Sunday, September 22, 2024

 



మాదిగలు చర్మకారులు. జంబూద్వీప మూలవాసులు. దక్షిణాన హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ దాకా చర్మకార సమూహాలు అతి పెద్ద జనాభాగా విస్తరించి ఉన్నాయి.


మాదిగలు, చక్కిలియార్లు, మాద్గి, మాంగ్, మాతంగ, చమార్, జాతవ్, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మాదిగదాసు, ఆది జాంబవ, అరుంధతీయ, మోచి, సమగర - ఇలా అనేక పేర్లతో భారతదేశంలో చర్మకార కులాల వారు పిలవబడుతున్నారు.


చర్మకార మాదిగ సమూహాలు ప్రకృతి జీవులు. ప్రకృతి ఆరాధకులు. అమ్మ తల్లిని పూజించే మాతృస్వామ్యాన్ని అనుసరించేవారు. ఎల్లమ్మ, మాతంగి, మాతమ్మ, జోగులాంబ, బసవమ్మ వీరి దేవతలు. మాతృస్వామిక సంస్కృతికి ప్రతీకగా మాతంగి దేవత జనించింది. పునరుత్పత్తి సహజావసరంగా, సగౌరవంగా యోని ఆరాధన జరుగుతున్నది. ఆహార సేకరణ, వేట సమాజాలకు మహిళలు నాయకత్వం వహించారు. విపత్తులను ఎదుర్కోవడంలో, కుటుంబంలో, గుంపు జీవితంలో మహిళలు వీరోచితమైన, ప్రేమైక పాత్ర నిర్వహించి, నాటి మాతృస్వామ్య సమాజాల్లో ఆదర్శనీయులు, పూజనీయులు అయినారు.

వివిధ పురాణాల, మతాల, చరిత్ర, సంస్కృతులను పరిశీలిస్తే, మహారాష్ట్ర, గుజరాత్ లలో మాతంగ కులం ఉన్నది. మాతంగ మహర్షి ఉన్నాడు. మాతంగ కన్యా మనసా స్మరామి అని మహాకవి కాళిదాసు కాళీమాతను పూజించాడు. మాతంగి పర్యాయ పదాలుగా ఆదిశక్తి, అఖిల జనని, మహా విద్యాధరి, ఎల్లమ్మ, సుందత్తి ఎల్లమ్మ, ఏకవీర, లజ్జగౌరి, సవరేశ్వరీదేవి, దుర్గ, కాళి, కాళీమాత, పార్వతి, మాతంగిదేవి, చాముండి, చండాలిక, ఉచ్చిష్ట చండాలిని, రాజమాతంగి, సుముఖ మాతంగి మొదలగు అనేక పేర్లతో భరత ఖండంలో పూజలందు కొంటున్నది. దీనిని బట్టి మన సమాజంలో మాతృస్వామ్య సమాజం జాడలు ఎంతగా విస్తరించి, వ్యాపించి ఉన్నాయో విశదమౌతున్నది. బిడ్డలను, సమూహాలను, సమాజాన్ని ధీరోదాత్తంగా కాపాడి, బతికించే మానవోన్నత మాతృస్వామిక ధర్మమే మాతంగిది అని తెలుస్తున్నది.

పోశమ్మ, మైసమ్మ, మాంకాళమ్మ, ఏకవీర, కాకతమ్మ, సమ్మక్క, సారలమ్మ మొదలగు దేవతలను పరిశీలించినా, బోనాల పండుగ సందర్భంలో ఇప్పటికీ భవిష్యవాణి వినిపిస్తున్న మహిళా సాంప్రదాయాన్ని గమనించినా - మానవ విపత్తులు, అంతకు మించిన ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే వేట, వ్యవసాయ, విద్య, వైద్య, వైజ్ఞానిక యుద్దరంగం మొదలగు రంగాల మేటి మహిళలు పూజనీయరాళ్ళు అయ్యారని, వారి వాణి సమాజ హితమైనదని మనకు అర్థమవుతుంది. మరి ఇంత గొప్ప మాతస్వామ్య వ్యవస్థ ఎప్పుడు ప్రమాదంలో పడింది?

ప్రాచీన భారత ఉపఖండంలో భిన్న మానవ సమూహాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, మాతృస్వామిక సంస్కృతీ సమాజాలే మనుగడ సాగించాయి అనేదానికి ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. గుణగణాల ఆధారంగా మనుషులను ప్లేటో వర్గీకరించిన విధానానికి, ఆర్యులు ప్రవేశ పెట్టిన వ్యవస్థీకృత వర్ణ వ్యవస్థకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఆర్యుల దండయాత్రలు, వలసలతో భారతఖండంలో వర్ణ వ్యవస్థ, నిర్బంధ వృత్తి బానిస వ్యవస్థలూ మొదలయ్యాయి. పితృస్వామ్యం, అంచెల వారీ ఆధిపత్య కుల వ్యవస్థ ఏర్పడింది. దీంతో మాతృస్వామ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడింది. దీనితో ప్రాచీన మాతృ పాలనా సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన మాతంగి వ్యవస్థ ఇప్పటి ఆర్య పితృస్వామ్యం కారణంగా తన దైవిక ప్రాభవం ఒకవైపు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బ్రష్టత్వానికి, దోపిడికీ గురవుతున్నది నేడు.

