Wednesday, October 28, 2020

జాంథానీ

       

           ఉప్పాడ జాంథానీ చీరలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



       తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ మీదుగా ఎర్రటి మారుతి కారు ఉప్పాడ గ్రామానికి పరుగులు పెడుతుంది. బీచ్ రోడ్డు పైకి దూసుకు వచ్చే కెరటాలకు ఓ ప్రక్క భయం మరో ప్రక్క ఆనందంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణకు ,లక్ష్మికి విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు .ఇద్దరూ కవలపిల్లలు కూడా కావడంతో ఒకే తరగతి చదువుతున్నారు.లక్ష్మి ఆలోచనలన్నీ చీరల చుట్టూ తిరుగుతున్నాయి. ఎనిమిదవ తరగతి ఆంగ్లపాఠం "ద స్టొరీ ఆఫ్ ఐకత్" చెప్పేప్పుడు విన్నాను ఉప్పాడ జాంథానీ చీరల గురించి, అదే ఆలోచిస్తుంటే సముద్రపు కెరటం ఒకటి కారు అద్దాలను దబ్బున తాకింది. లక్ష్మి కెవ్వున కేక పెట్టి సీటులో కూలబడింది . తల్లి దుర్గావతి వాట్స్ యాప్ చాటింగ్ లోంచి బయటకు వస్తూ ఇద్దరినీ గోలచేయకుండా కూర్చోమని కసిరింది. తండ్రి గంగాధర్ డ్రైవింగ్ చేస్తూ ఎత్తు బ్రిడ్జి దగ్గర కొంతసేపు ఆపి సముద్రం అందాలు చూపించాడు. రాళ్ళ మధ్య నిలబడి సముద్రపు అలలు కనిపించేలా ఫోటోలు తీసుకున్నాం. మరలా ఉప్పాడ వైపు పోనిచ్చాడు కారుని నాన్న. కాకినాడకు  ఉప్పాడకు మధ్య దూరం 20 కి.మీ .



     కృష్ణకు అంత ఆసక్తి లేదుగాని లక్ష్మికి మాత్రం జాంథానీ చీరల తయారీ ఎప్పుడు ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. తల్లి దుర్గావతి నాన్నను జాంథానీ చీర ఎప్పుడు కొంటారని పోరుపెట్టడం రోజూ చూస్తునే ఉంది. ఆ చీర చాలా ఖరీదని అమ్మ ఎవరితోనో చెబుతుంటే విన్నది లక్ష్మి. ఒక్కో చీర ఐదువేల నుండి లక్షవరకూ కూడా ఉంటుందని చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఉప్పాడ గ్రామంలోకి ప్రవేశించే సరికి బీచ్ రోడ్డు సెంటరు కనిపించింది. మలుపు తిరిగి పిఠాపురం రోడ్డుకు టర్న్ తీసుకుంది కారు. ఉప్పాడ కొత్తపల్లి జంటగ్రామాలు రెండు గ్రామాలలో చీరలు నేస్తారు కాని ఉప్పాడ చీరలుగానే ప్రసిద్ది. "పూర్వం జైపూర్ మహారాణి ఉప్పాడను ఆనుకుని ఉన్న అమీనాబాదలో వీరరాఘవులు అనే చేనేత కార్మికుడితో చీరలు నేయించుకునేవారట అందుకే ఇది గొప్పవారి చీరగా బావించి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. కాని ఇటీవల దేశవ్యాప్తంగా బాగా పేరుపడింది." కారు నడుపుతూ చెపుతున్నాడు నాన్న. ఉప్పాడ సినిమా సెంటరుకు వచ్చేసరికి ఎక్కడ చూసినా  చీరల షాపులే. ప్రతీ ఇల్లు ఓ బట్టల దుకాణమే . అందుకే అన్నట్టున్నారు చేనేతను కుటీర పరిశ్రమ అని. కారు ఆపితే అందరం దిగాం నాన్న ఎవరికో ఫోను చేస్తే వచ్చి చీరల షాపులకు తీసుకువెళ్ళారు.అమ్మ అతనితో ఒకసారి చీర ఎలా నేస్తారో చూపించమని అడిగింది. అలాగేనంటూ అతను తలాడించి చీరలు నేచే ఇళ్ళకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలు చీర నేయడం కనిపించింది. ఓ ప్రక్క కుర్చీలో సేదతీరుతున్న మాస్టర్ వీవరు దగ్గర ఉండి నేయిస్తున్నాడు. చీరకు కావలసిన ముడి సరకునంతా ఇతనే సమకూరుస్తాడు. మా అందరికీ కుర్చీలు వేయించాడు. అక్కడే తిరుగుతున్న ఓ అమ్మాయికి చెవిలో ఏదో చెపితే  అది విని అమ్మాయి హడావిడిగా బయటకు పరిగెత్తింది.

"సార్ చీరలు కొనుగోలుకు వచ్చాం కాని కొనేముందు జాంథానీ చీరల తయారీ దాని విశిష్ఠత తెలుసుకోవాలనుకుంటున్నాం"  అన్నాడు నాన్న మాట కల్పించుకుంటూ . "తప్పకుండా జాంథానీ చీర పుట్టింది బంగ్లాదేశ్ దేశంలో. "జాం "అంటే పూలు "థానీ" అంటే గుత్తి అంటే పూలగుత్తి" అంటుంటే నేను" ప్లవర్ బోకే అన్నమాట " అన్నాను. ఆయన నవ్వేస్తూ "అంతేనమ్మా చీరను చేతిలోనికి తీసుకుంటే ఆ బావన కలుగుతుంది కాబట్టే ఆ పేరు వచ్చింది,  ఏం చదువుతున్నావ్ ?" అని అడిగారు నన్ను మురిపెంగా చూస్తూ మాస్టర్ వీవర్ ." ఎనిదవ తరగతి అండి " అని బదులిచ్చాను. అమ్మ మధ్యలో మాట్లాడకు చెప్పనీ" అంది విసుగు ప్రదర్శిస్తూ. "పరవాలేదండి పిల్లలు ప్రశ్నలు వేస్తూ సందేహాలు తీర్చుకోవాలి." అన్నాడు మాస్టర్ వీవరు. 

       "అతి సున్నితమైన దారపు నూలుపోగులను సన్నని చేతివేళ్ళు కలిగిన చిన్నవయస్సు వారే నేస్తారు. దీనిని పెద్ద వయస్సు వారు నేయలేరు"  అన్నాడు మాస్టరు వీవరు అన్నయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం.  "ఎందుకని ? అడిగాను ఆశ్చర్యం ప్రదర్శిస్తూ. "ఎందుకంటే జాంథానీ దారపు పోగులు అతి సన్నగా సుతి మెత్తగా ఉంటాయి పెద్దవారి చేతులకు దారాలు తెగిపోతాయి అందుకని చిన్నవయస్సు వారే నేస్తారు." చెప్పాడు మాస్టర్ వీవరు. అన్నయ్య కృష్ణ "చీరలు నేచే వాళ్ళను ఏమంటారు? అని అడిగాడు."మగ్గం నేతగాళ్ళు లేదా నేతగాళ్ళు"  అంటారు." "జాంథానీ చీరలు యంత్రాలమీద నేస్తారండీ ?" అని అడిగాడు నాన్న.

"లేదండి పూర్తిగా చేనేత మగ్గం మీదే నేస్తారు. వెండి జరీతో నేయడం వల్ల దీని ఖరీదు ఎక్కవ  అందుకే దీనికి అంత డిమాండ్ కూడా "

" ఏ రకమైన డిజైన్ల చీరలు పేరు పొందాయంటారు? " అమ్మ అడిగింది. 

" కాటను చీరలు, పట్టుచీరలను మగ్గం పై నేస్తారు. ఇక చీరలలో రకాలంటే పల్లులు, అంచు లతలు, ఆల్ ఓవర్ ఉంటాయి. ఇక డిజైన్లు అయితే మల్లెపందిరి,త్రిశూల, మధులత , బోర్డరు చిలకలు, దండా చిలుకలు, దర్బారు, శ్రీలత  పేరుబడ్డాయి". బయటకు వెళ్ళిన అమ్మాయి గబగబా వస్తూ సర్వింగ్ ప్లేటులో బూందీ, ఉప్పాడ కజ్జికాయ స్వీటు తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది. నేను అన్నయ్య ఆత్రంగా తింటుంటే అన్నయ్యకు పొలమారింది. అమ్మ హేండ్ బేగ్ లోనుండి వాటర్ బోటిల్ తీసి తాగిపించింది. 

