Wednesday, October 28, 2020

పాకం గారెలు


కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


    జాను, రాములు సముద్రపు ఒడ్డున పీతలతో ఆడుకుంటున్నారు. పీతలు కన్నాలలోకి వస్తూ పోతూ ఉంటే సరదా పడి పోతూ ఆడుకుంటున్నారు.

"ఒరే జాను నీ చొక్కామీద ఆ మరకలేమిటిరా?"

అడిగాడు రాములు. "నిన్న మా అక్క కొత్త పెరుమాళ్ళపురం నుండి పాకం గారెలు తెచ్చిందిరా అవి తింటుంటే పాకం కొద్దిగా చొక్కా మీద పడింది" అన్నాడు శీను.

పాకం గారెలు మాట వినగానే రాములు నోరు ఊరింది. "జాను మీ అక్కను పరిచయం చేస్తావా మీ ఇంటికి వస్తాను" అన్నాడు రాములు." నాకు తెలుసులేరా నువ్వు ఎందుకు మా ఇంటికి వస్తానంటున్నావో మా అక్క కోసం కాదులే పాకం గారెలకోసం" అంటూ కిలకిల నవ్వేశాడు జాను. "పోరా నువ్వు నన్ను అలాగే ఆటపట్టిస్తావు" అంటూ సిగ్గు పడిపోయాడు రాములు. 

  జాను, రాములు గబా గబా అంగలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అక్కడ అమ్మలిక్కలందరూ జాను అక్కయ్య ప్రేమతో ముచ్చటిస్తూ ఉన్నారు. వారి సంభాషణ వింటూ చప్పుడు చేయకుండా అరుగుమీద కూర్చున్నారు స్నేహితులిద్దరూ.జాను అక్క  ప్రేమావతి కొత్తపెరుమాళ్ళపురం పాకం గారెల గురించి చెపుతూ " కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు బలే తీపిగా ఉంటాయి. మనం ఇళ్ళల్లో చేసుకునే పద్దతే అయినా వీటి ప్రత్యేకతే వేరు.  నానబెట్టిన మినుములను మెత్తగా రుబ్బి చిట్టి చిట్టి మినపగారెలుగా వేసి దోరదోరగా వేయిస్తారు. కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద వండుతారు.కొద్దిసేపటి తరువాత పంచదార పాకంలో వేసి తీస్తారు. గారెలలోనికి పాకం ఊరి తినగానే పసందైన రుచిని కలిగిస్తుంది. వేడి వేడి గారెలు తినడానికి చాలా మంది సుదూరం ప్రయాణించి వస్తూఉంటారు. ఇక రాష్ట్రంలో జరిగే పెద్ద పెద్ద సభలలొ జరిగే విందుల్లో కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు ఉండవలసిందే. కాకినాడ బీచ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు స్టాల్ పెట్టి అమ్ముతూ ఉంటారు కూడా. పది రూపాయలకు మూడు గారెలు ఇస్తారు. ఇంతకీ  ఇదేదో పెద్ద మిఠాయి దుకాణం అనుకున్నారు ఓ చిన్న పూరిపాకలో ఓ ముసలమ్మ  తన కూతురు కలసి వండే వంటకం  అంటే ఆశ్చర్యపోవలసిందే మరి " అంటూ చుట్టూ చేరిన వారికి తలో ఒక పాకం గారె పంచి పెట్టింది ప్రేమావతి. రాములు గబా గబా అందుకుని  గుట్టుక్కున బుగ్గలో పెట్టి నమిలేస్తూ బాగుందని తలాడించాడు జానుని చూసి నవ్వుతూ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...