Wednesday, October 28, 2020

బషీర్ బీ బీ

 


        బషీర్ బీబీ తీర్ధం( బంగారుపాప)


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




    జానకీరాం మాస్టారుకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యింది. పొన్నాడ పేరు చెప్పగానే తోటి ఉపాధ్యాయులు మంచి చరిత్ర ప్రసిద్ది చెందిన ఊరు వెళుతున్నారంటూ అభినందించారు.అక్కడ బషీర్ బీబీ దర్గా ఉందని ,ఉరుస్సు ఉత్సవాలు బాగా నిర్వహిస్తారని ,మతసామరస్యానికి చిహ్నంగా పేరు పొందినదని చెప్పారు. అంతే అంతకు మించి ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. బడిలో చేరిన మాస్టారును పలకరించడానికి అందరూ వస్తున్నారు. వచ్చిన వారిని బషీర్ బీబీ దర్గా విశేషాలు అడుగుతున్నారు మాస్టారు . బంగారుపాప అంటారని, బంగారపాపమ్మ తీర్ధమని పిలుస్తారని చెపుతున్నారు. తీర్దం మూడురోజులు జరుగుతుందని దేశ నలుమూలల నుండి ముస్లీం మతస్ధులు  కుటుంబాలతో వస్తారని, చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన హిందూ మతస్ధులు కూడా దర్గాను దర్శించి తమ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు జరిగితే చీర,రవిక, గాజులు  మొక్కుగా చెల్లించుకుంటారని ఊరిలో పెద్దలు వారికి తెలిసింది చెప్పారు.

 మధ్యహాన్నం భోజనం ముగించి విరామ సమయంలో దర్గా చూడడానికి వెళ్ళారు మాస్టారు. నిర్మానుష్య ప్రాంతంలో పాడుబడిన పురాతన శిధిల భవనంలా కనిపించింది. అది ముస్లీం ప్రార్ధన మందిరంలా అనిపించలేదు. దర్గా పరిసర ప్రాంతాలలో జనసంచారం కనిపించలేదు కాని దర్గా దర్శనానికి వచ్చిన ఓ రెండు మూడు ముస్లీం కుటుంబాలు ప్రక్కనున్న షెడ్ లో వంట చేసుకుంటూ కనబడ్డాయి. దర్గా మధ్యలో ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దానికి చమ్కీవస్త్రాలు  కట్టి ఉన్నాయి. అవి గాలికి అటూ ఇటూ  ఎగురుతూ ఉన్నాయి .చుట్టూ పరిశీలించి వచ్చేశారు జానకీరాం మాస్టారు.

 తరువాత రోజు బడి దగ్గరకు ప్రక్కస్కూల్ ప్రసాదు మాస్టారు వచ్చారు. మాటల సందర్భంలో బంగారుపాప అని ఎందుకు పిలుస్తారో చెప్పారు. పూర్వం ఇక్కడ ఉండే బంగారుపాప అప్పుల బాధలలో ఎవరైనా ఉంటే  అడగగానే తన బంగారునగలు తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చేదని అందుకే అందరూ బంగారు పాప అని పిలిచేవారని ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారని జనం నాలుకలమీద నానే కథను చెప్పారు. అయినా జానకీరాం మాస్టారుకు ఆ సమాచారం తృప్తిని ఇవ్వలేదు. దర్గాకు చెందిన విశేషాలు ఇంకా తెలుసుకోవాలని దగ్గరలో ఉన్న మూలపేట గ్రామం వెళ్ళారు.గ్రామంలో చదువుకున్నవారి దగ్గర సమాచారం ఏదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో. అక్కడ ఓ బ్రాహ్మణ కుటుంబం కంటబడింది. మాస్టారు వాకబు చేస్తుంటే లోపలనుండి ఒకాయన వచ్చి మా పూర్వీకులు రాసిన పుస్తకం ఒకటుందని 

‌చెప్పి లోపలకు వెళ్ళాడు. మాస్టారుకు !చెప్పలేని ఉత్సుకత ,ఆనందం కలిగింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయ్యింది. లోపలకు వెళ్ళిన ఆయన ఓ చివికిన పుస్తకం తీసుకు వచ్చి చేతికి ఇచ్చాడు. ఆయన చేతిలో ఓ పాతిక రూపాయలు పెట్టి గబగబా వెనక్కి తిరిగి వచ్చేసారు మాస్టారు.

       స్కూల్ అయిన తరువాత ఇంటికి వెళ్ళి భోజనం ముగించి పుస్తకం చదవడం ప్రారంభించారు. అది చారిత్రక నవల.

70  సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం.పీఠికలో దర్గా కథను రచయిత కలలో కనబడి బంగారుపాప రాయించుకున్నట్టుగా ఉంది.వేయి సంవత్సరాల క్రితం నాటి మాట. 

