Wednesday, October 28, 2020

మత్స్యకారుల జీవన విధానం

 మత్స్యకారుల జీవనం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



సముద్రతీర ప్రాతం అయిన ఉప్పాడ గ్రామంలో ఓ కుటుంబం నివశిస్తూ ఉండేది. తేజ  ఎనిదవ తరగతి చదువుతున్నాడు.తన తల్లిదండ్రుల పేర్లు దేవయ్య, కటాక్షం. దేవయ్య ఊరిలో మోతుబరి. ఒకరోజు బాగా చీకటి పడింది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. రేడియోలో  ప్రకటన వస్తుంది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవ్వరూ సముద్రం పైకి వేటకు వెళ్ళవద్దని అనౌన్సర్ చదువుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంబం అయ్యింది. అప్పుడే భోజనాలు ముగించి నులకమంచం మీద నడుం వాల్చాడు దేవయ్య . మరో మంచంపై దుప్పటి కప్పుకుని తేజ ఇనప పెట్టె పై పెట్టిన  దీపంబుడ్డి దగ్గరకు వచ్చిన తూనీగతో ఆడుకుంటున్నాడు. కటాక్షం ఇల్లంతా సర్ది తనూ నడుం వాల్చబోయింది. బయట హోరున వర్షం కురుస్తుంది. ఇంతలో వీధి తలుపును ఎవరో తడుతున్నట్టు అనిపించి దేవయ్య దిగ్గున లేచివెళ్ళి వీధి తలుపు గడియ తీసాడు. సుబ్బంపేటలో పేరు మోసిన చేపలవ్యాపారి కాశీబుల్లొడు వర్షానికి బాగా తడిసిపోయి వణుకుతున్నాడు. దేవయ్య కంగారుపడుతూ కాశీబుల్లోడిని లోపలికి ఆహ్వనించి ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకోమని రుమాలు, పంచే ఇచ్చాడు.

కటాక్షం కంగారుపడుతూ కాశీబుల్లోడికి భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటగదిలోనికి పరిగెత్తింది.

"దానవాయిపేట నుండి వ్యాపారం నిమిత్తం సవారి బండి మీద వెళ్ళి వస్తుంటే దారిలో వర్షం ఎక్కువైయ్యి మీ ఇంటి దగ్గర ఆగానని" చెపుతున్నాడు కాశీబుల్లోడు.

ఇంతలో పళ్ళెం నిండా వేరుసెనగకాయలు వేపి 

పట్టుకు వచ్చింది కటాక్షం . తేజ గబగబా గుప్పెడు తీసికుని తినసాగాడు. దేవయ్య కాశీబుల్లోడుతో మాటలు కలుపుతూ  

"ఎప్పటినుండో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మత్స్యకారుల జీవన విధానం గురించి చెప్పండి కాస్త అన్నాడు దేవయ్య

  "తప్పక చెబుతాను " అంటూ  తలను రూమాలుతో రుద్దుకుంటూ చెప్పడం మొదలెట్టాడు కాశీబుల్లోడు. తేజలో ఆసక్తి పెరిగింది ఏం చెపుతారా అని.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజసిద్దమైన   పొడవైన సముద్రతీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలు నెల్లూరు జిల్లా తడ వరకూ ఈ తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ తీరప్రాంతాన్ని ఆనుకుని  మత్స్యకారులు నివసించే వందలాది గ్రామాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో  అగ్నికుల క్షత్రియులు వీరినే పల్లీలు అని పిలుస్తారు, వాడబలిజ, జాలరి,గంగపుత్రులు వంటి మత్స్యకార తెగలవారు నివసిస్తూ ఉన్నారు."

"వీరి జనాభా ఎంత ఉంటుందంటారు ?"

అడిగాడు దేవయ్య

"వీరి జనాభా సంఖ్య దాదాపు 60 లక్షలువరకూ ఉండవచ్చు.వీరు మొదటిలో వ్యవసాయం చేసినప్పటికి  ఆ తరువాత కాలంలో చేపలు పట్టే వృత్తిని స్వీకరించారు.కొంత మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు .ప్రధానంగా చేపలవేట మీదే వీరు జీవిస్తూ ఉన్నారు. సముద్రం,నదులు,కాలువలు,చెరువులు, కుంటలలో వీరు చేపలను పట్టి అమ్ముతూ జీవిస్తారు. "

"పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఏముంది?"  అడిగాడు దేవయ్య

" మహాభారత పురాణ హితిహాసాలకాలం నుండి వీరి మనుగడ ప్రస్తావన ఉంది.వీరిని గంగపుత్రులు అనికూడా పిలుస్తారు. వీరి ప్రధాన ఆధాయ వనరు సముద్రపువేట."

