ్ హిల్స్ సిగరెట్లకు బానిసయ్యూడు. రోగాలు మీదపడంతో అన్ని మాని
గతఙ్ఞాపకాలతో తన మేడలోనే నివసిస్తూ  ఉన్నాడు మన తొలి ఉప్పాడ సెలబ్రెటీ.

సిద్ధాంతపు బెన్ జాన్సన్ (జనశ్రీ)
ఉప్పాడ కొత్తపల్లి
9908953245

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...