Wednesday, November 2, 2022

జంగందేవర — జానపదకళారూపాలు 7

 జంగం దేవర

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com




తెలుగు నేలపై మనలను అలరిస్తున్న జానపద కళారూపాలను లోతుకంటా పరిశీలిస్తే జనపదుల యొక్క జీవన స్థితిగతులు, వారిలోని రాగద్వేషాలు, జీవనంలోని ఆటుపోట్లను నిశితంగా పరిశీలించగలం.జంగందేవర జానపదకళారూపం చాలా ప్రాచీనమైనది. భారతీయ సనాతన సంప్రదాయాల్లో అంతర్లీంగా కలిసిపోయింది జంగందేవర కళారూపం. జంగం అని మనం తలచుకోగానే మన కళ్ళముందు నిలిచేది జంగం దేవర రూపం. దేవర వేషం బుడిగెజంగం తెగకు చెందిన వారే కడుతున్నారు. ప్రధానంగా తరతరాలనుండి యాచక జీవనం గడుపుతూ సంచారులుగా ఈ జంగందేవరలు గడపడం వీరి జీవన విధానం .


జంగం దేవర వృత్తి కళ చాలా పురాతనమైనది. ఇది శైవమతానికి చెందినది. ఈ జంగం దేవరలు మనకు కార్తీక పౌర్ణమి నుండి సంక్రాంతి వరకు పల్లెల్లో ప్రతి ఇంటి ముందు తెలతెలవారుతుందనగా నిలబడి శంఖం ఊదుతూ, చేతిలోని గంట వాయిస్తూ భీకర రూపంలో కనిపిస్తుంటారు. ఈ జంగం దేవర'వేషం' మగవారే కడతారు. వీరి యొక్క వేషధారణ ఆసక్తికరంగా ఉంటుంది. ఆజానుబాహుడైన జంగం తలపై పాగాను ధరిస్తాడు. అది  మామూలు తలపాగా కాదు, ప్రత్యేకంగా మలచబడి ఉంటుంది. రంగు రంగుల గుడ్డలతో తలపాగా తయారు చేస్తారు. అందులో ఇత్తడి రేకులతో తయారు చేసిన సర్పాకారాలను అలాగే ఇత్తడి రేకులతో చేసిన పూలను అమర్చుతారు. నుదురుకు విభూదిని నామాలుగా పెట్టుకుంటారు.నామాల మధ్యలో సింధూరం బొట్టు పెడతారు. 

జంగం దేవర తన మెడలో తరతరాలనుండి వస్తున్న లింగకాయను సంప్రదాయంగా వేసుకుంటారు. దీనిని వారు  అత్యంత పవిత్రంగా చూసుకుంటారు. వీరి ప్రదర్శనలో ఈ లింగకాయ చాలా ప్రధానమైనది. ఈ లింగకాయ వెండితో చేసి ఉంటుంది. ఇది ఒకరి నుండి ఒకరికి వారసత్వంగా వస్తుంది. మెడలో రుద్రాక్ష మాలలు ఉంటాయి. వంటిపై పాతకోటును వేసుకొని దానిపై రంగు రంగుల వస్త్రాలతో తయారు చేసేకున్న విలువు అంగీని వేసుకుంటారు. చంకలో ఒక జోలిని వ్రేలాడేసుకుంటారు. మరొక చంకకు కంచుతో చేసిన బరువైన గంటను వ్రేలాడేసుకుంటారు. చూడడానికి భీకరంగా కనిపించే ఈ జంగందేవర  తమ ఇంటముందుకు వచ్చి శంఖం ఊదగానే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చినట్లు భావించిన ముత్తయిదవులు వీరి జోలెలో బియ్యం వేసి సంభావనలు ఇచ్చి పంపిస్తుంటారు. ఈ జంగందేవరలు ముందుగా నిర్ణయించుకున్న గ్రామాలలో యాచన చేస్తారు. ఒకరి గ్రామాలలోనికి మరోకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరు. రైతుల ఇండ్లకు వెళ్ళి వారి ఇచ్చే పంట ఫలాలలను స్వీకరించి వారిని పొగడ్తలతో స్తుతించి వారి వారి గోత్రనామాలతో పొగుడుతారు. వారకి బిక్ష వేయగానే సహజరీతిలో పొగడ్తలతో ముంచెత్తి శివ ప్రాసిస్త్యాన్ని కూడా చదువుతారు. వీరి శంఖం ఊదడం ఆశ్చర్యం కల్గిస్తుంది. గుక్క తిప్పుకోకుండా ఎంతసేపైనా వీరు ఊదగలరు. వీరి చేతిలో ఒక కర్ర కూడా ఉంటుంది.జంగం దేవరలు ఎంత దూరమైనా కాలినడకనే పోతూ ఉంటారు. వీరు ఒకరకమైన పిల్లన గోవిని ఊదుతుంటారు మనకు దొరికే పిల్లనగ్రోవి కాదు. ప్రత్యేకంగా స్వరాలను అది పలుకుతుంది దానికి అందంగా జూలుతో ఉన్న గుడ్డలను కట్టి అందంగా తయారు చేస్తారు. దీనిని నిలువుగానే ఊదుతారు. వీటి నుండి పలికే రాగాలు మనకు వీనులు విందుగా వినిపిస్తాయి. ఈ జంగం దేవర వేషం కట్టేప్పుడు చాలా నియమనిష్టలతో

ఉంటారు. వీర జంధ్యాన్ని కూడా వేసుకుంటారు. జంగం దేవరలు శైవ ఆరాధీకులు ఉండే ప్రాంతాలలోనే యాచన సాగిస్తూ ఉంటారు. శివరాత్రి సందర్భాలలో రాష్ట్రం నలుమూలలా ప్రసిద్ధ ఆలయాల దగ్గర తీర్ధాలు, స్నానాల రేవులు, సముద్ర తీరాలు, గోదావరి ప్రాంతాలలోను వీరు కనిపిస్తుంటారు. వీరు పిండ ప్రధానం.

చేయడం కత్రువులను నిర్వహించడం నదిలోని నీటిని జ్యోతులలో వెలిగించి వదలడం చేస్తుంటారు. వైష్ణవ సంప్రదాయ కుటుంబాల వారు పిలిచి వీరిచే కర్మ కాండలు చేయించుకుంటారు. వీరు శవయాత్రలలో పాల్గొని, దహన కాండలు కూడా నిర్వహిస్తుంటారు. భారతీయ సనాతన సాంప్రదాయాలతో ముడివడిన అపురూప జానపద కళారూపం జంగం దేవరను ఆదరించవలసిన అవసరం  మనందరికి ఉంది.