"మరి కుటుంబ జీవనం ఎలా వుంటుంది" అని అడిగాడు దేవయ్య.

‌  "మత్స్యకారులది ఎక్కువగా ఉమ్మడి కుంటుంబ వ్యవస్ద. ఇప్పటికీ వీరిలో కులకట్టుబాట్లు అధికం. కుటుంబంలోని మగవారు ఆడపిల్లల బాధ్యతను చేపడతారు వీలు కుదరకపోతే గ్రామంలోని అన్ని కుటుంబాలు బాధ్యతను పంచుకునే అపురూపమైన సమిష్టి జీవనవిధానం ఇంకా వీరిలో అమలవుతూ ఉండటం ఆశ్చర్యం అభినందనీయం."

"నిజమేనండి ఎంత మంచి కట్టుబాటు" 

ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేసాడు దేవయ్య 

కాశీబుల్లోడు చెపుతూ"ఒక కుటుంబంలోని మగవారు అందరూ చేపలవేటకు వెళతారు తెచ్చిన చేపలను ఆడవారు బజారుకు పట్టుకు వెళ్ళి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తారు."


"అంకుల్  చేపలవేటకు ఏం ఉపయోగిస్తారు?" ఆసక్తిగా అడిగాడు తేజ


‌ "చేపలవేటకు వీరు వలలను ఉపయోగిస్తారు. కుంటలలో చేపలు పట్టడానికి చేతులు ఉపయోగిస్తారు. దీనిని "తడుముకోవడం" అంటారు.చెరువులలో "కొంటె వల"ద్వారా చేపలు పడతారు. నదులలోను, సముద్రపు ఉప్పుటేరులలోనూ మూడు కర్ర దుంగలను ఒకటిగా కట్టిన "తెప్ప పడవ" వాడతారు."మోచేతి వల"ద్వారా పట్టిన చేపలను తాటాకుతో చేసిన "బుంగ"లో వేసుకుంటారు."

"ఇంకే ఉపయోగిస్తారు"  అడిగాడు దేవయ్య

‌     కాశీబుల్లోడు  చేతిలోని వేరుసేనగకాయ పగులకొట్టి పల్లీ వలిసి నోటిలో వేసుకుని నమూలుతూ   "పడవ,బోటు, మరబోటులను సముద్రపు వేటకు ఉపయోగిస్తారు. పడవ ముందుకు వెళ్ళడానికి నీటిని వెనక్కి నెట్టే తెడ్డులను ఉపయోగిస్తారు.సముద్రపువేటలో సూదూరం ప్రయాణిస్తారు. దాదాపు పక్షం రోజులు వరకూ సముద్రంమీదే వేట కొనసాగిస్తారు మత్స్యకారులు."

"వలలు ఎలా తయారవుతాయి చెప్పండి కాశీబుల్లోడు గారు" అడిగాడు దేవయ్య


"పూర్వం వలలను మత్స్యకారులే తయారుచేసుకునేవారు. నూలుదారాలను "వగ్గావు" అనే ప్రత్యేక సాధనంతో నులిపెడతారు. నూలు దారం తయారైనాక ఆడవారు వలలను అల్లుతారు. వలల అల్లికల మధ్య ఖాళీని" పేతు" అని పిలుస్తారు. ఈ పేతు అంగుళం రెండగుళాలు సైజులతో ఉంటాయి.


"అలా ఎందుకు సైజులుగా ఉంటాయి అంకుల్ " అడిగాడు తేజ 

కాశీబుల్లోడు నవ్వుతూ  "మంచి ప్రశ్న. ఈ పేతు సైజును బట్టే రకరకాల చేపలు వలలో పడతాయి. 

త్వరత్వరగా వంట సిద్దం చేస్తున్న కటాక్షం అన్నీ వింటుంది వంటగది గుమ్మం దగ్గర నిలబడి అన్నయ్యగారు జిగురు వాడతారనుకుంటాను"  అని అడిగింది

 కాశీబుల్లోడు నవ్వుకుంటూ "ఎంతైనా మా ఉప్పాడ అమ్మాయి కదా కొంతైనా తెలియకుండా ఉంటుందా !" అంటూ చెప్పడం ప్రారంబించాడు

"తయారైన వల మన్నిక కోసం తుమ్మ చెక్క తుమ్మజిగురును గూనల్లో పోసి వేడిచేస్తారు.గోరువెచ్చని రంగులో వలను నానబెట్టి ఎండబెడతారు . దానితో వలకు పటుత్వం వస్తుంది.

