Monday, May 30, 2022

కోనసీమ

 ఇటీవల కాలంలో ఈ పేరు చుట్టూ చర్చ సాగుతోంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటయిన కొత్త జిల్లాకు కోనసీమ పేరు మాత్రమే ఉంచాలని కొందరు, కోనసీమకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుని కూడా జోడించాలని మరికొందరు పట్టుబడుతున్నారు. పేరు విషయంలో ఏర్పడిన వివాదం విధ్వంసానికి, హింసాకాండకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు కోనసీమ అనే పేరు ఎలా వచ్చింది, ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఎలా మారిందనే విషయాల్లో ఆసక్తి నెలకొంది.




స్వరూపమిదే.

ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నీటివనరుగా ఉన్న గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతమే కోనసీమ. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా పిలిచే ఆ నదీ ప్రవాహం ఆ తర్వాత దిశ మారుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన పలు పాయలుగా మారుతుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ పాయల మధ్య ప్రాంతమే కోనసీమ. నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉంటుంది. జిల్లాల విభజనకు ముందు 16 మండలాలతో కోనసీమ ఉండేది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉండేది.

అమలాపురం పార్లమెంట్ స్థానం ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో ప్రస్తుతం 21 మండలాలతో ఇది ఉంది. అందులో 9 మండలాలు సముద్రంతీరంలో ఉన్నాయి. గోదావరి నదీ ప్రవాహపు ఒండ్రుమట్టితో సారవంతమైన నేలలకు కోనసీమ ప్రసిద్ధి. వ్యవసాయ, వాణిజ్య పంటలతో పాటు ఆక్వా సాగులోనూ అభివృద్ధి సాధించింది. సగటున 1,280.0 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. దాంతో నీటి వనరులకు లోటులేని ప్రాంతంగా చెబుతారు. 20 ఏళ్ల క్రితం గౌతమీ నదీ పాయపై యానాం- ఎదుర్లంక వద్ద నిర్మించిన వంతెనకు పూర్వం ఇక్కడ తగిన రవాణా సదుపాయాలు లేవు.

అంతకుముందు జాతీయ రహదారి విషయంలో కూడా రావులపాలెం మీదుగా ఎన్‌హెచ్ 16 ఉండడం కొంత కలిసివచ్చింది. ఆ తర్వాత ఎన్‌హెచ్ 216ని అమలాపురం మీదుగా అభివృద్ధి చేస్తున్నారు. రైలు మార్గం ఏర్పాటు చేయాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. నిధుల మంజూరులో జాప్యం కారణంగా కోనసీమలో రైలు కూత ఆలస్యమవుతోంది. పారిశ్రామికంగా ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా చమురు-సహజ వాయువు ఉత్పత్తిలో దేశంలోనే కీలక స్థానంలో కోనసీమ ఉంది. కేజీ బేసిన్ పరిధిలోనే ఈ ప్రాంతం ఉంటుంది. కానీ వ్యవసాయాధారిత పరిశ్రమలు గానీ, ఇతర పరిశ్రమలు గానీ ఆశించిన స్థాయిలో ఏర్పాటు కాలేదు. కోనసీమ నుంచి వనరులు తరలించుకుపోవడమే తప్ప తగిన అభివృద్ధి ప్రయత్నాలు జరగలేదనే అభిప్రాయం ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ పి గోపి వ్యక్తం చేశారు.

కోన అంటే అర్థమదే..

తెలుగు నిఘంటువు ప్రకారం కోన అంటే చాలా అర్థాలున్నాయి. అందులో అడవి వంటివి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే కోన అంటే మూల అని, సీమ అంటే ప్రదేశం అని తెలుగు అధ్యాపకుడు ముళ్లపూడి రామచంద్రం అభిప్రాయపడ్డారు. "గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కోనసీమగా పిలుస్తున్న ప్రాంతం ఓ మూలన ఉంటుంది. అందులోనూ భౌగోళికంగా నదీ ప్రవాహానికి చివరిలో ఉంది. ఇది ఓ దీవిని తలపిస్తుంది. రోడ్డు రవాణా మార్గాలు అంతగా లేని రోజుల్లో రాకపోకల కోసం పడవల మీద గోదావరిని దాటాల్సి వచ్చేది. అందుకే ఆ ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. కోనసీమ గురించి 12వ శతాబ్దం నాటి నుంచే ప్రస్తావన ఉంది. నన్నయ్య వంటి వారి రచనల్లోనూ కోనసీమ గురించి పేర్కొన్నారు. అనేక శతాబ్దాలుగా కోనసీమగానే ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారు"అని ఆయన బీబీసీకి వివరించారు.

కోనసీమ అనే పేరు రావడానికి ఆనాటికి ఇది అటవీ ప్రాంతంగా ఉండడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

విపత్తులు ఎదుర్కొంటూ..

కొనసీమ అంటే వర్తమానంలో అత్యధికులకు గుర్తుకు వచ్చేది కొబ్బరి సాగు. దేశంలోనే కొబ్బరి ఉత్పత్తిలో కోనసీమకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి తోటలతో పాటుగా వివిధ అంతర పంటలతో కోనసీమ దాదాపుగా కేరళని తలపిస్తుంది.

కానీ ధవళేశ్వరం క్యాటన్ బ్యారేజ్ నిర్మాణానికి ముందు కోనసీమ కూడా నీటి వనరుల వినియోగానికి దూరంగా ఉండేది. 1850 తర్వాత ఆనకట్ట, దానికి అనుబంధంగా కాలువలు నిర్మించిన కాటన్ సంకల్పంతో కోనసీమ కొత్త రూపు దాల్చింది. ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాల ద్వారా లక్షల ఎకరాల ప్రాంతం సాగులోకి వచ్చింది. అయితే చుట్టూ గోదావరి ప్రవాహం మూలంగా వరదల ముప్పు పొంచి ఉంటుంది. 1986, 2006 వంటి పెద్ద వరదలను కోనసీమ ఎదుర్కోవాల్సి వచ్చింది.

తీర ప్రాంతం కారణంగా తుపాన్ల తాకిడి కూడా తప్పదు. 1996లో పెను తుపాన్ కోనసీమని అతలాకుతలం చేసింది. దాని నుంచి కోలుకోవడానికి కోనసీమ ప్రాంతానికి చాలా కాలం పట్టింది. అనేక విపత్తులను ఎదుర్కొంటూ కోనసీమ నిలబడింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. తొలుత చేపల సాగుతో మొదలయ్యి, ఆ తర్వాత టైగర్ రొయ్యలు, ప్రస్తుతం వనామీ రొయ్యల సాగుతో కోనసీమ రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఒకనాటి పచ్చదనం క్రమంగా తగ్గుతోంది.

ఆయిల్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్, కెయిర్న్స్, జీఎస్ పీసీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యకలాపాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఆయిల్ రిగ్గులలో 30 ఏళ్ల క్రితం పాశర్లపూడి బ్లో అవుట్ కలకలం రేపింది. రెండేళ్ల క్రితం ఉప్పలగుప్తం మండలంలో చెయ్యేరులో కూడా ఆయిల్ బావి వద్ద మంటలు చెలరేగి రెండు రోజుల పాటు ఆందోళనకు గురిచేశాయి.

''రాజకీయాలే కారణం''

కోనసీమ పేరుకి సుదీర్ఘ చరిత్ర ఉండడం వల్ల ఆయ్ మాది కోనసీమ అంటూ ప్రత్యేక యాసలో ఈ ప్రాంత వాసులు గర్వంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిల్లా పేరు చుట్టూ సాగుతున్న చర్చలో కోనసీమ పేరు తొలగించడం లేనందున అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదన్నది కొందరి అభిప్రాయం.

"కోనసీమను జిల్లాగా తొలుత నిర్ణయించారు. దానిని అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం వల్ల పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ కారణాలు మాత్రం అనేకం ఉన్నాయి. అంబేడ్కర్ అనే పేరుని అంగీకరించడానికి కొందరు సిద్ధంగా లేరు. స్పష్టంగా అది చెప్పకపోయినా ప్రస్తుతం వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు అసలు కారణం కోనసీమ పేరు మీద ప్రేమ కన్నా అభ్యంతరమంతా అంబేడ్కర్ పేరు ఉండడమేనని చెప్పాలి. రాజకీయ కారణాలతో కొందరు ఈ వైరుధ్యాన్ని రాజేస్తున్న కారణంగానే సమస్య జటిలమయ్యింది" అంటూ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కందికట్ల రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కోనసీమ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా పేరు పెట్టే ఆలోచన చేయవచ్చంటూ ఆయన సూచించారు. అంతేగాకుండా ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా ప్రజలు వాడుకలో మాత్రం కోనసీమ జిల్లాగానే ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉందంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని అధికారికంగా నిర్ణయించినా వాడుకలో నెల్లూరు జిల్లాగానే ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

''ప్రత్యేకతను నిలుపుకోవాలి..''

"కోనసీమ అంటే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి వాతావరణం, ప్రకృతి వనరులు, పర్యాటకం పరంగా ఉన్న అవకాశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వనరులు.. ఇలా అనేక రంగాల్లో కోనసీమకు గుర్తింపు ఉంది. లంక భూములు సహా అనేక వనరులు సామాన్యుల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీలలోనూ విద్యావంతులు, ఉద్యోగుల సంఖ్య పెరిగింది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అన్ని సామాజిక తరగతుల్లోనూ ఇక్కడ కొంత అభివృద్ధి కనిపిస్తుంది. ఇలాంటి ప్రత్యేకతలను నిలుపుకోవాలి. కానీ కులం పేరుతో కొందరు విద్వేషాలు రాజేస్తే రెచ్చిపోయే పరిస్థితి రావడం ఆందోళనకరం"అని ఆర్డీవోగా పనిచేసి పదవీ విరమణ చేసిన అడబాల వెంకట్రావు చెప్పారు.

తాను రెవెన్యూ శాఖలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో కోనసీమ వాసిగా గర్వంగా చెప్పుకునే వాడినన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు కూడా కోనసీమ అనగానే ఆసక్తిగా చూసేవారని తెలిపారు. ప్రస్తుతం అలాంటి గుర్తింపు కోల్పోయే పరిస్థితి రావడం ఆందోళనకరం అంటూ వెంకట్రావు అభిప్రాయపడ్డారు.

Sunday, May 29, 2022

గుంటూరు శేషేంద్ర శర్మ

 నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశు త్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు'' (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేషేంద్ర శర్మ ఈ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన కవి.



ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీరు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి అని చెప్పిన శేషేంద్ర 1927 అక్టోబర్‌ 20న నెల్లూరులోని తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. బీఏ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. జర్నలిజం పట్ల మక్కువతో తాపీ ధర్మారావు వద్ద 'జనవాణి'లో ఉద్యోగం చేశారు. కానీ సాహిత్యం ఆయనను వెంటాడటంతో అన్నిటినీ వదిలి కవిత్వాన్ని ప్రేమించడం ప్రారంభించారు.

ఆయన కవిత్వంలో ప్రాచీన, ఆధునిక ధోరణులు అందంగా ఇమిడి పోతాయి. ప్రగతి శీలతనూ, ప్రాచీన భారతీయ అలం కార శాస్త్రాల్నీ, మార్క్స్‌ ఫిలాసఫీనీ ఏక కాలంలో జోడించి ఈ దేశానికి అవసర మైన విలువైన సాహిత్య సిద్ధాంతాన్ని ఆయన 'కవిసేన మేనిఫెస్టో' పేరిట మనకు అందించారు. 'షోడశి- రామా యణ రహస్యాలు' పేరుతో వాల్మీకి సుందర కాండకు అద్భుతమైన తాంత్రిక భాష్యాన్ని అందించిన శేషేంద్ర మేఘదూతానికీ, వాల్మీకి రామాయణానికీ మధ్య ఉన్న సంబం ధంపై జర్మనీ ఇండొలాజికల్‌ యూనివర్సిటీలో అపురూపమైన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.

