Thursday, September 19, 2024

 

అదెలాగో పరిశీలిద్దాం! క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో ఇరాన్లో 'హఖీమని' వంశం ఒకటి ఉండేది. ఆ వంశంలో ప్రసిద్ధుడు మొదటి డేరియాస్.ఆయన సెప్టెంబర్ 550-అక్టోబర్ 436 BCE సాధారణ శకానికి ముందు కాలంలో సుమారు 64 ఏండ్లపాటు జీవించాడు. ఈ హఖీమని వంశాన్ని అఖియమినిడ్ వంశం అని కూడా అంటారు. ఆ పదాన్ని అనుసరించుకుంటే- 'స్నేహితుని హృదయంలో ఉండేవారు' అని చెప్పుకోవచ్చు. డేరియస్ ద గ్రేట్గా చరిత్రలో నమోదయిన ఈ చక్రవర్తి (Emperor) అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యం ఇరాన్ నుండి మన సింధూ ప్రాంతం వరకు విస్తరించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ఈ ఇరాన్ వంశం వారే తాము 'ఆర్యపుత్రుల'మని గర్వంగా చెప్పుకునేవారు. ఈ విషయం వారి శిలాశాసనాల ద్వారా తెలిసింది. వీరే భారతదేశంలోకి ప్రవేశించారన డానికి చారిత్రక ఆధారాలు దొరికాయి. ఈ హఖీమని వంశం వారు మన భారతదేశంలోకి వచ్చినపుడు కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ భారతదేశంలో బావులున్నాయి. అక్కడ వారి అరబ్ ప్రాంతంలో లేవు. ఇక్కడ ఏనుగులున్నాయి. వారి ప్రాంతంలో లేవు. ఇక్కడ మనదేశంలో పెద్దపెద్ద చింతచెట్లున్నాయి. వారి ప్రాంతంలోలేవు. ఇవన్నీ వారికి సంభ్రమాశ్చర్యాలు కలిగించే విషయాలయ్యాయి.
అరబ్ దేశాల వారు నీటికొరకు వర్షాల మీద ఆధారపడతారు. వర్షాలు పడ్డప్పుడు పర్వతాల నుండి ప్రవా హంగా వచ్చే నీటిని నిలువ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటారు. మనకు ఇక్కడ సింధూ నాగరికత నాటినుండే బావులున్నాయి. అందువల్ల ఇక్కడి వారికి అవి కొత్తకాదు. ఇరాన్ వారికి కొత్త వర్షం కురిపించే దేవుడు ఇంద్రుడు అనే భావన ఉందికదా? అది వారి పుగార్ కొయి శిలాశాసనాలలో ఉంది. అయితే వారు ఇంద్రుణ్ణి 'ఇందర్' అన్నారు. ఇందర్ అన్నా నీరే, సముందర్ (సముద్రం) అన్నా నీరే. బందర్ గాహ్ అంటే సముద్రపు ఒడ్డు. అంటే బందర్ కూడా నీటికి సంబంధించిన మాటే, ఇక్కడ బందర్ అంటే కోతి కాదు. (బహుశా, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న బందరుకు కూడా పేరు ఆ విధంగానే వచ్చి ఉంటుంది) అందువల్ల ఇక్కడ భారతదేశంలో బావుల్ని చూసి వారు, వాటిని ఇంద్రాగార్ (ఇంద్ర-ఆగార్) అని అన్నారు. ఆగార్ అంటే ఖజానా. బావులంటే నీటి ఖజానాలని వారు భావించారు. ఇంద్రాగార్ అపభ్రంశమై అనేక రకాలుగా మార్పులు చెందింది.ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల బావులను బోజ్పురి ఇంకా ఇతర ప్రాంతీయ మాండలికాల్లో ఇనారా/ఇనార్/ఇందారా అని అంటున్నారు.ఇవన్నీ ఇంద్రాగార్కు మారు రూపాలే (వికృతి)
తొలిసారి హఖీమని వంశం వారు భారతదేశంలో ఏనుగులను చూసి 'హస్తీమృగ' అన్నారు. హస్తం ఉన్న జంతువు అని అర్థం.తొండాన్ని వారు చేయిగా భావించారు. అలాంటి అవయవం మరే జంతువుకు లేదు.ఇరాక్, ఇరాన్ ప్రాంతాలలో ఏనుగులు ఉండవు గనక అది వారికి ఒక చిత్రమైన ప్రాణి (మృగహస్తీన్) మృగ అని ఎందుకు అన్నారంటే- మృ అంటే మట్టి గ అంటే గమనం. మట్టి మీద తిరిగేవి. మనిషితో పాటు భూమి మీద సంచరించేవన్నీ మృగాలే. చెట్లమీద తిరిగే కోతులను శాఖామృగ అని అన్నారు. అలాగే ఖగ-ఖ అంటే ఆకాశం. గ అంటే గమనం. ఆకాశంలో విహరించేవి. పక్షులు అలాగే చూడండి.భూగోళానికి ఎదురుగా ఉన్నది. ఖగోళం అని అంటు న్నాం కదా? ఇది మట్టి గోళమయితే, అది ఆకాశగోళమని అర్థం. వాడుకలో ఏనుగు 'హాథీ (చేయగలది) అయిపోయింది.
