Monday, September 2, 2024

సమరయ స్ర్రీ

 


*సమరయ స్ర్తీ*(ఏకపాత్ర)


*సమరయ స్ర్తీ  ఏకపాత్ర*

(వేదిక మధ్యలో సమరయస్ర్తీ కూర్చుని ఉంటుంది తన ముందర ఉన్న మంచినీటి కూజా ఇంచుమించు ఒడిలో పొదివికున్నట్టు ఉంటుంది.కూజా మూతిపై చేతులు చాపి ఆ చేతులులో తలను వాల్చి ఉంటుంది.)

తెర తీయబడగానే ......మెల్లగా తలను పైకి ఎత్తి నిద్ర మత్తు కళ్ళను ప్రదర్శిస్తూ ఆవలించి ,వళ్ళు విరిచుకుంటూ  నిద్రలో తన ప్రియునితొ సరసాలాడిన రీతిని ఊహించుకుంటూ పగలబడి నవ్వుతూ నవ్వుతూ లేచి  వేదిక కుడి మూలన వరకు ఎవరో తనను కౌగిలించుకుని వదిలి పెట్టిన భావన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు  అనిపించి వదలమన్నట్టు నటిస్తు  నవ్వి   ఆగి.....ఒక్కసారిగా కొంటే చూపులు చూస్తూ వయ్యారపు నడకతో కుడి నుండి ఎడమ మూలవరకు నడచి నడుస్తున్నప్పుడు నా అంత అందెగత్తె లేదు అన్నట్టు భావించుకుంటూ వెను తిరిగి మధ్యలో వరకు వచ్చి మరో సారి కొంటే నవ్వు విసిరి కనులు ఎగరేసి తలను వాల్చి కురులు ముందుకులాగి మరలా  కనులు ఎగరేసి 

ఓ రెండు నాట్యభంగిమలు ప్రదర్శించి)


ఓయ్ ..  ఓయ్ మిమ్మల్నె  వింటున్నారా...(తన ముసుగు చెంగును నోటిలో సుతి మెత్తగా పంటి బిగిన పట్టి  కాలి బొటన వ్రేలు నేలను రాస్తూ) సుఖారు గ్రామ రసికాగ్రేసులారా ఇది విన్నారా ! ఆహ విన్నారాంట ( విసుగు ప్రదర్శించి )  విని ఉండరులే.....  నా యవ్వన సిరులు దోచుకోవలనే ఆశే కాని ఈ సమరయ ప్రాంతంలో ఇంత రూపవతి శృంగారదేవత   ( క్రిందనుండి పైకి తన చేతిని చూపిస్తు)  లేనే లేదనే విషయం మీకు తెలుసాంట ...  ( అరచేతిని నోటి పై ఉంచి ఒకింత వగలపు నవ్వు నవ్వుతూ ) ఇప్పటికే నా లావణ్య రేఖావిలాసాలు సమరయ ప్రాంతంలో పేరు మోసిన దిగ్జజాలదగ్గర ఉన్నాయని  వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి  సేదతీరి.....అవసరం తీరాక ముఖం చాటేస్తారని ,వారి రహస్యజీవితాలు నా గుప్పెటలో  బందీ అని అందుకే నన్ను వేనొళ్ళ పొగుడుతారని తెలుసా ( కళ్ళు పెద్దవి చేసి ఎవరో అడిగినట్టు ) ఊ   .... ఎలాగో  చెప్పనా.(గట్టిగా ఎగతాళి నవ్వు ).ఊ.... ఎవరిదని చెప్పనూ ( కళ్ళుత్రిప్పి గట్టిగా నవ్వి  భర్తలాగ మగవానిగా నటిస్తూ గొంతు గంభీరంగా పెట్టి )  ఓ సుమరమణీ ...నీ నవ్వు నా హృదయారవిందాన్ని ఎంత గాయం చేసిందో చూడు నీ ఒడిలో  ఒక్కసారి నా తలను వాల్చనివ్వవూ... ( పగలబడి వేళాకోళం కలగలిపిన తొణికిసలాడే నవ్వు గట్టిగా నవ్వుతూ ) మరోకప్రియునిదా    ఏయ్ సౌందర్యరాశి ఏం లావణ్యమే నీది ....నీవు అనుమతిస్తే నీ అడుగుల్లో అడుగులు వేస్తాను .పువ్వుల్లో  పెట్టి చూసుకుంటాను  వదలనంటే వదలను నిన్ను ( నవ్వి నవ్వి   నవ్వుతూనే  ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి మోసపోయిన దానిని గుర్తుచేసుకుంటుంది.. ఏడ్చి ఏడ్చి .... ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ....కన్నీళ్ళు తుడుచుకుని )  