'ఇద్దరు రుషులు- ఒక కవి' శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వంపై విశిష్టమైన పరిశోధనా వ్యాసాన్ని రాశారు. 'స్వర్ణ హంస' పేరుతో నైషధంపై లోతైన విమర్శ చేశారు. 'నా దేశం- నా ప్రజలు', 'మండే సూర్యుడు', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'నీరై పారిపోయింది', 'సముద్రం నా పేరు', 'పక్షులు', 'శేష జ్యోత్స్న' పేరిట అద్భుతమైన కావ్యాల్ని ఆయన రచించారు. 'కాలరేఖ' పేరిట సాహితీ వ్యాసాల్నీ వెలువరించారు. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నోబెల్‌ సాహిత్య పురస్కారానికి నామినేట్‌ అయిన రెండో భారతీ యుడు శేషేంద్ర. తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్‌ ఇవ్వగా... పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 'రాసేందు' బిరుదును ప్రదానం చేసింది. 'కామోత్సవ్‌' పేరిట ఆయన రాసిన సీరియల్‌ నవల తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది.




'ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను' అని చెప్పిన శేషేంద్ర కవిత్వాన్ని ఆధునిక, సంప్రదాయ కవులు ఇరువురూ ఇష్టపడ్డారు. చాలాచోట్ల శేషేంద్ర కవిత్వంలో నన్నయ్య తచ్చాడుతారనీ, పెద్దన, శ్రీనాథుడిని ఆయన ఉపాసించినట్లున్నారనీ, విశ్వనా«థ, జాషువా, రాయప్రోలు, కృష్ణశాస్త్రి వంటివారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయనీ పుట్టపర్తి ఆయన 'రుతుఘోష'కు రాసిన ముందుమాటలో అన్నారు. ''నీది మంచి పద్యమా, లేక ఫ్రెంచి మద్యమా, కవిరేవ విజనాతి, కవిదేవ సుధాగీతి, శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం'' అని శ్రీశ్రీ ప్రశంసించారు.

'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందీ' అని 'ముత్యాల ముగ్గు' కోసం ఆయన ఒకే ఒకపాట రాసినా అది సినీ సాహితీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. సంస్కృత భాషా సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలో లోతైన పరిజ్ఞానం ఉన్న శేషేంద్ర ఫ్రెంచి కవిత్వం, గ్రీకు విషాదాంత నాటకాలు, మార్క్సిస్ట్‌ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళిదాసు, భవభూతి, టి.ఎస్‌. ఇలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్, రేంబో, శ్రీశ్రీ, ప్లేటోల సమన్వయం శేషేంద్ర!

''కవికి సామాజిక స్పృహ కావాలి. కానీ వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాద రూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లం దరి మీదా ఉంది'' అన్న మాటలు ఆయన కాలానికి అతీతంగా నిలుస్తాయి. ''కళ్ళు తుడుస్తాయి/ కమలాలు వికసిస్తాయి/ మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా''- అంటూ గజల్స్‌ కూడా రాసిన శేషేంద్ర కవిత్వంలో ఉర్దూ సాహిత్య పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. 'ఎప్పుడు ఆకు రాలి పోతుందో గాలికే తెలియదు' అంటూ 30 మే 2007న శేషేంద్ర రాలిపోయారు. ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించకపోవడం ఒక బాధగా మిగిలిపోయింది.

నలభై ఐదు సంవత్సరాలక్రితం.. అంటే 1977లో బహుముఖీన దిశల్లో పతనమౌతూ అనేకానేక రుగ్మతలతో సతమతమౌతూ చేవను కోల్పోతున్న తెలుగు వచన కవితను తిరిగి పునరుజ్జీవింపజేయ టానికి 'కావ్యాన్ని ఒక శాస్త్రం'గా పరిగణించాలని ప్రతిపాదిస్తూ 'కవిసేన' అన్న ఒక సంస్థను స్థాపించారు గుంటూరు శేషేంద్రశర్మ.


ఆ సందర్భంగా 'కవిసేన మేనిఫెస్టో'ను ఆవిష్కరిస్తూ ఇలా అన్నారు: ''చరిత్రలో ఎప్పుడూ కవుల అవిరళ కృషే మానవత్వాన్ని నిలబెడ్తూ వచ్చింది... ఏ తరానికి ఆ తరం కొత్త కవుల్నీ, కొత్త భాషనీ, కొత్త విలువల్నీ, ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించుకుంటుంది. కవి గొంతు ఒక శాశ్వత నైతిక శంఖారావం. విశిష్టంగా చెప్పబడిన మాటే కవిత్వం కాగలదు. ఆ మాటకే మనిషిని మార్చే శక్తి ఉండగలదనేది అక్షరసత్యం. దీనిని ఈ తరం కవులు పాటిస్తే కవిత్వానికి మంచి రోజులు వస్తాయి''.

అందరికీ తెలిసినా క్రమంగా మరుగునపడిన ఈ పరమ సత్యాన్ని శేషేంద్ర మళ్ళీ అప్పటి యువకవులకు మననం చేయించాడు. ఈ నలభై ఐదేండ్ల కాలం గడిచిన తర్వాత అప్పటి యువకవులు ఇప్పుడు వయసుమళ్ళిన కవులుగా పరిణామం చెంది, వెనక్కి తిరిగి 'నడచి వచ్చిన దారి'ని చూసుకుంటే, శేషేంద్ర స్వప్నించిన, ఆశించిన మనిషిని మార్చగలిగిన క్షిపణితుల్య మహోదాత్త కవిత్వమేదీ తెలుగు నేలపై మొలకెత్తి, వినూత్న అక్షరవృక్షమై వర్ధిల్లలేదని అర్థమవుతుంది. అందుకుభిన్నంగా, అతిసులువుగా అందు బాటులోకి వచ్చిన మధ్యమాలవల్లనో, తొందరపడికూస్తున్న కోయిలలవలె prematured కీర్తి చాపల్యాలవల్లనో, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, జూమ్‌ మీటింగ్‌, ఆన్‌లైన్‌ వర్చువల్‌ పత్రికలు... ఇలా అంతా మిథ్యామయమై అస్తవ్యస్త 'మిథ్యా కవిత్వాన్ని' టన్నులు టన్నులుగా కవిత్వంపేర కుమ్మరిస్తున్నారు. ఈ కవిత్వంలో ప్రయోజనమూ, రసాత్మకతా, రంజకత్వం, ఆత్మానందాన్ని అందివ్వగల విశిష్టత, గాఢ తాదాత్మ్యతను యోగపర్చగల విలక్షణత... ఇవేవీ కానరావట్లేదు సరికదా, తామేది రాసినా 'ఇదే కవిత్వం' అని దబాయించగల దౌర్జన్యం మాత్రం కనబడ్తోంది. పత్రికలు కూడా విధిలేక పేజీలను నింపే ఒక 'ఫిల్లర్‌ ఐటమ్స్‌'గా కవిత్వాన్ని కుమ్మరిస్తున్నాయి.

వ్యాసం, కవిత, కథ, నవల, సాహిత్య విమర్శ, నాటకం, మంత్ర తంత్ర శాస్త్రాల వంటి అనేక ప్రక్రియలన్నింటినీ స్పృశించి తనదైన ఒక ప్రత్యేక ముద్రను తెలుగు పాఠకులకు అందించిన శేషేంద్ర ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసనపట్టి తనదైన శిల్పసౌందర్యంతో ప్రసంగించినా, పుస్తకాలను వెలయించినా అపురూప వైదుష్యాన్ని చివరిదాకా ప్రదర్శించిన ఋషి. కవి ఎవడైనా కవిత్వ సృజనను ఒక తపస్సుగా స్వీకరిస్తూ, కవిత్వాన్ని ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎందుకు రాయాలి, ఎవరికోసం రాయాలి.. అన్న ఆత్మస్పృహతో, సోయితో, బాధ్యతగా రాయాలని చెబుతూనే, చలోక్తిగా ''నువ్వు ఆకలి కవిత్వం రాసినా, ఆవకాయ కవిత్వం రాసినా అందులో కేవలం కవిత్వం మాత్రమే ఉండాలి'' అని చెప్పాడు. కవిత్వ నిర్వచనంవంటి లోతైన విషయాన్ని ప్రస్తావిస్తూ శేషేంద్ర ఇలా అన్నాడు: ''కవిత్వంలో అనుభూతే సర్వధాప్రధానం. అనుభూతిలోంచే కవిత్వం.. అంటే అలంకారాలు, బింబాలు, ప్రతీకలు, మార్మిక వ్యక్తీకరణలు, నైరూప్య శబ్ద విన్యాసాలూ, శబ్దశిల్పమూ, అభివ్యక్తి శిల్పమూ వాక్యాన్ని రసాత్మకం చేస్తూనే నర్తించే నృత్య భంగిమల వంటి ముద్రలతో రూపుదిద్దుకుని అంతిమంగా విశిష్టమైన భావం, విశిష్టమైన భాష, వ్యక్తీకరణ తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు''.

కవిసేన ఆవిర్భవాన్ని ఒక చారిత్రక వైజ్ఞానిక ఉద్యమంగా అభివర్ణిస్తూ శేషేంద్రశర్మ తను లక్ష్యించిన యువకవులను ఉద్దేశ్యించి ''తమ్ముడూ నీ గొంతులో గంధకపు గనులు న్నాయి సుమా, నీవు చేసే ప్రతి పద్యమూ ఒక తుపాకీ, నీ పద్యం మోసే ప్రతి వాక్యమూ ఒక శతఘ్ని, నీకు తెలుసు... మొదటి నీటిబొట్టే సముద్రం కాదని. ఐతే సమూహిస్తున్న కవిసేన సముద్రాన్ని సృష్టించేవరకు నిద్రపోదని. నువ్వు ఒక్కో వాక్యశకలాన్ని ఒక్కో పిస్టల్‌లా పట్టుకుని నడవాలి యుద్ధంలో గమ్యాన్ని ముద్దాడేవరకు'' అని దిశానిర్దేశం చేశాడు స్పష్టంగా, అర్థవంతంగా ప్రతి కవిసేన సైనికున్నీ ఒక సత్యాగ్రహిగా సంబోధిస్తూ.

కవిసేన మానిఫెస్టోలో 'ఆశయాలు-నియమాల'ను పొందుపరుస్తూ శేషేంద్ర: ''కవిసేన ఒక కవుల పార్టీ, కవికి రాజకీయాలు కావాలేకాని రాజకీయ పార్టీలు కాదు'' అంటాడు. అసలు సామాజిక చైతన్యం అంటే ఏమిటి వంటి కీలక భావనలను విపులంగా బోధపరుస్తూ ''ఇప్పటి వర్తమాన సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో కవులు సంఘటితమై ఒక 'వైజ్ఞానిక నాయ కులశక్తి'గా కవిసేన రూపొందాలని ఆకాంక్షించాడు శేషేంద్ర. యువకవుల పైన అచంచలమైన విశ్వాసంతో 'కవిసేన మేనిఫెస్టో' గ్రంథాన్ని 'ఎవరు నా ఆశాకిరణ పుంజమో ఆ యువతరానికి' అంటూ అంకితం చేశాడు. ఒక ప్రత్యేక కవితరాన్ని సృష్టించాడు. వాళ్ళిప్పటికీ తమ స్వంత గొంతుతో, అస్తిత్వంతో తమదే ఐన మార్గంలో పయనిస్తూనే ఉన్నారు.

(నేడు శేషేంద్రశర్మ 15వ వర్ధంతి సందర్భంగా 'కవిసేనమేనిఫెస్టో' మూడవ ముద్రణ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా...)

రామా చంద్రమౌళి



Thursday, May 26, 2022

సిద్దవటం కోట

 



రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నేడు మండల కేంద్రమైన సిద్దవటంలో క్రీస్తుపూర్వం 30-40 సంవత్సరాల మధ్యకాలంలో రూపుదిద్దుకున్న ఈ కోట అలనాటి సంస్కృతీ సంప్రదాయాలు, శిల్పకళా సంపద, నాటి రాజుల రాజవైభోగానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఈ కోటను పురావస్తు శాఖ ఆధీనంలో ఉంచుకున్నా సరైన భద్రత లేక రోజురోజుకు కోట పడిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సిద్దవటం కోటను ఒకసారి పరిశీలిస్తే.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అలనాటి సంస్కృతీ సంప్రదాయాలు నేడు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. కడప నుంచి భాకరాపేట మీదుగా నెల్లూరుకు వెళ్లే రహదారిలో పెన్నానది ఒడ్డున సిద్దవటం కోట ఉంది. 36 ఎకరాల పైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. ఈ కోటకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కోటను మౌర్యులు, శాతవాహనులు, పూర్వపల్లవులు, గుప్తులు, తెలుగు చాణక్యులు, కంచిపల్లవులు, బాదామాచాణుక్యులు, రాష్ట్రకూటులు, రేణాతి చోళులు, బైదంబులు, విజయనగర చక్రవర్తులు, మట్లిరాజులు, గోల్కొండ నవాబులు, హైదర్‌అలీ, టిప్పుసుల్తాన్‌, మాయానా నవాబు, మొగళులు, మహారాష్ర్టులు, పాలేగాండ్లు పరిపాలించారు. అయితే వారి పరిపాలనకు సజీవ సాక్ష్యాలుగా శిల్పకళా సంపద, ఢంకానగర్‌, మొదటి మండపం, రెండవ మండపం, రాణిమహల్‌, కోనేరు, నిజాంనవాబు నిర్మించిన మసీదు, హైదర్‌ అలీ నిర్మించిన దర్గా, సొరంగమార్గాలు, కామాక్షీ గుడి, నంది విగ్రహం, రాణీస్నానపు తొట్టి వంటివి ఉన్నాయి.

