Friday, January 10, 2020

చింతకూర గంప గంగమ్మ ( జనశ్రీ) మన ఊరి కథలు - 3

                                                      చింతకూర గంప గంగమ్మ ( జనశ్రీ)
                                                               మన ఊరి కథలు - 3
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. చింతపిక్కలు ఏరుకొని జావ కాసుకుని కడుపు నింపుకునే వారు ఆరోజుల్లో. అదే సమయంలో సామర్లకోట నుండి వ్యాపారస్తుల (దుమ్ములు వ్యాపారం) కుటుంబంలో నుంచి ఉప్పాడకు కోడలుగా వచ్చింది  మిరియాల గంగమ్మ.  ఉప్పాడ శివారు  అమీనాబాద్ కు చెందిన ఏడిది ముసలయ్య మనువాడాడు మన గంగమ్మను. గంగమ్మకు 11 మంది అప్పాచెల్లెళ్ళు. డబ్బు ఆడుతున్న కుటుంబం నుంచి వచ్చిన గంగమ్మకు ఉప్పాడలోని కరువు పరిస్థితి ఆశ్చర్యంగా తోచింది.కూలి పనులు లేవు కాబట్టి చింతకూర అమ్మి కుటుంబం నడపాలని ఆలోచించింది. ఉదయాన్నే గంప పట్టుకుని ఎండపల్లి శివారు చింతతోపు దగ్గరకు ముసలయ్యను తీసుకుపోయి చింత చివరలు కోసి ఉప్పాడ చిన్న బజార్ లోకి పట్టుకెళ్ళి అమ్మేది. ఇంటి పెరటిలో మల్లె తోట వేసి మల్లె మొగ్గలు బాపనోళ్ళు ఇళ్ళకి పట్టికెళ్ళి అమ్ముకు వచ్చేది. ముసలయ్య మాంచి చమత్కార మనిషి. భార్యకు చేదోడు వాదోడుగా వుంటూ అప్పుడప్పుడూ చింతకూరను బజారుకు పట్టుకెళ్లి అమ్ముకు వచ్చేవాడు. అమ్మడానికి పెట్టినప్పుడు ముదరాకు అని ఎవరైనా అడిగితే "సనుకాలుతో చింతకూర నూరతావుంటే  మీ కొప్పు ఊడిపోకుండా వుంటే నన్ను వచ్చి అడగండి"  అంటూ హాస్యమాడేవాడు. ముసలయ్య చమత్కార మనిషి కావడంతో ఊరిలో గంగమ్మకు,ముసలయ్యకు పలుకుబడి వచ్చింది. గంగమ్మ ఎండపల్లి పొలాలలో పరగ ( పొలంలో కోసిన వరి చేనును కట్టలు కట్టేప్పుడు రాలే వరి కంకులు)ఏరుకొని వచ్చేది. వాటిని బల్లలపై కొట్టి రాలిన గింజలను పెద్ద మట్టి బానల్లో(కుండలు) దాచేది. మెల్లమెల్లగా కూడబెట్టిన డబ్బులతో సపోటా తోటలు కూడా కౌలుకు తీసుకొని సపోటా పళ్ళ వ్యాపారం కూడా చేసేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమాయకమైన రోజుల్లో తాను నిజాయితీగా వుంటూ గంగమ్మ కష్టపడే తత్వాన్ని , ఆరోజుల్లోని అమాయకత్వాన్ని చెప్పడం కోసమూను ఇదంతా.
పొద్దంతా పరగ ఏరుకొచ్చిన గంగమ్మ సాయంత్రం ఐదు గంటలకి చూరులో దాచిన లంక పొగాకు చుట్ట వెలిగించి సేద తీరేది.  అప్పటికి టీ పానీయం అందుబాటులో లేదు . గబగబా ఎసరు పెట్టి గంజి వార్చి నాలుగు గుటకలు గంజిని డోకు( కొబ్బరి చిప్పకు వెదురుపుల్ల దూర్చి చేసిన గరిటె)  తో తాగి  గంపట్టుకుని బజారుకు బయలుదేరేది.

