Wednesday, April 6, 2022

రాజరికం శిధిలావస్ధ

 భారతదేశంలోని దాదాపు 500 రాజ కుటుంబాల (Royal Families) సంపద చాలా కాలంగా క్షీణిస్తోంది. 1947లో బ్రిటన్ (Britain) నుంచి స్వాతంత్య్రం ( Independence) పొందిన తర్వాత వారి ఆడంబరమైన జీవనశైలి నాటకీయంగా తగ్గిపోయింది.

వివిధ రాజకుటుంబాలు, మహారాజులు, మహారాణులు, నవాబులు, బేగంలు, నిజాంలు, యువరాజులు, యువరాణులు అందరి అధికారాలు తొలగిపోయాయి.. వారి భూములను స్వాధీనం చేసుకొన్నారు.. కొందరికీ ఇప్పటికీ పరిహారం దక్కకపోవడం గమనార్హం. అయితే రాజ కుటుంబాలకు చెందిన కొందరు శక్తివంతమైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా మారితే.. మరికొందరు తమ వద్ద ఉన్న రత్నాలు, నగలు, నౌకలు తదితర ఆస్తులను అమ్ముకొని, అప్పులపాలై, చాలీచాలని ఆదాయంతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. దీనావస్థలో ఉన్న రాజ కుటుంబాల కొన్ని గాధలు ఇవే..

ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ చివరి నిజాం వారసులు

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు అతని వారసుల వద్ద అతని సంపదలోని ఒక భాగం కంటే తక్కువ ఉంది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి నిజాం సంపద సుమారు 100 మిలియన్ పౌండ్లు. బంగారం, వెండి కడ్డీలు, 400 మిలియన్‌ పౌండ్ల విలువైన ఆభరణాలు ఉండేవి. కాగితాలు గాలికి ఎగిరిపోకుండా ఉంచే పేపర్ వెయిట్ కోసం 200 మిలియన్‌ పౌండ్ల విలువైన 185 క్యారెట్ వజ్రాన్ని నిజాం ఉపయోగించారు. అతని అంతఃపురంలో 86 మంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. 100 మంది కంటే ఎక్కువ అక్రమ సంతానం ఉన్నట్లు సమాచారం. దీని కారణంగా 1990ల నాటికి అతని సంపదపై చట్టపరమైన హక్కుదారులు 400 మందికి పైగా చేరుకున్నారు.

ఇస్తాంబుల్‌లోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో బలహీనమైన, ముసలి తనంలో మధుమేహంతో.. చెప్పలేని సంపద, అందమైన మాజీ భార్యలు, 14,718 మంది సభికుల జ్ఞాపకాలతో బతుకుతున్న నిజాం వారసుడు ముకర్రం జా అత్యంత దురదృష్టవంతుడు.

* రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చముపతి సింగ్, తిగిరియా మహాపాత్ర

తన రాజభవనాన్ని బలవంతంగా విక్రయించి, రాచరికపు అధికారాలను తొలగించడంతో రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చముపతి సింగ్ ఇప్పుడు గ్రామ ప్రజల దయతో జీవిస్తున్నాడు. అతను ఒడిశాలో జీవించి ఉన్న చివరి మాజీ పాలకుడు. ఒకప్పుడు భారతదేశంలో విలాసవంతమైన రాజు. అతని వద్ద 25 లగ్జరీ కార్లు ఉండేవి. 30 మంది సేవకులతో ప్యాలెస్‌లో నివసించాడు. 13 పులులు, 28 చిరుతపులులను కాల్చి చంపిన వ్యక్తిగా ప్రసిద్ధి.

అయితే భారత స్వాతంత్య్రం తర్వాత అతని అదృష్టం అదృశ్యమైంది. తన రాష్ట్ర పన్ను ఆదాయాన్ని రాజు కోల్పోయారు. బదులుగా సంవత్సరానికి 130 పౌండ్ల ప్రైవీ పర్స్ ఇచ్చారు. 1960లో తన రాజభవనాన్ని 900 పౌండ్లకు బలవంతంగా విక్రయించవలసి వచ్చింది. తరువాత అతని భార్య విడిపోయింది. 1975లో ప్రభుత్వం చివరిగా మిగిలిన రాచరికపు అధికారాలను ఉపసంహరించుకుంది. ఆయన తన వార్షిక ఆదాయాన్ని కోల్పోయారు. ఈరోజు మధ్యాహ్న భోజనానికి అన్నం, పప్పు తెచ్చే గ్రామస్తుల దయతో శిథిలావస్థలో ఉన్న మట్టి గుడిసెలో జీవిస్తున్నారు. ఆ కాలంలో గొప్పతనాన్ని, ఇప్పుడు ఈ జీవితాన్ని చూస్తున్న తాను సంతోషంగానే ఉన్నానని.. అప్పుడు నేనే రాజుని, ఇప్పుడు నేను పేదవాడిని,, కానీ నాకేమీ పశ్చాత్తాపం లేదని రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చముపతి సింగ్ చెబుతున్నారు.

