Sunday, September 29, 2024

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం


మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి జీవిత కథలు పద్యంలో రాసిన వారిలో జాషువా అగ్రగణ్యుడు. ఆయన జీవిత కథకి, ‘పిరదౌసి’ కథకి ఎంతో సారూప్యం ఉన్నందువల్ల ‘పిరదౌసి’లో కూడా ఆయన జీవిత కథనాన్ని వినిపించాడు.


జాషువా కవి నీటి అలల్లో నుంచి,శృతిని వినిపించగల సంగీతజ్ఞుడు.ఆయన కవిత్వంలో సంగీతం వుంది. సంగీత సాహిత్య సమన్వయుడు ఆయన. ఆయన కవిత్వంలో ఉన్న సంగీతం కృత్రిమమైనది కాదు. ప్రకృతి లోంచి వస్తున్న ‘ఝుంకార ధ్వని’. అందుకే అడవిలో సింహ నాదం కొన్నిసార్లు వినిపిస్తుంది. పక్షుల గువ్వల మోతలు కొన్నిసార్లు వినిపిస్తాయి. సాలీడుల జీవన సౌందర్యాన్ని ఒకసారి చూపిస్తాయి. ఆయన ఏ చిత్రం గీసిన అది మన కళ్ల ముందు దృశ్యీకృతమవుతుంది. ఆయన రచనలు అన్నింటిలో కూడా ‘నా కథ’ చాలా గొప్ప కావ్యం. సత్యభాషణా చాతుర్యంతో దానిని రచిస్తాడు. ఆయనకి అసత్యం రాదు. జీవిత రహస్యాలను ఆయన ప్రకృతిలో మేళవించి చెప్పు చాతుర్యం కలవాడు. ‘జాషువా’ తన ఆత్మ కథను రాస్తూ ఇలా విశ్లేషిస్తాడు.


సాధారణంగా విఖ్యాత మహాపురుషులు స్వీయ చరిత్రలు వ్రాసుకొంటూ యుంటారు. అట్టివారి మనుగడలు సమగ్రంగా తెలిసి కోవలెనని ప్రజలుబలాటపడుతూ యుంటారు.అందుత్తమ గ్రంథాలకు సాహిత్య రంగంలో అర్హస్థానం కూడా యుంటుంది. ఆత్మకథాకర్తలు పెక్కురు ప్రాయికంగా వారి వార్ధక్యంలో కథారచనకు పూనుకోవడం అప్పటి వారి హోదాకు, పలుకుబడికి, పదవికి తగిన యుదాత్త ఘట్టాలే వ్రాసికొంటూ తమదొక విశిష్ట జన్మగా నిరూపించుకొంటూ, సత్యగోపనం చేస్తూ కథ సాగించడం పరిపాటి.అట్టి రచనలు పాఠక లోకాన్ని ఆకర్షించలేవు సరికదా కొంత అనుమానాలకు, హాస్యానికి గుణియై నిరుపయోగాలౌతాయి. మహాపురుషులు నిత్య జీవితంలో వారనుభవించిన కష్టసుఖాలు పొందిన గౌరవాగౌరవాలు, వయ:పరిపాకంలో నెదుర్కొన్న క్లిష్టసమస్యలు యథాతథంగా చిత్రించి, తాము నడచిన త్రోవ సర్వజన సులభమని వారార్జించిన కీర్తి ప్రతిష్ఠ అనన్య సాధ్యాలు గావని నిరూపిస్తూ ఒక ఆశాకిరాణాన్ని వెలిగిస్తూ యుంటారు.ప్రపంచ మహాపురుషుల జీవిత చరిత్రల్ను పరిశీలిస్తే ఈ సత్యం ఋజువౌతుంది. గాంధీ,నెహ్రూ, బోసు,టాగోరు ప్రభతుల ఆత్మకథ లీకోవలోవి. వారి బాల్య యౌవన కౌమార ఘట్టా లాదర్శాలవలె స్వచ్ఛమై ఆయా కాలాలలో వారి మూర్తులను కన్నుల గట్టుతూ హృదయంగమంగా యుంటయి. గౌరవ భంగ భయంతో వారు దాచుకొన్న స్వీయదోషా లందుండవు.స్వీయ చరిత్రలకీ లక్షణా లాయుర్ధాయాలు- అలంకారాలు.

అట్టి ప్రసిద్ధ పురుషుల జాబితాలో చేరవలెననే ఆశతో నేనీ గ్రంథ రచన చేయడం లేదు. 


‘క్షుభిత మనశ్శాంతికి గత చరిత్ర ధ్యానంకన్న బ్రహ్మానందం లేద’న్న ఒకానొక ఆంగ్ల కవి వాక్రుచ్చినట్లు ఏకాంతంగా నేను నా జీవిత గ్రంథాన్ని మనస్సులో చదువు కొంటూ సింహావలోకనం చేసుకొంటూ మైమఱచిన నిశీథాల సంఖ్యాకాలు. దాదాపు నలుబదేండ్ల నా భాషా పరిశ్రమలో అనుభవమిది. ప్రసిద్ధాంధ్ర కవులు మ్రోయించిన కవితావీణెలు నా పసితనంలో నన్నాకర్షించినయి. ఊగించినయి, ఊరించినయి. నేనూ ఒక వీణెమ్రోయించాలి అనుకొన్నాను. ప్రయత్నం మీద నాకు లభించింది. వీణె కాదు.సితార,అది నా కవిత. దాన్ని మ్రోయిస్తున్నాను. వినిపించింది. ప్రజలకు కాని ప్రభువులకు కాదు. అట్లు నే సాగించిన కవితా ప్రవాసంలో కొన్ని తీగెలు తెగినయి. ముడులు పడ్డాయి,బెట్లు తప్పినయి, మూగవోయినయి. కాని నిరుత్సాహిని మట్టుకు కాలేదు. పైపెచ్చు పూర్ణోత్సాహ వంతుణ్ణయి మ్రోయిస్తూనే యున్నాను. లోకం నా వంక కోరగా వారగా చూచింది. అనాదరించింది. అసత్కరించింది. సత్కరించింది. దూరపర్చింది, చేరదీసింది.ఇతరేతర ఘర్షణోన్ముఖాలైన అభిరుచులు, ఆశయాలు, దృక్పథాలు అడుగడుగున వర్ణాభిమాన వర్గాభిమాన మతాభిమానాలతో స్వేచ్ఛావిహారం చేసే నేలలో అకలంక కళాకల్యాణులకు న్యాయం జరుగుతుందని ఆశించడం శశవిషాణ ప్రాయం, పర రాజ్యం పోయి,ప్రజా రాజ్యమై పాముకున్నది లేదు.కొందరికి ప్రజారాజ్యంగా కొందరికి మజా రాజ్యంగా కొందరికి క్షుధా రాజ్యంగా తయారై అష్టకష్టాల కాలవాలమైంది. విద్యాభివృద్ధి తప్ప విజ్ఞాన వృద్ధి శూన్యమై వింత ప్రకృతులతో విఱ్ఱవీగు తుంది. నిజాయితి నిండుకొన్నది.మూఢతా జలనిధి జడనిధియై స్తంభించి పోయింది. మేడలు పెరిగి మేధస్సు తరిగింది. ఫలశూన్యాలైన పైపై నవ్వులు, పల్కరింపులు, ప్రణామాలు సభ్యతా చిహ్నాలైనయి. వన ప్రతిష్ఠలు, శిథిల శిలాఖండ పునరుద్ధరణలు, ఉరుసులు, ఉత్సవాలు, దేశాభ్యుదయ సాధనాలై బక్కపేదల డొక్కల నూరించి కారిస్తూయున్నయి. పురోగమనం తిరోగమనమైంది. ఆంధ్రకవు లంత: పురాంగన కలరు.మాలలల్లి యలంకరణలు చేస్తూ పాతపుంతలో పల్లటీలు కొడుతూ పచార్లు సారిస్తూన్నారు. ఎవరికివారై యమునా తీరాన మున్ను కట్టుకొన్న గుడిసె లిప్పుడున్నత సౌధాలై కంచెలు వైచికొన్నయి. పూర్వమన్నాదమ్ములు,నేడు బ్రదర్లు, భాయీలు భాషలో మార్పు తప్ప ప్రకృతిలో మార్పు లేదు.


ఈ నవ్య యుగం చేసే విచిత్ర నగ నాట్య రభసచే నాలో రేగిన వృథా వాత్యకుక్కిరి బిక్కిరై ఒకానొక రాత్రి నాజీర్ణ జీవిత గ్రంథాన్ని సింహావలోకనం చేసికొన్నాను. జన్మస్థలాన్ని, జననీజనకుల్ని నాటి నేటి రాజకీయ సాంఘిక వ్యవస్థల్ని పరిశీలించి చూచుకొన్నాను. మనశ్శాంతికై కలము పట్టుకొన్నాను. అందలి ప్రథమ నిశ్వాసమే.

జీవిత చరిత్ర రాయడం చాలా కష్టం. అది సత్య నిష్టతో కూడుకున్నది. చాలామంది తన జీవిత చరిత్రను రాసి ప్రజలను మెప్పించ లేకపోయారు. కారణం వారు జీవితాన్ని అనుభవించలేకపోవడం. జీవితాన్ని అనుభవిస్తేగాని పవలరించ లేము. అందుకే ‘నా కథ’ జగత్‌ ప్రసిద్ధమైనది. ఆయన తన ఊరిని తల్లి అని సంబోధించాడు. ఊరిలో వున్న అన్ని దేవాలయాల గురించి ప్రస్తావించాడు. తల్లిదండ్రులకు నేను గారాల సుతుడను అని పేర్కొంటాడు.ఏనుగు మీద గండపెండెరంతో ఊరేగించారని ఆత్మగౌరవంతో చెప్పాడు. వినుకొండ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పాడు. టిప్పు సుల్తాన్‌ కట్టించిన మసీదు విశిష్టతను వివరించాడు. కనకదుర్గను పొగిడాడు. శివాలయాన్ని దర్శింపచేశాడు. చివరకు వినుకొండ ఊరును మనకు దృశ్యీకరింప చేశాడు.