పాలనకు కేంద్రం సిద్దవటం కోట

18 తరాల రాజవంశీయులు ఈ కోటను ఆధారంగా చేసుకుని పరిపాలన చేసినట్లు చరిత్ర చెబుతోంది. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తక సంఘం వరకు ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకు సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకు ఉన్న మట్టి కోట కాస్త రాతి కట్టడంగా మారింది. 1792 సంవత్సరంలో టిప్పు సుల్తాన్‌ నుంచి నైజాం నవాబుల పాలనలోకి, అనంతరం 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలో ఈ కోట పాలింపబడింది. బ్రిటీషు కాలంలో 1808 నుంచి 1812 వరకు కడప జిల్లా పరిపాలనా కేంద్రంగా భాసిల్లింది. దక్షిణం వైపు పెన్నానది, మిగిలిన మూడు వైపులా లోతైన అగడ్తలతో శత్రువులు ప్రవేశించడానికి వీలు కాని రీతిలో ఈ కోటను నిర్మించారు. మట్లిరాజులు ఈ కోటను పరిపాలించే నాటికి ఇది మట్టి కోట. అనంతరం శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరద రాజులు మొదట ఈ కోటను పాలించాడు. అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. అనంతరం మట్లిరాజుల పరిపాలనలోకి వచ్చింది. మట్లి రాజైన అనంతరాజు మట్లి కోటను శత్రు దుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లిరాజుల పతనం తరువాత ఔరంగజేబు సేనాని మీర్‌జుమ్లా సిద్దవటంను ఆక్రమించి పాలించాడు. ఆ తరువాత ఆర్కాటు నవాబులు సిద్దవటం కోటను స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్‌నభీఖాన్‌ 1714లో సిద్దవటంను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. 1799లో సిద్దవటం కోట ఈస్ట్‌ ఇండియా కంపెనీ వశమైంది. కోటకు పడమర, తూర్పున రెండు ముఖద్వారాలున్నాయి. ముఖద్వారానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్యభంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి.

పశ్చిమ ద్వారం లోపల పైభాగాన రాహుగ్రహం, పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణీదర్బార్‌, ఈద్గామసీదు, సమీపంలోని నగారా ఖానా, వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్దేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం, కామాక్షి ఆలయం ఉన్నాయి. టిప్పు సుల్తాన్‌ కాలంలో దర్గాను నిర్మించారు. దీని పక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోట గోడలో సొరంగ మార్గాన్ని ఏటిలోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏటిలో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు. మట్లిరాజులు అంతకు పూర్వం పరిపాలించిన రాజుల కాలంలో రత్నాలను రాసులుగా పోసి వజ్రవైడూర్యాలు, బంగారు నాణాలతో వ్యాపార లావాదేవీలు కొనసాగించే వారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో రాజులకు శిస్తురూపంలో ప్రజల నుంచి కూడా కొంత నగదును వజ్ర వైడూర్యాలు, బంగారు రూపంలో సేకరించి ఖజానాలను నింపుకునే వారు. ఎందరో రాజులు పాలించిన కోటలో కేంద్ర ఖజానా కారాగారంలో వజ్ర వైడూర్యాలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకోవడంతో కొందరు వీటిపై కన్నేసి సందర్శకుల రూపంలో తరచూ కోటలోని అంతర్భాగంలో తిరుగుతూ అన్వేషణలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దశలో కోట రక్షణపై సర్వత్రా నీలినీడలు కమ్ముకున్నాయి. పురాతన కట్టడాలను, ఆస్తులను దక్కించుకునేందుకు కేంద్ర పురావస్తు, పర్యాటక శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా స్థానికంగా కోటలో ఇప్పటికే కొన్ని అమూల్యమైన పురాతన కట్టడాలు కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయాయి. వీటిని పునరుద్ధరించే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించే కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. లేదంటే ఉన్న కట్టడాలు కూడా కూలిపోయే పరిస్థితి నెలకొంటుంది.

Tuesday, May 24, 2022

జై ఆంధ్ర

 1972 చివరలో ఉవ్వెత్తున లేచింది 1973 మొదట్లో ఆరిపోయింది. మొన్న ప్రత్యేక తెలంగాణఉద్యమం జోరుగా సాగుతన్నరోజుల్లో కొంతమంది కోస్తాంధ్ర నాయకులు విజయవాడలో సమావేశమైనపుడు '1972 తరహా ఉద్యమానికి ఆంధ్రలో ప్రయత్నాలు'అంటూ రాయడం మినహా ఈ ఉద్యమాన్ని ఎవరూ గుర్తు చేసుకున్న దాఖలా లేదు.

1969ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లబడినా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చింది. అవకాశం వచ్చినపుడల్లా తెలంగాణ నేతలు, విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణ అంటూ సభలు సమాశాలు, పాదయాత్రలు, రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తూ సాహిత్యం సృష్టిస్తూ ఆగ్గిరాజేస్తూ వచ్చారు.

2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పడి విజయవంతం కావడం వెనక ఇంత చరిత్ర ఉంది. కాని, జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకోలేదు.

ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఎంతోమంది రక్తం చిందించి నడిపించిన ఒక ఉద్యమం ఇలా లక్ష్యం, దిశ లేకుండా ఎలా సాగింది? ఎటు మాయమైంది? అమాయక విద్యార్థుల త్యాగం వృథా అయినట్లేనా?

ఒక దశలో విజయవాడ రాజధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా బీవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా కాకాని వెంకటరత్నం ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొంత కాలం నడించింది.

ఉద్యమ సమయంలో యువకులు చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల నుంచి పన్నులు కూడా వసూలు చేశారని 'టైమ్'మ్యాగజైన్ రాసింది. ఇంత స్థాయికి వెళ్లిన 'జై ఆంధ్ర'ఉద్యమం ఇప్పటికీ ఎవరికీ అర్థంకాని ప్రశ్న.

ఈ ఉద్యమం లక్ష్యం ఫలానా అని, ఈ ఉద్యమానికి ప్రోద్బలం ఇదీ అని ఎవరూ చెప్పలేరు. జై ఆంధ్రా నినాదం సాధించిందేమిటో కూడా అర్థం కాదు.

ఉద్యమంలో రాయలసీమ వాళ్లు కూడా పాల్గొన్నా, ప్రధానంగా కోస్తా జిల్లాల ఉద్యమంగా, భూస్వాముల మద్దతుతో సాగిన ఆందోళనగా పేరు పడింది.

కోస్తా కమ్మ తదితర కులాల భూస్వాములు ఒక లక్ష్యంతో ఉద్యమంలోపాల్గొంటే, రాయలసీమ రెడ్డి నేతలు మరొక ధ్యేయంతో పాల్గొన్నారు.

ఉద్యమానికి ఊపిరిపోసిన విద్యార్థులు ఒక లక్ష్యం తోపాల్గొన్నారు. ఎన్జీవోలు మరొక లక్ష్యంలో రంగంలోకి దూకారు. పైకి మాత్రం 1918 లో నిజాం తీసుకువచ్చిన ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంగా ప్రచారమైంది.

ఉన్నత కులాల మధ్య సాగుతున్న పవర్ స్ట్రగుల్ లోకి అశేష ప్రజానీకాన్నిలాగేందుకు ముల్కీ రూల్స్ బాగా పనికొచ్చాయి.

ఈ నియమాలు అమలు చేస్తే ఆంధ్రులకు ఉద్యోగాలుండవు, హైదరాబాద్ లో ఉద్యోగాలన్నీ ముల్కీ పేరుతో తెలంగాణ వాళ్లు అందుకుంటారని భయాందోళన సృష్టించడంలో నేతలు విజయంతమయ్యారు.

ఇలా ఉద్యోగావకాశాల డిమాండ్ తో మొదలైన ఉద్యమ నినాదం నెల రోజల్లోనే ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా మారిపోయింది. మరో నెలరోజుల్లో ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు.

పేరుకు జై ఆంధ్ర ఉద్యమమే అయినా, ప్రత్యేక రాష్ట్రం నాటి నేతల నిజమైన డిమాండ్ కాదు. ఆ డిమాండ్ మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది. అందుకేనేమో మళ్లీ ఎపుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం రానేలేదు.

ఆ ఉద్యమం ఎవరికీ స్ఫూర్తిగా కాకుండా మరుగునపడిపోయింది.

జై ఆంధ్ర ఉద్యమం ఏమిటి?

రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించిన రెడ్లను మెల్లిగా పక్కకు తప్పించే క్రమంలో ఇందిరాగాంధీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం వచ్చిందని డ్యాగ్మర్ బెర్న్ స్టార్ఫ్ వంటి రాజనీతి శాస్త్ర పండితులు కొందరుచెబుతారు.

కాదు, అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు రాష్ట్రంలో తీసుకువస్తున్న భూసంస్కరణలకు వ్యతిరేకంగా కోస్తా భూస్వాములు, జమీందారులు లేవనెత్తిన ఉద్యమం అని హ్యూ గ్రే వంటి మరికొందరు చెబుతారు.

ఆంధ్రా ప్రాంత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని తప్పించేందుకు తెలంగాణ నేతలు ఉద్యమం చేసినట్లు, తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి పీవీని తప్పించేందుకు ఆంధ్రా నేతలు సాగించిన ఉద్యమం అని కొందరు చెబుతారు.

ఇంకొందరేమో ఇది తెలంగాణ వ్యతిరేక ఉద్యమమని, సమైక్యవాది అయిన ప్రధాని ఇందిరా గాంధీ భవిష్యత్తులో ఎపుడూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను అంగీకరించకుండా ఉండేందుకు ఆంధ్రావాళ్లు ఆమెకు ఇచ్చిన వార్నింగే ఈ ఉద్యమం అనే వాళ్లు అన్నారు.

జై ఆంధ్ర ఉద్యమానికి ఇవన్నీ కారణాలే అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ అంటున్నారు.

అయితే, ఈ ఉద్యమం, ఏవో కొన్ని రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకుని ప్రధాన డిమాండ్ అయిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ విషయంలో ఫెయిలందని అందరికీ తెలుసు.

జై ఆంధ్ర ఉద్యమం ఎలా మొదలైంది?

1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ నేత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు శాఖమంత్రి అయ్యారు.

అయితే, ఎన్నికల ప్రచారంలో ఒక మసీదులో ప్రసంగించి చెన్నారెడ్డి మతభావాలు రెచ్చగొట్టారని ఆర్యసమాజ్ అభ్యర్థి వందేమాతరం రామచంద్రారావు ఎన్నికల పిటిషన్ వేశారు.

అపుడు ఈ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. చెన్నారెడ్డి ఓడిపోయారు.

ఆరేళ్లు రాజకీయ అనర్హత శిక్ష పడింది. అంతే, ఆయన హైదరాబాద్ తిరిగొచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. ఇది ఆంధ్రా వ్యతిరేక ఉద్యమం అయింది. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వచ్చి తమ అవకాశాలు దెబ్బతీస్తున్నారని చెబుతూ ఉద్యోగులు ఉద్యమంలోకి దిగారు.

ఉద్యమం 1971 వరకు ఉధృతంగా సాగింది. ఆయన తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) పార్టీ పెట్టి 10 లోక్ సభ స్థానాలను గెల్చుకున్నారు.