తోలుబొమ్మలాట — జానపదకళారూపాలు 6

  తోలుబొమ్మలాట

రచన జనశ్రీ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



శతాబ్దాల తరబడి భారతీయ సంస్కృతిలో భాగంగా అందరినీ అలరించిన అపురూప కళారూపాలలో పురాతనమైన కళారూపం తోలుబొమ్మలాట. జింక లేదా మేక తోలుతో తయారయిన ఈ బొమ్మలు తెలుగువారి జీవితంలో విడదీయరాని భాగంగా మమేకమయినవి. ప్రస్తుతం నిశ్శబ్దంగా అంతరిస్తూ మినుకు మినుకుమంటూ ఆధునిక నాగరికతకు ఎదురీదుతున్న జానపదకళారూపం తోలుబొమ్మలాట. ఈ విశిష్ట కళారూపం పండితారాధ్య చరిత్రలోను, "పల్నాటి చరిత్రలోను ప్రస్తావించబడిన ప్రాచీన కళ ఇది. వర్షాలు కురవకుంటే తోలుబొమ్మలాటలోని విరాటపర్వం ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని ఈనాటికి పల్లె ప్రజలకు విశ్వాసం.


తోలు బొమ్మలాట లలిత కళల సమాహారం అనడంలో సందేహం లేదు. ఇందులో సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేకఖనం, శిల్పాలతో కూడిన సంపూర్ణ కలయింది. ఊరు మధ్య ఖాళీ ప్రదేశంలో మూడు వైపుల మూసి వేసి, నాలుగవ భాగం వైపు తెర కడతారు. లోపల దీపాల వెలుగులో తెరమీద తోలుబొమ్మలు నిలిపి దానిని కదుపుతూ ఉంటారు. రామాయణ, భారత , భాగవత ఘట్టాలను కీర్తనలుగాను, పద్యాలుగాను, వచనాలుగాను ఆయా ప్రాంతాల మాండలీకతో కూడిన సంభాషణలుగా వెనుకనుంచి పలుకుతూ రసవత్తరంగా రాత్రంతా సాగే ప్రదర్శన తోలుబొమ్మలాట. ఈ కళ నేటి సినిమాకు మాతృక అనడంలో అతిశయోక్తి లేదు.


తోలు బొమ్మల తయారీ ప్రాచీన కళానైపుణ్యానికి ఓ మచ్చుతునక. సాధారణంగా నాలుగు అడుగుల తోలు: బొమ్మ తయారు చేయాలంటే

రెండు మేక చర్మాలు, గోరు గొల్లలు, మేకులు, వెదురు బద్దలు, గేదె కొమ్ములు, దారాలు మొదలయినవి అవసరముంటుంది. బొమ్మను మూడు భాగాలుగా తయారు చేసి కదలికలకు అనువుగా అతుకుతారు. బొమ్మలకు ఆనాడు ప్రకృతి సిద్ధంగా లభించే రంగులు వాడేవారు. నేడు ఆధునికమైన రసాయనిక రంగులను వాడుతున్నారు. ప్రదర్శన ఇచ్చేప్పుడు నేపధ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాత్రల సంఖ్యలను బట్టి ప్రదర్శన కారులు 10 మందికి పైగా అవసరమవుతారు. వీరు హార్మోనియం, మృదంగం, ఇతర వాయిద్యాలు, పెద్ద పెద్ద చప్పుడు చేసే చెక్క బల్లలు, డబ్బాలు, విద్యుద్దీపాలు, మైకులు ఉపయోగిస్తారు. రామాయణ, భాగవతాల నుండి, లంకా దహనం, లక్ష్మణ మూర్చ, ఉత్తర గోగ్రహణం, రావణ గర్వభంగం, సుందరకాండ, శశిరేఖ పరిణయం,బాణాసుర, తదితర ప్రదర్శనలిస్తుంటారు .  నాలుగు దశాబ్దాల క్రితం వరకు తరతమ భేధాలు మరచి ఆబాలగోపాలం ప్రదర్శనలను తిలకించే వారు. కేరింతలు కొట్టి ఆనందించేవారు. సినిమా విదేశీ టి.వి. ఛానళ్ళ ప్రభావంతో క్రమేణా అదృశ్యమయ్యే పరిస్థితికి చేరుకుంది ఈ తోలుబొమ్మలాట. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవ పట్నం గ్రామం తోలుబొమ్మలు ఆడించే కళాకారులకు ప్రసిద్ధి చెందింది. 600 మందికి పైగా కళాకారులు ఈ గ్రామంలో నివసిస్తూ ఈ ప్రదర్శన కోసం 50 బృందాలుగా ఏర్పడి జీవిస్తూ ఉన్నారు.


ప్రస్తుత కాల మాన పరిస్థితుల దృష్ణా మనుగడకోసం ఈ తోలుబొమ్మలాట కళాకారులు తమ ఇతి వృత్తాలను మార్చుకొని కుటుంబ నియంత్రణ, ఎయిడ్స్, పల్స్ పోలియో, జన్మభూమి, బాలకార్మిక నిర్మూల బాల్య వివాహాలు,వంటి సామాజిక చైతన్య ఇతివృత్తం గల రూపకాలను ప్రదర్శిస్తూ జాతీయ, అంతర్జాతీయంగా కీర్తి గడిస్తున్నారు. శరవేగంగా దూసుకు వస్తున్న ఎలక్ట్రానిక్ యుగంతో పోటీ పడలేక ఇలాంటి జానపదకళా రూపాలు కనుమరుగు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి కళారూపాలను ఆదరించి, కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా వుంది. ఈ కళకే అంకితమయిన మాధవ పట్నం గ్రామ నివాసి తోలు బొమ్మలాట కళాకారుడు తోట పవన్ కుమార్ మరియు వారి బృందం దేశ, విదేశాలలో ప్రదర్శనలిస్తూ, విశేష ఖ్యాతిని గడించారు. వీరి బృందం అమెరికా: ఆస్ట్రేలియా, మారిషస్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి భారతీయ కళావైభవాన్ని చాటి చెపుతున్నారు.