కం. ననుగాంచి పెంచి నాలో

గొనబుం గవనమును, పాదుకొల్పిన తల్లీ!

నను మరచిన నిను మరవను

వినుకొండా! నీకు నా పవిత్ర ప్రణతుల్‌.


కం. వీరయకు లింగమాంబకు

గారాల సుతుండ కవిని గంధగజముపై

నూరేగి చరణమున పెం

డారంబు ధరించినాడ నలువురు మెచ్చన్‌.


ఆయన ఊరిని ఎంత ప్రేమించాడో దేశాన్ని అంత ప్రేమించాడు.ప్రపంచాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆయన తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టాడు. ఆయన కేవలం అక్షర విద్య వలన జ్ఞానం రాదు అన్నాడు. జ్ఞానం నిరంకారులకు,జీవన సత్యాలు తెలుసుకునేవారికి మానవతా స్ఫూర్తి కలిగిన వారికి, మాత్రమే వస్తుంది అన్నాడు. మొదటి నుంచి ఆయన మతోన్మాదాన్ని నిరసిస్తూ మతద్వేషాన్ని నిరసిస్తూ, మనవతా సౌజన్యాలు విరజిమ్ముతూ కవిత్వాన్ని నడిపించాడు. ఆయన జీవిత కథలోకి వెళ్దాం.


కం. గొరియల మేకల నెత్తుటి

ఝరముల నిర్దోషమునను జర్జరితంబై

కరిగినవి గిరులు శ్రుతగిరి

కరుగదనిన అపయశంబు గాదే మనకున్‌.


సీ. కృపలేని నీదు కొంచెపు దృష్టి బాధింప కన్నీరు చిందిన కవనపటిమ

దరిలేని నీ యనాదరణ మాటున మ్రగ్గి మంటి పాలైన సమత్వ సుఖము

ముక్కిపోయిన నీదు మూఢతా జడనిధి మునిగి యిప్పటికి కోల్కొనని చదువు

ఫలమింతలేని నీ భజన కూటములచే ఖర్చైన యౌవన కాల నియతి.


ఇకపోతే మహాకవి జాషువాకి నవయుగ చక్రవర్తి అనే బిరుదు రావడం గురించి కొండవీటి వేంకట కవి నాతో ఇలా చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి కవిరాజు బిరుదునిచ్చారు.తుమ్మల సీతారామమూర్తి గారికి తెలుగు లెంక బిరుదునిచ్చారు. కొత్త సత్యన్నారాయణ చౌదరి గారికి మహాపండిత్‌ బిరుదునిచ్చారు. నాకు కూడా కవిరాజు బిరుదునిచ్చారు. అయితే మహాకవి గుర్రం జాషువా గారికి మాత్రం నవయుగ కవి చక్రవర్తి అని బిరుదునిచ్చారు. మేము శూద్ర కవులం. ఆయన పరిచయ కవి అయినా ఆయనకి నవయుగ చక్రవర్తి అనే బిరుదు వచ్చింది. ఆయనను ఏనుగు మీద ఊరేగించారు అని చెప్పారు. అప్పటి శూద్ర కవుల కంటే కూడా జాషువా గారికి గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఆయన కవిత్వంలో ‘ఊరు’, ‘వాగు’, ‘కొండలు’, ‘పక్షులు’, ‘జీవితం’, ‘దు:ఖం’, ‘నీతి’, ‘వ్యక్తిత్వం’ ఉంటాయి అని కొండవీటి వేంకట కవి చెప్పారు.


జాషువా కవిత్వంలో శిల్ప రహస్యాలున్నాయి. ముఖ్యంగా ఆయన తెలుగు నుడికారాన్ని పలుకుబడినీ, సామెతనీ, కవిత్వంలో మేళవించారు. ఆయన సామాన్యంగా పద్యాన్ని పూర్తి చేయడు. ఆయన పద్యం రాసే పద్ధతి గురించి ‘పిరదౌసి’ కావ్యంలో ఇలా చెప్పారు.


ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురుబొట్టు మేనిలో

దక్కువగా రచించి వృథాశ్రమ యయ్యె గులీనుడైన రా

జిక్కరణిన్‌ మృష ల్వలుకునే? కవితాఋణ మీయకుండునే

నిక్క మెఱుంగనైతి గజనీసులతాను మహమ్మదగ్రణీ.


నిజానికి ‘పిరదౌసి’ జీవితం గుఱ్ఱం జాషువా జీవితానికి దగ్గరగా వుంది. జాషువా జీవితం సుసంపన్నమైంది. కథనాత్మకమైంది.ఆదర్శ ప్రాయమైంది. అందులో దు:ఖం ఉంది. నైతికత ఉంది.పోరాటం ఉంది.ఆవేదన ఉంది. సందేశం ఉంది.అందుకే ఆయన జయంతి రోజున మనమందరం ఘన నివాళి అర్పిద్దాం.


 వ్యాసకర్త : డా|| కత్తి పద్మారావు సెల్‌ : 9849741695

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...