చివరకు చెన్నారెడ్డి సమర్పించిన ఆరు డిమాండ్లకు ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి మౌఖికంగా అంగీకరించడంతో ఉద్యమం చల్లారింది. టీపీఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

ఆయన సమర్పించిన డిమాండ్లలో ఆంధ్రా నాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఒకటి.

కాంగ్రెస్ లోని ఆంధ్రా, తెలంగాణ రెడ్ల తగవులతో సతమతకావడం ఇష్టంలేని ఇందిరగాంధీ ఈ ఉద్యమం ఆసరా చేసుకుని రెడ్ల పట్టు నుంచి కాంగ్రెస్ ను బయటకు లాగాలని భావించి బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా ఎలాంటి ముఠా మరకల్లేని పీవీ నరసింహారావును నియమించారు. ఆంధ్రా రెడ్లకు ఇది నచ్చలేదు.

అయినా సరే,హైకమాండ్ మీద తిరగబడటం ఇష్టం లేక కోపం దిగుమింగుకుంటూ వచ్చారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక, ఇందిరా గాంధీ తాత్కాలిక సీఎం నరసింహారావునే ముఖ్యమంత్రిగా కొనసాగించారు.

ఈ సమయంలో పీవీ నరసింహారావు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం అమలు చేయాలనుకుంటున్నారు.

"ఇది కొంచెం పేదలకు అనుకూలమైంది. ఇందులో భూసంస్కరణలనేది ఒక ముఖ్యమయిన అంశం. భూస్వాముల నుంచి సీలింగ్ పేరుతో భూములను స్వాధీనం చేసుకోవడం దీని ఉద్దేశం. దీనిని దృష్టిలో పెట్టుకుని 1972 మే 2న ఒక అర్డినెన్స్ తో నరసింహారావు రాష్ట్రంలో భూలావాదేవీలన్నింటిని రద్దు చేశారు. సెప్టెంబర్ 15న భూసంస్కరణల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించారు. ఈ రెండు చర్యలు కోస్తాంధ్ర భూస్వాములకు నచ్చలేదు. ఈ వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది" అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

అయితే, మరొక పరిశోధకుడు ప్రొఫెసర్ కేసీ సూరి కోస్తాంధ్ర భూస్వాముల ప్రోద్బలంతో సాగిన ఉద్యమం అనే వాదనతో ఏకీభవించ లేదు.

ఈ వాదనను నిరూపించలేమని చెబుతూ, బహశా విద్యార్థుల, ఉద్యోగుల మనోభావాలు కూడా దీనికి అదనంగా తోడై ఉండవచ్చని ఆయన 'ఆంధ్ర ప్రదేశ్:పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ రీజినలిజం. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఇన్ ఇండియా' అనే వర్కింగ్ పేపర్ లో రాశారు.

బ్రహ్మానంద రెడ్డి తొలగింపు, నరసింహారావు భూసంస్కరణలకు ప్రజల్లో తెలంగాణ మీద వస్తున్న వ్యతిరేకత కూడా తోడయ్యింది .

"1969 తర్వాత తెలంగాణలో ఆంధ్రా వాళ్లను వేధించడం ఎక్కువయింది. చాలామంది తెలంగాణ వదలి ఆంధ్ర వచ్చారు. వాళ్లంత రకరకాల వేధింపుల కథలను మోసుకొచ్చారు. ఆంధ్రులకు తెలంగాణలో ఉనికి లేదు, హైదరాబాద్ లో ఉద్యోగాలు రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుంది. 1969 ఉద్యమం తర్వాత నిధులన్నీతెలంగాణకే వెళ్తున్నాయి. ఆంధ్రులకు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు లేదు "అనే విషయాలు బాగా ప్రచారమై ప్రజల్లో తెలంగాణ వ్యతిరేకత పెరిగి ఆందోళనలకు నిప్పు రాజేశాయని హరగోపాల్ అన్నారు.

దానికి తోడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.1972 సెప్టెంబర్ నాటికి ఇది రాష్ట్ర రాజకీయ, వాతావరణ పరిస్థితి.

ఇదే సమయంలో సుప్రీంకోర్టు ముల్కీ నియమాల మీద హైకోర్టు తీర్పును కొట్టి వేస్తూ ఈ నియమాలను తెలంగాణలో అమలు చేయడాన్ని సమర్థిస్తూ, 1972 అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. ఆంధ్రలో విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది ఆగ్రహం తెప్పించింది.

సమైక్యాంధ్ర కావాలనుకుంటే ముల్కీ రూల్స్ ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. భారతీయ జనసంఘ్, స్వతంత్ర పార్టీలు ఈ డిమాండ్ ను సమర్థించాయి.

కాంగ్రెస్ లో హైకమాండ్ మీద గుర్రుగా ఉన్నవాళ్లు కూడా వీళ్లతో చేతులు కలిపారు. పీవీ నరసింహారావు భూ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవాళ్లు వీళ్లకు తోడయ్యారు.

దీనితో కాంగ్రెస్ లో కూడా ఆంధ్ర, తెలంగాణ విభేదాలు తీవ్రమయ్యాయి.

అక్టోబర్ 25న ఏలూరులో ఒక సభలోప్రసంగిస్తూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయక తప్పదని ముఖ్యమంత్రి ప్రకటించడం తీవ్ర అసంతృప్తిని రాజేసింది.

అంతే, విద్యార్థులు ఈ సమావేశం తర్వాత ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ల డిమాండ్ కేవలం కేవలం 'ముల్కీ రూల్స్ రద్దుచేయాలి,' అని మాత్రమే.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ కేవలం జనసంఘ్, స్వతంత్ర పార్టీలు మాత్రమే చేస్తూ వస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులలో విజయవాడలో తొలి కోస్తాంధ్ర నిరసన సభ జరిగింది.

తెలంగాణ విషయంలో అసంతృప్తి

లాయర్లు ఆంధ్రా ప్రాంతంలో హైకోర్టు కావాలన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ని ఆసుపత్రులకు నిధులీయడంలేదని, హైదరాబాద్ ఆసుపత్రుల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తున్నారని, తమకు ఉన్న రెండేళ్ల ప్రొబేషన్ తెలంగాణలో లేదని, ఇది వివక్ష అని డాక్టర్లు అన్నారు.

మునిసిపల్ టాక్స్ విషయంలో కూడా వివక్ష ఉందని కౌన్సిలర్లు చెప్పారు. నిధుల పంపకం మీద గణాంకాలతో సహా వివరాలు బయటకు వచ్చాయి.

సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర మునిగిపోతున్నదన్న భావన బలపడింది. ఆంధ్ర సెటిలర్స్ భూములను తెలంగాణలో గుంజుకుంటారనే ప్రచారం మొదలయింది. ఈ ప్రచారాలతో రాష్ట్రమంతా ఆందోళనలు మొదలయ్యాయి.

ఇందిరా గాంధీ రాజీసూత్రం

నవంబర్ 21న ఆందోళనకారుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఒంగోలులో 9 మంది, ఆదోనిలో ఇద్దరు, తెనాలిలో ఆరుగురు చనిపోయారు. నవంబర్ 27న ప్రధాని ఇందిరాగాంధీ అయిదు సూత్రాల రాజీ పథకం ప్రకటించారు.

ముల్కీ నియమాలను కేవలం నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకే వర్తింప చేస్తామని, హైదరాబాద్ పోలీస్ శాఖలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఉంటుందనేవి కూడా ఇందులో ఉన్నాయి.

ఇది కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు ఆంధ్రా నేతలు భావించారు.

ఇందిరా గాంధీ జోక్యంతో ఆంధ్రా కాంగ్రెస్ నేతలు కొంచెం దిగి వచ్చినా, ఆంధ్రా ఎన్జీవోలు మాట వినలేదు. నవంబర్ 30న వారు ప్రధాని రాజీసూత్రాన్ని తిరస్కరించారు. ముల్కీ రూల్స్ ని రద్దు చేయాల్సిందే అన్నారు.

అటువైపు తెలంగాణ ఎన్జీవోలు కూడా ప్రతిపాదనలను తిరస్కరించి ముల్కీ రూల్స్ ని పూర్తిగా అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. పరిస్థితి ఉద్రిక్తమయింది. డిసెంబర్ 7న ఆంధ్రా ఎన్జీవోలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

ప్రధాని రాజీ సూత్రానికి చట్టబద్ధత కల్పించే విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి బీవీ సుబ్బారెడ్డి, వ్యవసాయ మంత్రి కాకాని వెంకటరత్నం, మరొక ఏడుగురు మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రత్యేకాంధ్ర డిమాండ్ పుట్టుక

జై ఆంధ్ర ఉద్యమంలో 1972 డిసెంబర్ 10 అంత్యంత కీలకమయిన తేదీ. ముల్కీ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా మారింది ఈ తేదీనే.

ఆ రోజున విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, జనసంఘ్, స్వతంత్రపార్టీ , తెన్నేటి విశ్వనాథం వంటి ఇండిపెండెంటు సభ్యులు కూడా సభకు వచ్చారు.ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తొలిసారి బయటపడింది ఇక్కడే.

చాలా స్పష్టంగా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ సభలో తీర్మానం చేశారు. స్వతంత్ర పార్టీ నేత గౌతు లచ్చన్న తయారు చేసిన ప్రత్యేకాంధ్ర రాష్ట్ర పతాకాన్ని ఎగుర వేశారు.

పసుపుపచ్చ నేపథ్యంలో తెల్లటి ఆంధ్ర మ్యాప్ తో ఈ జెండా రూపొందించారు. దీనితో ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.

లచ్చన్న జెండా ఇళ్ల మీద, కూడళ్లలోనే కాదు, ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా ఎగరేసేవారని, ఈ సమావేశం తర్వాతే, ఉద్యమం నాలుగు కోస్తా జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు విస్తరించిందని ఉద్యమాన్ని రికార్డు చేసిన హ్యూ గ్రే రాశారు.

అయితే, సీపీఐ, సీపీఎం తో పాటు, కాంగ్రెస్ లో ని ఒక వర్గం సమైక్యాంధ్రనే సమర్థిస్తూ వచ్చాయి. డిసెంబర్ 17న ఉపముఖ్యమంత్రి బీవీ సుబ్బారెడ్డి, వ్యవసాయమంత్రి కాకాని వెంకటరత్నం విజయవాడలోని ఒక బహిరంగ సభలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

డిసెంబర్ 19న పీవీ నరసింహారావు క్యాబినెట్ నుంచి 9 మంది ఆంధ్రా మంత్రులు రాజీనామా చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తప్ప మరొకటి తమకు సమ్మతి కాదని ప్రకటించారు.

అయితే, ఇందిరాగాంధీ మాత్రం తన సమైక్య ధోరణి మార్చుకోలేదు.

ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నా డిసెంబర్ 21న ప్రధాని రాజీ సూత్రాన్ని పొందుపరిచి రూపొందించిన మూల్కీ రూల్స్ బిల్లు లోక్ సభ లో పాసయింది. 233 మంది దీనిని సమర్థించారు. 40 మంది వ్యతిరేకించారు.

డిసెంబర్ 24 మరొక ముఖ్యమైన తేదీ. ఇది చాలా విషాదాన్ని నింపిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. ఆయన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అంతేకాదు 1972 ఎన్నికల్లో ఉయ్యూరు నుంచి కాకాని వెంకటరత్నం మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ రోజు ఏమి జరిగిందో వడ్డేశోభనాద్రీశ్వరరావు వివరించారు.

''సీపీఐ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఊరేగింపు జరిగింది. దీనిని అడ్డుకునేందుకు ప్రత్యేకాంధ్ర ఆందోళనకారులు ప్రయత్నించారు. ఘర్షణ జరిగింది. ఇళ్ల మీది నుంచి ప్రత్యేకాంధ్ర ఆందోళనకారులు సీసాలు రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. చివరకు కాల్పులు జరిపారు. ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఎవరో కాంగ్రెస్ మంత్రి సమైక్యాంధ్ర సభలో ప్రసంగించేందుకు ప్రత్యేక విమానంలో వస్తున్నారని వదంతి వ్యాపించింది. ఆ విమానం రాకుండా ఆందోళనాకరులు విజయవాడ ఎయిర్ పోర్టు రన్ వే మీద బైఠాయించారు'' అని వడ్డే శోభనాద్రీశ్వరరావు గుర్తు చేసుకున్నారు.