ఆది జాంబవంతుని నివాస, నియంత్రణా ప్రాంతమే జంబూద్వీపం. ఆది జాంబవంతుని వారసులే చర్మకార సమూహాల వారు. నేడు పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, అత్యాచారాలు, కులహింసలు, వెట్టి చాకిరి, బాలకార్మిక వ్యవస్థ, పారిశుద్ధ్య వృత్తి వ్యవస్థ, భూమి లేకపోవడం, ఇళ్ళు లేకపోవడం, కనీస వేతనాలు పొందలేకపోవడం, క్వాలిటీ చదువులు లేకపోవడం, నిరుద్యోగం, మార్జినలైజేషన్, మూఢనమ్మకాలు మొదలగు అనేక రూపాల్లో మాదిగలు దోపిడీ, పీడనలకు గురవుతూనే ఉన్నారు.

మాదిగ బాలికలను ఈ దేవతలకు అంకితమిచ్చి, పెళ్లిళ్లు చేసి, వారిని విద్యా వికాసాలకు, కుటుంబ జీవనానికి దూరం చేసి, అణిచివేతలు కొనసాగించే దురాచారాలు గ్రామ సమాజంలో ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.

మాదిగ ఆడపిల్లలను మాతంగి, మాతమ్మ, జోగిని, బసివిని, దేవదాసీలుగా అంకితం ఇచ్చినా, ప్రోత్సహించినా, వినోదించిన, ఇలాంటి వారికి మూడేళ్లు జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా అని 1988లో వచ్చిన, ఏపీ దేవదాసి వ్యవస్థ రద్దు చట్టం చెబుతున్నది. కానీ, ఇంతవరకు ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఇంకా అమలు కానేలేదు. ఇదొక చారిత్రక వ్యవస్థీకృత విషాదం.

ఏ సమాజంలోనైనా స్త్రీల విద్య, అభివృద్ధిల స్థాయిలను ఆ సమాజం సామాజిక అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటారు. అణగారిన సమూహాల మహిళల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సాంస్కృతిక, నాయకత్వ పరిస్థితులను పెంపొందించు కోవలసిన అవసరం మరింత ఏర్పడింది. వివక్షలకు తావు లేని, సాధికారాన్ని, మెరుగైన జీవనాన్ని అణగారిన మహిళల హక్కుగా దాఖలు చెయ్యాల్సిన అవసరం, బాధ్యత, సమాజం పై, ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్నది.

ఈ నేపథ్యంలో బాధిత సమాజం నుంచి వచ్చి, కాకతీయ విశ్వ విద్యాలయంలో, చరిత్ర విభాగంలో విశేష పరిశోధన చేసిన విద్యార్థిని డాక్టర్ ఇ.వసంత 'తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మాతంగి సాంప్రదాయం ఒక పరిశీలన' అను అంశంపై పిహెచ్ డి కోసం పరిశోధన చేశారు. ఈ పరిశోధన కోసం ఆమె మారుమూల గ్రామాల్లో ఉన్న మాతంగి క్షేత్రాలను, చారిత్రక కట్టడాలను, మాజీ మాతంగి మహిళలను, మాతంగి పురా గాథలను గురించి వివరించే బైండ్ల కళాకారులను, సంబంధిత కమ్యూనిటీ ప్రజలను కలిసి ఎన్నో ఆధారాలను, విశేష అంశాలను సేకరించారు. పుస్తక భాండాగారాలను దర్శించి, ఎన్నో విలువైన చరిత్ర గ్రంథాలను, పరిశోధనా గ్రంథాలను పరిశీలించారు. యీ గ్రంథంలో దక్షిణ భారతదేశ మాదిగల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో వున్న చర్మకార సమూహాల్లో మాతంగి వ్యవస్థ ఎంత ప్రాచీన కాలం నుంచి, ఎలా వేళ్ళూనుకొని ఉన్నదో విస్తృతమైన, లోతైన అధ్యయనం, ఆంతరిక విశ్లేషణతో తన పరిశోధనా గ్రంథంలో వెల్లడించారు. మాతంగి ఒకనాటి మాతృస్వామిక వ్యవస్థ సంస్కృతికి ఎలా ప్రతీకగా నిలిచిందో యీ పరిశోధకురాలు చక్కగా విశ్లేషించారు. అలాగే ప్రస్తుత పితృస్వామిక వ్యవస్థ ఒకప్పటి ఉన్నత, సదాచారమైన మాతంగి వ్యవస్థను వ్యవస్థీకృత దురాచారంగా ఎలా మార్చివేసిందో విశ్లేషించారు. చారిత్రక ఆచారాల్లో మహిళల నిమ్నోన్నతాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పరిశోధక గ్రంథాన్ని తప్పక చదివి తీరాలి. తాను చేసిన కృషికి డాక్టర్ వసంత చాలా అభినందనీయురాలు.

కృపాకర్ మాదిగ

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...