Friday, January 10, 2020

కృష్ణా పుష్కరిణి (జనశ్రీ)


కృష్ణా పుష్కరిణి (జనశ్రీ)
నా కృష్ణవేణమ్మ !
మా కృష్ణవేణమ్మ !
పుష్కర పావనీ జననీ
సహ్యాద్రి సంచారిణీ
కృష్ణ పుష్కరిణి
దుష్కర్మ సంహారిణి
సకల పాప హరిణి
అన్నపూర్ణ స్వరూపిణి
ఓ కృష్ణ పుష్కరిణి
పాహిమాం !పాహిమాం!
అమరావతి సిగన
జాలువారే ఓ సిరి దండ
నాగార్జునుని మానస సరోవర తిమ్మెర వీచిక
సకల దేవళాల కుంకుమ సుగంధ పరిమళ వేణి
ఓ కృష్ణవేణి !
విశ్వనాధుని కవితా ఝురికి
నడక సొగసులద్దిన కిన్నెరసాని
దుర్గమ్మ భుజాన అలా అలా అలలా
ఎగిరే చీరచెంగువి నీవు కదా కృష్ణవేణమ్మ
ఓ కృష్ణవేణి
నమోన్నమః
మాకు తెలుసు తల్లి నీవు ఒంటరిగా రావని
గంగమ్మను తోడ్కొని వస్తావని
అందుకే మాకు నీవంటే అంత ఆత్రం
ఆరు నదుల సంగమ విరిబోణివి నీవు
తెలుగింటి వెలసిన మా సిరి ఓణీవి నీవు
ఓ జీవనది  !
మా  జీవితాలను పావనం చేసే పుష్కరిణి
పండ్రెండు వసంతాల తరువాత వస్తుంటే
ఏం జరుగుతుందోనని ఓసింత ఆశ
జల జగడాలతో  నీ జలధార
కృషీవలుని ఇంట అశ్రుధారలు కాదు కదా
మరి బిరబిరా కృష్ణమ్మవే
నీ భీకర సుందర రూపం చూడగలమా !
నువ్వు నిండా వుంటే తెలుగింటి పట్టు చీర
చీరచెంగులా  నిండుగా ఉంటుంది
ఇప్పుడేంటి నేత చీర చిన్నదైపోయింది !
అర్ధమయ్యింది లే కృష్ణవేణి
నీవు వస్తూ వస్తూనే
నయీం (అండర్ వరల్ఢ్ డాన్ )పాపాల చిట్టాలను ఉతికి ఆరేసిన నప్పుడే
నీ పుష్కరాలు రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అంత ఘనంగా మోత మోగింది సుమా !
ఇంకా నయా నయీంలు
ఎందరు కలుగుల్లో  నక్కారో
వారు ఇప్పుడు తప్పించుకోవచ్చు కృష్ణా పుష్కరిణి
నువ్వు బృహస్పతితో వస్తూనే ఉంటావు
వాళ్ల పాపాలను కడిగేస్తూనే ఉంటావు
ఓమారు కృష్ణా పుష్కరిణి
నీ ప్రవాహంలో ప్రహసనంగా మారిన
రాజకీయ రాబందుల పాపాల పుట్టల
పని పడతావ్ ఏంటి ?
ఓ కృష్ణా పుష్కరిణి !
రా రా రా మళ్లీ మళ్లీ రా రా....
పుష్కరిణి నీవు సృష్టి ఉన్నంతకాలం రా రా.....
కృష్ణా పుష్కరాలు సందర్భంగా
తెలుగు భాషా సంఘం వారు నిర్వహించిన ఆ కవిసమ్మేళనంలో రాజమండ్రిలో చదివిన కవిత
పొట్లూరి వారి సన్మాన తాంబూలం
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
తూర్పు గోదావరి జిల్లా
9908953245


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...