గంగిరెద్దులాట— జానపదకళారూపం 5

 గంగిరెద్దులాట

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దుల ప్రదర్శన ఆ పండగకు మరింత శోభనిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. వాకిటిల్లో తీర్చి దిద్దిన రంగవల్లులపై నుంచి గంగిరెద్దులు ముస్తాబై నడిచి వెళుతుంటే తనువు పులకరించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. రాజులు, జమిందార్లు "పోషణలో వర్ధిల్లిన ఈ కళారూపం ప్రస్తుతం నిరాదరణకు గురై పట్టెడు మెతుకుల కోసం ఈ కళారూపం ప్రదర్శించబడటం శోచనీయం. కళాకారులు దుర్భర జీవితాన్ని గడుపూతూ ఉండటం హృదయాలను కదిలించకమానదు.


కళారూపం ఆవిర్భావం గురించి పురాణాలలో ప్రస్తావన వుంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని తన ఉదరంలో భంధించగా పరమేశ్వరుని విముక్తి కావించటానికి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి విష్ణువు సన్నాయి ధరించి బ్రహ్మడోలు వాయిద్యం చేబూని ముందుకు ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు. ప్రదర్శన తిలకిస్తున్న గజాసురుని నంది తన వాడియైన కొమ్ములతో పొట్టను చీల్చి పరమేశ్వరుని బయటకు రప్పించినట్లు పురాణగాథ. ఈ సందర్భంలోనే తన అనుచరులైన ఒక గుంపునకు ఈ ప్రదర్శన చేసుకొనడానికి శివుడు అనుమతి ఇచ్చాడని అప్పటినుండి వంశాను గతంగా ఈ కళారూపాన్ని అంటి పెట్టుకుని ఉన్నామని గంగిరెద్దుల వారు చెబుతుంటారు.. గంగిరెద్దు ఆటనే వృత్తిగా స్వీకరించిన వీరిని గంగిరెద్దోళ్ళుగా పిలుస్తూ ఉంటారు. వీరిని పూజ గొల్లలని కూడా పిలుస్తారు. వీరు తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి, జగ్గంపేట, మాధవపట్నం, గెద్దనాపల్లి, విరవ, కందరాడ, కాకినాడ, హుకుంపేటలో సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నారు.కాని 50 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని కలిగి వున్నాయి.వీరి వేషధారణను పరిశీలిస్తే ఎత్తైన విగ్రహం కలిగి కోరమీసాలు, బుర్రమీసాలు పెంచి ఈ కళారూపానికి తగిన అలంకరణ చేసుకుంటారు. ధోవతి చేతులనిండా చొక్కా  , నల్లని కోటు ధరించి తలకు జరీ అంచు ఉత్తరీయాన్ని చుట్టుకుంటారు. డోలు, శృతి బూరలు, లేదా సన్నాయి చేత పట్టుకొని సుస్వరాలతో వీనుల విందు చేస్తారు. వీరి గళం నుండి వినిపించే సాహిత్యమంతా అనుచానంగా అందుకొన్నదే. వీరి సాహిత్యంలో కొన్ని కథలలో బొబ్బిలికథ,సీతాదేవికథ నివాసం వంటివి ఉన్నాయి..


ఇక గంగిరెద్దుల ముస్తాలు చెప్పనక్కరలేదు. వీటి అలంకారంలో మువ్వలు, చిరుగంటలు, కొమ్ములకు, కుచ్చులు, మూపురంపైన చిలకల బొంతీలు, కాళ్ళకు గజ్జెలు వంటివి అలంకరిస్తారు. శ్రావ్యంగా సన్నాయి మోగిస్తూ, డోలు వాయిస్తే గంగిరెద్దులు చేసే విన్యాసాలు నేత్రపర్వంగా ఉంటుంది. దీనినే గంగిరెద్దులాట అని కూడా అంటారు. "అయ్యగారికి దన్నం పెట్టూ... డూ డూ బసవన్నా అంటూ గంగిరెద్దులాడించే వాడి గుండెలపై కాలు ఆనించి లయబద్ధంగా తన శరీరాన్ని ఊపుతూ గంగిరెద్దులు చేసే నృత్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుగు కాళ్లను ముక్కాలి పై వుంచి గంగిరెద్దు నిలబడి చేసే విన్యాసం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. గంగిరెద్దుకు రాముడు, లక్ష్మణుడు అని పేర్లు పెట్టి పిలిస్తే రాముడు అంటే పెద్ద ఎద్దు, లక్ష్మణుడూ అంటే చిన్న ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇది చూసే వారు సంబ్రమాశ్చర్యాలకు లోను కాకమానరు.  గంగి రెద్దులా తలాదించడం అనే జాతీయం ఇక్కడి నుండి వచ్చినదే. ఆధునిక మోజులో పడిన తెలుగువారు పట్టణ నాగరికత వ్యామోహంలో పడ్డవారు ఈ గంగిరెద్దులవారి పట్ల నిరాదరణ చూపడం ఫలితంగా ఇది కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఏమైనా అందరికి శుభం కలగాలని దీవెనెలు అందించే ఈ గంగిరెద్దులోళ్ళు ప్రస్తుతం కడుపునిండని పరిస్థితుల్లో వుండడం విచారకరం. వీరి ఆదరణకు ప్రభుత్వం చేయూత నివ్వడంతో పాటు ఈ కళారూపాల్ని భద్రపరుచుకోవలసిన అవసరం ఎంతో వుంది.

బుర్రకథ — జానపదకళారూపాలు 4


బుర్రకథ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



మన తెలుగు వారి జానపద కళాఖండాలలో బుద్ధకథ స్థానం అపూర్వమైనది. ఇది అచ్చమైన ప్రజాకళ .ఆది నుండి తెలుగు నేలపై  తెలుగు వాడి పౌరుషాన్ని రగిలిస్తూ ఆడవారి కళ్ళవెంట నీరు ఒలికిస్తూ రసజ్ఞులైన ప్రేక్షకులను  ఉర్రూతలూగించి వినోదాన్ని అందిస్తూ వస్తుంది. గత ఏభై సంవత్సరముల నుండీ ఈ బుర్రకథ కొత్త పుంతలు తొక్కుతూ విజ్ఞానాన్ని వెదజల్లే ప్రాధాన సాధనంగా కూడా మలచబడి నిలబడింది. ఈ బుర్రకథను జంగమ కథలని, పదములని, తందాన కథలని దీనికి పేర్లు కలవు. కథ చెప్పి కథకుడు తన చేతినందు సొరకాయతో కాని గుమ్మడి బుర్రతో చేసినా తంబూరాను,శారద వంటి వాద్యములు వాయిస్తూ ఆ శబ్దాలలో కూడిన గానములు గల కథలను పాడటం వలన దీనికి బుర్రకథలని పేరు వచ్చింది. రామచంద్రాపురం నందుగల బుర్రకథ చెప్పే ప్రఖ్యాత బుర్రకథ కథకులు శ్రీ గొర్రెల రాము తమ అనుభవాలను విశేషాలను ఇలా తెలియజేస్తున్నారు.