విజయవాడ రోడ్లన్నింటిని దిగ్భంధం చేశారు, ప్రత్యేకాంధ్ర సభ కొనసాగించాలని కాకాని వెంకటరత్నం ప్రయత్నించారు. కానీ, విఫలయ్యారు. డిసెంబర్ 25న కాకాని వెంకటరత్నం గుండెపోటుతో చనిపోయారు.

దీనికి కారణం, విజయవాడ పోలీసుల కాల్పులేనని, అమాయకులు ప్రాణాలు పోవడంతో ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, గుండెపోటు దీని ఫలితమేనని నాటి ఉద్యమంలో పాల్గొన్నశోభనాద్రీశ్వరరావు చెప్పారు.

కాకాని అంతిమయాత్రకు సుమారు నాలుగయిదు లక్షలమంది హాజరయ్యారని చెబుతూ, బాగా జనాదరణతోపాటు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్ననాయకుడు కాకాని అని శోభనాద్రీశ్వరరావు అన్నారు.

ఆయన నాయకత్వం కొనసాగి ఉంటే ఉద్యమం ప్రత్యేకాంధ్రను ఆ రోజే సాధించి ఉండేదేమోనని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

తర్వాత ఉద్యమ నాయకత్వం రాయలసీమ ప్రాంతానికి చెందిన బీవీ సుబ్బారెడ్డి తీసుకున్నారు. 1972 డిసెంబర్ 31న తిరుపతిలో 100 మంది ఆంధ్రా శాసన సభ్యులు సమావేశమై ఆంధ్రా బంద్ కి , పన్నుల నిరాకరణ కు పిలుపునిచ్చారు.

అప్పటికే ఉద్యమంలో సుమారు 34 మంది చనిపోయారు. 1973 జనవరి 2న మొదటి ఆంధ్రా బంద్ జరిగింది. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడే దాకా ఉద్యమం కొనసాగిస్తామని ఎన్జీవోలు ప్రకటించారు.

రాష్ట్ర కాంగ్రెస్ లో ఏమాత్రం మద్దతు లేని పీవీ నరసింహారావు ప్రతిచిన్న విషయానికి ప్రధాని సలహా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటూ ఉద్యమాన్ని అదుపు చేయలేక పోయారు.

జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ చేతికి పగ్గాలు వచ్చాయి.

ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జనవరి 23న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు పార్టీకీ రాజీనామా చేస్తూ బీవీ సుబ్బారెడ్డికి లేఖలు సమర్పించారు. ఫిబ్రవరి 5 లోపు రాష్ట్ర విభజన జరగాలని గడువు విధించారు.

మధ్యలోనే ఆగిపోయిన ఉద్యమం

ఉద్యమం ఇంత అల్టిమేటమ్ ఇచ్చే స్థాయికి ఎదిగి ఒక్కసారి నీరు కారడం మొదయింది. ఈ ఉద్యమానికి కేంద్రం ఏ మాత్రం జంకలేదు. జనవరి 24న ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్ర కాంగ్రెస్ నేతలను తీవ్రంగా తప్పు పట్టారు.

ఆ రోజు నుంచి మార్చి 25 దాకా కేంద్రం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో రాష్ట్ర విభజన చేసేది లేదని పునరుద్ఘాటిస్తూ వచ్చింది. ఫిబ్రవరి 25 కేంద్ర హోంమంత్రి కేసీ పంత్ రాష్ట్ర విభజన డిమాండ్ ను పార్లమెంటులో తోసిపుచ్చారు.

ఇలా కేంద్ర తిరస్కారాల మధ్య డిసెంబర్ 7 నుంచి మొదలుపెట్టిన తమ సమ్మెను (108రోజులు)ఆంధ్ర ఎన్జీవోలు మార్చి 25న విరమించుకున్నారు.

ప్రధాని ఇందిరా గాంధీతో, తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ సంపద్రింపులు మొదలయ్యాయి. ఉద్యమం ఆగిపోయింది. రాష్ట్రపతి పాలన మరొక ఆరు నెలలు కొనసాగించారు.

ఉద్యమానికి నిధుల కొరత ఎదురయింది. ఆందోళనాకారుల్లో అలసట వచ్చింది. కాంగ్రెస్ నేతలు చర్చల్లో మునిగి పోవడంతో ఉద్యమానికి నాయకత్వం లేకుండా పోయింది.

సీపీఐ, సీపీఎం మద్దతు లేకపోవడం ట్రేడ్ యూనియన్ల నుంచి సహకారం లేకుండా పోయింది.

చివరకు కేసీ పంత్ మరొక కొత్త ఫార్ములాతో ముందుకు వచ్చారు. ఉద్యోగులకు, ఉద్యోగాలకు భద్రతతో పాటు, ఇందులో కొత్త అంశం సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు మాత్రమే.

ప్రత్యేకాంధ్ర ప్రధాన డిమాండ్ మాయమైంది. ఉద్యమం చల్లారింది.

1973 డిసెంబర్ 10న 11 నెలల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. ఎవరికీ ఇష్టంలేని పీవీ నరసింహారావును తొలగించి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ను ఇందిరాగాంధీ నియమించారు.

పవర్ స్ట్రగుల్ ప్రజా ఉద్యమం ఎలా అయింది?

రాజకీయాధికారం కోసం, అస్థిత్వం కోసం సాగుతున్న జై ఆంధ్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు రెండు కారణాలున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర మాజీ ఆచార్యులు ప్రొ. కె.శ్రీనివాసులు అన్నారు.

"ముల్కీ నియమాల వల్ల పెద్దగా నష్టపోయేందుకు వీలులేదు. ఎందుకంటే అపుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలే తక్కువ. ఇవి కేవలం కింది స్థాయికే వర్తిస్తాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా విస్తరించలేదు. అయితే, 1918లో తయారైన ముల్కీరూల్స్ అని వాటిని భూతంగా చూపించారు. ఇదొక కారణమయితే, రెండోది రాష్ట్రంలో పెరుగుతున్న విద్యావంతుల సంఖ్య. ఆంధ్రప్రదేశ ఏర్పడిన తర్వాత కాలేజీల ఏర్పాటు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తయారు కావడం ఎక్కువయింది. వీళ్లకి ఉద్యోగాలు కావాలి. ఇది నిజమయిన సమస్య. ఈ నేపథ్యంలో ముల్కీ రూల్స్ ఉంటే అసలు ఉద్యోగాలు రావు, ప్రమోషన్లు కష్టమనే భయం సులభంగా సృష్టించారు. అందుకే విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు" అని ఆయన అన్నారు.

ఆ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉద్యమాన్ని ఎం. వెంకయ్య నాయుడు, రాయలసీమకు చెందిన ఆగస్టీన్ అగ్రభాగాన ఉండి నడిపించారు.

జై ఆంధ్రా ఉద్యమం పూర్తిగా పవర్ స్ట్రగుల్ మాత్రమేనని, వ్యవసాయంలో వచ్చిన మిగులుతో క్యాపిటలిస్టు వర్గంగా మారుతున్న కొన్ని సామాజిక వర్గాలు చేసిన ఆందోళన మాత్రమేనని ఆంధ్రవిశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్ కేఎస్ చలం అన్నారు.

"ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు అస్థిత్వం కోసం పోరాడతాయి. అస్థిత్వం రాజకీయాధికారం కోసం సాగుతుంది. నాటి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం,1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 తెలంగాణ ఉద్యమం లాగానే, జై ఆంధ్రా ఉద్యమం కూడా రెండు కులాలు తమ అస్థిత్వం, ఆపైన అధికారం కోసం నడిపించిన ఉద్యమాలు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం నడిచిన ఉద్యమం కాదు. దీనికి ఉద్యోగాలు, ముల్కీ వ్యతిరేకత అనే సమస్యను జోడించడంతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో త్యాగాలు చేసింది, ప్రాణాలు పొగొట్టుకున్నది వెనకబడి వర్గాల వాళ్లు, లబ్ధి పొందింది భూములున్నకులాల వాళ్లు" అని ప్రొఫెసర్ చలం అన్నారు.

ప్రొఫెసర్ చలం కూడా ఉద్యమం కాలంలోఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉన్నారు. అయితే, ఉద్యమంలో భాగంగా ఉంటూనే ఆయన ఉత్తరాంధ్ర వేదిక ఏర్పాటు చేసి ఈ ప్రాంత హక్కుల కోసం క్యాంపెయిన్ చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ ఇ.వెంకటేశు దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఉద్యమకాలం నాటికి ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు పెట్టుబడులు రావడం ఇంకా ఊపందుకోలేదు.. జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా కొనసాగించి, రాష్ట్ర విభజన సాధించి ఉంటే హైదరాబాద్ లో ఆంధ్రుల పెట్టుబడి కేంద్రీకృతమై ఉండేది. అది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడి ఉండేది. అలా కాకుండా ఉద్యమానికి నాయకత్వం వహించిన కులాలు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం మీద శ్రద్ధ చూపించి కేంద్రంతో బేరసారాలడాయి. బేరం కుదరగానే ఉద్యమాన్ని ఆపేశాయి. అందుకే ఉద్యమంలోపాల్గొన్న అశేష ప్రజానీకానికి ప్రయోజనమేమీ కలగ లేదు," అని ప్రొఫెసర్ వెంకటేశు అన్నారు.




Monday, May 16, 2022

తమిళనాడుకు చెందిన దైవసహాయానికి మహిమాన్విత హోదా ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

 తమిళనాడుకు చెందిన దైవసహాయానికి మహిమాన్విత హోదా ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

వాటికన్‌ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా) లభించింది


వాటికన్‌ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్‌ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్‌ 23న కేరళలోని ట్రావెంకోర్‌ రాజ్యంలో హిందూ నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు.

ట్రావెంకోర్‌ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్‌ బిషప్స్‌ సమాఖ్య పోప్‌ ఫ్రాన్సిస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్‌ గుర్తించినట్టు వెల్లడించారు

Friday, May 13, 2022

కాటన్ దొర

 నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం.. ":

(మాకు


ఈ నేలే కాదు.. ఆయన నడిచిన ప్రతిచోటా నీరు పారింది. కన్నీరు మాయమైంది. రైళ్లపై కాదు.. నీళ్లపై ఖర్చు చేయండని బ్రిటిష్‌ ప్రభుత్వంతోనే పోరాడిన అరుదైన ఆంగ్లేయుడు.. 123 సంవత్సరాల కిందే కన్నుమూసినా.. నేటికీ కోట్ల మంది జీవితాల్లో జీవనదిలా పారుతున్న అపర భగీరథుడు, డెల్టాశిల్పి.. దార్శనికుడు.. సర్‌ ఆర్థర్‌ కాటన్‌!

Sir Arthur Cotton: 11 మంది సంతానంలో పదోవాడిగా 1803 మే 15న జన్మించిన ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఇంజినీర్‌గా ఎదిగి.. 1821లో భారత్‌కు వచ్చారు. మద్రాసు రాష్ట్ర చీఫ్‌ ఇంజినీర్‌ వద్ద అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా చేరారు. ఆంగ్లో-బర్మా యుద్ధం తర్వాత 1828 నాటికి కెప్టెన్‌గా ఎదిగిన కాటన్‌కు నీటిపారుదల బాధ్యతలు అప్పగించారు. చోళ రాజులు చేపట్టిన పనుల స్ఫూర్తితో కావేరీ నదిపై పలు ఆనకట్టలు కట్టి.. కరవు కాటకాలతో అల్లాడుతున్న తంజావూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చేశారాయన. తిండికి అలమటించే తంజావూరు కాస్తా.. మద్రాసు రాష్ట్రంలో అత్యధిక పంట పండించే ప్రాంతంగానే కాదు.. యావత్‌ భారత్‌లోనే ఎక్కువ ఆదాయం ఇచ్చే జిల్లాగా మారింది.