మరియమ్మ పంతులమ్మగారికి ఇష్షమైన సఖి మన గంగమ్మ
గంగమ్మ నడుస్తుంది కాని ఊరి నుండి వచ్చిన కూతురు కటాచ్చమ్మ, మనవడు అబ్బు గురించే ఆలోచనంతా. గత ఙ్ఞాపకాల్లోకి నడుస్తూ వెడుతుంది తనకు మగ కవల పిల్లలు పుట్టిన నెలలోనే చనిపోతే ఆశ చావక తిరిగి గోతిని తవ్వి బిడ్డల్ని చూడందే ఏడుపు ఆపలేదు గంగమ్మ . గొయ్యి తవ్వే వారు " ఇలా తిరిగి చూడడం తప్పు  మరల మగపిల్లలు పుట్టరు"  అని   చెప్పినా వినలేదు అందుకేనేమో కూతురు కటాచ్చమ్మ పుట్టింది. మరల మగబిడ్డలు పుట్టలేదు. కూతుర్ని టీచరు చదివించింది ఇష్టపడి. కటాచ్చమ్మ కొడుకే అబ్బు. చాన్నాళ్ళకు మగబిడ్డ పుట్టాడు. ఆశతీరా ఆడుకోవాలి అనుకుంటూ నడుస్తుంటే. ఏడిద సూర్రావు పిలుపుతో ఙ్ఞాపకాల బయటకు వచ్చింది గంగమ్మ.
.ఏడిద సూర్రావు బ్రాకేట్ ఆడతాడు.( ఇదో రకమైన లాటరీ జూదం ప్రభుత్వం నిషేదించింది.) రోజూ కాకినాడ నుండి నెంబర్లు వస్తాయి . కొట్టుముందు  నిన్న రాయించుకున్న నెంబర్లు రాసి పెట్టేవారు రాయించుకున్న నెంబరు తగిలితే డబ్బులు ఇచ్చేవారు .గంగమ్మ నిన్న రాయించుకున్న నెంబరు చీటి తీసి చూసుకుంది. రోజూలాగే ఆ రోజూ తగల్లేదు. రోజు 2 రూపాయల బ్రాకెట్ నెంబర్లు రాయించుకోవడం గంగమ్మకు అలవాటు. ఎప్పుడో ఓ సారి తగిలింది బ్రాకెట్ నెంబరు మరలా తగల్లేదు. కొత్త నెంబరు రాయించుకుని  నూకాలమ్మ గుడి దాటి పాలంకోరి మేడదగ్గరకొచ్చింది. ఆయుర్వేదం మందు బిళ్ళలు కొనుక్కుంది. కాళ్ళపీకులకు పాలంకి సుబ్బారావు మంచి బిళ్ళలిత్తారని గంగమ్మ నమ్మకం.ఆయుర్వేదం బిళ్ళల పొట్లాం గంపలోవుంచి బొడ్డులో దోపుకున్న గుడ్డ శిక్కంలో డబ్బులు తీసి ఇచ్చింది. " అబ్బుగాడికి ఏదైనా కొనాలి బజారులో  బిడ్డడు రాక రాక వచ్చాడు " అని అనుకుంటూ  అడుగులు పెద్దవివేస్తూ నడుస్తుంది.నాగూరు మేడ దాటుతుంటే  " ఎమే కూతురు గాని వచ్చిందేటే కంగారుగా నడుత్తున్నావు "  అని ఎటకారమాడాడు నాగూరు. నవ్వే సమాదనమిచ్చి  వెడుతుంటే తిగుటి పెకాశరావు మేడలో నుండి గట్టికేక " గంగమ్మా...... వస్తువులు  ఎప్పుడు విడిపిస్తావు " అంటూ."వచ్చే అమాసకి విడిపిత్తానండి " అని సమాదానమిచ్చి నాలుగడుగులు  ఎసేసరికి పెద్దాబ్బాయి కీళ్ళీకొట్టు నుండి కుయ్య్ మని గోళీసోడా చప్పుడు వింది .  గోళీసోడా తాగాలని గంగమ్మకు బెమ పుట్టింది .కొట్టు ముందు  వాడోళ్ళు ( మత్సకారులు) ఎక్కువ మంది మూగి వుండే సరికి బజారు చేసుకుని వచ్చేప్పుడు తాగుదాంలే అనుకుని ముందుకుపోయింది గంగమ్మ..
సీకోటి అప్పారావు చుట్టకాలుత్తు ఎత్తరగు మేడ గట్టు చివర కూర్చుని కనిపించాడు. సీకోటి అప్పారావు అమీనాబాద సర్పంచయినా బట్టలవ్యాపారం చేసేవాడు. "మా అబ్బుగాడికి జుబ్బా కొంటాను అప్పారావుగారు మంచి బట్టలుంటే పక్కన బెట్టండని " గట్టిగా అరిచింది గంగమ్మ." ఇదిగొనే ఏటగాళ్ళ గోచీలు రంగురంగులున్నాయి. గోచీ( దాదాపు మీటరు పొడవుండేవి) ఓటి మీ అబ్బుగాడికి  కొను "  అంటూ విరగబడి నవ్వాడు సీకోటి అప్పారావు. అవును మరి చేపల వేటగాళ్ళు పెదపండగ వస్తుందంటే సీకోటి అప్పారావు బట్టల దుకాణం ముందు ఏలగట్టిన గోచీలు కొనుక్కుంటం ఆనవాయితీ మరి.