పొన్నాడ షెహర్ డిల్లీ పాదుషాల ఏలుబడిలో వుండేది. పొన్నాడ షెహర్ శ్రీకాకుళం వరకు ఏలుబడిలొ వుండేది. పొన్నాడను పరిపాలిస్తున్న వజీర్ స్త్రీలోలుడు. అందమైన యువతులను చెరపట్టి ఢిల్లీ పాదుషాలకు భార్యలుగా పంపేవాడు. శ్రీకాకుళంలో నివశిస్తున్న సుందరి, బీషీర్ బీబీ స్నేహితురాళ్ళు. ఇద్దరూ మంచి సౌందర్యవతులు  .సుందరి హిందూమతానికి చెందిన యువతి. బషీర్ బీబీ ముస్లీం వనిత. బషీర్ బీబీకి ఆనాటికే వివాహమైంది. భర్త ఢిల్లీ  ఫాదుషాల దగ్గర  సైనికదళంలో పనిచేస్తూ ఉండేవాడు.  ఢిల్లీ పాదుషాకు ఇక్కడ బషీర్ బీబీ ,సుందరి అనే అందగత్తెలున్నారని కబురు పెడతాడు వజీర్ .అందులో బషీర్ బీబీ మహా అందగత్తే అని చెపుతాడు. ఢిల్లీ పాదుషా బషీర్ బీబీ కోసం పొన్నాడలో మనోహరమైన 7 అంతస్దుల భవనం నిర్మించమని ఆదేశిస్తాడు.  వజీర్ ఆఘమేఘాల మీద పరిసర ప్రాంతం దుర్గాడ  నుండి నల్లరాళ్ళను తెచ్చి భవంతి నిర్మాణం వెంటనే ప్రారంభిస్తాడు.వజీర్ నుండి తప్పించుకోవడం కోసం పొన్నాడ నగరానికే మారువేషాల్లో వస్తారు స్నేహితురాళ్ళు .పొన్నాడ షెహర్ లో వజీర్  ఆడవారి పట్ల చేస్తున్న  దౌర్జన్యాలపై ప్రజలను చెైతన్య పరుస్తారు. ప్రజలకు అడిగిన వారికి తోచిన సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు.ఢిల్లీలో ఉన్న బషీర్ బీబీ భర్త అనారోగ్యం పాలవడంతో ఇంటికి ప్రయాణవుతాడు. చివరకు ఇద్దరు స్నేహితురాళ్ళు వజీర్ సైనికులకు దొరికిపోతారు.ఇంతలో బషీర్ బీబీ భర్త పొన్నాడ మీదుగా శ్రీకాకుళం వెడుతూ పొన్నాడలో మరణిస్తాడు. అది తెలిసి సైనికుల నుండి తప్పించుకుని బషీర్ బీబీ తన భర్త శవంతోపాటు ఢిల్లీ  పాధుషా తనకోసం నిర్మించిన భవంతి పైనుండి అడుగుభాగానికి పోయి సజీవసమాధికి సిద్దపడుతుంది. పై అంతస్దుకు చేరుకున్న సుందరి క్రిందకు చూస్తుంది . భర్త శవం ప్రక్కనే ధ్యాన ముద్రలో ఉన్న బషీర్ బీబీ బంగారుకాంతులు ఈనుతూ కనిపిస్తుంది సుందరికి. అప్రయత్నంగా సుందరి " ఓ బషీర్ బీబీ నా బంగారు పాప" అంటూ పిలుస్తుంది. బంగారుపాప కనులు తెరచి "సుందరీ నా ప్రియమైన మిత్రురాలా ఈ చోటును దర్శించి భక్తితో నన్ను "బంగారుపాప" అని ఎవరు పిలుస్తారో వారి కోరికలు నెరవేస్తాను. మన స్నేహనికి గుర్తుగా ఇక్కడ హిందూ ముస్లీంలు అందరూ కలసి తీర్ధం ఆచరిస్తారని అంటూ ధ్యాన ముద్రలోకి తిరిగిపోతూ కనులు మూసేసుకుంటుంది. ఇంతలో ఉప్పాడ సముద్రం ఉప్పొంగి సునామీలా పొన్నాడపై విరుచుకు పడుతుంది. వజీర్ సైన్యం ఇసుకమేటలలో కూరుకుపోయి చనిపోతారు. ఇసుకమేటలలో బంగారుపాప భవనం చివరి అంతస్దు మాత్రమే కనబడుతూ మిగులుతుంది.. ఆనాటినుండి ఆ చివరి అంతస్ధు భాగం  దర్గాగా పూజలందుకుంటూ ఉంది. నవల చదవడం పూర్తి చేసిన జానకీరాం మాస్టారు గుండె నిండా ఊపిరి పీల్చి మంచి చారిత్రక పుస్తకాన్ని చదివానని ఆనందపడుతూ తృప్తి నిండిన మనస్సుతో బంగారుపాప నవలను ప్రక్కన పెట్టి నిద్రకు ఉపక్రమిస్తారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



     

మత్స్యకారుల జీవన విధానం

 మత్స్యకారుల జీవనం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



సముద్రతీర ప్రాతం అయిన ఉప్పాడ గ్రామంలో ఓ కుటుంబం నివశిస్తూ ఉండేది. తేజ  ఎనిదవ తరగతి చదువుతున్నాడు.తన తల్లిదండ్రుల పేర్లు దేవయ్య, కటాక్షం. దేవయ్య ఊరిలో మోతుబరి. ఒకరోజు బాగా చీకటి పడింది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. రేడియోలో  ప్రకటన వస్తుంది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవ్వరూ సముద్రం పైకి వేటకు వెళ్ళవద్దని అనౌన్సర్ చదువుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంబం అయ్యింది. అప్పుడే భోజనాలు ముగించి నులకమంచం మీద నడుం వాల్చాడు దేవయ్య . మరో మంచంపై దుప్పటి కప్పుకుని తేజ ఇనప పెట్టె పై పెట్టిన  దీపంబుడ్డి దగ్గరకు వచ్చిన తూనీగతో ఆడుకుంటున్నాడు. కటాక్షం ఇల్లంతా సర్ది తనూ నడుం వాల్చబోయింది. బయట హోరున వర్షం కురుస్తుంది. ఇంతలో వీధి తలుపును ఎవరో తడుతున్నట్టు అనిపించి దేవయ్య దిగ్గున లేచివెళ్ళి వీధి తలుపు గడియ తీసాడు. సుబ్బంపేటలో పేరు మోసిన చేపలవ్యాపారి కాశీబుల్లొడు వర్షానికి బాగా తడిసిపోయి వణుకుతున్నాడు. దేవయ్య కంగారుపడుతూ కాశీబుల్లోడిని లోపలికి ఆహ్వనించి ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకోమని రుమాలు, పంచే ఇచ్చాడు.

కటాక్షం కంగారుపడుతూ కాశీబుల్లోడికి భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటగదిలోనికి పరిగెత్తింది.

"దానవాయిపేట నుండి వ్యాపారం నిమిత్తం సవారి బండి మీద వెళ్ళి వస్తుంటే దారిలో వర్షం ఎక్కువైయ్యి మీ ఇంటి దగ్గర ఆగానని" చెపుతున్నాడు కాశీబుల్లోడు.

ఇంతలో పళ్ళెం నిండా వేరుసెనగకాయలు వేపి 

పట్టుకు వచ్చింది కటాక్షం . తేజ గబగబా గుప్పెడు తీసికుని తినసాగాడు. దేవయ్య కాశీబుల్లోడుతో మాటలు కలుపుతూ  

"ఎప్పటినుండో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మత్స్యకారుల జీవన విధానం గురించి చెప్పండి కాస్త అన్నాడు దేవయ్య

  "తప్పక చెబుతాను " అంటూ  తలను రూమాలుతో రుద్దుకుంటూ చెప్పడం మొదలెట్టాడు కాశీబుల్లోడు. తేజలో ఆసక్తి పెరిగింది ఏం చెపుతారా అని.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజసిద్దమైన   పొడవైన సముద్రతీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలు నెల్లూరు జిల్లా తడ వరకూ ఈ తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ తీరప్రాంతాన్ని ఆనుకుని  మత్స్యకారులు నివసించే వందలాది గ్రామాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో  అగ్నికుల క్షత్రియులు వీరినే పల్లీలు అని పిలుస్తారు, వాడబలిజ, జాలరి,గంగపుత్రులు వంటి మత్స్యకార తెగలవారు నివసిస్తూ ఉన్నారు."

"వీరి జనాభా ఎంత ఉంటుందంటారు ?"

అడిగాడు దేవయ్య

"వీరి జనాభా సంఖ్య దాదాపు 60 లక్షలువరకూ ఉండవచ్చు.వీరు మొదటిలో వ్యవసాయం చేసినప్పటికి  ఆ తరువాత కాలంలో చేపలు పట్టే వృత్తిని స్వీకరించారు.కొంత మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు .ప్రధానంగా చేపలవేట మీదే వీరు జీవిస్తూ ఉన్నారు. సముద్రం,నదులు,కాలువలు,చెరువులు, కుంటలలో వీరు చేపలను పట్టి అమ్ముతూ జీవిస్తారు. "

"పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఏముంది?"  అడిగాడు దేవయ్య

" మహాభారత పురాణ హితిహాసాలకాలం నుండి వీరి మనుగడ ప్రస్తావన ఉంది.వీరిని గంగపుత్రులు అనికూడా పిలుస్తారు. వీరి ప్రధాన ఆధాయ వనరు సముద్రపువేట."