ఇరాన్ ప్రాంతంలో ఖర్జూర (తమరే) చెట్టు తప్ప, చింతచెట్లు ఉండవు. ఆర్యులు మొదటిసారి ఇంత పెద్ద చెట్టు చూసి విన్మయ చకితులయ్యారు. దాని పండు రుచిచూస్తే తియ్యగా, పుల్లపుల్లగా ఉంది. అది వారికి ఖర్జూరం లాగా అనిపించింది. అందుకే 'తమరే ఐ హింద్' (ఇండియా ఖర్జూరం) అని పేరు పెట్టారు. ఖర్జూర ఫలాలను వారు తమరే అని పిలుస్తారు కాబట్టి. తమరే ఐ హింద్ అన్నారు. ఇరాన్ ప్రాంతం నుండి ఇంగ్లీషు వారు ఆ పదాన్ని తీసుకుని 'టామర్-ఇండ్' (ఇండియా ఖర్జూరం) అని అన్నారు. ఆ పదమే వాడుకలో టామరిండ్' (TAMAR- IND) అయ్యింది.
దేశంలోకి ఆర్యులు చొరబడ్డాక, వారు చేస్తూ వచ్చిన అరాచకాలకు లెక్కలేదు. అయితే కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకుందాం! చాలామంది ఇంటి ముఖద్వారానికి గుమ్మడికాయ కట్టుకుంటారు. ఎందుకూ? దిష్టి తగల కుండా అని చెపుతారు. దిష్టి అనేది నమ్మకం మాత్రమే. అది నిరూపణ కాలేదు. అది ఒక మూఢనమ్మకంగా కొనసాగుతోంది. అసలు ఆచారం ఎలా మొదలైంది? అని గతంలోకి వెళ్లి చూస్తే వళ్లు గగుర్పొడిచే నిజం బయట పడుతుంది. శృంగ వంశం వారు (185-72 BCE ) బౌద్ధాన్ని నాశనం చేయడం ప్రారంభించారని మనకు తెలుసు. బౌద్ద భిక్షుల తలలు నరికి తెచ్చిన వారికి పుష్యమిత్ర శృంగుడు (185-149 BCE) బహుమానాలు అందించే వాడని కూడా మనకు తెలుసు. ఆ సాంప్రదాయాన్నే ఆ తర్వాత వచ్చిన వైదిక మతాభిమానులైన రాజులు కొన సాగించారు. వీరి ఆగడాలు తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి బౌద్ధులు చుట్టుపక్కల దేశాలకు పారి పోయారు. అదంతా మళ్లీ వేరే విషయం. ఆ సమయం నుండే తాము ఒక బౌద్ధ భిక్షువు తల నరికామని గర్వంగా ప్రకటించుకోవడానికి కొందరు తమ ఇండ్ల ముఖద్వారాలకు తల ఆకారంలో ఉండే గుమ్మడికాయను కట్టుకునేవారు. తాము తమ పాలకుల దృష్టిలో పడాలనీ, వారి గుర్తింపు పొందాలనీ తాపత్రయపడేవారన్నమాట! ఆ విధంగా అది ఒక ఆనవాయితీ అయ్యింది. తలలు నరకడమనే హింసాత్మకమైన కారణాన్ని కప్పిపుచ్చడానికి ఆర్య బ్రాహ్మణులు దిష్టిని ప్రవేశపెట్టారు. ఇతరుల దిష్టి తగలకుండా తమ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవాలన్న ఒక ముఢాచారాన్ని వారు ప్రచారం చేశారు. అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈ కాలానికి అవసరం లేనివి పాటించడం అవసరమా? అన్నది సమకాలీనంలో మనం ఆలోచించుకోవాలి కదా?