13వ శతాబ్దానికి ముందే ఉన్న 'బాలనాగమ్మ' తంబూరా పాటే కాలక్రమేణా బుర్రకథగా రూపాంతరం చెందినది. ఒకనాడు ఇది ఒక జాతివారికి బిక్షాటనకు ఆలంబనగా ఉండేది. ఇద్దరు స్త్రీలు, లేదా పురుషులు తంబూర వాయిస్తూ అందె మ్రోగిస్తూ  గుమ్మం, గుమ్మానికి తిరుగుతూ కథను పాడుతూవుంటే తెలుగంటి వారు చేటలతో బియ్యం తీసుకువచ్చి వారి జోలెలో వేస్తూ ఉండేవారు. ఈ బుర్రకథను భిక్షక స్థాయి నుండి దీని స్దాయిని పెంచి నాట్యాది విషయాలు జోడించి గజ్జె కట్టించి, బల్లనెక్కించి, పూలదండలు వేయించి పండితుల ఆదరణను తెచ్చిన గౌరవం శ్రీ నాజర్ కు చెందుతుంది. ఆంధ్రదేశంలో ప్రజానాట్యమండలి వారు కూడా ఈ బుర్రకథకు ఊపు యివ్వడంతో వాడవాడలా బుర్రకథ ధళాలు వెలిశాయి.


బుర్రకథలో ముగ్గురు కళాకారులుంటారు. ప్రధాన కథకుడు కాక ఇద్దరు వంతలు ఉంటారు. కథకుడు దోవతి కట్టుకుని పొడవైన అంగరఖా ధరిస్తాడు. తలకు ఎర్రని రుమాలు చుట్టుకుంటారు. వంతలు కాళ్ళుకు గజ్జెలు కట్టుకుంటారు. కధకుడు వాళ్ల గజ్జెలు లయబద్ధంగా మ్రోగిస్తూ భుజాన తంబూర మీటుతూ ఎడమచేతిలో అందెను మ్రోగిస్తూ కథ చెబుతుంటే వంతలు ఐదు ప్రక్కలా నిలబడి మెడలో డక్కీలు లేదా బుర్రలు వంటివి వేలాడదీసుకుని కథకుని అడుగులో అడుగు కదుపుతూ తందానతాన అని వంత కలుపుతారు. ఈ బుర్రకథలో ఒక వంత హాస్యం: పలికిస్తే, మరో వంత రాజకీయం చెబుతూ వుంటాడు.


బుర్రకథ ద్విపద, మంజరీద్విపదల శైలిలో బుర్రకథ రచన ఉంటుంది. శ్రీ నాజర్ గారు యక్షగాన పద్దతిని ఇందులో చొప్పించడంతో  నవ్యత వచ్చి ప్రజలకు చేరువయ్యింది. కమ్యూనిస్టు ఉద్యమాలలోను స్వాతంత్య్ర ఉద్యమాలకు కొత్త ఊపిరిలూదిన ఈ జానపద కళారూపం. సంగీతం, నాట్యం, అభినయం, వాచకంలతో నిండిన సర్వకళా సమాహారం అనడంలో అతిశయోక్తిలేదు. నవరసాలను సమ్మోహనంగా ప్రదర్శించడానికి ఈ కళారూపం దీనికిదే సాటి.


వినరా భారత వీర కుమారా విజయము మనదేరా" అంటూ విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు కథను బుర్రకథా కళారూపంలో విని తీరవలసిందే. వీరబొబ్బిలి, పల్నాటి యుద్ధం, నేతాజీ, బాపూజీ, అంబేద్కర్, బెంగాల్ కరువు, వీర యోధుల కథలు, వంటివి ఈ బుర్రకథలో గానం చేస్తుంటారు. ప్రస్తుతం అభిమన్యు, క్రీస్తు జీవితం, వంటి నాటికే అదరణ లభిస్తూ వుంది. ఈ బుర్రకథను ఎందరో కళాకారులు తమ కళాన నైపుణ్యంలో విశిష్టత చేకూర్చొరు. వారిలో శ్రీ నాజర్ , జూనియర్ నాజర్, నిట్టలబ్రదర్స్, గొర్రెల బ్రదర్స్,  లూక్ బాబూరావు మాస్టారు, దిండి బ్రదర్స్,

బెనర్జీ దళం ఒకరేమిటి 150 దళాల వరకు ఈ బుర్ర కథను నమ్ముకుని జీవించారు.. వాడవాడలా వినిపించిన బుర్రకథ ముప్పై సంవత్సరాల నుండి తన ప్రజాదరణను కోల్పోతూ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నా కథకులు పాత కథలనే చెప్పడం వేషధారణలో లోపాలు, నవ్యతలేని హాస్యం, కథచెప్పే శైలిలో ఇప్పటికీ నాజర్ గారినే అనుసరించడం ప్రేక్షకులకు ముఖం మొత్తిందనకోవచ్చు. బంగిమలు ప్రధానకారణంగా కూడా కనిపిస్తూ వుంది. నేడు ప్రభుత్వ కార్యక్రమాలలో బుర్రకథను ఉపయోగించడంతో కొంత వరకూ ఈ కథ తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది. బుర్రకథకులు తమ కథలను మార్చుకుని, వాణిజ్య ప్రకటనలకు, అక్షరాస్యతకు, వైద్య, విద్య రంగాలకు ప్రచారం చేస్తూ జీవనం సాగిస్తూ వున్నారు. పట్టుమని 20 దళాలు కూడా లేని ఈ బుర్రకథ కళారూపం కలకాలం బ్రతకాలంటే బుర్రకథకులు నవ్యతలను ఆవిష్కరించడమే కాకుండా ప్రజలు కూడా మన సంస్కృతి చిహ్నాలైన కళారూపాలను  కళను ఆదరించవలసిన అవసరము ఉన్నది. శ్రీ నాజర్ గారికి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం బుర్రకథ కళకు గుర్తింపు రావడమే కాకుండా  ఒక గొప్ప కళగా భారత ప్రభుత్వం గుర్తించినది అనడానికి మంచి నిదర్శనం.