"మరి కుటుంబ జీవనం ఎలా వుంటుంది" అని అడిగాడు దేవయ్య.

‌  "మత్స్యకారులది ఎక్కువగా ఉమ్మడి కుంటుంబ వ్యవస్ద. ఇప్పటికీ వీరిలో కులకట్టుబాట్లు అధికం. కుటుంబంలోని మగవారు ఆడపిల్లల బాధ్యతను చేపడతారు వీలు కుదరకపోతే గ్రామంలోని అన్ని కుటుంబాలు బాధ్యతను పంచుకునే అపురూపమైన సమిష్టి జీవనవిధానం ఇంకా వీరిలో అమలవుతూ ఉండటం ఆశ్చర్యం అభినందనీయం."

"నిజమేనండి ఎంత మంచి కట్టుబాటు" 

ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేసాడు దేవయ్య 

కాశీబుల్లోడు చెపుతూ"ఒక కుటుంబంలోని మగవారు అందరూ చేపలవేటకు వెళతారు తెచ్చిన చేపలను ఆడవారు బజారుకు పట్టుకు వెళ్ళి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తారు."


"అంకుల్  చేపలవేటకు ఏం ఉపయోగిస్తారు?" ఆసక్తిగా అడిగాడు తేజ


‌ "చేపలవేటకు వీరు వలలను ఉపయోగిస్తారు. కుంటలలో చేపలు పట్టడానికి చేతులు ఉపయోగిస్తారు. దీనిని "తడుముకోవడం" అంటారు.చెరువులలో "కొంటె వల"ద్వారా చేపలు పడతారు. నదులలోను, సముద్రపు ఉప్పుటేరులలోనూ మూడు కర్ర దుంగలను ఒకటిగా కట్టిన "తెప్ప పడవ" వాడతారు."మోచేతి వల"ద్వారా పట్టిన చేపలను తాటాకుతో చేసిన "బుంగ"లో వేసుకుంటారు."

"ఇంకే ఉపయోగిస్తారు"  అడిగాడు దేవయ్య

‌     కాశీబుల్లోడు  చేతిలోని వేరుసేనగకాయ పగులకొట్టి పల్లీ వలిసి నోటిలో వేసుకుని నమూలుతూ   "పడవ,బోటు, మరబోటులను సముద్రపు వేటకు ఉపయోగిస్తారు. పడవ ముందుకు వెళ్ళడానికి నీటిని వెనక్కి నెట్టే తెడ్డులను ఉపయోగిస్తారు.సముద్రపువేటలో సూదూరం ప్రయాణిస్తారు. దాదాపు పక్షం రోజులు వరకూ సముద్రంమీదే వేట కొనసాగిస్తారు మత్స్యకారులు."

"వలలు ఎలా తయారవుతాయి చెప్పండి కాశీబుల్లోడు గారు" అడిగాడు దేవయ్య


"పూర్వం వలలను మత్స్యకారులే తయారుచేసుకునేవారు. నూలుదారాలను "వగ్గావు" అనే ప్రత్యేక సాధనంతో నులిపెడతారు. నూలు దారం తయారైనాక ఆడవారు వలలను అల్లుతారు. వలల అల్లికల మధ్య ఖాళీని" పేతు" అని పిలుస్తారు. ఈ పేతు అంగుళం రెండగుళాలు సైజులతో ఉంటాయి.


"అలా ఎందుకు సైజులుగా ఉంటాయి అంకుల్ " అడిగాడు తేజ 

కాశీబుల్లోడు నవ్వుతూ  "మంచి ప్రశ్న. ఈ పేతు సైజును బట్టే రకరకాల చేపలు వలలో పడతాయి. 

త్వరత్వరగా వంట సిద్దం చేస్తున్న కటాక్షం అన్నీ వింటుంది వంటగది గుమ్మం దగ్గర నిలబడి అన్నయ్యగారు జిగురు వాడతారనుకుంటాను"  అని అడిగింది

 కాశీబుల్లోడు నవ్వుకుంటూ "ఎంతైనా మా ఉప్పాడ అమ్మాయి కదా కొంతైనా తెలియకుండా ఉంటుందా !" అంటూ చెప్పడం ప్రారంబించాడు

"తయారైన వల మన్నిక కోసం తుమ్మ చెక్క తుమ్మజిగురును గూనల్లో పోసి వేడిచేస్తారు.గోరువెచ్చని రంగులో వలను నానబెట్టి ఎండబెడతారు . దానితో వలకు పటుత్వం వస్తుంది.

" త్వరగా వండు కటాక్షం కాశీబుల్లోడు గారు ఎప్పుడు తిన్నారో ఏంటో ఏం కూర చేస్తూన్నావ్ అని అడిగాడు దేవయ్య 

"నాటుకోడి గ్రుడ్లు, ఉల్లి తురుము అండి" అంటూ కూర కలపడానికి వెళ్ళింది కటాక్షం. మరలా సంభాషణలోనికి వస్తూ 

"బుల్లొడు గారు అలివి గురించి చెప్పండి కాస్త"

అడిగాడు దేవయ్య

"తప్పకుండా   సముద్రపు వేటలొ "అలివి" అనే ప్రత్యేక విధానం వుంది. ధ్వని శాస్త్ర నిపుణుడు లాంటి "సడిగాడు"అనే వ్యక్తి ముందుగా పడవపై సముద్రంలోనికి వెళ్ళి  "సడికత్తావు" అనే తెడ్డును సముద్రపు నీటిలో ముంచి సడికత్తావు మరో కొనను చెవిదగ్గర పెట్టుకుంటాడు. ఆ సడికత్తావు నుండి చేపలు గుంపులుగా ఎక్కడ తిరుగుతున్నాయో అవి చేసే శబ్దతరంగాలను ఇట్టే  గ్రహించి అక్కడ వలవేయమని  చేతిరుమాలును ఊపుతాడు .అలివి యజమాని "సరంగి"కి చెపుతాడు. అప్పుడు సరంగి పడవపై ఒక కిలోమీటరు మేర తాడును వదులుతూ వెళతాడు దానిని" కొడి ఇవ్వటం" అంటారు.  ఆ తరువాత రెండు కిలోమీటర్లమేర రెండు అడుగుల వలను వదులుతారు. మధ్యలో పెద్దదైన మధ్యవల లేదా "మైపాల" ను వదులుతూ ఆంగ్ల అక్షరం "U " ఆకారంలో పడవను నడుపుతు వలను సముద్రంలో వదులుతారు . ఇప్పుడు రెండు కొసలను ఓ నలభైమంది "రైతులు" అనే పిలవబడే కూలీలు వలను అటూ ఇటూ  లాగుతూ అలివలో పడిన చేపలను ఒడ్డుకు చేరుస్తారు."