అరకొర సదుపాయాలతోనే..: ధవళేశ్వరం ప్రాజెక్టుకు ముందు ఆంధ్రాలోని గోదావరి జిల్లా పరిస్థితి దారుణంగా ఉండేది. అతివృష్టి అనావృష్టితో అల్లాడేది. ఈ పరిస్థితి మార్చేలా.. గోదావరిపై బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు కాటన్‌. అనుమతైతే వచ్చిందిగాని.. అడిగినన్నీ ఇవ్వలేదు. ఆరుగురు ఇంజినీర్లు, 8 మంది జూనియర్లు, 2వేల మంది మేస్త్రీలను అడిగితే.. ఒక యువ ఇంజినీరును, ఇద్దరు సర్వేయర్లను, కొంతమంది మేస్త్రీలను అప్పగించి చేయమన్నారు. పట్టుదలతో ఆ కొద్దిమందితోనే రంగంలోకి దిగారు కాటన్‌. 1847లో పనిమొదలైంది. మరుసటి ఏడాదే.. అనారోగ్య కారణాలతో ఆయన ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. కలత చెందుతూనే తన కలల ప్రాజెక్టును విడిచి వెళ్లిన ఆయన.. రెండేళ్లలో తిరిగి వచ్చారు. కర్నల్‌ స్థాయికి పదోన్నతి పొంది.. రేయింబవళ్లు తన ఇంటిపనిలా పర్యవేక్షించారు.

సర్​ ఆర్థర్​ కాటన్

పాము కాటుతో కుమార్తె మరణించినా కుంగిపోకుండా.. బ్యారేజి పని ఆగకుండా జాగ్రత్తపడ్డారు. స్థానికంగా లభ్యమయ్యే సామగ్రినే వాడుతూ 1852కల్లా బ్యారేజిని నిర్మించారు. అనుకున్నదానికంటే తక్కువ ఖర్చులోనే పూర్తి చేసి చూపించారు. 370 మైళ్ల మేర కాలువలతో 3.6లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. గోదావరి ప్రాంత రూపురేఖలను, జీవితాలను మార్చేశారు. ధవళేశ్వరం తర్వాత.. కృష్ణా నదిపై దృష్టిసారించారు. 1855కల్లా ప్రకాశం బ్యారేజి పూర్తి చేశారు. 1858లో భారత్‌లోని అన్ని నదుల అనుసంధానానికి ప్రతిపాదించారు. కలకత్తా నుంచి కరాచీ దాకా.. ఇండస్‌ నుంచి నీలగిరుల దాకా నదులు, కాలువలను కలపాలనుకున్నారు. తాగునీరు, సాగునీటి సమస్యలతో పాటు.. జల రవాణా వ్యవస్థ కూడా ఎంతో లాభదాయకమవుతుందని కాటన్‌ ఆకాంక్షించారు.

రైల్వేలతో పాటు.. నీటి వసతికి, నీటి వనరులకు భారత్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాటన్‌ ఆంగ్లేయ సర్కారుతో పోరాడారు. "భారత్‌కు స్టీల్‌ కాదు నీళ్లనివ్వండి.." అంటూ వాదించారు. ఆయన తీరు నచ్చని ఆంగ్లేయ అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇక్కడి నుంచి పంపించేయాలని విఫలయత్నాలు చేశారు. కాటన్‌ బుర్రలో నీరు తప్ప మరేమీ లేదని వేళాకోళం చేశారు. చివరకు.. అభిశంసననూ కాటన్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. 1878లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ విచారణ కమిటీ ముందు హాజరై 900 ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానమిచ్చారు.




1860లో పదవీవిరమణ చేసి ఇంగ్లాండ్‌ వెళ్లిన కాటన్‌ను 1861లో బ్రిటిష్‌ రాణి నైట్‌హుడ్‌తో సత్కరించింది. 1877లో సంభవించిన కరవు గురించి విన్న కాటన్‌... "భారత ప్రాధాన్యాలను గుర్తించటంలో మన (ఆంగ్లేయ) సర్కారు ఘోరంగా విఫలమైంది. కోట్ల మంది తిండికి చస్తుంటే.. కోట్లు ఖర్చు చేస్తూ రైల్వే లైన్లు వేస్తున్నాం. లక్షల మంది మరణం.. నాగరికులం అనుకొనే మన దేశానికే తలవంపు" అని ఆక్షేపించారు. ఆయన సిఫార్సు మేరకే.. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ)ని ఆంగ్లేయ సర్కారు ఆరంభించింది.

భారత్‌ను విడిచి వెళ్లాక.. 84 ఏళ్ల వయసులో కాటన్‌ కొత్త ప్రాజెక్టు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కరవుకాటకాలు పోవాలంటే.. వ్యవసాయ విధానాలు మారాలని భావించారు. తన తోటనే ప్రయోగశాలగా చేసుకొని వ్యవసాయం, ఉద్యాన పంటలపైనా పరిశోధనలు చేశారు. ఉత్తరాల ద్వారా భారతీయ రైతులకు సూచనలిచ్చేవారు. తన పరిశోధన సాగుతుండగానే.. 96వ ఏట 1899లో కన్ను మూశారు కాటన్‌. ఒకవైపు ఆంగ్లేయులు భారత్‌ను అన్ని విధాలుగా లూటీ చేస్తుంటే.. భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపాలని తపించిన మహనీయుడు.. భారతావని ఆత్మీయుడు కాటన్‌!

ఇదీ చదవండి: భారత రైల్వేపై బ్రిటిష్​ పెత్తనం.. అధికారాలన్నీ వారివే!





ఉయ్యాలవాడ

 ఉయ్యాలవాడ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అంటూ వెతకడం మొదలుపెట్టారు. మనకు తెలియని ఓ ఉద్యమకారుడి గురించి తెలుసుకునేలా సైరా సినిమా ప్రభావం అందరిపై పడింది. కొందరు అతనే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు అంటారు.. మరికొందరు తమకు దక్కాల్సిన రాజాభరణాల విషయంలో జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసిన పాలెగాళ్ల నాయకుడు మాత్రమే అంటారు. అయితే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అతను బ్రిటీష్‌ వాళ్లను ఎందుకు ఎదిరించాడు?


ఉయ్యాల వాడ చరిత్ర దాదాపు 150 ఏళ్ల క్రితం నాటిది. 18వ శతాబ్ధంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది. ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవాడ కూడా ఒకరు. దాదాపు 80 మంది పాలెగాళ్లు నిజాం నవాబు బ్రిటిషు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేశారు. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ కాపు పెదమల్లారెడ్డి రెండో భార్య. ఆమె తండ్రి కూడా జమిందారే. పేరు జయరామిరెడ్డి. అతనికి కొడుకులు లేకపోవడంతో మనవడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. జయరామిరెడ్డి మరణం తరువాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అతడి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే చాలా అవమానించి పంపాడు తహసీల్దార్. ఆ అవమానం నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను పెంచింది.

బ్రిటీష్‌ వాళ్లపై ఉయ్యాలవాడ పోరాటం

తనతో కలిసి వచ్చిన ఇతర పాలెగాళ్లను కూడగట్టుకుని.., 500 బోయసైన్యమంతో కలిసి బ్రిటిష్ ట్రెజరీపై 1846 జులై 10న దాడి చేశారు. ఆ ట్రెజరీ కోయిలకుంట్లలో ఉంది. అక్కడున్న తహసీల్దారును కూడా చంపేశారు. దీంతో బ్రిటిష్ సైన్యం అతనిని వెతకడం మొదలుపెట్టింది. అతడిని పట్టుకున్న వారికి భారీ బహుమతులు కూడా ప్రకటించారు. నరసింహారెడ్డి మరింత సైన్యాన్ని సమకూర్చుకుని గిద్దలూరు వద్ద కెప్టెన్ వాట్సన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చాలా మేరకు సైన్యాన్ని నష్టపోయారు నరసింహారెడ్డి.

1846 అక్టోబర్‌లో నల్లమల కొండల్లో ఉన్న జగన్నాథ ఆలయంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఉండగా బ్రిటిష్ సైన్యం అతడిని బంధించింది. అతడితో పాటూ కొన్ని వందల మందిని పట్టుకుంది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్ష వేశారు. వేలమందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై బందిపోటు దొంగగా ముద్ర వేసింది బ్రిటిషు ప్రభుత్వం. బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఉయ్యాలవాడ తిరుగుబాటు చేశారని, హత్యలు, దోపిడిలకు పాల్పడ్డాడని, అతడో దోపిడి దొంగ అని బ్రిటిష్ కమిషనర్ తీర్పునిచ్చారు. అతనికి ఉరిశిక్ష వేస్తున్నట్టు ప్రకటించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో కోవెలకుంట్ల సమీపంలో ఉన్న జుర్రేరు ఒడ్డున ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీశారు. అతడి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. అంతే కాకుండా నరసింహారెడ్డితో పాటు పట్టుబడిన వందల మందిపై కేసు పెట్టారు. వీరిలో కొంతమందికి జైలు శిక్ష వేయగా.. మరికొందికి ద్వీపాంతర శిక్ష పడింది.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు!

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ సంఘటనకు పదేళ్ల ముందే ఓ వీరుడు తెల్ల దొరలపై ఎర్ర జెండా ఎగురువేశాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. ఆయన 170వ వర్థంతి సందర్భంగా 2017లో ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి వందల కొద్దీ సైన్యాన్ని సమకూర్చాడు. అతడు బ్రిటిషు సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొలేకపోవచ్చు, ఏడాది కూడా తన పోరాటాన్ని కొనసాగించలేక ప్రాణాలు విడిచి ఉండొచ్చు... కానీ అతని పోరాటం ఎంతో మందిలో ఉద్యమ స్పూర్తిని నింపింది. వేల మంది స్వాతంత్ర్య ఉద్యమం పట్ల అడుగులేసేలా చేసింది.

Friday, May 6, 2022

అల్లూరి

 అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే ఒక ఉత్తేజం కలుగుతుంది. ప్రతీ తెలుగువాడిలో ఆ స్థాయి ముద్ర వేశారాయన. ఆయన సాగించిన మన్య ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.



అలాంటి వాటిలో ఇదిగో ఈ బ్రిటీష్ అధికారులకు సంబంధించిన రెండు సమాధులు కూడా ఉన్నాయి.

దోపిడీకి గురవుతున్న గిరిజనులకు అండగా ఉద్యమం మొదలు పెట్టిన అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 22న మొదటిసారిగా చింతపల్లి, ఆ తరువాత 23, 24 తారీఖుల్లో కృష్ణ దేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లపై దాడిచేసి రిజిస్టర్‌లో సంతకాలు చేసి మరీ ఆయుధాలను పట్టుకెళ్ళాడు. వాటిలో 26 తుపాకులు, 2500 తూటాలు ఉన్నాయి. ఇది బ్రిటీష్ ప్రభుత్వం కలలో కూడా ఊహించనిది.

బ్రిటీష్ కాలంలో పోలీస్ స్టేషన్‌లను చూస్తేనే సామాన్య జనం అందునా గిరిజన ప్రాంతాల్లో ఉండేవారు వణికిపోయేవారు. అలాంటిది ఏకంగా పోలీస్ సిటీషన్‌పై దాడి అనేది బ్రిటీష్ అధికారులు సహించలేకపోయారు. ఎలాగైనా అల్లూరి సీతారామరాజుని అణచి వెయ్యాలని అనుకున్నారు. అటవీ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు.

అల్లూరు సీతారామరాజుని వెతికే క్రమంలో 1922 సెప్టెంబర్ 3 న బ్రిటీష్ పోలీసులకు, అల్లూరి దళానికి మధ్య చిన్నయుద్ధం జరిగింది. దానిలో అల్లూరి సీతారామరాజు సైన్యం విజయం సాధించగా ఒక బ్రిటీష్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇది బ్రిటీష్ సైన్యం ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించింది. రామరాజు పేరు మన్యం ప్రాతంలో మారుమోగిపోయింది. మరింత పట్టుదలకుపోయిన బ్రిటీష్‌ సైనం ఎలాగైనా అల్లూరిని మట్టు బెట్టాలని భావించిన షికారీగా పేరున్న్ క్రిస్టఫర్ విలియం స్కాట్ కోవర్డ్, లియోనెల్ నివెల్లే హైటర్ అనే ఇద్దరు అధికారులను రంగంలోకి దింపింది.

షికారీ అంటే మృగాల వేటగాడు కాదు.. మనుషుల వేటగాడు

వీరిలో స్కాట్ కోవర్డ్‌ను షికారీగా పిలవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. సాధారణంగా వేటగాళ్లను షికారీలని పిలుస్తారు. కానీ బ్రిటీష్ సైన్యంలో తమ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వేటాడే వాళ్లను షికారీలని పిలిచేవారు. అల్లూరి ఉద్యమం కంటే ముందే జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిపిన జనరల్ డయ్యర్‌ను కూడా ఆంగ్లేయులు షికారీ అని పిలుచుకున్నారు.