ఆంధ్రుల పౌరుషాగ్నులు వెదజల్లే వీర గాథలే కాకుండా, స్వాతంత్యోద్యమ స్ఫూర్తిని దేశమంతా రగిలించడంలో బుర్రకథ చురుకైన పాత్రను పోషించింది. నేడు ఈ బుర్రకథ శాస్త్రవేత్తల జీవితగాధలు, ఎయిడ్స్ వంటి సామాజిక అంశాలను ప్రజలకు తన దైనశైలిలో వినిపిస్తూ జనజాగృతికి మూలస్థంభంగా నిలవడం ముదావాహం. రేడియో, దూరదర్శన్ వంటి ప్రచార సాధనాలే కాకుండా సాంగ్ డ్రామా డివిజన్-న్యూఢిల్లీ వారు కూడా ఈ బుర్రకథ ప్రాచుర్యాన్ని తెలియజేస్తూ బుర్రకథ పురోభివృద్ధికి ఇతోధికంగా సహకరించడం ఆనందదాయకం.

హరికథ జానపదాకళారూపాలు3

 హరికథ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



ఈ జానపద కళారూపం  నా సొంతం అని తెలుగువాడు గర్వంగా చెప్పుకొని సంబర పడే కళారూపం హరికథ.  బహుముఖ ప్రచారం కలిగి ఇంచుమించు అన్ని ప్రాంతాలలోను, హరికథ వ్యాపించి వున్నది. హరికథ కళారూపం పంచ ప్రాణజన్యం. అంటే సంగీతం, సాహిత్యం... అభినయం ,నృత్యం  సమతూకపు సమాహార కళ అన్న మాట . భక్తి గురించి ప్రధానంగా భోదించడమే ప్రాణంగా తొలుత హరికథ పుట్టింది. ఇది పేరులో తెలిపినట్లు హరి (విష్ణు) కథలను ఎక్కువగా గానం చేయడం లక్షణంగా కలిగి ఉండేది. అయితే కాలక్రమేణా సమస్త పురాణగాథలూ ఈ హరికథా గానంలో చోటు చేసుకున్నాయి. 20 వ శతాబ్దం వచ్చేప్పటికి ఇతర ఇతిహాస, చారిత్రక, సాంఘిక గాథలు కూడా హరికథాంశాలుగా రూపుదిద్దుకున్నాయి.


ఈ హరికథా గానం ఉనికి పన్నెండవ  శతాబ్దం పండితారాధ్య చరిత్రనందే కనిపిస్తుంది. అయితే అప్పుడు యక్షగాన రూపంలో బహుముఖ పాత్రలలో పలువురు వ్యక్తులు నిర్వహిస్తే హరికథలో అన్ని పాత్రలను ఒకే వ్యక్తి పోషిస్తాడు. కీర్తనలు, కృత్యాలు, తోహారాలు, మిత్రాలు, వచనాలు, శ్లోకాలు, దండకాలు, దరువులు కందార్థాలు అన్నీ తానే చెబుతారు. తెలుగుభాషలో హరికథా రూపంలో సంపూర్ణ రూపంలో వెలువడిన తొలి హరికథ 'ఆధ్యాత్మిక రామాయణం' అంటారు. దీని రచయిత మునిపల్లె సుబ్రహ్మణ్యకవి .క్రీ॥శ 17వ శతాబ్దానికి చెందిన ఈయన రామాయణ గాధ అంకం 104 కీర్తనల్లో చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలే హరికథగా రూపుదిద్దాయి. అందులో చేరి వినవే శౌరి చరితము గౌరీ సుకుమారి గిరి వర కుమారి ఇలా ఆయన శ్రీరామ జననం, బాల్య క్రీడలు తదితర ఘట్టాలు వినసొంపుగా రచించారు. శివలీలలు, సక్కుబాయి, మీరాబాయి, జయదేవ వంటి భక్తుల గాధలు అదనంగా వచ్చాయి. జాతీయోధ్యమ కాలంలో జాతీయ భారతం, ఝూన్సీరాణి, రాణా ప్రతాప్ , వీర శివాజీ, నెహ్రూ, తిలక్ , భగత్ సింగ్, బెంగాల్ కలుపు కథలను గానం చేయసాగారు.


హరికథ చెప్పే కథకుడు కాళ్లకు గజ్జెలు, చేతిలో బిడలేలు ముంజేతికి సింహ తలాటం, మరుగురులు, భుజాలకు దండ కడియాలు, నుదుట కుంకుమబొట్టు, గిరజాల తల (ఉంగరాల జుట్టు), మధ్యలో పాపిడి, వెనుక సిగముడి, మెడలో పూలదండలు, పట్టుపంచి, జరీ కండువా, వేసుకుంటాడు. ఇతనికి ఇరువైపులా మృదంగం, ఫిడేలు ఉంటే వెనకవైపు శృతికోసం హర్మోనీ సహా వాయిద్యాలుగా ఉంటాయి. కొందరు కంజెరను గానీ, అగ్గిపెట్టెల వాయిద్యం కూడా ఏర్పాటు చేసుకుంటారు. హరికథ కళాకారుడు అభినయ సమయంలో స్వేచ్చగా తిరగడం అవసరమవుతుంది. సహా వాయిద్య కారులూ హరికథకులు ఇరువైపులా వేదికమీదే కూర్చుంటారు.


గజ్జె కట్టి, చిరుతలు వాయిస్తూ, సంగీత సాహిత్యాలను రెండింటిని మేళవించి పండిత పామరులను రంజింప చేసిన కళాకారులు ఈ తెలుగు గడ్డమీద ఎందరో ప్రసిద్ధి చెందారు. వారిలో 1854 సంవత్సరంలో విజయనగర ప్రాంతంలో ఇజ్జాడ అనే గ్రామంలో జన్మించిన శ్రీ మద్దజ్ఞుడు ఆదిబట్ల నారాయణదాసుగారు ఒకరు వీరు హరికథా పితామహా గానకళా ప్రపూర్ణ, లయ బ్రహ్మ, స్వర్ణ శిల్పి, హరిదాస జగద్గురు అనే బిరుదంతో పిలబడేవారు. 1853 నుండి 1945 సంవత్సరం వరకు హరికథా రంగంలో నారాయణడి కాలం స్వర్ణయుగంగా వర్ధిల్లింది. శ్రీ ఆదిబట్ల వారు హరికథకు విశేషమైన ప్రాచుర్యాన్ని తీసుకువచ్చారు. వీరి దగ్గర అనేక మంది శిష్యులుగా చేరి ఆంధ్రదేశమంతా హరికథ గానంలో పామరులను సైతం ఉర్రూతలూగించారు. వారిలో మన ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన పుచ్చల భ్రమర్ధాసుగారు, శ్రీ నల్లమిల్లి బసివిరెడ్డి భాగవతార్, కొమ్మూరు బాల బ్రహ్మానందదాసు, భమడిపాటి సూర్యనారాయణదాసు, వడియ్య దాసుగారు , గాజుల దాసుగారు, అచ్చమాంబ భాగవతారిణి, శార్వాణీ భాగవతారిణి, సలాది భాస్కరరావు తదితరులు కలరు. ఈ కళారూపాన్ని మహిళలలూ ప్రతిభావంతంగా కథాగానం చేస్తున్నారు.