"అబ్బో అలివి వెనుక పెద్ద కథే ఉందన్నమాట"

ఆశ్చర్యపోతూ అన్నాడు దేవయ్య


"అంకుల్ మత్స్యకారుల ఆచారవ్యవహారాలు గురించి చెప్పండి?" దుప్పటి ముసుగు మరింత దగ్గరకు బిగిస్తూ అడిగాడు తేజ.


"మత్స్యకారులు దేవతలను ఆరాధిస్తారు. కాశమ్మోరు,నూకాలమ్మ,బంగారమ్మ, గంగమ్మ వీరి ప్రధానదేవతలు. క్రొత్త అమావాస్య రోజున వీరు ఒకరి దగ్గరనుండి మరోకరి దగ్గరకు పనిలోకి కుదురుతూ వుంటారు.హిందూ సాంప్రదాయ పద్దతిలోనే వివాహాలు చేసుకుంటారు.


"ఏదేమైనా నీటి మీద జీవనం ప్రమాదమే సుమండీ"అని సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్నాడు దేవయ్య

"అవును దేవయ్యగారు తుఫానులు, సూనామీలు సంభవించి నప్పుడు ప్రాణనష్టం సంభవిస్తుంది. ఇప్పుడిప్పుడే శాస్త్రసాంకేతికతలను ఉపయోగించి చేపలు పట్టడం నేర్చుకుంటున్నారు."

భోజన పళ్ళెం పట్టుకువస్తూ "రండి అన్నయ్యగారు భోజనం చేసాక మాట్లాడుకుందాం అలా చూస్తారే అన్నయ్యగారికి చేతులు కడుగుకోటానికి నీళ్ళివ్వండి" అంటూ హడావిడి చేసింది కటాక్షం. 




 సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



కాకినాడ కాజా

 కాకినాడ కోటయ్య కాజ


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలం. ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ భరతమాత స్వేచ్చా వాయువులకోసం భారతవీరులు కరవాలాలు ఝళిపిస్తున్నారు  . ఆదే కాలంలో భారతదేశం అద్భుత ప్రతిభావంతులకు జన్మనిస్తున్న సమయం కూడా. తెలుగువీరుల గడ్డ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబం ఓ ప్రతిభావంతుడికి జన్మనిచ్చింది.అతడే చిట్టిపెద్ది కోటయ్య .చిన్ననాటి నుండి కోటయ్యను తండ్రి తనకూడా పొలానికి తీసుకుపోవాలని ఆరాటపడేవాడు. పొలంపని అస్సలు ఇష్టం ఉండేది కాదు కోటయ్యకు . పదేళ్ళ వయస్సుకే  కోటయ్యలో నూతన ఆలోచనలు గజి బిజి చేయసాగాయి. అమ్మ పిండివంటలు చేస్తున్నప్పుడల్లా ఎంతో సంబర పడిపోయేవాడు.తనూ కూడా ఉండలు ఒత్తుతూనో , గరెటెలతో వండినవి పెనం నుండి దించుతుంటేనో  చెప్పలేని ఆనందం కలిగేది కోటయ్యకు.

 పొలంపనికి కోటయ్య రావటంలేదని ఆరోజు పెద్ద రాద్దాంతం చేసాడు కోటయ్య తండ్రి. పొలం పని ఇష్టంలేని కోటయ్య పదేళ్ళవయస్సులో అర్దరాత్రి ఇంటినుండి పారిపోయేడు. కన్నవారు కోటయ్య కోసం వెతకని ఊరులేదూ వెతకని చోటూలేదు. కోటయ్య పోయి పోయి తిరుపతి చేరుకున్నాడు. ఎలా బ్రతకాలో బ్రతకడానికి ఏంచెయ్యాలో తెలియని వయస్సు కోటయ్యది. దూరంగా ఏడుకొండలు కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ ఏడుకొండలవాడా అంటూ పూజలు చేయడం గుర్తుకు వచ్చింది. ఇంతలో తన ముందర నుండి భక్తులగుంపు " ఏడుకొండలవాడా  వెంకటరమణా "  అంటూ కొండ ఎక్కడం చూసాడు.తను కూడా" ఏడుకొండలవాడా వెంకటరమణా " అంటూ  నడవడం మొదలెట్టాడు కోటయ్య . కొంత సేపటికి తిరుపతి కొండ ఎక్కలేక ఓ చెట్టు క్రింద కూలబడిపోయాడు. ఓ ప్రక్క ఆకలి దంచేస్తుంది. ఇంతలో ఓ భక్తుల బృందం కొండ దిగుతూ ఉంది. అందులో ఓ ముసలావిడ అలసిపోయి ఆకలితో దిగులుగా కూర్చున్న కోటయ్య దగ్గరకు వచ్చి చేతిలో తిరుపతి లడ్డు పెట్టింది. గబా గబా సగం తినేసాడు. అబ్బ ఎంత రుచిగా వుందో అనేలోపు లడ్డూతీపిలోని మాధుర్యానికి కోటయ్య  కనులు మెల్లగా మూతలు పడ్డాయి. కనులు తెరచి చూసే సరికి చెన్నపట్టణం అంటే ఇప్పుడు చెన్నై నగరంలో మంచం మీద పడుకుని ఉన్నాడు. వంటపాత్రల చప్పుడుకు మెలకువ వచ్చి గబ గబా మంచం దిగి గది బయటకు వచ్చి చూసాడు. అక్కడ చాలామంది పనివాళ్ళు రకరకాల మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అక్కడ కుర్చీలో జారబడి వినసకర్ర విసురుకుంటూ ఉన్న బామ్మ కనబడింది. ఆ బామ్మే తనకు చేతిలో లడ్డు పెట్టిన బామ్మ అని గుర్తు పట్టాడు కోటయ్య . బామ్మ  కోటయ్యను చూడగానే లేచి దగ్గరకు వచ్చింది. "ఏం నాయనా ఇప్పటికి కళ్ళు తెరచావా. నీకు లడ్డూ పెట్టగానే తింటూనే  నిద్రపోయావు. నువు ఎవరో ఏంటో ఎవరిబిడ్డవో తెలియదు .అందుకే అక్కడ నిన్ను వదిలేయలేక తీసుకువచ్చాను మా ఇంటికి" అంటూ కోటయ్యకు గాలి విసురుతూ చెపుతుంది. కోటయ్యకు మెల్లగా అర్దమయ్యింది. బామ్మగారి బుగ్గన ముద్దుపెట్టాడు. బామ్మగారి మనస్సు వెన్నలా కరిగిపోయింది. తన వృత్తాంతమంతా చెప్పాడు బామ్మగారికి. "పాలుగారేలా ఉన్నావు నిన్ను కొడతాడా మీ నాన్న  వద్దులే అక్కడకు పోవద్దు ఇదిగో మా మిఠాయి దుకాణంలో రకరకాల వంటలు నేర్చుకుంటూ ఇక్కడే ఉండిపో" అంది. కోటయ్యకు బామ్మగారి ప్రేమాభిమానాలు మిఠాయి దుకాణం ఎంతో నచ్చేసింది. కోటయ్య నెల తిరిగేలోపే అన్ని రకారకాల మిఠాయిలు వండటం నేర్చేసుకున్నాడు. పన్నెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఇరవై రెండేళ్ళ వయస్సు వచ్చేసరికి చిట్టిపెద్ది కోటయ్యకు ఇంటి వైపు మనసు లాగింది. అమ్మా నాన్నలను చూడాలనిపించింది. మెల్లగా బామ్మ దగ్గరకు పోయి " మా ఇంటికి వెళతాను" అని బామ్మతో చెప్పాడు. బామ్మకు ఏడుపు  ఆగలేదు కోటయ్య పట్ల ప్రేమ పెంచుకుంది మరి. బామ్మ కన్నీళ్ళు తుడుచుకుని "వెళ్ళు కోటయ్య మీ అమ్మ నీకోసం ఎంత ఏడుస్తుందో, ఎంత బెంగ పెట్టుకుందో" అంటూ గబగబా లోపలికి వెళ్ళి డబ్బులమూట తెచ్చి చేతిలో పెడుతూ దీవించి పంపింది.