అయ్యో అప్పుడే మిట్ట మధ్యహాన్నం అయ్యింది .  ఎండ చుర్రుమంటుంది .ఇదే సమయం యాకోబు బావి నుండి నీళ్ళు తేవడానికి. నా తలరాత ఇలా తగలడింది మరి .బయటకు వెళితే చాలు హేళన మాటలు వినలేక చావాలనిపిస్తు ఉంటుంది . సూటిపోటి మాటలలతో ప్రాణం తీస్తారు ఈ పాడు జనం. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే. వీరి సంపదేమైనా ఎత్తుకు పోయానా ఏంటి. నా బడి ఏడుస్తూ ఉంటారు...సరేలే....  ఎప్పుడూ ఉండే సొదే.... ఈ సమయమైతేనే జనం తక్కువ ఉంటారు బావి దగ్గర .( అంటూ కూజాను సంకన ఉంచి బయలు దేరుతుంది .) 

(రెండడుగులు వేసిందో లేదో . వీధిలో ఓ సైనికుడు సమరయ స్ర్తీని చులకనగా చూస్తూ చేయిని పట్టుకున్నట్టు  తన చేతిని  సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ) ఎయ్ చేయి వదులు  ...,,,దారి తప్పుకో  సైనికుడా.... అడ్డులే  నన్ను వెళ్ళనివ్వు....ఏమిటా వెకిలి నవ్వు.....నేను సమరయ స్ర్తీని . నేనేం నిన్న మొన్నటి నుండి  ఇక్కడ ఉంటున్న దానినేం కాదు . ఒమ్రీ రాజు కట్టించిన పట్నంలో అస్సూరు రాజు ఆజ్ఞతో నివశిస్తున్న సమరయ జాతి స్త్రీని. ఏం అంటున్నావు ? సంకరజాతి దానిననా ,అంటరాని దాన్ననా. మా తాతలు దొంగలా  అయితే అయి ఉండవచ్చు .....ముందు అడ్డు తొలగు...... బావి వద్దకు పోవాలి  ... చేయి వదులు ముందు  . ఆ చెట్ల మాటున  దేశదిమ్మరులుంటారు  వెళ్ళి దాని చెయిపట్టుకో  వదలమన్నాన.....ఛీ...... చేయి వదులు ( చేయిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ముఖం పై ఉమ్మి వేసినట్లు నటించి కోపంగా చూస్తున్నట్టు   ముందుకు వెళుతూ  బయలుదేరుతుంది  నాలుగు అడుగులు వేసి ) 