పల్లెల్లో వర్షాకాలం పనుబాటులు పూర్తయిన తరువాత ఈ హరికథా కాలక్షేపంతోనే కాలం గడిపే వారు ఆనాటి ప్రజలు, వీరికి సర్వ విజ్ఞానం అందించే ఉపాధ్యాయులుగా హరికథకులు ఉండేవారు. ఆనాడు ఈ హరికథా దాసుల హరికథా గానం లేనిదే  పండగలు, ఉత్సవాలు  ముగిసేవి కావు . ఈ హరికథ గురువులను భక్తి శ్రద్ధలతో గౌరవించేవారు. హరికథాగానం ప్రారంభమవుతుందంటే ఊరిలోని ముత్తెదువలందరూ పళ్ళు ఫలహారాలు ఉంచిన పళ్ళాలు తీసుకుని వేదికపై ఉంచి హరిదాసుకు నమస్కరించి కూర్చునేవారు. హరికథాగానంలో రామాయణ, భాగవ, భారత గాథలలోని చక్కని పిట్టకథలను జోడించి హరిదాసులు చెబుతుంటే అర్ధరాత్రి దాటినా జనం కదలకుండా కూర్చుని వినేవారు. 'ఓరోరి గణపతి రాదా నీకు ఉండ్రాళ్ళు పోసేదా రారా అంటునో తాండవ నృత్య హారీ గజానన, ధిరుకిట దిమికిట బాజా మృదంగ అంటూనో గణపతి ప్రార్ధన మొదలెట్టి "పవమానా సుతుడు పుట్టు పాదారా విందములకు అని మంగళం పాడే వరకూ అందరూ పరవశులై వింటూ కూర్చొనేవారు. మధ్యలో ప్రేక్షకులతో చిరు భజన కీర్తన అందుకుని హరిదాసు అందరిచేత భజనలు కూడా చేయించేవారు.


దాదాపు 40 రోజుల పాటు ఈ హరికథా గానం జరిగేది శిష్యులతో వచ్చిన హరిదాసులు ఆ వూరిలోనే ఉండిపోయేవారు. వీరి హరికథాగానం మధ్యలో ఊరిలోని పెద్దలు కానుకలను పోటీ పడి చదివించే వారు. 'శ్రీమద్రమారమణ గోవిందో హరి' అని హరిదాసు వాడే ఊతపదం మన ఆంధ్రదేశమున ఎంత ప్రాచూర్యం పొందిందో తెలియనిది కాదు. ఊరి మధ్య దేవాలయం వద్ద పచ్చని పందిరి వేసి ఆ పందిరి క్రింద బల్లలు చేసి, పైన రెండు పెట్రోమాక్స్లెట్లు తగిలించి హరిదాసు కథ చెబుతుంటే భోజనాలు ముగించుకుని కూర్చోడానికి గోనెసంచులు తెచ్చుకొని యింటిల్లపాది వినే ఈ హరికథ మన సంసత్కృతిలో ఒక భాగం. మన జానపద కళారూపాలలో ఆణిముత్యం. ఇటుంటి హరికధను నేడునూ. రసరమ్యంగా కథాగానం చేస్తున్న కళాకారులు పెండెం ధర్మారావు, ముమ్మిడివరం వారు కూడా ఉన్నారు. ఈ హరికధలో శిక్షణ ఇవ్వడానికి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో హరికథా శిక్షణా పాఠశాల కూడా ఉండటం ఆనందించవలసిన విషయం.

Tuesday, November 1, 2022

జానపదకళారూపం—పోటు వేషాలు 2

 పోటు వేషాలు

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



పగటివేషాలు సూదిరిగానే 'పోటు వేషాలు' విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. జానపదకళారూపాలలలో రహస్యాలను దాచుకున్న కళా ప్రదర్శనగా ఈ పోటు వేషాలు ప్రసిద్ధి చెందాయి. బీభత్సరసానికి చెందిన ఈ జానపదకళా ప్రదర్శన సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. బళ్ళాలతోను, రంపాలతోను, గొడ్డళ్ళతోను, కత్తులతోను ఎదుట మనిషిని పొడిచినట్లు, రక్తం చిందుతున్నట్లు అత్యంత సహజంగా కనిపిస్తూ గగుర్పాట్లును కలిగిస్తాయి. అందుకే వీటిని ఖూనీ పోటు వేషాలని కూడా పిలుస్తారు. ఈ కళారూప రహస్యాలు విశ్వ బ్రాహ్మణులకే తెలుసు అంటారు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ,మూలపేట, అమీనాబాద గ్రామాలు ఈ కళారూపానికి ప్రసిద్ధి "ఆశ్వీయుజ పౌర్ణమికి దేవాంగులు, పద్మశాలీలు తమ కులదేవత గౌరమ్మను నిలుపుకుంటారు. కార్తీక పౌర్ణమి వచ్చేవరకు నెలరోజుల పాటు సంబరాలు చేస్తారు. నెలరోజులూ రోజులో చేపు కడుతూ చివరి రోజు గౌరమ్మను సాగనంపుతూ ఈ ఖూనీ పోటు వేషాలు కడతారు. ఈ పోటు వేషాలలో బాడితివేషం, రంపం వేషం, బొడ్డులో బళ్ళెం, పక్క బళ్ళెం, జబ్బకత్తి వేషాలు చూపరులను కట్టిపడేస్తాయి. బళ్ళాలు, కత్తులు శరీరాలలోనికి.

దిగబడినట్లు అత్యంత సహజంగా కనిపిస్తాయి. ఈ వేషాలకు మేకప్ విద్య తెలిసిన పాలంకి బాల సూర్యనారాయణ (బాబి ) ఉప్పాడ వారిని అడిగితే చాలా విషయాలు తెలియజేసారు..?