  చెన్నపట్టణం మద్రాసుగా మారింది. మద్రాసు నగరం నుండి తెనాలి చేరి తన ఊరు చిన్నపరిమి చేరుకున్నాడు. ఇంటి ముందుకు వెళ్ళి "అమ్మా ! నాన్నా !" అంటూ బిగ్గరగా పిలిచాడు కోటయ్య. ఎన్నాళ్ళగానో  ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్న కోటయ్య తల్లిదండ్రులు గబగబా బయటకు వచ్చి నూనూగు మీసాల కోటయ్యను చూసి గుర్తుపట్టి  కౌగిలించుకున్నారు. ఒళ్ళంతా తడుముతూ ముద్దాడుతూ తనివితీరా ఏడ్చారు. క్షమించమని తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించి లోపలికి నడిచాడు కోటయ్య.

          కోటయ్యకు తల్లిదండ్రులు అనసూయతో పెండ్లి జరిపించారు. కోటయ్య తెనాలిలో మిఠాయి దుకాణం తెరిచాడు. అనతికాలంలోనే మంచి మిఠాయి దుకాణంగా పేరుతెచ్చుకుంది. అయితే ప్రతిభావంతులు ఎప్పుడూ చేతులు కట్టుకు కూర్చోరు. తన పనిలో గొప్పదనం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కోటయ్య మనస్సు నూతన ఆవిష్కరణకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు పిండితో కుస్తీ పడుతున్న కోటయ్యను చూసి భార్య "ఏం చేస్తున్నారండి" అంది. "అనసూయ మనం అమ్మే తినుబండారాలు అందరి దగ్గరా దొరికేవే నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అందుకు ఓ కొత్తరకం వంటకు ప్రయత్నిస్తున్నాను" అన్నాడు కోటయ్య "అసలు మీ ఆలోచన ఏంటో చెప్పవచ్చుకదా " " ఏం లేదు అనసూయ కొరికితే పాకం కారాలి  దానిని చూస్తుంటే  లోపల పాకం ఉన్నట్టు కనబడకూడదు నొక్కితే గట్టిగా ఉండాలి" అన్నాడు కోటయ్య. "ఏంటి ఏంటి విడ్డూరంగా ఉందే "బుగ్గలు నొక్కుకుంటూ కళ్ళు పెద్దవి చేస్తూ కోటయ్య ప్రక్కన పీట వేసుకు కూర్చుంది అనసూయ. "ఏలా చేస్తారు మరి"  "ఏం చేస్తానంటే  ఇదిగో మైదాపిండి  కేజి తీసుకున్నాను దీనికి  ఓ వంద గ్రాములు పచ్చి సెనగపిండి కలుపుతాను." "మైదాలో సెనగపిండి బలేగుందండి"  "అనసూయ నిన్న నువు తయారుచేసిన గుమగుమలాడే నెయ్యి తీసుకురా" అన్నాడు కోటయ్య. అనసూయ లేడిలా వంటగదిలోకి పరిగెత్తి నెయ్యి డబ్బా తెచ్చింది. కోటయ్య అందుకుంటూ  ఇందులో వందగ్రాముల నెయ్యి వేస్తాను. వేసి ఇదిగో నెయ్యితో పిండిని పాలిష్ చేసినట్టు కలుతాను. అంటూ రెండు చేతులలోనికి పిండిని తీసుకుని నలపడం మొదలెట్టాడు. ఓ పదినిమిషాలు

నెయ్యిని మొత్తం పిండికి పట్టించాడు.

"ఆ తరువాత ఏం చేస్తారు"  ఆతృతగా అడిగింది అనసూయ. "వంటసోడా ఓ ఇరవై గ్రాములు వేస్తాను". "నాకు తెలుసు వంటసోడా వేస్తే పొంగుతాయి కదా" అన్నది అనసూయ . "ఆ అవును అందుకే వేస్తాను. వేపినప్పుడు కరకరలాడడానికి కాస్త డాల్డ కూడా కలుపుతాను."  "మీ బుర్రే బుర్రండీ" మెచ్చుకుంటూ సాయంచేస్తుంది కోటయ్యకు భార్య అనసూయ. "కాస్త  నీళ్ళుపొయ్యి "అన్నాడు. అనసూయ  పిండిలో ఇత్తడి చెంబులో ఉన్న నీళ్ళు పోసింది. "ఇప్పుడు పిండిని కలిపి కలిపి ముద్దలా చేస్తాను చేయడమే కాదు ఓ అరగంటసేపు పిండిముద్దను ఎత్తి కుదేస్తాను" అంటూ పళ్ళెం కేసి బాదడం మొదలెట్టాడు కోటయ్య .  ఇలా చేస్తున్నాడే కాని అలా వండాలని కోటయ్యకూ తెలియదు ప్రయత్నిస్తూన్నాడంతే. కోటయ్యకు చేతులు నొప్పి పుట్టాయి. అనసూయ  కోటయ్య అలసిపోవడం చూసి "పైకి లేవండి బాదింది చాలుగాని చేతులు కడుక్కొని భోంచేయండి అంది." కోటయ్య అవస్దను చూసి నవ్వుకుంటూ . వంటగదిలోకి వెళ్ళి భోజనం పళ్ళెం తెచ్చి పీటమీద పెట్టింది. కలిపిన పిండి ముద్దను ప్రక్కన పెట్టి  దానిపై గుడ్డను కప్పాడు కోటయ్య. కోటయ్యకు తెలియదు అలా కొంత సేపు  పిండిముద్దను కదపకుండా ఉంచితే చక్కగా మృదువుగా అవుతుందని.