( యాకోబు బావిని దూరం నుండి చూసి నట్లు నటించి)  ....హమ్మయ్య...  అదిగో యాకోబు బావి   యాకోబు యేసేపుకు కట్టించిన బావి . ఆ నుయ్యి లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయి . ఎంత మధురంగా ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయో చెప్పలేను ( అని అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యం నటిస్తూ  .....ముఖం చిట్లించి.. ... బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు గమనించి) ....అమ్మో ఎవరో బావి వద్ద ఉన్నారు.....ఎవరైఉంటారు   .... బావి   అంచున కూర్చుంది ..ఎవరైయుంటారో.....ఎవరో యూదుడులా అంగీ వేసుకుని ఉన్నాడు..బావి గట్టునే కూర్చుని ఉన్నాడు...నేను చూస్తుంది నిజమేనా  అతను యూదుడు కాదుగదా ఆ తేజస్సు ఆ గంభీరతా యూదులకే సొంతం సుమా మరెవరికి ఉంటుంది ఆ దర్పం .....నేను  దగ్గరకు వెళ్ళవచ్చో లేదో . ..(గర్వపు గొంతుతో ).......ఆ నాకేం భయం  యూదులకు మా సమరయులకు బద్ద వైరం ఉన్నమాట ఎవరు కాదనగలరు . .....అతను యూదుడైతే నాకేంటట , .....ఉండనీ నాకేం భయం. సమరయులు దేనిలో తీసిపోతారు ...యూదుల గొప్పేంటో (  తనలో తను మాట్లాడుకుంటూ....... బుగ్గలు నొక్కుకుంటూ దిగ్బ్రమకు లోనై ) దోపిడీ దొంగలు "విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారులు నివశించే ఈ సమరయ ప్రాంతానికి యూదులు ఏనాడో రావటం మాని యూదయ నుండి చుట్టూ తిరిగి గలలియ పోతున్నారు.మరి  ఇతనెవరు చూస్తే యూదుడులాగే ఉన్నాడు. (నిట్టూర్చి )  ఏది జరిగితే అదే జరుగుతుంది .........దగ్గరగా వెళతాను.. నా పని నేను చేసుకుంటాను.......( అని బావి వద్దకు వెళ్ళినట్లు నాలుగడుగులు వేసి కూజాను క్రింద పెడుతుంది  ఇంతలో మెస్సీయా దాహాం తీర్చమని నీళ్ళు అడుగుతాడు అది విని  ఆశ్చర్యం నటిస్తూ  ..) ఏంటేంటి  ....దాహానికి నీరు ఇమ్మంటున్నావా ? నువు యూదుడవే కదా !

నేను చేదతో తోడి నీకు నీరు పోస్తే త్రాగుతావా ? సమరయ స్ర్రీ తాకిన నీటిని నువు త్రాగుతావా ?   .నేను ఎవరో  తెలిసే మాట్లాడుతున్నావా ! యూదులు మేము వండినవి తినరట , మా చేతి నీరు త్రాగరట ,మాతో సంబాషించడానికే ఒప్పుకోరట  . మరి నువేంటి త్రాగడానికి నీళ్ళడుగుతున్నావు.

నువు  యూదుడవైతే......ఏషర్హద్దోన్ మిమ్మల్ని అస్సూరు రాజ్యం తీసుకుపోయాడుగా  అక్కడే ఉండక  ఈ సమరయ ప్రాంతంతో నీకేం పని ఇలా వచ్చావ్ ....  ఏం మాట్లాడవేం ....పోనీలే అని  విగ్రహారాధన మాని మన దేవుడైన యెహోవాను పూజిస్తే నెహేమ్యా  ఊరుకున్నాడా మా సమరయులను సంకరజాతంటూ కలవవద్దని నిభందన పెట్టాడు .  అయితేనేం  మేము దేవుడిని విడిచి పెట్టలేదు. లేఖనాలు చదువటం మానలేదు . గెరీజీము  కొండపై ఆలయం కట్టుకుని  మెస్సీయ వస్తాడని ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని మీ యూదులు కలవనివ్వక పోతేనేం  మేము గొప్పగానే బ్రతుకుతున్నాం , మరి మా సమరయ ప్రాంతంతో నీకేం పనో  .ఏం మాట్లాడవేం . అందరిలాగే యూదయా నుండి చూట్టూ తిరిగి గలలియ పోలేక పోయావా  మా సమరయ ప్రాంతంలోకి వచ్చావ్.........నీళ్ళు కావాలట నీళ్ళు ( గుడ్లురుమి నట్లు చూసి ....దగ్గరగా వెళ్ళినట్లు నాలుగు అడుగులు వేసి )

     .ఇంతకూ.......ఎవరు నువ్వు  ఈ మిట్టమధ్యహాన్నం  ఇంత ఎండలో అంత ప్రశాంతంగా కూర్చున్నావ్  దేనికోసమో తెలుసుకోవచ్చా  .చూస్తుంటే  యూదు జాతివానిగానే కనబడుతున్నావు . నేను చూస్తుంది నిజమేనా ....( అవతలి నుండి నిజమే నువు చూస్తుంది అనే జవాబు విని ఆశ్చర్యాన్ని చూపిస్తూ )