* సుల్తానా బేగం, బహదూర్ షా జాఫర్ ముని మనవడి భార్య

భర్త చనిపోయాక ఫించనుతో 6 మంది పిల్లలను పోషించాల్సిన స్థాయికి ఆమె జీవితం పడిపోయింది. ఆమె బహదూర్ షా జాఫర్ ముని మనవడిని వివాహం చేసుకుంది. ఆమె భర్త ప్రిన్స్ మీర్జా బేదర్ బఖ్త్, ఆయన 1980లో మరణించినప్పటి నుంచి సుల్తానా పేదరికంలోకి దిగజారిపోయింది. కోల్‌కతాలోని ఒక మురికివాడలో ఒక చిన్న రెండు గదుల గుడిసెలో నివసిస్తోంది. ఆమె తన పొరుగువారితో వంటగదిని పంచుకొంటోంది. వీధి కొళాయి వద్ద నుంచి నీటిని తెచ్చుకొని వీధిలోనే పాత్రలను శుభ్రం చేసుకొంటోంది.

ఆమె 19వ శతాబ్దపు రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని రుజువు ఉన్నప్పటికీ.. సుల్తానా తన రోజువారీ జీవితాన్ని నెలకు అందే రూ.6000 ఫించనుతో గడుపుతోంది. ఆ మొత్తంలోనే తన ఐదుగురు కుమార్తెలు, కొడుకు బతకాల్సి వస్తోంది.

గ్వాలియర్ సింధియాస్

తోమర్లు గ్వాలియర్ అద్భుతమైన కోటను నిర్మించారు. మొఘలులు దానిని అపఖ్యాతి పాలైన జైలుగా మార్చారు. 1857 తిరుగుబాటుదారులు దీనిని వ్యూహాత్మక అవుట్‌పోస్ట్‌గా ఉపయోగించారు. చివరికి ఇది సింధియాలకు బలమైన కోటగా మారింది. గ్వాలియర్ కోటను సింధియాలు ఆయుధశాలగా, ఖజానాగా ఉపయోగించారు. సింధియాల వద్ద 'గంగాజలి'గా పేర్కొనే భారీ సంపదను దానిలోనే ఉంచారు. యుద్ధాలు, కరవు వంటి సమయాల్లో ఉపయోగించుకొనేందుకు ఆ సంపదను పోగు చేశారు.

ఈ ఖజానాకు బాధ్యత వహించిన మహారాజా జయజీరావు సింధియా హఠాత్తుగా మరణించడంతో.. ఆ సంపదను పొందేందుకు అవసరమైన రహస్య కోడ్‌ను అతని కుమారుడు మాధవరావుకు చెప్పలేకపోయారు. అప్పుడు మాధవరావు చిన్న పిల్లవాడు. దీంతో ఆ కుటుంబం చాలా ఏళ్లుగా ఆర్థికంగా చితికిపోయింది. ఏళ్ల తరబడి సంపద పోగొట్టుకుని జీవితం కష్టతరంగా మారింది. అదృష్టవశాత్తూ చివరికి మాధవరావు సంపద ఉన్న చోటును కనుక్కొన్నారు. వారి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. అతను నిధిని కనుగొన్నప్పుడు.. ఆస్తులను లిక్విడేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. టాటా సహా అనేక పరిశ్రమలు, కంపెనీలలో పెట్టుబడి పెట్టారు.

* జియావుద్దీన్ టుసీ, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు

జియావుద్దీన్ టుసీ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ ఆరో తరం వారసుడు. ప్రస్తుతం అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న అతను ఇప్పటికీ ప్రభుత్వం పూర్వపు మొఘలుల ఆస్తులను చట్టబద్ధమైన వారసులకు అప్పజెబుతుందని నమ్ముతున్నారు. మొఘల్ వారసులకు రూ.100 స్కాలర్‌షిప్‌ను కొంతకాలం క్రితం ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని ఆయన కోరుతున్నారు. ఆర్థికంగా అణగారిన మొఘల్ వారసుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం డబ్బు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టుసీకి ఇద్దరు నిరుద్యోగ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఫించనుపైనే ఆధారపడి జీవిస్తోంది.