"భోజనం చేస్తున్నాడే గాని కోటయ్య "తరువాత ఏంచేయాలి ? అని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా పొలమారింది కోటయ్యకు. అనసూయ కోటయ్యకు మంచి నీళ్ళ చెంబు అందిస్తూ "  నాకు తెలుసు మన కాకినాడ చూట్టాలే తలుచుకుంటున్నారు. మొన్న దీపావళికి వచ్చినప్పుడు నాతో చెప్పారు.  కాకినాడలో మంచి మిఠాయి దుకాణం ఏదీ లేదు మీరు అక్కడకు వచ్చేయవచ్చు కదా. తెనాలి బాగా చిన్నఊరు  కాకినాడ అయితే మీవ్యాపారం పెద్దదవుతుందని " అంటూ చుట్టాలు సలహ ఇవ్వడం చెప్పింది కోటయ్యకు. భోజనం ముగించిన కోటయ్య చేయి కడుగుకుంటూ  "నాకు అలాగే అనిపిస్తుంది అనసూయ మద్రాసులో చూసాను కదా  ఎంత పెద్దనగరమైతే వ్యాపారం అంత పెద్దగా సాగుతుంది. వెళదాము గాని ముందు మనకంటూ ఓ ప్రత్యేకమైన వంటకం ఉండాలి. నేను అనుకున్న వంటకం బాగా వస్తే రేపే ప్రయాణం " అన్నాడు కోటయ్య. "ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి" అంది అనసూయ సంబరపడిపోతూ. పిండిముద్దను పీటపై వేసుకున్నాడు" ఏం చెయ్యాలి ఇప్పుడు  చేసేది ఏదైనా నేతి వంటకమే ఉండాలి అలాగే చేతిలో ఇమడాలి అంటే వ్రేలంత పొడవుంటే చాలు  అనుకుని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనతో  "అనసూయ  ముందు పొయ్యి వెలిగించి పెనం మీద కళాయి పెట్టి నెయ్యి మరిగించు" అన్నాడు. "అదేంటండి నెయ్యంతా మరిగిస్తే రేపు వంటలకో" అంది అనసూయ . "మాట్లాడకు మన దశ తిరగబోతుంది బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది." అంటూ కోటయ్య పిండిముద్దను సన్నని గొట్టంలా చేసి ముక్కలు ముక్కలుగా ఇనపరేకు తో కోసాడు. ఇంతలో కళాయిలో నెయ్యి వేడెక్కింది. కోటయ్య పిండి ముక్క తీసుకుని వేలితో ఓ నొక్కు నొక్కి అప్పడాలు వత్తే కర్రతో అదిమి ఆ పిండి ముక్కను మరిగే నెయ్యిలో వేసాడు. అంతే  బుడగలాగ పొంగింది. కోటయ్య అనుకున్నది వచ్చేసింది. భార్య అనసూయ "ఇదేంటండి గొట్టంలా వుంది" అంది. "అవును గొట్టాలే " గబగబా ఓ యాబై గొట్టాలు తయారు చేసాడు కోటయ్య. " అనసూయ గొట్టాలు బంగారు రంగులోకి మారేసరికి గరిటె బెట్టి గొట్టాలు పళ్ళెంలోకి తీసేయ్ " అన్నాడు . అనసూయ కంగారుపడుతూ గొట్టాలను కళాయినుండి తీసి పళ్ళెంలో వేసింది.. "అదేంటండి అప్పుడే దించేయమన్నారు." " చెపుతాను గాని  నువ్వు  

కేజి పంచదార తీసుకుని దానికి సమానమైన నీరు పోసి పంచదార పాకం పట్టు " అన్నాడు.  అనసూయ కోటయ్య చెప్పినట్టే పంచదార పాకం పట్టింది మారు మాట్లాడకుండా. ఇంతలో కోటయ్య గొట్టాలు అన్నీ ఒకేసారి  మరలా నెయ్యికళాయిలో వేసి గరెటెతో త్రిప్పుతూ గొట్టాలను ఎగరేస్తూ ఉన్నాడు. "అనసూయ అదేంటండి అలా ఎగరేస్తున్నారు మతిగాని పోయిందా" అంది కోటయ్య చేసేది అర్దంకాక." "నాకు మతి పోలేదోయ్  ఎందుకు ఎగరేస్తున్నానంటే గొట్టాలు గలగల శబ్దం చేసే వరకూ వేగాలని"  అంత గట్టిగా వేపితే పాకం ఎలా పడుతుంది అని మనస్సులో అనుకుంటూ "బాగానే ఉంది కాని పాకం వేడి తగ్గిపోతుంది" అంది అనసూయ. 

"తగ్గితేనే మంచిది అనసూయ గొట్టాలు వేడిగా పాకం వేడితక్కువగా ఉంటే గొట్టాలలోకి పాకం ఎక్కువ పడుతుంది" అన్నాడు కోటయ్య. 

భర్త కోటయ్య అనుకున్నది సాధించినట్టే ఉన్నాడనిపించింది అనసూయకు. 

"అనసూయ రాత్రి నువు పడుకున్నాక జార అని తయారు చేసాను అది బయట అరుగుమీద ఉంది పట్టుకురా" అన్నాడు. ఇదెప్పుడు చేసాడు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అనుకుంటూ భర్త ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తూ ఉంది అనసూయ. గరెటెలో మైదాపిండితో చేసిన గొట్టాలు గలగలలాడుతున్నాయ్  కోటయ్య ముఖం ఆనందంతో విప్పారింది. గొట్టాలను పంచదారపాకంలో వేసి జారతో ఓ నిమిషం నొక్కి బయటకు తీసాడు చిట్టిపెద్ది కోటయ్య.

     భార్య అనసూయ ముఖం చిన్నబోయింది . గొట్టం గొట్టంలాగే వుంది  ఏం ప్రత్యేకత వుంది ఇందులో అనుకుంది. కోటయ్య భార్యకు ఓ గొట్టం ఇచ్చి తినమన్నాడు. భర్త శ్రమను చూసి వద్దనలేక వంటకం సరిగా రాలేదు పాపం అనుకుంటూ  గొట్టాన్ని పళ్ళమధ్య పెట్టి కొరికింది.  అంతే ఒక్కసారిగా నోటినిండా పాకం జలజలా కారింది. అనసూయ ఆశ్చర్యానికి అంతులేదు. కోటయ్య అనుకున్నది సాధించాడు. బయటకు మామూలుగా గట్టిగా కనిపిస్తుంది గొట్టం కాని నిండా పాకమే. పాకం గొట్టం లోపలికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. బలే వంటకం."ఏమండీ దీనికి ఏం పేరు పెడతారు ? " అని అడిగింది. "అనసూయ దీనికి " కాజ "అని పేరు పెడతాను. "గొట్టం కాజా అంటారా" " లేదు ఇది కాకినాడ కాజా " అని ప్రసిద్ది చెందుతుంది అన్నాడు కోటయ్య . భర్త ఉద్దేశ్యం అర్దమయ్యింది కాకినాడలో అమ్మడం మొదలు పెడతారన్నమాట అని అనుకుంది అనసూయ.  భర్తను మురిపెంగా చూస్తూ "ఏమండి మీరు తయారు చేసిన ఈ వంటకం వందేళ్ళపాటు ప్రపంచ ప్రసిద్ది చెందుతుంది "అంటూ భర్త కోటయ్య నుదిటికి పట్టిన చెమటను పైట చెంగుతో తుడిసింది అనసూయ. 