  ఆ అవునా ! యూదుడవే... ( కాస్త నెమ్మదైన గొంతుతో )  నేను ఎవరో తెలుసా ! సమరయ స్త్రీని  అంటరాని జాతిలో పుట్టిన దానిని . మీరు ఈ యాకోబు బావి దగ్గరకు ఎందుకు వచ్చారు ? నేను పుట్టి ఉండగా ఓ యూదుడు ఇలా సమరయ ప్రాంతంలో అడుగు పెట్టడం ఇదే ప్రధమం . ఈ పాపుల మార్గాన రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది.  మా సమరయులు చూస్తే ఏదైనా గొడవ జరుగుతుందేమో అన్న భయం మీకులేదా ?  నన్ను చూసి   నవ్వుతూ శాంత వదనులై మాట్లాడుతున్నారు ( ఒకింత చెవులు నిక్కించి వింటున్నట్లు నటించి సంబ్రమాశ్చర్యాలకు లోనై )

అయ్యా  ! ఏమిటి మీరంటున్నది (  మోకాళ్ళ పై కూలబడి ) ఏమిటి... ఏమిటీ..నేను వినేది నిజమేనా .   నాకు ఐదుగురు భర్తలని  ఆరవ భర్తతో ఉంటున్నానని  అంటున్నారా ! నాకు తప్ప మరెవరికీ  ఈ అంతరంగిక విషయం తెలియదు. మీకెలా తెలిసింది. నా అంతరంగ రహస్యాలు మీకెలా తెలిసాయి నమ్మలేకపోతున్నాను ?. నా అంతరంగ రహస్యాలు తెలిసేది దేవునికే కదా ! నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు సామాన్యులుగా కనబటంలేదు .సాక్షాత్తు దైవస్వరూపులుగా ఉన్నారు. నిజం చెప్పండి ఎవరు మీరు ?

  చూస్తుంటే మీరు సమరయుల పట్ల ప్రేమ జాలి కలిగి ఉన్నట్లు ఉన్నారు . పాపులను క్షమించే వారిగా ప్రేమించే వారిగా కనబడుతున్నారు . యూదులు గొప్పవారు కదా ఈ సమరయస్ర్రీ ఇచ్చే నీరు నిజంగా త్రాగుతారా!  నిజం చెప్పండి (ఏదో ఆశ్చర్యంగా అర్దంకానట్లు ముఖం పెట్టి )

ఏంటి జీవజలములా   ..జీవజలములు..ఇస్తారా?  ఏమిటి మీరనేది తోడుకోడానికి చేదలేదు కదా మీ దగ్గర , మరి నాకు జీవజలం ఎలా ఇస్తారు? మీ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగుతుంది.  అసలు మీరు ఎవరు ? మీ పేరేంటి ? నా పాపాలు తెలిసేది దేవునికే కదా. .మీరు ఎవరో తెలుసుకోవాలని ఉంది. 

 ఈ రోజు నా హృదయమెందుకో భారంగా ఉంది.   మీతో మాట్లాడుతుంటే  హృదయంలో పశ్చత్తాపం కలుగుతుంది . మిమ్ములను చూస్తున్నా , మీ మాటలు వింటున్నా నిత్యజీవం, నిత్యరక్షణ,నిత్యరాజ్యం లోకి పిలుస్తున్నట్టు ఉంది. మన తండ్రి అయిన యాకోబు కంటే మీరు గొప్పగా ఉన్నారే . పాపుల రక్షకుడు మెస్సయ్య వస్తాడని లేఖనాలలో తెలుసుకున్నాను. ఆయన కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఇంతకూ మీరు ఎవరో చెప్పటం లేదు ?  (  కొంతసేపు ఆగి వినినట్లు నటించి )

అయ్యా ! ఏమిటి మీరంటున్నది.మనం అందరం దేవుని వారసులమా .ఆయన ఇచ్చు రక్షణ అందరికీ సమానమేనా ,యూదులని ,సమరయులని,పాపులని ,నీతిమంతులని భేదాలే లేవా  అందరికీ ఆయన రక్షణ ఇచ్చేవాడు ఉన్నాడా !