సందు తిరుగుతుంటే  కిరాణా కొట్టులోంచి తూమ్ బొక్కోడు ( కొట్టు యజమాని పేరు ఎవడు పెట్టేడో నిక్ నేమ్ ) అరుపులు వినబడుతున్నాయి. అది అసలు సిసలు శెట్టిగారి గొంతు. డబ్బాలో రాళ్ళేసి గిలకొట్టినట్లుండేది. "ఈ శెట్టి ఎప్పుడూ అంతే బేరాలకు వచ్చినోళ్ళను తిడతావుండడమే" అనుకుంటూ  చిన్న బజార్ కి వచ్చేసింది గంగమ్మ. ఉప్పాడలో చిన బజారు రోజూ జరుగుతుంది. పెద బజారులో వారం సంత జరిగేది.గంగమ్మ చేపల గంపలు దగ్గరకు పోయి నాలుగు ఆకు పరుగులు , రొయ్యలు గోంగూర కట్ట  బేరమాడి కొన్నాది. గంగమ్మని " ఇయాల గంపెట్టలేదేమే" అంటూ అందరూ అడిగారు." ఈయల మా కూతురు ,మనవుడూ ఊరినుండి వచ్చారు అందుకనే కొట్టెట్టలేదని చెప్పింది" ఇంతలో పుల్ల ఐసు సూరిగాడు గంగమ్మను" పుల్లఐసు కొంటావేటి "అని అడిగాడు. పుల్ల ఐసు బజారుకి రావడం అదే మొదటిసారి. గంగమ్మ చూడడ్డం కూడా అదే. మనవడి కోసం పుల్ల ఐసు కొని గంపలో పెట్టుకుంది.ఫుల్ల ఐసు చేతిలో పెట్టగానే మనవడి ముఖంలో కాంతిని తలచుకుని. సరుకులు అన్నీ కొనుక్కుని గబ గబా ఇంటికి వచ్చేస్తూ  బియ్యం కొట్టు పొన్నేటి ఎంకట్రావు దగ్గర గిద్దమసూరి పాతబియ్యం అడ్డుడు కొని చెంగులో మూటగట్టి నెత్తిమీద పెట్టుకుంది. కూతురు ముతక బియ్యం తినలేదని. ఎంకట్రావు చాటున నల్లమందు అమ్మతాడు. రోజూ ఓ బిళ్ళేసుకుని తొంగొవడం గంగమ్మకు అలవాటు.  రెండు రూపాయల నల్ల మందు బిళ్ళ కొనుక్కుని  శిక్కంలో భధ్రంగా దాచుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తూ  అమీనాబాద  నూకాలమ్మ గుడులు దగ్గరికి చేరుకుంది.  కూతురు కటాచ్చమ్మ పెదనుయ్యి దగ్గర తాటాకు చేదతో ఇత్తడి బిందెలోకి నీళ్ళు తోడతా కనిపించింది. మనవడు అబ్బు నూతి చూట్టూ ఉన్న చప్టాకి (అంచు)పడ్డ గొతుల్లొని నీరుని కాళ్ళవ్రేళ్ళతో తోడుతూ ఆడుకుంటం కనిపించింది. కూతురు ఉద్యోగస్తురాలు పని చేస్తుంటే చూడలేక "నీకెందుకమ్మా ఇంటిలో ఉండలేకపోయావా నేను చేత్తాను కదా" అంది గంప కిందనెడుతూ. "మామా నాకేం కొన్నావూ" అని అడిగాడు మనవడు గంపలోకి తొంగి చూస్తూ." ఇదిగో నా బుజ్జి కన్నా నీకు పుల్ల ఐసంట  కొత్తగా వచ్చింది బజారులోకి అది తెచ్చాను" అని గంపలో చెయ్యెట్టింది.గంపలో చెయ్యెట్టిన గంగమ్మకు చేతికి తడి చిన్న వెదురు పుల్ల తగిలాయి. ఏం అర్దం కాలేదు గంగమ్మకి. గబ గబా గంపంతా తడిమింది. పుల్ల ఐసు కనబడలేదు. ఐసు అమ్మినోడు మోసంచేసాడనుకుంది.మనవడికి అడిగింది ఇవ్వలేకపొయానన్న బాదతో  ఎంత మోసంచేసాడు నా బంచోతుగాడు, నాగుడ్డ, నా పాత, ఆడూడుపోను అంటూ తిట్లు లంఖించుకుంది. ఎప్పుడూ ఐసు చూడని  అమాయకపు గంగమ్మకు ఐసు కరిగి పొద్దని తెలియక కొని గంపలో పెట్టుకుంది. తల్లి అవస్ధ అర్దమైంది ఉద్యోగస్తురాలైన కూతురు కటాచ్చమ్మకు. తల్లి అమాయకత్వానికి నూతి గచ్చుకు జారబడి తలచుకుని తలచుకుని నవ్వుతూనే వుంది.

సిద్దాంతపు బెన్ జాన్ సన్  (జనశ్రీ )
ఉప్పాడ కొత్తపల్లి
9908953245

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...