  1891  కాకినాడ కోటయ్య కాజా  దుకాణం తెరవడానికి కాకినాడ మెయిన్ రోడ్డులో అడుగు పెట్టాడు మన కోటయ్య. అలా కాకినాడ కాజాను ఐదు తరాలనుండి వారి వంశీకులు తయారు చేస్తూనే ఉన్నారు. దేశ విదేశాలలోని ప్రజలు నిత్యనూతన స్వీటుగా  పెళ్ళిళ్ళలోను, పండగలకు, విందు వినోదాలలోను కాకినాడ కోటయ్య కాజాను ఆదరిస్తూనే ఉన్నారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


       

పాకం గారెలు


కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


    జాను, రాములు సముద్రపు ఒడ్డున పీతలతో ఆడుకుంటున్నారు. పీతలు కన్నాలలోకి వస్తూ పోతూ ఉంటే సరదా పడి పోతూ ఆడుకుంటున్నారు.

"ఒరే జాను నీ చొక్కామీద ఆ మరకలేమిటిరా?"

అడిగాడు రాములు. "నిన్న మా అక్క కొత్త పెరుమాళ్ళపురం నుండి పాకం గారెలు తెచ్చిందిరా అవి తింటుంటే పాకం కొద్దిగా చొక్కా మీద పడింది" అన్నాడు శీను.

పాకం గారెలు మాట వినగానే రాములు నోరు ఊరింది. "జాను మీ అక్కను పరిచయం చేస్తావా మీ ఇంటికి వస్తాను" అన్నాడు రాములు." నాకు తెలుసులేరా నువ్వు ఎందుకు మా ఇంటికి వస్తానంటున్నావో మా అక్క కోసం కాదులే పాకం గారెలకోసం" అంటూ కిలకిల నవ్వేశాడు జాను. "పోరా నువ్వు నన్ను అలాగే ఆటపట్టిస్తావు" అంటూ సిగ్గు పడిపోయాడు రాములు. 

  జాను, రాములు గబా గబా అంగలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అక్కడ అమ్మలిక్కలందరూ జాను అక్కయ్య ప్రేమతో ముచ్చటిస్తూ ఉన్నారు. వారి సంభాషణ వింటూ చప్పుడు చేయకుండా అరుగుమీద కూర్చున్నారు స్నేహితులిద్దరూ.జాను అక్క  ప్రేమావతి కొత్తపెరుమాళ్ళపురం పాకం గారెల గురించి చెపుతూ " కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు బలే తీపిగా ఉంటాయి. మనం ఇళ్ళల్లో చేసుకునే పద్దతే అయినా వీటి ప్రత్యేకతే వేరు.  నానబెట్టిన మినుములను మెత్తగా రుబ్బి చిట్టి చిట్టి మినపగారెలుగా వేసి దోరదోరగా వేయిస్తారు. కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద వండుతారు.కొద్దిసేపటి తరువాత పంచదార పాకంలో వేసి తీస్తారు. గారెలలోనికి పాకం ఊరి తినగానే పసందైన రుచిని కలిగిస్తుంది. వేడి వేడి గారెలు తినడానికి చాలా మంది సుదూరం ప్రయాణించి వస్తూఉంటారు. ఇక రాష్ట్రంలో జరిగే పెద్ద పెద్ద సభలలొ జరిగే విందుల్లో కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు ఉండవలసిందే. కాకినాడ బీచ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు స్టాల్ పెట్టి అమ్ముతూ ఉంటారు కూడా. పది రూపాయలకు మూడు గారెలు ఇస్తారు. ఇంతకీ  ఇదేదో పెద్ద మిఠాయి దుకాణం అనుకున్నారు ఓ చిన్న పూరిపాకలో ఓ ముసలమ్మ  తన కూతురు కలసి వండే వంటకం  అంటే ఆశ్చర్యపోవలసిందే మరి " అంటూ చుట్టూ చేరిన వారికి తలో ఒక పాకం గారె పంచి పెట్టింది ప్రేమావతి. రాములు గబా గబా అందుకుని  గుట్టుక్కున బుగ్గలో పెట్టి నమిలేస్తూ బాగుందని తలాడించాడు జానుని చూసి నవ్వుతూ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


Monday, October 26, 2020

నన్ను ఒకాయనన్నాడు  మీరు సాదారణ స్కూల్ ను డిస్టబెన్స్ చేస్తున్నారని


నేనన్నాను



లెనిన్  

భగత్ సింగ్  

అల్లూరి

గాంధీ

కందుకూరి



అందరూ డిస్టబెన్స్ గాళ్ళే

అందులో నేనూ ఒకడిని అని😊

నా అనుభవాలు 1

 లా జవాబు నహీ


నేను ఒక ఊరి బడికి బదిలీపై వెళ్ళాను. నా ప్రతిభతో అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాను. నా వయస్సు సీనియారిటీని బట్టి నన్ను అన్నిటిలో  ముందు ఉంచేవారు. అది నచ్చని ఓ జూనియరు టీచరకు నేనంటే గిట్టేది కాదు. ఒక రోజు అందరూ  స్టాఫ్ రూంలో కూర్చునుండగా నేను అర్జంటగా అవసరమై సెలవు పెట్టి వెడుతుంటే  ఆ జూనియరు టీచరు

అందరూ నవ్వేలా  "రాజు వెడలే రవితేజము లదరగా" అంటూ పాడపాడాడు.  అది నా కోసమే హేళనగా పాడాడని తెలుసు. నేను మౌనం వహించాను . కాలమే సమాధానం చెపుతుందని అనుకున్నాను.  అందరం బదిలీలపై వేరే బడులకు వెళ్ళాం. ఆ జూనియరు టీచరు  బదిలీపై వెళ్ళిన బడిలో  పదవ తరగతి అమ్మాయిని వేదిస్తూ అర్దరాత్రి సరాసరి ఇంటికి పోతే ఆ జూనియరు టీచరును చెట్టుకు కట్టి కుక్కను కొట్టినట్లు కొట్టారని తెలిసింది . బదిలిపై పోవలసిందిగా గ్రామస్తులు హుకుం జారీచేసారని కూడా తెలిసింది. తరువాత బదిలి పై వెడుతూ రిలీవింగ్ తీసుకుంటుంటే  జూనియరు టీచరు సెల్ కు నేను  ఇలా మెసేజ్ పెట్టాను "రాజు వెడెలె రవితేజము లదరగ"

Wednesday, August 19, 2020

రమ్య కథ

       

                   ఓ  రమ్య కథ

              (దివ్యాంగుల కథ)



      వేసవి సెలవులు ముగిసిన తరువాత  బడులు ప్రారంబమై అప్పుడే రెండునెలలు కావస్తుంది. క్లాసు మాస్టారు చెపుతున్నారు ఇలా ఈరోజు బడిలోకి  రమ్య అనే అమ్మాయి  చేరుతుందని మన ఔ తరగతిలోనే చేరిందని తను  కూర్చుంటానికి చోటు ఇమ్మని చెప్పగానే పిల్లల్లో ఒకటే అలజడి బయలుదేరింది.క్రొత్తగా వచ్చే అమ్మాయి  మా బెంచీలో కూర్చోవాలంటే మా బెంచీలో కూర్చోవాలని పోటీపడసాగారు. 