అయ్యా !  (   రోదిస్తూ )  ఎన్నో పాపాలు చేసాను, విగ్రహారాధన చేసాను, నన్ను క్షమిస్తాడా!  ఈ పాపిని క్షమిస్తాడా వచ్చే మెస్సియ్యా ( గుక్కపట్టి ఏడుస్తుంది   ) పాపపు జీవితమని తెలిసీ తప్పులు చేసాను . ఇహలోక వాంచలకు లొంగిపోయాను . నేను ఘోర పాపిని ...ఘోర పాపిని ( దుఃఖపడి కొంతసేపటికి తేరుకుని  లేచి నిలబడి దీన వదనురాలై )

అయ్యా  మీ పేరు ఏంటో చెప్పనేలేదు?               ( మెస్సీయ అని పేరు వినగానే ఆశ్చర్యం తో పరవశురాలై దిగ్బ్రమ చెంది స్దానువురాలై ) 

ఏమిటి  మెస్సయ్య  ! లోకరక్షణార్దం ఈ భువిలో వెలసే మెస్సియ్యె నా మీరు . మేం ఎదురు చూసే మెస్సయ్య మీరేనా  ! అయ్యా నన్ను మన్నించండి!ఈ పాపిని క్షమించండి! అయ్యా మీరు నన్ను అమ్మా అని పిలుస్తున్నారా ! నేను ధన్యురాలని అయ్యా ధన్యురాలిని !   

పాపపు ఊబిలో దిగజారిన నా బ్రతుకులో అశాంతి ఊపిరాడనివ్వడంలేదు .దూరంనుంచి చూసినప్పుడే అనుకున్నాను ఈ పాపపు బ్రతుకు ఇక ముగియబోతుందని. గొంగళి పురుగు లాంటి నా జీవితం మీ చల్లని మాటతో రెక్కలు తొడిగింది.....అయ్యా నా పాపపు జీవితాన్ని విడనాడి ఈనాడే రూపాంతర అనుభవం పొందుతాను . మీరు ఇస్తానన్న జీవజలం పొందుతాను . ( కంగారు నటిస్తూ కనులు తుడుచుకుంటూ )

అయ్యా ఇక్కడే ఉండండి  . మీరు అస్సలు కదలోద్దు . నేను పోయి మా ఊరి వారందరికీ    పాపుల రక్షకుడు వచ్చాడని   చెప్పి వస్తాను.  ఇక్కడే ఉండండి ....ఇక్కడే ఉండండి  ( అని కూజాను విడిచి ఊరివైపు వెళుతూ  .....కంగారుగా నటిస్తూ..... పరిగెడుతూ వెనక్కి వస్తూ  ఏమి పాలుపోని దానివలె  ఆనంద పరవశురాలై నవ్వుతూ   )

మెస్సయ్య వచ్చాడని   పాపాలతో కొట్టుమిట్టులాడుతున్న మా సమరయులందరికీ చెప్పాలి . అంటరానివారిగా చూడబడుతున్న మా సమరయ జనాంగాన్ని ఇంట చేర్చుకునే స్నేహితుడు వచ్చాడని చెప్పాలి  మెస్సియ్య పరిశుద్దమైన మాటలు వినడానికి రమ్మని స్వయంగా పిలుస్తాను . ప్రభు  రాకను ప్రకటిస్తాను . ధన్యురాలిని మెస్సియ్యా . ధన్యురాలును ఈ సమరయ స్ర్రీ ఇక నుండి పాపాలను విడిచి రక్షణ పొందిన విశ్వాసురాలని ప్రకటిస్తాను. నేను మెస్సియ్య ఇచ్చే జీవజలములు పొందానని కేకలు వేసి మరీ చెపుతాను  ఊరి వారందరికీ ఈ శుభవార్త చెప్పాలి మన పాపాలను పరిహరించడానికి మెస్సియ్య వచ్చాడని తెలుపుతాను  పాపపు కడవను మోసిన ఈ సమరయ స్ర్రీ  తన హృదయంలో జీవజలము బావిని పొందిందని సాక్ష్యమిస్తు బ్రతుకుతాను  ..... హల్లెలూయ ( సంతోషకరమైన నవ్వు ..... ఆనందబాష్పాలు )  .

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...