నాన్న మాస్టరు వీవరుతో "బుటా వర్కు అని విన్నాను. ఏమిటి కాస్త వివరంగా చెప్పండి" అని అడిగాడు. "బుటావర్కునే చుక్కతీయడం అంటారు. చిన్న చిన్న ఆకులు, రెమ్మలు, పువ్వులు డిజైన్లుగా చీరమీద ఖచ్చితమైన దూరం, సైజుతో  చీర మీద చేతితో అల్లుతారు. ఈ బుటా పనితనమే జాంథానీకి ప్రత్యేకత తీసుకువచ్చింది." అని ఒకించిత్ గర్వం తొణికిసలాడే స్వరంతో అన్నాడు మాస్టర్ వీవరు.

      "అమ్మా మగ్గం చూపించమనవే"  అంటూ అడిగాను నేను ఖాళీ చేసిన పేపరు ప్లేటును క్రిందపెడుతూ" నా మాట విని మాస్టర్ వీవర్ "రండి చూపిస్తాను" అంటూ కుర్చీలోంచి పైకి లేచాడు. అందరం అతని వెనుకే అనుసరించాము. ఆయనే మగ్గం పనిని వివరిస్తూ "మగ్గాలు గుంట మగ్గాలు,స్టాండు మగ్గాలుగా అని ఉంటాయి. మగ్గంపై ముగ్గురు పనిచేస్తారు. మధ్యలో కూర్చున్నవారు  చిలక లాగుతూ ,సప్పాలు తొక్కుతూ మగ్గాన్ని ఆడిస్తే అటూ ఇటూ ఉన్నవారు  చుక్కతీస్తుంటారు. 

 ఇదిగో చూడండి  ఈ పొడవాటి దారపు పోగులను పడుగు అంటారు. కోర అనే తెల్లటి దారాలకు రంగులు అద్ది తయారుచేస్తారు. అడ్డంగా అల్లే దారాన్ని  పేక అంటారు."

"మగ్గం టకు టికూ మని శబ్దం వస్తుందేమిటండీ" అమాయకంగా అడిగాడు అన్నయ్య. అందరూ నవ్వేశారు " మగ్గానికి క్రిందనున్న సప్పాలతో తొక్కి మగ్గం పైనున్న చిలుకను లాగినప్పుడు  రెండు వరుసలలో ఉన్న పడుగు క్రిందది పైకి పైది క్రిందకు వెడుతుంది అప్పుడు అడ్డునేత నాడి అనే పరికరంలో బిగించిన దారపుకండె అటూ ఇటూ అల్లుతూ ఉంటుంది . ఆ నాడి చేసే శబ్దమే నువు విన్నది "  అన్నాడు మాస్టర్ వీవరు . నాన్న మధ్యలో మాట్లాడుతు "రాట్నం మీద కండెలు చుడతారు ఇందుకేనేమో "అన్నాడు. "నిజం చెప్పారు కండెలు చుట్టేవారు ప్రత్యేకంగా ఉంటారు. పెళ్ళిళ్ళకు ప్రత్యేక ఆర్డరుపై అతి ఖరీదైన చీరలు నేస్తూ ఉంటాం రాజకీయ ప్రముఖులు, సీనీ తారలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ వుంటారు." "నేత పనిలో ఎటువంటి కష్టనష్టాలు ఉన్నాయంటారు ?  అమ్మ అడింగింది మాస్టరు వీవరును. "లేకేం చుక్క తీసేవారికి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గుంట మగ్గాలలో పని చేసేవారికి దోమల ద్వారా బోదకాలు వంటి రోగాలుకు గురవుతున్నారు." అందరం ముఖాలు చూసుకున్నాం ఇక వెడదామన్నట్టు. "నమస్కారమండి చాలా విషయాలు మాకు తెలియజేసారు. మంచి నాణ్యమైనవి ఓ రెండు చీరలు తీసుకుంటాను చూపించండి" అన్నది అమ్మ. "పదండి మా షాపు మా ఇంటి దగ్గరే ఉంది" అంటూ ముందుకు నడిచాడు మాస్టరు వీవరు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...