గతంలో కొన్ని వందల యేండ్ల క్రితం రాజులు, జమిందారులు, దేశ్ముఖులు, సమాజంలోని ప్రముఖులు వేటకు వెళ్లేవారు. వారు వేటలో చంపిన జంతువుల గుర్తులు అంటే జింక చర్మాలు, దుప్పికొమ్ములు వగైరా తెచ్చి దివాన్ ఖానాలోనో, ముందు హాల్లోనో డాబుగా ప్రదర్శించుకునేవారు. పులిగోరు లభిస్తే దాన్ని బంగారు గొలుసుకు అమర్చి, ఒక మెడల్లా మెడలో ధరించేవారు. ఇంటికొచ్చిన అతిధులు తమ ఘనతను గుర్తించాలని అలా చేసేవారు. అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కదా? ఎవరైనా, ఏదో ఒక విషయంలో విజయం సాధిస్తే, దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా ఫొటో, డ్రాయింగ్ రూంలో పెట్టుకుంటున్నాం కదా?అలాగేనన్నమాట! ఒకా నొకప్పుడు బౌద్ధ భిక్షు తలనరికామని గర్వంగా చెప్పుకోవడానికి సంకేతంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టు కునేవారు. లక్షలాది బౌద్ధ సన్యాసుల రక్తంతో ఈనేల ఇంకిపోయిందని గుర్తుచేస్తున్నట్టుగా ఉంది- ఇంటి ముఖ ద్వారానికి వేలాడుతున్న గుమ్మడికాయ!
బౌద్ధుల కాలంలో సిద్ధార్థుడి తల్లి మహామాయ శిల్పాల్ని ఆనాటి శిల్పులు చెక్కుకున్నారు. ఆ మహా మాయ శిల్పంలో ఆమె పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. రెండు వైపుల నుండి రెండు ఏనుగులు తొండాలు ఆర్చ్లాగా ఎత్తి ఆమె మీద నీళ్లు పోస్తుం టాయి. అంటే అభిషేకమన్నమాట! మహా మాయ కాళ్ల దగ్గర పెద్ద కాడలున్న పువ్వులు చెక్కి ఉంటాయి. పూర్తిగా ఆ శిల్పాన్ని కాపీకొట్టి, వైదిక మతస్థులు శ్రీలక్ష్మి చిత్రపటానికి రూపకల్పన చేసుకున్నారు. లక్ష్మీదేవి చిత్రపటాలు కానీ, పెయింటింగ్స్ కానీ 120 ఏండ్లకు ముందు లేవు. అంతకు ముందు లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు-మహామాయ శిల్పంలోలాగే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. దూరం నుండి రెండు ఏనుగులు చెంబులతో లక్ష్మీదేవి మీద నీళ్లుపోస్తుంటాయి. ఆ విధంగా విదేశీ ఆర్య బ్రాహ్మ ణులు ఒక పెద్ద కుంభకోణం చేసి మొత్తం భారతదేశాన్ని మోసం చేశారు. మీరు ఎప్పుడైనా హిందూ దేవీ దేవతల ఆలయాలకు వెళ్లినపుడు ముఖద్వారానికి పైన మహామాయ శిల్పం కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించండి, తెలుస్తుంది. ఎందుకంటే తొలి శిల్పులు బౌద్ధులు, మొదట కట్టబడ్డవి బౌద్ధరామాలు. వాటిని శివాలయాలు, విష్ణు ఆల యాలుగా మార్చుకున్నారనడానికి నూటికి నూరుశాతం ఆధారాలు కనిపిస్తున్నాయి. 120 ఏండ్లకు ముందు లక్ష్మీదేవి శిల్పాలు, పెయింటింగ్స్, చిత్రపటాలు ఏవైనా ఉన్నాయని వైజ్ఞానిక పద్ధతుల ద్వారా నిరూపిస్తే, తప్పదు మనం ఒప్పుకోవాల్సిందే- కానీ, వాళ్లు ఆ పని చేయలేరు. కారణం అవి లేనేలేవు గనక!
