Thursday, March 19, 2026

రిక్షా

 రిక్షా

చీకటి పడింది.మాదిగ పేట గూంగుర ఎండుకక్కలు కూర తిని నిద్రపోతూఉంది.రాజులమ్మ గిన్నెలు తోమి తాతబ్బాయి ఇంకా రాలేదని చూస్తుంది.ఇంతలో ఇసుక దారి లో రిక్షాను లాగుతు వస్తున్నాడు తాతబ్బాయి.రిక్షా హేండిల్ కి కట్టిన మువ్వలు చప్పుడు  చాకలొళ్ళ ఇళ్ళదగ్గర ఉన్న ఉసిరిచెట్టు దాటగానే వింది రాజులమ్మ .ప్రాణం లేచి వచ్చింది.చెక్కముక్కలు అద్దాలతో చేసిన లాంతరులో కిరసనాయిలు బుడ్డితీసి వత్తి పెద్దది చేసి తాతబ్బాయి రిక్షాకు ఎదురెళ్ళింది.తాటికల్లు వాసన గుప్పున వస్తుంది. ఆ రోజుల్లో భర్త రోజంతా కష్టపడి తాగివచ్చిన పల్లెత్తు మాట అనేది కాదు భార్య .సర్దుకుపోయేది.సార కల్లు వాసనే సెంటు వాసన అనుకునేది అది జీవిత భాగస్వామి ఇచ్చే గౌరవం. రిక్షా వెనక్కి వెళ్ళి రిక్షా కదలటానికి సాయంచేసింది రాజులమ్మ.ఇంటి ముందు రిక్షా పెట్టి నల్లటి దారంతో చేసిన తాడును బ్రేకుకు బిగించి కల్లు సీసాను రిక్షా సీటు కింద తొట్టిలోంచి తీసి అదే చేతితో మూర మల్లెపూలు కట్ట తీసి రాజులమ్మకు ఇచ్చాడు తాతబ్బాయి.పండు వెన్నెల చల్లటి తెల్లటి వెన్నెల 

 తాటాకు చేదతో నూతిలో నుండి చల్లటి నీళ్ళతో తానమాడి  తుమాలుతో తుడుచుని పీట మీద కూర్చున్నాడు తాతబ్బాయి.ముందు చెక్కపీట పెట్టి  అల్యూమినియం గిన్నెనిండా అన్నంపెట్టి అన్నం ఎంత ఉందో అంత  గూంగూర ఎండుకక్కల కూర  వేసి తెచ్చింది.ఆ రోజు జరిగిన కబుర్లన్నీ చెపుతూ తింటున్నాడు తాతబ్బాయి. గంటకు పైగా కల్లుతాగుతూ ముద్దలు తింటు మాట్లాడుతుంటే కునుపాట్లు పడుతూ ఊకొడుతుంది రాజులమ్మ.అన్నం తిని నులకమంచం మీద సాగోరోడు మన తాతబ్బాయి.కిరసనాయిలు దీపం వత్తి తగ్గించి తాతబ్బాయి తెచ్చిన మల్లెపూలు పెట్టుకుని పక్కకు వచ్చి పడుకుంది రాజులమ్మ.

1960 నుండి 1990 వరకు మాదిగల జీవితాలలో రిక్షా ఓ భాగమయింది.బ్రతుకు తెరువయ్యింది.బాదలు పంచుకుంది.పిల్లల పెళ్ళిళ్ళు చేసింది.అనారోగ్యాలలో ఆదుకుంది.మాదిగలు చెప్పులు కుట్టింది తక్కువే ఒకటో రెండు కుటుంబాలు చెప్పులు కుట్టటం మీదే ఆదార పడేవి మిగతా కుటుంబాలన్ని రిక్షామీదే బ్రతుకీడ్చాయి.రిక్షా నడుస్తున్నంత సేపు నవ్వులు చిందాయి మాదిగల జీవితాలలో.పెళ్ళి వచ్చిందంటే చాలు రిక్షాను పెళ్ళికూతురు కంటే బాగ ముస్తాబు చేసేవాడు మన మాదిగ రిక్షా కూలి.రోడ్డు మీద ఓ పదో పదిహేనో రిక్షాలు వరుసగ పెట్టి ఉండేవి.ఊరిలో నుండి బాపనోళ్ళు,కాపులు,రెడ్లు ,చదువుకున్న కుటుంబాలు రిక్షాలోనే తిరిగేవారు.ఓ ముప్పై సంవత్సరాలు రిక్షా మువ్వల చప్పుడు ప్రతీ విధిలో వినబడింది.


No comments:

Post a Comment

కొండేపూడి

 ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి  ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజ...