Wednesday, October 28, 2020

కొండెవరం యుద్దం

 


             కొండెవరం యుద్దం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



శ్రీరామనవమి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరగా ఉన్న కొండెవరంలో బాగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు పేరు పొందిన కళాకారులను రప్పిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. జానపదకళారూపాలు కనీసం ఓ నాలుగురోజులైనా ప్రదర్శిస్తారు. అందులో తప్పెటగుళ్ళు, కోలాటం, డప్పు వాయిద్యం, బుర్రకథ,హరికథ తప్పక ఉంటాయి. ఆ యేడు ఘనంగా  నవమి వేడుకలు నిర్వహించాలని ఆలయ కమిటీ 

మీటింగు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంది. గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆలయ ధర్మకర్త .ఆయన అధ్యక్షతనే సభ జరుగుతుంది. "భక్తులారా! చుట్టుప్రక్కల ఊళ్ళలో మన ఊరి శ్రీరామనవమి ఉత్సవాలకు ఉన్న మంచి పేరు మీ అందరికీ తెలుసు. ఆ పేరును మరింత పెంచేలా ఈ యేడు  వేడుకలు నిర్వహించాలి. అందుకు ఎలాంటి కార్యక్రమాలు ఉండాలో సూచించండి" అని కూర్చున్నారు. కమిటీ సభ్యుల్లో సత్యనారాయణ లేచినిలబడి అయ్యా మన ఊరి చరిత్ర 300  ఏళ్ళ క్రితం నాటిది. కొండెవరం యుద్దం లేదా చెందుర్తి యుద్దం లేదా చందవోలు యుద్దంగా పిలుస్తారు. ఆనాటి కథను మనకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగే వాళ్ళు ఒకరున్నారు వారిని పిలిపిద్దాం అన్నాడు. సభలో ఒకటే అలజడి "ఈ చరిత్ర ఎవరికీ తెలియదు తప్పకుండా పిలిపించండి" అని సభ్యులు గోలచేయసాగారు. "ఆగండి ఆగండి,  గోల చేయడం సభా మర్యాదకాదు నిశ్శబ్దం పాటించాలి " అని  అధ్యక్షుడు గదమాయించి  "సత్యనారాయణ గారు మీరు చెప్పింది బాగుంది వివరాలు చెప్పండి" అన్నారు . సత్యనారాయణ మాట్లాడుతూ "జముకుల కథ చెప్పే వారు ఉన్నారండి వారు కొండెవరం యుద్దం కథాగానం చేస్తారు. మన ఊరి కథను మనవారికి తెలియజేద్దాం" అని ముగించి కూర్చున్నాడు సత్యనారాయణ. "తప్పకుండా జముకుల కథ ఉంటుంది. నవమి మొదటిరోజే ఏర్పాటు చేద్దాం" అని సభ ముగించారు. ఈవిషయం బడిలోని సోషలు మాస్టారు కామేశ్వరరావుగారికి తెలిసింది. ఆయన పిల్లలను ఉద్దేశించి చెపుతూ పిల్లలూ" మీకు నేనిచ్చే ప్రాజెక్టువర్కు ఏంటో తెలుసా?"  "చెప్పండి సార్" పిల్లలు ఒకటే అరుపులు బల్లలపై దరువులు. ఏమిటంటే నవమికి జముకులవారు చెప్పే మన కొండెవరం యుద్దం చరిత్రగానాన్ని విని చక్కగా కథలా రాసి చూపించాలి. అదే ఈ నెల ప్రాజెక్టువర్కు " అని చెప్పగానే  "ఒకే సార్ " అంటూ పిల్లలు బల్లలు చరచసాగారు. 

నవమి కార్యక్రమాలలో  ఆ యేడు జముకుల కథ హైలెట్ అయ్యింది.

పిల్లలు ఆలకించి వీరావేశం పొందారు. ఇంటికి పోయి ప్రాజెక్టువర్కు పూర్తిచేసారు. బడిలొ మాస్టారుకు చూపించారు. సోషలు మాస్టారు  విద్యార్ది రమణ రాసిన ప్రాజెక్టు వర్కును ఎంపిక చేసి తరగతిలో ఇలా చదవడం ప్రారంబించారు.

"అది 1758 సెప్టెంబరు నెల బుస్సీ అధికారంలోని  ఫ్రెంచివారు విజయనగరం రాజులను ఇబ్బందులు పాలుజేస్తున్నారు. యుద్దానికి సై అంటున్నారు. బలహీనుడైన విజయనగరం ఆనందగజపతిరాజు బ్రిటీష్ వారి సహాయం కోరక తప్పలేదు .బ్రిటీష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ కొంతమంది సైనికులను రాబర్ట్ ఫోర్డ్ కు ఇచ్చి యుద్దానికి పంపాడు. ఫ్రెంచివారిని తరిమి కోస్తా ఆంధ్రాపై ఎప్పటినుండో పట్టుసాదిద్దామనుకుంటున్న బ్రిటీష్ సైన్యానికి ఆనందగజపతిరాజు ఆహ్వనం కోతికి కొబ్బరికాయ దొరికినట్లయ్యింది. 


కొండెవరం నుండి చెందుర్తి వరకూ దీనినే ఒకప్పుడు చందవోలు అని పిలిచేవారు ఈ ప్రాంతమంతా ఘోరమైన యుద్దం జరిగింది. ఫ్రెంచివారు ఓడిపోతున్న సమయంలో  ఆనందగజపతిరాజు నుండి, బ్రిటీష్ సేనలనుండి ప్రమాదాన్ని పసిగట్టిన పెద్దాపురం వత్సవాయి గజపతిరాజు ఫ్రెంచివారికి సహయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ యుద్దం విజయనగరం రాజులు, బ్రిటీష్ వారు ఓ ప్రక్క మరియు పెద్దాపురం రాజులు ఫ్రెంచివారు ఓ ప్రక్క ఉండి చేసిన యుద్దం అన్నమాట. బ్రిటీష్ వారు నైజాం రాజులతో సంధి కుదుర్చుకోవడంతో  విజయనగరం ఆనందగజపతరాజు ఓడిపోయాడు. ఇది భారతదేశంలో జరిగిన అతి నిర్ణయాత్మక యుద్దంగా గుర్తించబడింది. అని  మాస్టారు చదవడం ముగించారు. చక్కగా వివరంగా రాసిన రమణను విద్యార్దులు చప్పట్లతో అభినందించారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...