బుద్ధుని తల్లి మహామాయ కోసం కట్టుకున్న పద్దెనిమిది మందిరాలను 'అష్టాదశ శక్తి పీఠాలు'గా మార్చు కున్నారు. అలాగే బుద్ధుడి పన్నెండు మందిరాలను 'జ్యోతిర్లింగాలు'గా మార్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిట్టా చాలా పెద్దదే అవుతుంది. శ్రీలంకలోని మహామాయను కూడా హిందూ దేవతగా మార్చుకుని 'శక్తిమాత మట్టెలుండే చోటు' అని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇలాంటిదే మరో విషయం ఉంది. ఆలయ నిర్మాణ వైశిష్ట్యం గూర్చి గొప్పగా చెపుతారు. పూజారులు ఉచ్ఛరించే వేద మంత్రాలు గాలీ, వెలుతురూ చొరబడని గర్భగుడిలోని నాలుగు గోడల్ని తాకి-మధ్యలో ఉన్న దేవతా విగ్రహాన్ని లేదా శివలింగాన్ని తాకి, ఒక శక్తి ఉత్పన్నమౌతుందనీ, అది బయటికి వచ్చి భక్తుల మీద ప్రస రించి పాజిటివ్ ఎనర్జీ అందిస్తుందనీ-సూడోసైన్స్ ప్రచారం చేస్తున్నారు. ఇలా మాటలు చెప్పేవారు ఉట్టి మాటలు కట్టి పెట్టి-వైజ్ఞానిక పరికరాలు ఉపయోగించి నిరూపించాల్సి ఉంటుంది. దాంతో వారు మూర్ఖులు కారు. వైజ్ఞానిక ఆవగాహన ఉన్నవారేనని మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది.
బ్రాహ్మణార్యులు ప్రతి విషయంలో మోసం చేస్తూనే వచ్చారు. బుద్ధుడి జన్మస్థలమైన లుంబినిని అశోకుడు దర్శించాడనీ, అక్కడ ఒక స్థూనం నిర్మించాడని చరిత్ర చెపుతోంది. ఇప్పటికీ ఆ స్థూపం అక్కడ ఉంది. స్థూపం దగ్గర ఉన్న ఫలకం మీద 'దేవానాం పియ పియ దస్సి' అని రాసి ఉంది. 'పియదస్సి' అంటే అశోకుడు. దేవతలకు ప్రియమైన రాజు. ఆశోకుడు King Piyadassi The belved of Gods అని. అర్థం మార్చి ప్రచారం చేశారు! అసలైతే, ఆఫ్ఘనిస్తాన్ నంచి ఇక్కడ దక్షిణ భారతదేశం దాకా ఉన్న లక్షలాది అశోక స్థంబాల మీదగానీ, అశోకుని శిలా శాసనాలలో గానీ, చారిత్రక గ్రంథాలలో గాని ఎక్కడా ఇతర దేవీ దేవతల పేర్లు కనబడవు. ఇక్కడ దేవా అంటే బుద్ధ దేవుడనే అర్థం. పాలిభాషలో వాళ్లు దేవ- అని రాసుకున్నారంటే, ఆది బుద్ధ దేవుడిని ఉద్ధేశించి రాసుకున్నదే! అందువల్ల 'దేవానం పియ పియదస్సి' అంటే బుద్ధ దేవుడికి ప్రియమైన రాజు ఆశోకుడుగా మనం అర్థం చేసుకోవాలే తప్ప - అక్కడ ఇతర దేవీదేవతల ప్రసక్తి ఉన్నట్టు కాదు. ఇతర దేవతలకు ప్రియమైన రాజు అని వైదిక మతస్థులు చెసింది కేవలం దుష్ప్రచారమే!
- సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్ నుంచి)
- డాక్టర్ దేవరాజు మహారాజు

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...