" త్వరగా వండు కటాక్షం కాశీబుల్లోడు గారు ఎప్పుడు తిన్నారో ఏంటో ఏం కూర చేస్తూన్నావ్ అని అడిగాడు దేవయ్య 

"నాటుకోడి గ్రుడ్లు, ఉల్లి తురుము అండి" అంటూ కూర కలపడానికి వెళ్ళింది కటాక్షం. మరలా సంభాషణలోనికి వస్తూ 

"బుల్లొడు గారు అలివి గురించి చెప్పండి కాస్త"

అడిగాడు దేవయ్య

"తప్పకుండా   సముద్రపు వేటలొ "అలివి" అనే ప్రత్యేక విధానం వుంది. ధ్వని శాస్త్ర నిపుణుడు లాంటి "సడిగాడు"అనే వ్యక్తి ముందుగా పడవపై సముద్రంలోనికి వెళ్ళి  "సడికత్తావు" అనే తెడ్డును సముద్రపు నీటిలో ముంచి సడికత్తావు మరో కొనను చెవిదగ్గర పెట్టుకుంటాడు. ఆ సడికత్తావు నుండి చేపలు గుంపులుగా ఎక్కడ తిరుగుతున్నాయో అవి చేసే శబ్దతరంగాలను ఇట్టే  గ్రహించి అక్కడ వలవేయమని  చేతిరుమాలును ఊపుతాడు .అలివి యజమాని "సరంగి"కి చెపుతాడు. అప్పుడు సరంగి పడవపై ఒక కిలోమీటరు మేర తాడును వదులుతూ వెళతాడు దానిని" కొడి ఇవ్వటం" అంటారు.  ఆ తరువాత రెండు కిలోమీటర్లమేర రెండు అడుగుల వలను వదులుతారు. మధ్యలో పెద్దదైన మధ్యవల లేదా "మైపాల" ను వదులుతూ ఆంగ్ల అక్షరం "U " ఆకారంలో పడవను నడుపుతు వలను సముద్రంలో వదులుతారు . ఇప్పుడు రెండు కొసలను ఓ నలభైమంది "రైతులు" అనే పిలవబడే కూలీలు వలను అటూ ఇటూ  లాగుతూ అలివలో పడిన చేపలను ఒడ్డుకు చేరుస్తారు."

"అబ్బో అలివి వెనుక పెద్ద కథే ఉందన్నమాట"

ఆశ్చర్యపోతూ అన్నాడు దేవయ్య


"అంకుల్ మత్స్యకారుల ఆచారవ్యవహారాలు గురించి చెప్పండి?" దుప్పటి ముసుగు మరింత దగ్గరకు బిగిస్తూ అడిగాడు తేజ.


"మత్స్యకారులు దేవతలను ఆరాధిస్తారు. కాశమ్మోరు,నూకాలమ్మ,బంగారమ్మ, గంగమ్మ వీరి ప్రధానదేవతలు. క్రొత్త అమావాస్య రోజున వీరు ఒకరి దగ్గరనుండి మరోకరి దగ్గరకు పనిలోకి కుదురుతూ వుంటారు.హిందూ సాంప్రదాయ పద్దతిలోనే వివాహాలు చేసుకుంటారు.


"ఏదేమైనా నీటి మీద జీవనం ప్రమాదమే సుమండీ"అని సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్నాడు దేవయ్య

"అవును దేవయ్యగారు తుఫానులు, సూనామీలు సంభవించి నప్పుడు ప్రాణనష్టం సంభవిస్తుంది. ఇప్పుడిప్పుడే శాస్త్రసాంకేతికతలను ఉపయోగించి చేపలు పట్టడం నేర్చుకుంటున్నారు."

భోజన పళ్ళెం పట్టుకువస్తూ "రండి అన్నయ్యగారు భోజనం చేసాక మాట్లాడుకుందాం అలా చూస్తారే అన్నయ్యగారికి చేతులు కడుగుకోటానికి నీళ్ళివ్వండి" అంటూ హడావిడి చేసింది కటాక్షం. 




 సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...