పూర్వం అనకాపల్లి ప్రాంతం ఈ కళాప్రదర్శనకు ప్రసిద్ధి చెందినదని అంటారు. అమీనాబాద గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు కమ్మరి భీమన్న ఈ కళకు సంబంధించిన రహస్యాలు తెలుసుకుని తన కుటుంబస్థుల సహకారంతో వేషాలు కట్టించేవాడు. కమ్మర భీమన్న శిష్యులు బొమ్మకంటి శరభయ్య, సుబ్బారావు, వెంకటరత్నం అనే అన్నదమ్ములు వీటిని తెలుసుకుని మరింత ఆధునీకరించారు. అతి తక్కువ మందికి మాత్రమే ఈ రూపంలో లోతుపాతులు తెలియడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. నల్ల కళ్లద్దాలు, తలపాగలు, ఆశ్చాదనలేని శరీరాలతో ఈ వేషాలను పురుషులే వేస్తారు.


 ప్రదర్శన రోజున ప్రదర్శనకారులను రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి వీరికి వేషాలు కడతారు.  ఈ కళాకారుల వేషధారణ ప్రత్యేకముగానే ఉంటుంది. తెల్ల నిక్కరుగాని, గళ్ళపంచెలుగాని కట్టుకుంటారు. ముందు వెనుక వ్రేలాడ కాశీకోర ఉంటుంది . నల్ల కళ్ళద్దాలు, బుర్రమీసాలు పెట్టుకుంటారు. తలకు రంగు రంగుల తలపాగాలు ధరించి అరనామాలు పెట్టుకుంటు ముఖానికి భీకరంగా కనిపించేట్టు నామాలు పెట్టుకుంటారు. మెడలో పులిగోరుల దండలు, జబ్బు కడియాలు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద పొడవైన వెదురు లేక రేకు గడలకు చివరన పెద్ద బళ్లాలు, కత్తులు అతికబడివుంటాయి. వీటిని అమర్చుకొనుటలోనే వుంది ఈ కళా ప్రదర్శనలోని రక్తి అంతా . బాడితి వేషం నడినెత్తిలో గుచ్చుకుని గెడ్డం క్రిందకు దిగబడినట్లు వుంటుంది. బొడ్డు బళ్ళెం. పక్కబళ్ళెం అచ్చుం శరీరం నుండి దూసుకుపోయినట్లుగానే భ్రమింపజేస్తాయి. రంపపు వేషం మరింత ఆశక్తి కరంగా వుంటుంది. మధ్యలో మనిషిని నిలబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు రంపాన్ని పట్టుకుని ఆడిస్తూ వుంటే రంపం శరీరం మధ్య నుండి కదులుతున్నట్లు కనిపిస్తూ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ప్రదర్శన కారులు నెమ్మదిగా ఒక్కొక్క అడుగూ వేస్తూ కదులుతుంటారు.


ఈ ప్రదర్శనలు మధ్యాహ్నం నుండి వీధుల వెంబడి ప్రారంభమవుతాయి. వీటిని జనం విరగబడి చూస్తుంటే ఈ వేషాల నందుగల ట్రిక్కులను ప్రదర్శన తిలకించేవారు కనిపెట్టకుండా ఉండటానికి 'కోడిగాడు" అనే హాస్య పాత్ర అల్లరిచేస్తూ వుంటుంది. ఈ కోడి గాడి వేషం నవ్వు పుట్టిస్తుంది. చేతిలో కోడి, నల్లని గొడుగు, చిన్న జబ్బల చలికోటు, గొట్టంఫేంటు, తలపాగా, నల్ల కల్లద్దాలు పెట్టుకున్న కోడిగాడు జనం మీదకు తనచేతిలోని కోడిని ఆడిస్తూ ప్రదర్శన కారులపై దృష్టి పడకుండా చేస్తాడు. ప్రతీ పాత్రకు పరమార్ధమున్నట్టే ఈ కోడిగాడి పాత్రకు పరమార్ధముంది. ప్రదర్శన పూర్తవగానే కోడిగాడు తన చేతిలోని కోడిని కళాకారులకు దిష్టి తీసి గౌరమ్మకు సమర్పిస్తాడు.

భీభత్సరసాన్ని పూర్తి స్థాయిలో ప్రతిబింబించే ఈ కళారూపం ప్రదర్శిస్తున్నప్పుడు చిన్న పిల్లలు జడుసుకోకుండా ఇంట్లో పెట్టి తల్లులు గడియ పెట్టడం, కిటికీ సందుల నుండి ఆడవారు భయం భయంగా చూడడం ఈ కళా ప్రదర్శన సహజత్వానికి ఉదాహరణలు. పోటు వేషాలకు రక్తం కారుతున్నట్లు తిలకంరంగు అద్దడం మరింత సహజత్వాన్ని చేకూరుస్తుంది. ప్రదర్శనకు ప్రజలే విరాళాలు అందిస్తారు. ప్రతీ ప్రదర్శనకు ఈ రోజుల్లో, ఏడు, ఎనిమిది వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కొన్ని రోజుల క్రితం వరకూ తుని, పిఠాపురం, పందలపాక, రేలంగి, కాట్రేనికోన వంటి గ్రామాలలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు.


ఈ కళారూపం రహస్య కళారూపం కావడంతో వేషాలు వేసుకున్న వారు, వీరికి వేషం అమర్చిన వారికి తప్ప ఇతరులకు ఈవిద్య తెలియక పోవడంతో ఈ కళారూపం అంతరించిపోయే ప్రమాదంలో పడింది. వేషాలు ధరించిన వారి దగ్గర వేషం తాలూకు రహస్యాలు ఇతరులకు తెలపనని ప్రమాణం చేయించుకోవడం వలన కూడా ఇది మరుగున పడుతుంది. ఈ కళారూపం రహస్యాలు తెలిసిన వారు ప్రస్తుతం వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. వారిలో శ్రీ ఏడిద రత్నాకరరావు, ఆశపు సూర్యారావు, ఉన్నారు. ఈ కళారూపం ప్రదర్శించి పేరు సంపాదించిన వారిలో వడిగే మల్లికార్జున్, మలిపెద్ది అప్పులరాజు. సిద్ది సూర్యారావు, గుంటూరు స్టాలిన్ తదితరులు ఉన్నారు. ఇటువంటి అపురూప కళారూపాలను విడియో రూపంలో నిక్షిప్తం చేసి భావితరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది











.

