Wednesday, October 28, 2020

యానాం కాథలిక్ చర్చి

    యానాం కేథలిక్ చర్చి




సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



ఆ రోజు1996  నవంబరు 6.పాండిచ్చేరి శాసనసభ సమావేశాల్లో తీరికలేకుండా ఉన్న యానాం శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావుగారు పదే పదే మ్రోగుతున్న ఫోను అందుకున్నారు. అవతల నుండి వచ్చిన సమాచారం తీవ్ర ఆవేదన కలిగించింది. హుటాహుటిన హెలీకాప్టరులో యానాం బయలుదేరారు.యానాం సెయింట్ ఆన్స్ రోమన్ కేథలిక్ చర్చి ఫాదర్ జోసఫ్ అనితోథన్ ఓ ప్రక్క చర్చి ఆవరణలోని తన గదిలో గాబరాగా పచార్లు చేస్తున్నారు. ఆయన మనస్సు ఆవేదనతో నిండిపోయి వుంది. బంగాళాఖాతంలో వచ్చిన తీవ్ర తుఫాను యానాం పరిసరప్రాంతాలకు తీవ్ర నష్టం చేకూర్చింది.యానాం చర్చి ఆవరణలో ఫాదర్ గాంగ్ లోఫ్ పెంచిన  బొటానికల్ గార్డెన్ తుడిచిపెట్టుకుపోయింది.ఎంతో కాలంగా కాకినాడ పరిసరప్రాంత విద్యార్ధులకు విజ్ఞానాన్ని అందించిన గార్డెన్ తన హయాంలోనే కనుమరుగవ్వండం ఫాదర్ అనిథోతన్ తట్టుకోలేకపోతున్నారు. తుఫాను చేసిన నష్టం విని చర్చిని చూడడానికి ఎమ్మెల్యే కృష్ణారావుగారు వస్తూండటంతో ఇంకా కంగారుగా ఉంది.ఆలోచనలలోంచి బయటకు రాకుండానే ఎమ్మెల్యేగారు ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు. 

 జరిగిన నష్టం వేదన కలిగించడంతో ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకోలేదు. కొంతసేపటికి కృష్ణారావుగారే మాట్లాడుతూ "ఫాదర్ ఈ ఉధ్యానవనంతో నాకు చాలా అనుభందం ఉంది బడి గంట కొట్టగానే పిల్లలందరం పరుగు పరుగున చర్చి దగ్గరకు వచ్చేవారం ఇక్కడ ఫాదర్ గాంగ్ లోఫ్ పిల్లలకు పాలు, పళ్ళు, బిస్కట్లు పంచేవారు  అవి తిని అందరం చీకటి పడేవరకూ ఆడుకుని ఇంటికి వెళ్ళేవారం. అవి ఇక గురుతులుగానే ఉండిపోతాయి." ఎమ్మేల్యే గారి గొంతులో జీర కనపడింది.

ఫాదర్ ఎమ్మేల్యే గారి ఆవేదనను గమనించి మాట మారుస్తూ " సార్ యానాం చర్చి మన దేశంలోని  పురాతనమైన చర్చిల్లో ఇదీ ఒకటి. నీలిమందు వ్యాపారం కోసం వచ్చిన ఫ్రెంచివారు వారి ప్రార్దనలకోసం 1768 నిర్మించారు. అయితే తుఫానుకు చర్చి దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు 1787 లో ఒకసారి కూలిపోయింది. చర్చి నిర్మాణం తిరిగి1835 లో ప్రారంబమై 1846 లో పూర్తయ్యింది. అప్పటి నుండి ఈ తుఫాను వరకూ ఏ నష్టం జరుగలేదు ఇప్పుడు ఇలా జరగడం బాధిస్తుంది.

 ఎమ్మేల్యే కృష్ణారావుగారు మాట్లాడుతూ "  ఫాదర్ ఈ చర్చి మా యానాం పట్టణానికి తలమానికం.  రోమన్ గోథిక్ శైలిలో నిర్మించారు. పర్నీచరు అంతా రంగూన్ టేకుతో చేయబడింది.అందమైన గాజుదీపాలు,అద్దాలు, గంటలు,పూజా సామాగ్రి అంతా ఫ్రాన్సు దేశం నుండే వచ్చింది.ఇది ఓ  చారిత్రక చిహ్నం."

" అవునండి, చర్చి గోపురంలో అమర్చిన గడియారం మరీ ప్రత్యేక మైనది. చర్చికి దూరప్రాంతం నుండి వచ్చేవారు  ఆలయంలోని గోడల పై చుట్టు ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన క్రీస్తు జీవిత విశేషాల చిత్తరువులు చూస్తూ ఎంత ఆనందిస్తారో "అన్నారు ఫాదర్ .

వాచ్ మన్ తెచ్చిన పొగలు కక్కే టీ కప్పును అందుకుంటూ "నిజంగా ఫాదర్. మనదేశంలో అయితే పుదుచ్చేరి, కారైకల్ ,మాహెలలో కూడా ఇటువంటి నిర్మాణాలున్నాయి. ఫ్రాన్సు దేశంలో ఎక్కువగా ఇటువంటివి కనిపిస్తాయి" అన్నారు ఎమ్మేల్యేగారు. 

 ఫాదర్ అనిథోతన్ కూడా తేనీటిని త్రాగుతూ

"ఈ చర్చి ఆవరణలో ఉన్న లుర్దూ మాతను విశ్వాసులు దర్శించండం ఇటీవల పెరిగింది సార్ "

"అవును ఫాదర్ ఆసంఘటనను మా తాతగారు చెపుతుంటే వినేవాడిని 1943 లో విలియమ్ బి ఒడెన్ అనే పది టన్నుల ఓడ సాక్రమౌంట్ లైట్ హౌస్ దగ్గర యానాం సముద్రం మధ్య ఇసుకలో కూరుకుపోతే ఓడను బయటకు తీయడానికి అమెరికా నుండి వచ్చిన ఇంజనీర్ స్వీని సాధ్యంకాక మేరీమాత పై భారం వేసి ప్రార్దన చేయగా ఓడ అతి సులువుగా కదిలి అందరినీ ఆశ్చర్య పరచిందని "

"అవుసార్ మనం చూస్తున్న రాక్ టెంపుల్  ఆయన భార్య అల్బెర్టా స్వీని దానికి గుర్తుగానే నిర్మించారు. దక్షిణంవైపు  ఉన్న మేరీమాత విగ్రహం మంగుళూరు నుండి రప్పించారండి".

ఫాదర్  స్వరం తగ్గించి "సార్  పురావస్తు శాఖ వారు చర్చికి నిధులు మంజూరు చేస్తారని చెప్పారు పనేమైనా ముందుకు వెళుతుందంటారా సార్ "అని అడిగారు.

మాటలపనిలోపడి అసలు విషయం చెప్పడం మరచిపోయాను పురావస్తుశాఖ నుండి నిధులు మంజూరైయ్యాయి త్వరలోనే ఆలయ పునరుద్దరణ పనులు ప్రారంభమవుతాయి అందుకే కాంట్రాక్టరు డేవిడ్ రాజుకు కబురు పంపాను వస్తూ ఉండవచ్చు"

 అని చెప్పేలోగా మోటారుబైకు ఆపి కాంట్రక్టరు పావులూరి డేవిడ్ రాజు లోపలికి వస్తూ ఎమ్మేల్యేగారికి ఫాదర్ కు నమస్కారం చేసి కూర్చున్నాడు.

ఎమ్మేల్యేగారు రాజు వైపు తిరిగి "రాజు చర్చికి నిధులు మంజూరైయ్యాయి పునరుద్దరణ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. యానాం కేథలిక్ చర్చి పురాతన స్వరూపం మారకుండా మరో రెండువందలయేళ్ళు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం చేయాలి" అని నిధుల మంజూరు ఉత్తర్వులు రాజు చేతిలో పెట్టారు ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుగారు.

ఉత్వర్వులు తీసుకున్న రాజు "మేరీమాతకు సేవ చేసే భాగ్యం దొరికిందనుకుంటానండి  మరలా మార్చి నెలలో జరిగే లుర్దూమాత ఉత్సవాలకు సిద్దం చేస్తాను సార్ "అని వినయంగా చెప్పాడు ఎమ్మేల్యే గారికి.

 ఫాదర్ నవ్వుతూ భక్తిభావంతో కనులు మూసి "ఆమెన్ "  అంటూ పైకి లేచారు .



సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...