అల్లూరి కథలోకి వస్తే స్కాట్ కోవర్డ్ 1895 29 మేలో జన్మించాడు. సైన్యంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు అనే పేరున్న స్కాట్ ను అల్లూరి సీతా రామరాజును చంపడం కోసం అసిస్టెంట్ సూపరెండెంట్ హోదాలో నియమించారు. 1914 నుంచి 1920 వరకూ బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన హైటర్‌ను కూడా అదే హోదాలో ప్రత్యేకంగా పిలిపించారు. ఆయన 11 సెప్టెంబర్ 1896 లో జన్మించాడు . వీళ్లిద్దరికీ అప్పజెప్పిన టాస్క్ ఒకటే అల్లూరి సీతా రామరాజును చంపడం.

అల్లూరి ఆచూకీ కోసం మొదలైన వేట :

అల్లూరి సీతారామరాజును ఎలాగైనా మట్టుబెట్టాలనే తమ ఆశయం కోసం ఈ ఇద్దరు అధికారులూ స్థానిక గిరిజనులను ప్రశ్నించడం , వేధించడం మొదలుపెట్టారు. అటవీప్రాంతం మొత్తం జల్లెడపట్టారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో అల్లూరి ఆచూకీ కోసం స్థానికులపై ఒత్తిడి పెంచారు. అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటించారు.

మొదలైన వ్యూహాలు :

ఎలాగైనా సరే అల్లూరి సీతారామరాజుని పట్టుకోవాలన్న ఈ ఇద్దరు అధికారులు రామరాజు ఉద్యమం పట్ల సానుభూతిపరులపై కన్నేశారు. వాళ్ళ నుంచి రాబట్టిన సమాచారంతో గూడెం కొండల ప్రాంతంలో సీతారామరాజు ఉన్నాడని ఆయన్ను చంపడానికి బయలుదేరి వెళ్లారు. 1922 సెప్టెంబర్ 24న ఎటాక్ ప్లాన్ చేశారు. దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న అల్లూరి సీతారామరాజు దళం దానికి ప్రతివ్యూహంతో రెడీగా ఉన్నారు.

అల్లూరి సీతారామరాజును మట్టుబెట్టాలని ఉత్సాహంగా బయల్దేరి వెళ్తున్న బ్రిటీష్ సైన్యానికి అనుకోని విధంగా అల్లూరి దళం ఎదురు తిరిగింది. దామనపల్లి ఘాట్ వద్దకు బ్రిటీష్ సైన్యం చేరుకోగానే మెరుపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తుపాకులూ, సైన్యం వెంట ఉన్నా స్కాట్‌ సైన్యం ఏం చేయలేకపోయింది. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపుల ఎత్తైన ప్రాంతాల్లో దాక్కొని దాడి మొదలు పెట్టింది అల్లూరి సైన్యం. దీంతో స్కాట్,హైటర్‌ అల్లూరి దళాన్ని ఏమీ చేయలేకపోయారు.

తీవ్రంగా పోరాడిన స్కాట్,హైటర్ యుద్ధ భూమిలో కన్నుమూశారు. ఇద్దరి తల్లోకి తూటాలు దూసుకుపోవడంతో అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఈ దాడి టైంలో అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో లేరు. ఉత్తరాది యాత్రలో ఉన్నారు. అయినా బ్రిటిష్‌ వారి ప్లాన్ తెలుసుకొని గెరిల్లా పద్దతిని అనుసరించారు. ఈ దాడిలో పాల్గొన్న భారతీయ సైనికులు ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అందుకే స్కాట్‌, హైటర్‌ డెడ్‌బాడీలను అక్కడే వదిలేసి సైనికులు వెళ్లిపోయారు.

జరిమానా కట్టి డెడ్‌బాడీలను తెచ్చుకున్న బ్రిటీష్ అధికారులు :

స్కాట్ ,హైటర్ మరణం, కనీసం వాళ్ళ శవాలను కూడా వెనక్కు తెచ్చుకోలేని పరిస్థితిలో తాము ఉండడం అనేది బ్రిటీష్ అధికారులకు తల కొట్టేసినట్టైంది. అయినా చేసేది లేక తమ వద్ద పని చేసే భారతీయులకు తెల్ల జెండా ఇచ్చి శాంతి మంత్రం పాటిస్తూ డెడ్‌బాడీలను పడి ఉన్న దామనపల్లి ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న అల్లూరి సీతారామరాజు దళాన్ని తమ అధికారుల మృతదేహాలను అప్పజెప్పాలని కోరారు.

లేనిపోని ఆంక్షలతో స్థానిక గిరిజనుల ఉపాధి దెబ్బతీసినందుకు, వారిని బాధించినందుకు 500 రూపాయల జరిమానా విధించారు అల్లూరి సీతారామరాజు. దానితో ఆ జరిమానా కట్టి ఆ స్కాట్ ,హైటర్ డెడ్‌బాడీలను వెనక్కు తెచ్చుకున్నారు బ్రిటీష్ వాళ్ళు. వాటిని నర్సీపట్నంలో సమాధి చేశారు. ఆ సమాధులపై వారి వివరాలు చెక్కించిన బ్రిటీష్ అధికారులు వాటి రక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ముళ్లపొదలు-పిచ్చి మొక్కల మధ్య ఆ రెండు సమాధులు :

ఆ సమాధులు ఉన్న ప్రాంతం నాశనం కాకూడదని, స్వాతంత్య్రం ఇచ్చేసమయంలో ఓ కండిషన్‌ పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదొక్కటే కాదు దేశంలో తాము నిర్మించిన అనేక కట్టడాలకు కూడా ఇదే కండిషన్ పెట్టారు బ్రిటీషర్లు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దన్నారు.

ప్రస్తుతానికి ఆ ప్రాంతం అలానే ఉన్నా .. చుట్టూ రకరకాల కట్టడాలువచ్చేసాయి. ఆ సమాధులు ఉన్న ప్రాంతం కూడా ఎలాంటి శుభ్రత లేకుండా ముళ్ల పొదలతో నిండి పోయింది. నర్సీపట్నంలోని ప్రజల్లో చాలామందికి సైతం ఈ సమాధుల చరిత్ర తెలియదు.

అల్లూరి రగిల్చిన స్ఫూర్తి- నిత్య నూతనం :

అల్లూరిని వేటాడడానికి వెళ్లి తామే బలైన వేటగాళ్ల కథ ఇది. అల్లూరి సీతారామరాజు విప్లవాన్ని కేవలం ఒక పితూరీగా తగ్గించి చూపాలన్న బ్రిటీష్ కథనాలకు.. నిజానికి ఆయన నడిపిన ఉద్యమం ఎంత తీవ్రతరమైందో తెలిపే సంఘటనకు సాక్ష్యం ఈ సమాధులు. ఆయన ప్రాణాన్ని తీయడానికి ఎందుకు బ్రిటీష్ వాళ్ళు తహతహ లాడిపోయారో ఈ సమాధులను చూస్తే తెలుస్తుంది. అందుకే తరువాత కాలంలో నిరాయుధుడిగా ఉన్న అల్లూరిని అంత కిరాతకంగా చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చంపారు ఆంగ్లేయులు. అలా తమ కసినైతే తీర్చుకున్నారేమో గానీ తరతరాలుగా తెలుగువాళ్లలో అల్లూరి సీతారామరాజు రగిలించిన స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేకపోయారు

Monday, May 2, 2022

సంస్కృతం

 హిందీని జాతీయ భాషగా గుర్తించాలంటూ ఓ డిమాండ్ కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మోస్ట్ డిబేటబుల్ టాపిక్. కన్నడ స్టార్ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ల మధ్య భాష విషయంలో జరిగిన వివాదం కూడా దీనికి తోడైంది. ఇప్పుడు వీటన్నింటినీ కాదని మరో నినాదం ప్రచారంలోకి వచ్చింది. అదే సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలనే డిమాండ్.

ఎందుకంటే మన దేశంలో అన్ని భాషలకు మూలం సంస్కృతమే అని ఆ భాషలోనే మన వేదాలు ఉన్నాయ్ కాబట్టి తమది జెన్యూన్ డిమాండ్ అనీ వీళ్లు అంటున్నారు. దీన్ని కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని చాలా మంది ట్వీట్లు కూడా చేస్తున్నారు.



సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలా వద్దా అనే విషయాన్ని వదిలేసి అసలు దేశంలోని భాషలకు మూలం సంస్కృతమే అన్న వాదన ఎంత వరకు నిజమనేది తెలుసుకుందాం. చాలా మంది అనుకునేట్లు భారతీయ భాషలకు మూలం సంస్కృతం కాదు. ప్రత్యేకించి తెలుగు, తమిళ, మలయాళ భాషలకు అసలు ఏ మాత్రం సంబంధం లేదు. అసలు కనీసం అవి ఒకే ఫ్యామిలీకి చెందిన భాషలు కూడా కావు.

మరి సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది?

మన దేశ జనాభాలో 99 శాతం మంది మాట్లాడే 121 ప్రధాన భాషలు ఐదు వేర్వేరు భాషా కుటుంబాలకు చెందినవి. ఇది మేం చెబుతున్నది కాదు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారిక వెబ్ సైట్‌లో ఉన్న వివరాలే.

ఈ వివరాల ప్రకారం

1. ఇండో-యూరోపియన్ కుటుంబం
2. ద్రవిడియన్ లాంగ్వేజెస్
3. ఆస్ట్రో-ఏసియాటిక్
4. టిబెటో-బర్మీస్
5. సెమిటో హామిటిక్

1. ఇండో యూరోపియన్ కుటుంబం

ఇండోయూరోపియన్ అంటే ఇండియా, యూరోపియన్ ఖండం ప్రాంతంలో మాట్లాడే భాషల ఫ్యామిలీ అన్న మాట. మళ్లీ ఇండో యూరోపియన్ లో మూడు శాఖలు ఉన్నాయి. ఇండో-ఆర్యన్, ఇరానియన్, జెర్మానిక్ అనే మూడు మూడు శాఖల భాషలు భారతదేశంలో ఉన్నాయి.

ఎ) ఇండో-ఆర్యన్ శాఖ: బంగాలీ దగ్గర మొదలు పెడితే డోగ్రీ, గుజరాతీ, హిందీ, కశ్మీరీ, మరాఠి, నేపాలీ, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ ఇలాంటి భాషలన్నీ ఇండో ఆర్యన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భాషలు.

బి) ఇరానియన్ శాఖ: 1. అఫ్ఘానీ/కాబూలీ/పష్తో

సి) జెర్మానిక్ శాఖ: 1. ఇంగ్లిష్

2. ద్రవిడియన్ కుటుంబం గురించి మాట్లాడుకుంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ నుంచి మొదలు పెట్టి, తులు, మాల్టో, గోండి లాంటి భాషలు ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినవి.

3. ఆస్ట్రో-ఏసియాటిక్: భుమీజ్, గడబ, హో, జువాంగ్, ఖారియా, ముండారి, సవర లాంటి భాషలన్నీ ఆస్ట్రో ఏసియాటిక్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. ప్రత్యేకించి ఈ ఫ్యామిలీలో ముండారీ అనే భాషను చోటా నాగ్ పూర్ ప్లేట్ లో...మోన్ ఖేమర్ భాషను నార్త్ ఈస్ట్, అండమాన్ నికోబార్ దీవుల్లో మాట్లాడతారు.

4. టిబెటో-బర్మీస్: బోడో, మణిపురి,గారో, కుకీ, లడాఖీ, షేర్పా, టిబెటన్, త్రిపురి తదితర 66 భాషలు ఈ కుటుంబానికి చెందినవి. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రజలు వినియోగించే భాషను ఈ భాషా కుటుంబానికి చెందినవి.

5. సెమిటో హామిటిక్: అరబిక్/అరబీ

భారతదేశంలో అత్యధికులు అంటే 78 శాతం మందికి పైగా మాట్లాడే హిందీ తదితర 21 ప్రధాన భాషలు.. ఇండో-యూరోపియన్ కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు మళ్లీ దాంట్లో ఉపశాఖ అయిన ఇండో-ఆర్యన్ వర్గంలోకి వస్తాయి. ఇప్పుడు మన హిందీ కావచ్చు..సంస్కృతం కావచ్చు ఈ ఇండో ఆర్యన్ సమూహానికి సంబంధించిన భాషలు.ప్రస్తుతం ఇండో-యూరోపియన్ కుటుంబంలో ఎనిమిది శాఖలుగా మొత్తం 448 భాషలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రాచీన గ్రీకు, లాటిన్, సంస్కృతం మొదలుకొని.. ఆధునిక ఇంగ్లిష్, జర్మన్‌లతో పాటు హిందీ తదితర భాషలు ఇందులో ఉన్నాయి.

ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే ఆర్యులు సుమారు క్రీ.పూ 1,500 సంవత్సరాల కిందట భారత దేశంలోకి వాయవ్య ప్రాంతం నుంచి విస్తరించారని భాషాశాస్త్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

సంస్కృతం - హిందీ...

ఇతర భారతీయ ఇండో-ఆర్యన్ భాషల తరహాలోనే వేద సంస్కృతం నుంచి హిందీ పుట్టింది. ఈ క్రమంలో అనేక పరిణామాలు, ప్రభావాలు ఉన్నాయి. వేద సంస్కృతం 1,500 బీసీ కన్నా పురాతనమైనదని భాషాశాస్త్రవేత్తల అంచనా. తొలి వేదమైన రుగ్వేదం ఈ కాలానికి చెందిందని.. వేద సంస్కృతం క్రమంగా మారుతూ 250 బీసీ నాటికి ప్రాచీన వేదంగా రూపొందింది. కొంత కాలం పాటు సాహిత్య, శాసన భాషగా కొనసాగింది. కాల క్రమంలో వ్యాఖ్యానాలకు పరిమితమైపోయింది.

మరోవైపు 500 బీసీఈ నాటికి సామాన్య ప్రజల వాడుక భాష అయిన ప్రాకృతం ప్రాధాన్యం పెరిగింది.

తిణ దోసాని ఖేత్తాని
దోస దోస ఆయం పజా
తస్మాతి వీత దోశేషు
దిన్నం హోతి మహప్ఫలం..!

ఇది అంతరించిపోయిన ప్రాకృత భాషకు సంబంధించిన పద్యం. బౌద్ధులు, జైనులు చాలా వరకూ ఈ ప్రాకృత భాషలోనే గ్రంథాలు రచించారు. క్రీపూ 268 నుంచి 232 వరకూ భారత ఉపఖండాన్ని పరిపాలించిన అశోకుడి శాసనాలను కూడా ఈ వాడుక భాషలోనే వేయించారు.

మళ్లీ క్రీ.శకం 400 నాటికి ప్రాకృతంలోనే అపభ్రంశ మాండలికం ప్రాచుర్యం పొందింది. ఈ అపభ్రంశ నుంచి ఏడో శతాబ్దం నాటికి హిందీ ఆవిర్భావం మొదలైంది. నిజానికి అప్పటికి హిందీ భాషగా దీనికి నామకరణం చేయలేదు. మొఘలుల ఆస్థాన కవి అమీర్ ఖుస్రో 13వ శతాబ్దంలో తను 'హైందవి' భాషలో కవితలు రాసినట్లు చెప్పాడు.అంతకుముందు.. ఇండస్ - అంటే సింధూ నదికి తూర్పున 'హింద్' ప్రాంతంలో నివసించే వారిని చెప్పటానికి 'హిందీ' అనే పదాన్ని ఉపయోగించేవారు. ప్రాచీన పర్షియన్ భాష నుంచి ఈ పదం పుట్టింది. ఆ భాషలో 'హిందీ' అనే పదానికి అర్థం నేటి 'ఇండియన్'.

హిందీ, ఉర్దూలు రెండూ.. భాషాశాస్త్రపరంగా ఒకే ఉప మాండలికానికి చెందిన భిన్న సాహిత్య శైలులు. సాధారణంగా ఉపయోగించేటపుడు ఈ రెండు భాషలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని పదాలు, పలికే తీరుల్లో స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి. లిపి కోసం హిందీ దేవనాగరిని ఉపయోగిస్తే.. ఉర్దూ పర్సో-అరబిక్ లిపిని ఉపయోగించారు.

స్వాతంత్య్రానికి ముందు.. స్వతంత్ర భారత జాతీయ భాషగా హిందుస్థానీ భాషను ప్రకటించాలని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు భావించారు. అయితే.. పాకిస్థాన్ విడివడిన తర్వాత ఉర్దూను ఆ దేశ జాతీయ భాషగా ప్రకటించుకుంటే.. హిందీని భారతదేశ అధికార భాషగా చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం హిందీ అధికార భాష మాత్రమే. జాతీయ భాష కాదు.

ద్రవిడ భాషలు

సుమారు 6,000 సంవత్సరాల కిందట మూల ద్రవిడ భాష (ప్రోటో-ద్రవిడియన్ లాంగ్వేజ్) మాట్లాడేవారు. ఈ భాష మాట్లాడే ద్రవిడులు వాయవ్య దిశ నుంచి భారత ఉపఖండంలోకి ప్రవేశించి ఉంటారని.. సింధు నాగరికత వీరిదే అయి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు ప్రతిపాదించారు. మరికొంత మంది ద్రవిడులు పూర్తిగా భారత్‌లోనే ఉద్భవించిన తెగ అని చెబుతారు మరికొంత మంది ద్రవిడులు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం నుంచి వలస వచ్చిన జాతిగా అభివర్ణిస్తారు. వీటిలో ద్రవిడులు ఎలా వచ్చారనేది నిర్దిష్టమైన సమాధానం లేకపోయినా...ద్రవిడ భాషలు ఇండో ఆర్యన్ భాషలకు సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతోంది. భారత దేశంలోకి ఆర్యుల రాకతో...ద్రవిడ భాషలు మాట్లాడేవారు చాలా మంది ఆర్య సమాజంలో కలసిపోగా.. ప్రతిఘటించిన ద్రవిడులు క్రమంగా తూర్పు, దక్షిణ దిశలకు కదలిపోయారని భాషా పరిశోధకులు చెబుతూ ఉంటారు.

మూల ద్రావిడ భాష సుమారు 5,000 సంవత్సరాల కిందట

1) దక్షిణ ద్రావిడ
2) దక్షిణ మధ్య ద్రావిడ
3) మధ్య ద్రావిడ
4) ఉత్తర ద్రావిడ అనే నాలుగు శాఖలుగా విడిపోయింది.

ప్రస్తుతం ద్రవిడ భాషలలో అతి పెద్ద భాషలుగా ఉన్న తమిళం, మలయాళం, కన్నడ భాషలు దక్షిణ ద్రావిడ శాఖ నుంచి.. తెలుగు భాష దక్షిణ మధ్య ద్రావిడ నుంచి ఉద్భవించాయని చెబుతారు. ఆర్యులు 1500 బీసీ కాలంలో భారత ఉపఖండంలోకి ప్రవేశించేటప్పటికి అక్కడ ప్రధానంగా ఉన్న ద్రవిడ భాషా శాఖతో వారితో కలవటం వల్ల రుగ్వేదంలో సైతం కొన్ని ద్రవిడ భాషా పదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తారు.

500 బీసీ నాటికి పాళీ, ప్రాకృతి వంటి వాడుక భాషలు ప్రాచుర్యం పొందటం ఆరంభమైంది. బౌద్ధ, జైన మతాలు రాజ్యాల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి ఎదగటంతో.. ప్రాకృత భాషలు స్థిరపడగా సంస్కృతం క్రమంగా మొదటి భాష స్థానాన్ని కోల్పోయింది. పతంజలి కాలం నాటికి ప్రాకృత భాష తొలి భాషగా మారిపోగా.. సంస్కృతం మంత్రాలకు పరిమితమైంది.

వెయ్యేళ్ల కాలంలో ఈ భాషల్లో వేగంగా మార్పులు రావటం ప్రారంభించాయి. ప్రత్యేకించి ద్రావిడ, ఆర్య భాషాలు వేగంగా కలిసిపోవటంతో...చాలా పదాలు ఆర్యుల భాషా సమాజాలతో కలిసిపోయాయి. అయితే ఆర్యుల భాషలను ద్రావిడులు కచ్చితత్వంతో నేర్చుకోకపోవటం వల్ల ఈ రోజు చాలా మాండలికాలు ఏర్పడ్డాయి. సో ఇది మన దేశంలో భాషల వెనుక ఉన్న చరిత్ర. ద్రావిడ భాషలకు సంస్కృతం మూలం కాదు. ద్రవిడ భాషలు వాటికవే ప్రత్యేకం అనే విషయం చెప్పటమే ఈ విశ్లేషణ వెనుక ఉద్దేశం.

చీమలు

 ముందుగా చీమలు నిద్రపోతాయో లేదో తెలుసుకుందాం. గార్డియన్ నివేదిక ప్రకారం, చీమలు నిద్రపోతాయి. కానీ మనందరికీ అర్థమయ్యే రీతిలో అస్సలు కాదు.

1983లో చీమలపై చేసిన పరిశోధన ప్రకారం అవి 24 గంటలలో 12-12 గంటల వ్యవధిలో.. అది కూడా 8-8 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. వాటికి నిద్ర కంటే కునుకులే ఎక్కువ ఇష్టం. అందుకే ఎక్కువగా చీమలు కదులుతూనే కనిపిస్తాయి. అవి ఎల్లప్పుడూ సరళ రేఖలో ఎందుకు కదులుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. BBC మ్యాగజైన్ సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, చీమను సామాజిక క్రిమి అని పిలుస్తారు. అవి కాలనీలు కట్టుకుంటాయి. టీమ్ వర్క్ చేస్తాయి. అవి సరళ రేఖలో కదలడానికి ఇదే కారణం. చీమల నుండి వచ్చే రసాయనంతో దీనికి సంబంధం ఉంది. చీమలు తమ ఇతర సహచరులతో కలిసి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా అవి వరుసలో నడుస్తాయి. వాటి శరీరం వెనుక నుండి ఒక ప్రత్యేక రసాయనం బయటకు వస్తుంది, దీనిని ఫెరోమోన్స్ అని పిలుస్తారు. దాని వాసనను పసిగడుతూ ఇతర చీమలు ముందుకు సాగుతాయి. ఈ విధంగా ఒక లైన్ తయారయినట్లు కనిపిస్తుంది. ఎవరైనా ఈ లైన్‌ను విచ్ఛిన్నం చేస్తే, అవి కొన్ని సెకన్లలో తిరిగి సెట్ చేసుకుంటాయి. ఈ రసాయన వాసన ద్వారా, చీమల గుంపులు వాటి ఆహారాన్ని చేరుకోవడమే కాకుండా వాటి నివాస స్థలానికి కూడా చేరుకుంటాయి. ఈ రసాయనం సహాయంతో అవి వివిధ నిర్మాణాలను కూడా చేయగలవని ఈ నివేదిక చెబుతోంది.

Sunday, May 1, 2022

డొక్కా సీతమ్మ

 Dokka Sitamma: అన్నపూర్ణ దేవి(Annapurana Devi) అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అన్నపూర్ణ దేవీ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District) డొక్క సీతమ్మ అని వింటూనే ఉన్నాం.



అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి “అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా” అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ . అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరానికి ఆమె గొప్పదనం గురించి తెలియజేద్దాం..

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు ‘బువ్వన్న’ గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వ'(అన్నం) పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మకి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు.

లంకల గన్నవరంకి కోడలుగా అడుగు

గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు ‘డొక్కా’ గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.

ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే.. ఆవిడ జీవితంలో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు “ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం… అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు” అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మ . వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి… వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ. అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో.. ‘అపర అన్నపూర్ణ’ గా శ్రీమతి సీతమ్మ పేరుపొందారు.

నిరంతర అన్నదానంతో
ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్త “ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు…” అన్నారు. దానికి ఆవిడ “నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు” అని చెప్పింది. తరువాత ఒక రోజు సాయంకాలం ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ భర్త గునంతో తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే “నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా” అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, “నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకాలు ఎందుకు, వద్దు” అన్నారు ఆవిడ. “అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు” అని ఆ కలెక్టరు చెబితే, “నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి” అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం.

అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ‘అపర అన్నపూర్ణమ్మ’మన డొక్కా సీతమ్మ.. జాతిరత్నం. 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతుల ను చేయటమే ఆమహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!….

( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములనుండీ సేకరణ)

Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...