Wednesday, October 28, 2020

ఆత్రేయపుం పూతరేకులు


ఆత్రేయపురం పూతరేకులు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పట్టుపరికిణీ మల్లే దండల్లో మురిసి పోతున్నారు అను, రత్న. ఇద్దరూ అక్కచెల్లెళ్ళే కాని ఒకటే హృదయం ఇద్దరిదీ.ఇల్లంతా బందుమిత్రులతో సందడి సందడిగా వుంది. గుమ్మాలకు మామిడితోరణాలు వ్రేలాడుతూ ఉన్నాయి. పెళ్ళి బాజాలు శ్రావ్యంగా మ్రోగుతున్నాయి.

అక్కా చెల్లెళ్ళు  ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఇంటి ముందర తాటాకు పందిరిలోనికి  ఇంటిగదుల్లోకి ఒకటే పరుగులు. వారు పరిగెడుతుంటే కాళ్ళగజ్జెలు చేసే చప్పుడు పెళ్ళిసందడిని మరింత పెంచుతూవుంది. పెళ్ళి పెద్దలు కిళ్ళీలు నములుతూ అను, రత్నలు చేసే అల్లరికి చిరునవ్వులు చిందిస్తూ కబుర్లాడుకుంటున్నారు. అది అను , రత్నల  పెద్దక్క కనకదుర్గ పెళ్ళి రోజు.చాన్నాళ్ళకు వాళ్ళింటిలో పెళ్ళి జరుగుతుంది. పనులు పురమాయిస్తూ అను ,రత్నల నాన్నగారు శ్రీధర్ హడావిడిగా తిరుగుతున్నారు. "ఏమండోయ్ బావగారు  పెళ్ళి కొడుకుది ఏ ఊరు" అని అడిగాడు పెళ్ళి పెద్దల్లో ఒకరైన గంగాధరం కిళ్ళీ ఊస్తూ. "అబ్బాయిది ఆత్రేయపురం"  అంటూ మరో పనిలో పడ్డాడు పెళ్ళికూతురు తండ్రి శ్రీధర్ . ఆత్రేయపురం అనగానే పెళ్ళి పెద్దల్లో కూర్చున్న ప్రభాకరం అనే ఆయన  "ఒహోహో బలే ఊరు సంబంధం అండి. ఆత్రేయపురం పూత రేకులకు చాలా ప్రసిద్ది" అన్నాడు. "దాని గురించి వివరంగా చెప్పండి" అంటూ మడత కుర్చీలో కూలబడ్డాడు  పెళ్ళి పెద్ద రవిబాబు. పూతరేకుల తయారీ గురించి చెపుతుంటే అను, రత్న పరుగు ఆపి నీలిరంగు కుర్చీల్లో వచ్చి  కూర్చున్నారు. ఇద్దరి బుగ్గలు గిల్లుతూ ఆ పెళ్ళి పెద్ద చెప్పడం మొదలు పెట్టాడు" పూతరేకులు లేనిది పెళ్ళి సారెలు నిండుగా ఉండవు. పూతరేకులు రెండు రకాలు బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు, చెప్పాలంటే బెల్లంతో చేసినవి బాగుంటాయి. బొండా రకపు బియ్యంను నానబెట్టి రుబ్బుతారు. రుబ్బిన పిండిని నీటిలో కలుపుతారు . నీరులా ఉన్న ఆ బియ్యం నీటిలో ఓ చేతిరుమాలంత వస్త్రం ముంచి  ప్రత్యేకమైన మట్టితో తయారుచేసిన కుండపై పూతలా పూస్తారు. ఈ కుండ బోర్లించి ఉంటుంది. ఆ కుండ మూతి వద్ద రధ్రం ఉంటుంది. ఆ రధ్రం నుండి కొబ్బరాకులతో అతి చిన్న మంటను పెట్టి కుండను వేడిచేస్తారు. పూతలా పూసిన బియ్యం నీరు కొద్ది క్షణాలలోనే రేకులుగా తయారవుతుందన్నమాట". అని చెపుతుంటే  రఘురాం అనే ఆయన అందుకుంటూ" ఏమండీ ఇది ఏదైనా పెద్ద పరిశ్రమంటారా? " అని అడిగాడు సందేహంగా. "అబ్బే అదేం లేదండి ఇది కుటీర పరిశ్రమే. దాదాపు మూడు వందల కుటుంబాలు తయారీలో ఉంటాయి" అన్నాడు ప్రభాకరం"బాబాయ్ మరి పూతరేకులు తీయగా ఉంటాయి కదా!" అడిగింది అను. నెయ్యి వాసన కూడా వస్తుంది " అంది రత్న  త్వరగా చెప్పమని అక్కచెల్లెళ్ళు ఇద్దరూ తొందర చేయసాగారు. " ఆగండి ఆగండర్రా చెపుతున్నాను. పూతరేకులు తయారైన తరువాత రేకులు చుట్టండం మరొకరు చేస్తారు". " ఏంటి బాబాయ్  రేకులు చేసినవారు చూట్టరా ? ఆశ్చర్యపోతూ అడిగింది రత్న . "ఆహ లేదమ్మా పూతరేకులు ఒకరు చేస్తే చుట్టడం మరొకరు చేస్తారు. ఎక్కువగా మహిళలు పూతరేకులు చేస్తే చుట్టడం ఎక్కువగా మగవారు చేస్తుంటారు"." బాబాయ్  పూతరేకులు ఎలా చుడతారు?" అడిగింది అను.

"పూతరేకు తీసుకుని అందులో గుమగుమలాడే వేడి నెయ్యిని పూస్తారు ఆ తరువాత బాదం, జీడిపప్పు, బెల్లం పౌడరు జల్లి రెండు అంచులు దగ్గర చేసి మడతపెడతారు . ఈ పనిలో కుటుంబంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుంటారు.ఇలా రోజుకు వెయ్యి నుండి రెండువేల పూతరేకులు వరకూ ఒకో కుటుంబం తయారు చేస్తుంది. పది పది చొప్పున చక్కటి అట్టపెట్టెల్లో పేర్చి దేశ విదేశాలకు పంపిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఆత్రేయపురం పూతరేకుల తయారీని ప్రొత్సహిస్తూ ఋణాలను మంజూరు చేస్తుంది కూడా". "బలే ఉంది బాబాయ్ తయారీ విధానం" అన్నారు అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ . ఇలా వీరు మాట్లాడుతుండగా లోపలనుండి అను, రత్నల  అమ్మ నీరజ పూతరేకులు పళ్ళెంలో పట్టుకు వచ్చి పందిరిలోని పెద్దలందరికీ పంచి పెట్టింది. అను, రత్నలు గబ గబా తిని " అబ్బా నోటిలో పెట్టుకోగానే ఉత్తినే కరిగిపోతున్నాయ్ " అనగానే పందిరిలో  ఉన్న పెద్దలందరూ పకపకా నవ్వేశారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...