జముకుల కథ జానపదకళారూపాలు 1

 జముకుల కథ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



అతి ప్రాచీనమైన జానపదకళారూపం జముకులకథ. 'జముడు' అనేది వాయిద్యం ఈ కళారూపానికి ప్రాణం వంటిది. ఖంగుమని మ్రోగి హుషారెత్తించే లయతో పలికే ఈ వాయిద్యం వాయించాలంటే చాలా సాధన చేయాలి . జముకుల కథ చెప్పడానికి ముగ్గురు కళాకారులు అవసరమవుతారు. మధ్యలో ఆడ వేషం వేసుకుని ప్రధాన గాయకుడు ఉంటే ఇటు కుడివైపు అనపకాయతో చేసిన తంబూరా వాయిస్తూ, ఒకరు, ఎడమవైపు జముకు వాయిస్తూ ఒకరు ఉంటారు. విశాఖ జిల్లాలో ఈ జముకుల కథ ప్రసిద్ది చెందినప్పటికి రాజమండ్రి జిల్లాకు చెందిన  కళాకారుడు తాతపూడి సుబ్బారావు ముఖ్యులైతే,  పెదపూడి మండలం ఎ. పి. త్రయం గ్రామానికి చెందిన వేమగరి సుందరరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. జముకు వాయించడంలో ఈయనకు ఈయనే సాటి.తానా సభలలో జముకు వాయించిన ఘసాపాటి.


ఈ జముకుల కథ పదకొండవ శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లు గమనించగలము. పాల్కూరి సోమనాధుని పండితారాధ్య చరిత్రలో ఈ జముకుల కథ ప్రస్తావన కనబడుతుంది. రాజులు తమ సైన్యాలను ఉత్సాహపరచడానికి ఈ జముకుల కథను చెప్పించేవారు. ఈ కథలో వీర, కరుణ, శృంగార రసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సారంగధర కథను వింటే జముకుల కథలోనే వినాలి. రాజులేనప్పుడూ సారంగా రారాదా పోరాదా సారంగా అంటూ సారంగధరుణ్ణి ప్రేరేపించడం వగైరా కీర్తనలు ఓ ప్రత్యేకమైన బాణీలలో పాడుతూ ఉంటే వినితీరవలసిందే. కన్యక కథను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలివారు అనేక చోట్ల ప్రదర్శించారు. కన్యక కథను పీసా లక్ష్మణరావు, తవిటయ్య , ముదిలి నరసింహారావు , మిక్కినేని రాధాకృష్ణమూర్తి, శ్రీ కర్నాటి వారు  ఇంకా  ప్రమీలా సిస్టర్స్ ప్రదర్శించి ప్రసంశలు పొందారు.


జముకును కుంభంలా వుండే చెక్కతోకాని, రేకుతో కాని చేస్తారు. ఒకవైపు గొడ్డు మాంసానికి చెందిన ఓపలుచని పొరను ఉపయోగించి మూస్తారు. దాని నుండి ఎద్దు నరాన్ని జముకు లోపల అతికి ఒక చిడతకు అతుకుతారు. ఎడమ చేతితో చిడతను లాగి వదులుతూ ఉంటే. కుడిచేతిని కుంచం లోపలకు పెట్టి ఆ నరాన్ని మీటుతూ ఉంటే అద్భుతమైన మనోహరమైన శబ్దం పుడుతుంది. తంబూర తంతి వాయిద్యానికి ప్రత్యేక బాణీలో పాడే జానపద గీతానికి ఈ జముకు శబ్దం తోడై కూర్చున్న వారిని లేచి అడేలా చేస్తుందీ జముకు వాయిద్యం.

జముకుల కథ చెప్పేవారు అనుభావంగా ఈ కథను చెబుతుంటారు. తాతలు దగ్గర నేర్చుకున్న కథనే యధాతథంగా చెబుతూ అతి పవిత్రంగా ఈ వృత్తిని చేపడతారు. ఇందులో నాటక ప్రక్రియకు చెందిన సంవాదాలు ఎక్కువ. ద్విపద రూపంలో కథాగానం సాగుతుంది. అమీనాబాద గ్రామానికి చెందిన ఏడిద చిట్టోడు, రేడియో జముకుల కథకులు సామర్లకోట వాస్తవ్యులు మాలు సూర్యారావును కదిలించగా కన్నీళ్ళ పర్వంతమయ్యారు. పూర్వం జాతరలలోను, ఉత్సవాలలోనూ ప్రజాదరణ పొందిన ఈ కథకు ప్రోత్సాహం కరువైయ్యిందని విచారించారు. 

కథకుడు పాత్రకు సంబంధించిన ప్రధాన పాత్ర వేషం ధరించి జముకు కథ చెబుతాడని ఆయన చెబుతూ కొన్ని విశేషాలను తెలియజేసారు. జముకుల కథను ఆరోజుల్లో మహాభారత కథ మూడున్నర నెలలు, రామాయణ కథ రెండున్నర నెలలు కథాగానం చేసేవారు. ఇందులో నృత్యం, సంగీతం, అభినయం, హాస్యం అన్ని కలసిన సమాహార కళ ఇది. ఈ జముకుల కథనే మార్పుచేసి శ్రీ నాజర్ బల్లనెక్కించి బుర్రకథగా మలిచారు. బుర్రకథకు మూలం ఈ జముకుల కథే ముందు చెప్పుకున్నట్టే కథకుడు ఆడవేషం కట్టడం ఈ జముకుల కథలోని విశేషం. అతి ప్రాచీనమైన ఈ జముకుల కధను పూర్వం పేట ప్రజలు అపూర్వంగా ఆదరించారు. దూరదర్శన్ల రాకతో ఈ జముకుల కథకు ప్రాచుర్యం తగ్గింది. అయినా ప్రస్తుత కళాకారులు తమ కథలను సామాజిక అంశాలవైపు మళ్ళించి, ఎయిడ్స్, కరోనా,  బాలకార్మిక నిర్మూలన, ఆరోగ్యసూత్రాలు, వాణిజ్య ప్రకటనలుగా మలిచి మనుగడ సాగిస్తున్నారు. మన ప్రాచీన కళను కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నారు.

సిద్దాంతపు

సిద్దాంతపు ఇంటి పేరు ఎలా ఏర్పడింది ? సిద్దాంతపు ఇంటిపేరు వైదిక బ్రాహ్మణులలో వందలాది సంవత్సరాలుగ ఉంది బహుశ బ్రాహ్మణ స్ర్తీ కి మాదిగ పురుషుడి...