Wednesday, October 28, 2020

బషీర్ బీ బీ

 


        బషీర్ బీబీ తీర్ధం( బంగారుపాప)


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




    జానకీరాం మాస్టారుకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యింది. పొన్నాడ పేరు చెప్పగానే తోటి ఉపాధ్యాయులు మంచి చరిత్ర ప్రసిద్ది చెందిన ఊరు వెళుతున్నారంటూ అభినందించారు.అక్కడ బషీర్ బీబీ దర్గా ఉందని ,ఉరుస్సు ఉత్సవాలు బాగా నిర్వహిస్తారని ,మతసామరస్యానికి చిహ్నంగా పేరు పొందినదని చెప్పారు. అంతే అంతకు మించి ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. బడిలో చేరిన మాస్టారును పలకరించడానికి అందరూ వస్తున్నారు. వచ్చిన వారిని బషీర్ బీబీ దర్గా విశేషాలు అడుగుతున్నారు మాస్టారు . బంగారుపాప అంటారని, బంగారపాపమ్మ తీర్ధమని పిలుస్తారని చెపుతున్నారు. తీర్దం మూడురోజులు జరుగుతుందని దేశ నలుమూలల నుండి ముస్లీం మతస్ధులు  కుటుంబాలతో వస్తారని, చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన హిందూ మతస్ధులు కూడా దర్గాను దర్శించి తమ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు జరిగితే చీర,రవిక, గాజులు  మొక్కుగా చెల్లించుకుంటారని ఊరిలో పెద్దలు వారికి తెలిసింది చెప్పారు.

 మధ్యహాన్నం భోజనం ముగించి విరామ సమయంలో దర్గా చూడడానికి వెళ్ళారు మాస్టారు. నిర్మానుష్య ప్రాంతంలో పాడుబడిన పురాతన శిధిల భవనంలా కనిపించింది. అది ముస్లీం ప్రార్ధన మందిరంలా అనిపించలేదు. దర్గా పరిసర ప్రాంతాలలో జనసంచారం కనిపించలేదు కాని దర్గా దర్శనానికి వచ్చిన ఓ రెండు మూడు ముస్లీం కుటుంబాలు ప్రక్కనున్న షెడ్ లో వంట చేసుకుంటూ కనబడ్డాయి. దర్గా మధ్యలో ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దానికి చమ్కీవస్త్రాలు  కట్టి ఉన్నాయి. అవి గాలికి అటూ ఇటూ  ఎగురుతూ ఉన్నాయి .చుట్టూ పరిశీలించి వచ్చేశారు జానకీరాం మాస్టారు.

 తరువాత రోజు బడి దగ్గరకు ప్రక్కస్కూల్ ప్రసాదు మాస్టారు వచ్చారు. మాటల సందర్భంలో బంగారుపాప అని ఎందుకు పిలుస్తారో చెప్పారు. పూర్వం ఇక్కడ ఉండే బంగారుపాప అప్పుల బాధలలో ఎవరైనా ఉంటే  అడగగానే తన బంగారునగలు తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చేదని అందుకే అందరూ బంగారు పాప అని పిలిచేవారని ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారని జనం నాలుకలమీద నానే కథను చెప్పారు. అయినా జానకీరాం మాస్టారుకు ఆ సమాచారం తృప్తిని ఇవ్వలేదు. దర్గాకు చెందిన విశేషాలు ఇంకా తెలుసుకోవాలని దగ్గరలో ఉన్న మూలపేట గ్రామం వెళ్ళారు.గ్రామంలో చదువుకున్నవారి దగ్గర సమాచారం ఏదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో. అక్కడ ఓ బ్రాహ్మణ కుటుంబం కంటబడింది. మాస్టారు వాకబు చేస్తుంటే లోపలనుండి ఒకాయన వచ్చి మా పూర్వీకులు రాసిన పుస్తకం ఒకటుందని 

‌చెప్పి లోపలకు వెళ్ళాడు. మాస్టారుకు !చెప్పలేని ఉత్సుకత ,ఆనందం కలిగింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయ్యింది. లోపలకు వెళ్ళిన ఆయన ఓ చివికిన పుస్తకం తీసుకు వచ్చి చేతికి ఇచ్చాడు. ఆయన చేతిలో ఓ పాతిక రూపాయలు పెట్టి గబగబా వెనక్కి తిరిగి వచ్చేసారు మాస్టారు.

       స్కూల్ అయిన తరువాత ఇంటికి వెళ్ళి భోజనం ముగించి పుస్తకం చదవడం ప్రారంభించారు. అది చారిత్రక నవల.

70  సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం.పీఠికలో దర్గా కథను రచయిత కలలో కనబడి బంగారుపాప రాయించుకున్నట్టుగా ఉంది.వేయి సంవత్సరాల క్రితం నాటి మాట. 

పొన్నాడ షెహర్ డిల్లీ పాదుషాల ఏలుబడిలో వుండేది. పొన్నాడ షెహర్ శ్రీకాకుళం వరకు ఏలుబడిలొ వుండేది. పొన్నాడను పరిపాలిస్తున్న వజీర్ స్త్రీలోలుడు. అందమైన యువతులను చెరపట్టి ఢిల్లీ పాదుషాలకు భార్యలుగా పంపేవాడు. శ్రీకాకుళంలో నివశిస్తున్న సుందరి, బీషీర్ బీబీ స్నేహితురాళ్ళు. ఇద్దరూ మంచి సౌందర్యవతులు  .సుందరి హిందూమతానికి చెందిన యువతి. బషీర్ బీబీ ముస్లీం వనిత. బషీర్ బీబీకి ఆనాటికే వివాహమైంది. భర్త ఢిల్లీ  ఫాదుషాల దగ్గర  సైనికదళంలో పనిచేస్తూ ఉండేవాడు.  ఢిల్లీ పాదుషాకు ఇక్కడ బషీర్ బీబీ ,సుందరి అనే అందగత్తెలున్నారని కబురు పెడతాడు వజీర్ .అందులో బషీర్ బీబీ మహా అందగత్తే అని చెపుతాడు. ఢిల్లీ పాదుషా బషీర్ బీబీ కోసం పొన్నాడలో మనోహరమైన 7 అంతస్దుల భవనం నిర్మించమని ఆదేశిస్తాడు.  వజీర్ ఆఘమేఘాల మీద పరిసర ప్రాంతం దుర్గాడ  నుండి నల్లరాళ్ళను తెచ్చి భవంతి నిర్మాణం వెంటనే ప్రారంభిస్తాడు.వజీర్ నుండి తప్పించుకోవడం కోసం పొన్నాడ నగరానికే మారువేషాల్లో వస్తారు స్నేహితురాళ్ళు .పొన్నాడ షెహర్ లో వజీర్  ఆడవారి పట్ల చేస్తున్న  దౌర్జన్యాలపై ప్రజలను చెైతన్య పరుస్తారు. ప్రజలకు అడిగిన వారికి తోచిన సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు.ఢిల్లీలో ఉన్న బషీర్ బీబీ భర్త అనారోగ్యం పాలవడంతో ఇంటికి ప్రయాణవుతాడు. చివరకు ఇద్దరు స్నేహితురాళ్ళు వజీర్ సైనికులకు దొరికిపోతారు.ఇంతలో బషీర్ బీబీ భర్త పొన్నాడ మీదుగా శ్రీకాకుళం వెడుతూ పొన్నాడలో మరణిస్తాడు. అది తెలిసి సైనికుల నుండి తప్పించుకుని బషీర్ బీబీ తన భర్త శవంతోపాటు ఢిల్లీ  పాధుషా తనకోసం నిర్మించిన భవంతి పైనుండి అడుగుభాగానికి పోయి సజీవసమాధికి సిద్దపడుతుంది. పై అంతస్దుకు చేరుకున్న సుందరి క్రిందకు చూస్తుంది . భర్త శవం ప్రక్కనే ధ్యాన ముద్రలో ఉన్న బషీర్ బీబీ బంగారుకాంతులు ఈనుతూ కనిపిస్తుంది సుందరికి. అప్రయత్నంగా సుందరి " ఓ బషీర్ బీబీ నా బంగారు పాప" అంటూ పిలుస్తుంది. బంగారుపాప కనులు తెరచి "సుందరీ నా ప్రియమైన మిత్రురాలా ఈ చోటును దర్శించి భక్తితో నన్ను "బంగారుపాప" అని ఎవరు పిలుస్తారో వారి కోరికలు నెరవేస్తాను. మన స్నేహనికి గుర్తుగా ఇక్కడ హిందూ ముస్లీంలు అందరూ కలసి తీర్ధం ఆచరిస్తారని అంటూ ధ్యాన ముద్రలోకి తిరిగిపోతూ కనులు మూసేసుకుంటుంది. ఇంతలో ఉప్పాడ సముద్రం ఉప్పొంగి సునామీలా పొన్నాడపై విరుచుకు పడుతుంది. వజీర్ సైన్యం ఇసుకమేటలలో కూరుకుపోయి చనిపోతారు. ఇసుకమేటలలో బంగారుపాప భవనం చివరి అంతస్దు మాత్రమే కనబడుతూ మిగులుతుంది.. ఆనాటినుండి ఆ చివరి అంతస్ధు భాగం  దర్గాగా పూజలందుకుంటూ ఉంది. నవల చదవడం పూర్తి చేసిన జానకీరాం మాస్టారు గుండె నిండా ఊపిరి పీల్చి మంచి చారిత్రక పుస్తకాన్ని చదివానని ఆనందపడుతూ తృప్తి నిండిన మనస్సుతో బంగారుపాప నవలను ప్రక్కన పెట్టి నిద్రకు ఉపక్రమిస్తారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



     

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...