  రెండవ పీరియడు ప్రారంబమైయ్యింది . పిల్లల తలంపులన్నీ క్రొత్తగా చేరిన అమ్మాయి మీదే ఉన్నాయి.ఎదురు చూపులతో విసుగొచ్చింది అందరికి. తలదించి  నోట్సులు రాసుకుంటున్న పిల్లలకు గుమ్మందగ్గర చప్పుడైతే ఒక్కసారిగా తలెత్తి చూసారందరూ. అక్కడ దృశ్యం చూసి నోటమాటరాలేదు ఎవ్వరికీ. కాళ్ళు చచ్చుబడిన అమ్మాయిని రెండు చేతులతో ఎత్తుకుని ఉన్న తండ్రిని చూసారు. ఆ అమ్మాయి దివ్యాంగురాలు.

పిల్లలకు నిరూత్సాహం ఆవరించింది. అందమైన ఆరోగ్యంగా వుండేవాళ్ళు వస్తారనుకుంటే దివ్వాంగురాలు తమ తరగతి గదిలో చేరడంతో ఏమీ పాలుపోలేదు పిల్లలకు. అప్పటివరకూ మా బల్లంటే మా బల్ల అన్నవారు చోటు ఇష్వటం మానేసారు . మెల్లగా తండ్రివెళ్ళి ఆఖరున ఖాళీ బల్లపై కూర్చోబెట్టి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలెవ్వరూ రమ్య వంక కన్నెత్తి చూడలేదు పలకరించలేదు.

 రమ్య బడిలో చేరి నాలుగు రోజులు గడిచిపోయాయి ఎవరూ దగ్గరకు వెళ్ళి పలుకరించలేదు.

ఒకరోజు ఇంగ్లీషు టీచరు రమ్య ఎవరు అని అడిగింది. రమ్య నేనే టీచర్ అని చెప్పింది. ఇంగ్లీష్ రైటింగ్ చాలా బాగుంది క్లాసులో అందరికంటే చాలా అందగా వ్రాసావు  దస్తూరి బాగుంది అని మెచ్చుకుంది. టీచరు రమ్యను మెచ్చుకునే సరికి  పిల్లలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు . 

  తరువాత రోజు లెక్కలు మాస్టారు బోర్డుమీద లెక్క ఇచ్చి చేయమన్నారు . రమ్య క్షణంలో చేసి చూపించింది. తరగతి గదిలో పిల్లలకు మతి పోయింది. మేస్టారు రమ్య దగ్గరు వెళ్ళి రమ్య ప్రక్కన కూర్చుని చాలా సేపు కబుర్లాడారు.

అది తరగతిలోని పిల్లలకు ఆశ్చర్యమనిపించింది. ఇన్నాళ్ళు ఎప్పుడూ ఎవరి ప్రక్కన కూర్చోని మాస్టారు రమ్య ప్రక్కన కూర్చుని మాట్టాడే సరికి రమ్య సామాన్యమైంది కాదని మెల్లగా అర్దమయ్యింది. డ్రాయింగ్ టీచరు బొమ్మఇస్తే టీచరు కంటే బాగావేసి చూపింది రమ్య.ఇలా ప్రతీరోజూ ప్రతీ అంశంలో రమ్య ముందుంటంతో రమ్య పట్ల తమ అభి ప్రాయాన్ని మెల్లగా మార్చుకోసాగారు అందరూ.           ఒకరోజు ఇంటర్వువెల్ సమయంలో కొంతమంది మెల్లగా వెళ్ళి రమ్య తో మాట్లాడారు. మెల్ల మెల్లగా అందరూ చుట్టూ చేరారు. రమ్య చేతిలో కాగితం బొమ్మ చూసి సరదా పడిపోయారు. నీకు కాగితం బొమ్మలు చేయటం వచ్చా మాకు నేర్పవా అంటూ పోటీ పడ్డారు. వాళ్ళ సరదా చూసి రమ్యకు ముచ్చటేసి అందరికీ ఓపికగా చిలకలు, విమానాలు, గులాబీలు, పడవలు చేసి ఇచ్చింది .

   .  బాలల దినోత్సవానికి పాటలు పోటీ పెట్టింది క్రాప్ట్ టీచరు . తరగతిలో పిల్లలెవరూ పాడడానికి ముందుకూ రాకుండా  సిగ్గుపడుతుంటే  రమ్మ నేను పాడతానంటూ  తీయటి కంఠంతో " కోడి ఒక కోనలో"  అని గొంతెత్తి పాడింది. గది చప్పట్లతో మారుమోగింది. తరగతి గదిలో పిల్లలకు నోట మాటరాలేదు. రమ్య దివ్యాంగురాలు తనకు ఏమీ రాదని చదువుకు పనికి రాదని అనుకున్న పిల్లలకు  బాలల దినోత్సవంలో రమ్య  అన్నింటిలో మొదటి బహుమతులు గెలుచుకోవడంతో తీవ్రంగా ఆలోచనలో పడ్డారందరూ.రమ్య పట్ల తప్పుడు బావన కలిగినందుకు చింతించారు.

      బాలలదినోత్సవం తరువాత రోజు  తరగతి గదిలో పిల్లలందరూ కొట్టుకున్నంతగా  గొడవ పడుతున్నారు. రమ్యను ఎత్తుకుని తీసుకువచ్చిన తండ్రి దగ్గరకు పోయి మా బల్లపై కూర్చోపెట్టాలంటే మా బల్లపైన అంటూ గొడవ చేయసాగారు.

        సహచర పిల్లలో వచ్చిన మార్పుకు ఆనందపడిన రమ్య రోజుకు ఒకరి బల్లపై కూర్చుంటానికి అంగీకరించింది. వైకల్యం శరీరానికే కాని ప్రతిభకు, మనసుకు కాదని పిల్లలందరూ గ్రహించారు. అప్పటినుండి రమ్యను తమతో సమానంగా చూసుకుని స్నేహం చేస్తూ రమ్యకు అన్ని విషయాలలో సహయం చేయసాగారు. రమ్య పుట్టినరోజుకు  గిప్ట్ గా దివ్యాంగుల సైకిలు కొనిచ్చారు స్నేహితులందరూ.

   


సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రే...