ఉత్రదం తిరునాళ్ మార్తాండ వర్మ, ట్రాన్వాన్‌కోర్ మాజీ రాజు

ఇది తమ సంపదనంతా భగవంతుడికి ధారపోసిన కుటుంబం. 1750 నాటికి ట్రావెన్‌కోర్ ధనికంగా బలపడిన పెద్ద ప్రాంతంగా అవతరించింది. అప్పటి రాజు అద్వితీయమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అతను తన సంపదలన్నింటినీ ఆలయానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. పద్మనాభస్వామి వారి కుటుంబ దైవం.

1839లో తిరుగుబాటుకు దాదాపు రెండు దశాబ్దాల ముందు వారు బ్రిటీష్‌వారిని ఎదిరించారు.. ఈ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రావెన్‌కోర్‌లోని 50,000ల మంది సైన్యాన్ని తొలగించారు. బ్రిటిష్ రెజిమెంట్‌ల నిర్వహణకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఆ తర్వాత 2011లో తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయంలోని ఖజానాలో అపారమైన సంపదను గుర్తించిన ప్రభుత్వం దానికి రాష్ట్ర రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే ఈ నిధి తనకు లేదా ప్రభుత్వానికి చెందినది కాదని, దేవుడిదని రాజు ఒక ప్రకటన చేశారు.

టిప్పు సుల్తాన్ వారసులు

భారతదేశం నుంచి గొప్ప యోధులలో ఒకరు టిప్పు సుల్తాన్‌. అతని వారసులు ఇప్పుడు జీవనోపాధి కోసం రిక్షాలు లాగుతున్నారు. "టైగర్ ఆఫ్ మైసూర్"గా గౌరవం అందుకొన్న టిప్పు సుల్తాన్ తన సైనిక వ్యూహాలు, రాజనీతిజ్ఞతతో ఖ్యాతి పొందారు. 1799 మేలో సెరింగపట్నంలో బ్రిటిష్ వారితో పోరాడుతూ మరణించారు. అతని వంశం ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. టిప్పు సుల్తాన్ వారసులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. మనుగడ కోసం చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద , ధనిక ముస్లిం ట్రస్ట్‌లలో ఒకటైన ప్రిన్స్ గులాం మహ్మద్ ట్రస్ట్‌కి వారసులుగా కొనసాగుతున్నప్పటికీ ఈ పరిస్థితి తప్పడం లేదు.

అతని 12 మంది కుమారులలో ఏడుగురికి వారసులు లేరు. మిగిలిన 5 మందిలో మూనిరుద్దీన్, గులాం మహ్మద్ అనే ఇద్దరు మాత్రమే గుర్తించగలిగినవారు. వారి వారసులు చిన్న వ్యాపారులుగా జీవనోపాధి పొందుతున్నారు. గులాం మహమ్మద్ వంశానికి చెందిన వారు శిథిలమైన హవేలీలో దుర్భరమైన పేదరికంలో జీవిస్తున్నారు.

సకీనా మహల్, అవధ్ యువరాణి

ఒకప్పుడు విస్తారమైన భూమిని పరిపాలించిన ఈ కుటుంబం, ఢిల్లీలోని ఒక అడవిలో ఉన్న అపఖ్యాతి పాలైన మహల్‌లో నివసిస్తోంది. యువరాణి సకీనా మహల్, ఆమె కుటుంబం అవద్ రాజ్యాన్ని పరిపాలించింది. ఒకప్పుడు మధ్య భారతదేశంలోని మముత్ స్వాత్‌ను పరిపాలించారు. ప్రస్తుతం మధ్య వయస్కులైన పి ఇన్సెస్ సకీనా , యువరాజు రియాజ్ మల్చా మహల్‌లో నివసిస్తున్నారు. ఈ నిర్మాణం ఒకప్పుడు తుగ్లక్ కాలం నాటి వేట వసతి గృహంగా ఉంది. ఇప్పుడు చెప్పలేనంతగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వంతో 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత చివరకు ప్రతి నెలాఖరున రూ.500, అదనంగా స్థలాలు కేటాయించారు.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...