Monday, November 30, 2020

కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం


 కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం




వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

బాలసాహితీ రచయిత

9908953245


జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన మండలం తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /. యాదవులు,మత్య్సకారులు నివశిస్తా ఉన్నారు.1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బల్లోజి బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో 

ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది. బల్లోజిబాబా చరితార్దుడు అనడంలో సందేహం లేదు. 

1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా.ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి,వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి.ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి(గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు. ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి.

చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జంమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి.అడవిలోకి వెళ్ళడానికి బయపడేవారు. తేనెటీగల ఝంకారంచేస్తూ గుంపులు గుంపులుగా అడవి అంతా పెద్ద శబ్దం చేస్తూ ముసురుతూ వుండేవి.

            చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు  తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేది. జమిందారులు మహా ఇష్టంగా తినేవారు. 

    తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది.  ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు.కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు,తుమ్మచెట్లు,అడవి ఎద్దులు,గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి. పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం.


తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి?

మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా,పూరి,మచిలీపట్నం,యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850  తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు.



 


కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*


 *కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*

వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ (జనశ్రీ)

ఆంగ్ల ఉపాధ్యాయులు

బాల సాహితీ రచయిత


  తన నివసిస్తున్న చోటు ఏ నాటిదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికీ వెంటాడుతూ ఉంటుంది.తాతముత్తాతల గురించి వింటేనే మనసు పులకరిస్తుంది.ఓ ఉద్వేగం ముసుకుంటుంది. దాని ఆత్మీయత బావన స్పర్శ దేనికీ సాటిరాదు మరి.కొత్తపల్లి మండలం వేల సంవత్సరాల నాటిదే అంటే ఓ క్షణం దిగ్బ్రమ కలగకమానదు. కాని కొంత మంది అవును అంటారు కాని ఏమీ చెప్పలేరు. అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే తాటాకుల పత్రాలలోను, రాగిరేకుల్లో, శాసనాలలోను స్ధానిక చరిత్రలు రాసుకునేవారు. వాటిని దండకవిలెలు అనేవారు. వీటికి విలువ వుండేది కాదు. ఆనాటి సంస్కృతాంధ్ర కవితాఘోషలో వీటి శబ్దం అస్సలు వినిపించేది కాదు. అయినా కరణాలు, జమిందారులు వారి వంశ చరిత్రకోసం రాయించుకునేవారు. అయితే అవి కొంత కాలానికి కనుమరుగయ్యేవి. అవ్వవా  మరి గ్రంధాలయాలు ఉన్నాయా ఏమిటి ఆరోజుల్లో  అయితే ఓ మహానుబావుడుకి ఆ విలువ తెలిసింది అవి అపురూపమనిపించింది. అంతే తన జీతభత్యాలు త్యాగంచేసి వీటిని సేకరించాడు. మామూలుగా కాదు ప్రపంచంలో  ఇప్పటి వరకూ మానవమాత్రుడు ఎవరూ  చేయనంత సేకరణ. ఇప్పటికీ కొన్ని వేల సేకరణలు అలాగే వున్నాయి. పరిశోధకులు నిత్యం పనిచేస్తున్నా తరగడం లేదు. ఆయన ఎవరో కాదు మెకంజీ .స్కాట్లాండు దేశస్దుడు. 1783లో సర్వేయరుగా భారతదేశం వచ్చాడు. ఆయనికి ఈ దండకవిలెలు ఆశ్చర్యమనిపించింది. వీటి సేకరణకు ముందు బ్రిటీష్ వారు నిదులిచ్చినా  ఆ తరువాత ఆపేశారు. సమకాలీకులు పనికిరాని వస్తు సేకరణ అన్నారు. అయితేనో బుర్రయ్య అనే బహుబాషా కోవిదుడిని ప్రక్కన పెట్టుకుని ఊరూర పంపించి సేకరించాడు. ఈదండకవిలలనే  మహ్మదీయులు ఆ తరువాత కఫీయ్యత్తులుగా పిలిచేవారు. ఇది ఉర్దూ పదం నుండి వచ్చింది. కఫియ్యత్ అంటే సంగతులు, విశేషాలు అని అర్దం  వీటికి ఆ పేరే వాడుకలో ఉండి పోయింది.

      మెకంజీ 1784—1790 ప్రాంతంలో రాయలసీమలో ఉన్నాడు. అక్కడ నుండే కఫియ్యత్తులు సేకరించాడు.వాటిలో తూర్పుగోదావరివి 10 ఉన్నాయి. 

వీటిని 600 సంవత్సరంలో కొంకిపర్రు అని,1700 సంవత్సరంలో కాకినాడు అని ఇప్పుడు కాకినాడ  అని పిలిచే కాకినాడలో ఉండే మహానుబావుడు బల్లోజి బాబా వెలుగులోకి తెచ్చాడు.తూర్పుగోదావరి కఫియ్యత్తులు పిఠాపురం,పెద్దాపురం,కాకినాడ పరిసర ప్రాంత గ్రామాల చరిత్రలను జమిందారుల చరిత్రలు  తెలుపుతుంది. ఇందులో కొత్తపల్లి గ్రామం గురించి పెద్దగా తెలియకపోయినా మండలానికి సంబందించి ఓ స్పష్టత మరి కొంత సమాచారం దొరకడం నిజంగా కొత్తపల్లి వాసులం అందరం మెకంజీ మహాశయునికి ఋణపడి వున్నాం.  


         మనం త్రిలింగదేశం మధ్యలో ఉండే ఆంధ్ర ప్రాంతవాసులం.ఈ ప్రాంతం ప్రొలునాడు(పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు,తుని, పెద్దాపురం)  కిమ్మూరులోపరగణాలో ఇసుకపల్లి కొత్తపల్లి.చెల్లూరు పరగాణాలో పొన్నాడ, కొమరిగిరి ఉండేవి. 

     అంతకుముందు చూసుకుంటే1087నుండి 1093 వీరచోడుడు పరిపాలనలో వేంగీరాజ్యంలో ( శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం) మనం ఎక్కువగా పరిపాలించబడ్డాం. 

1182 నాటికే సంపర పేరు కనబడుతుంది. పిఠాపురం కుంతీమాదవస్వామి ఆలయంలోని శాసనంలో 1187 లో నవఖండ్రవాడ,కొండెవరం గ్రామాలను ఏర్పరచి కుంతీ మాధవస్వామికి దానంగా ఇచ్చినట్టుఉంది. బహుశా ఇవి ప్రొలునాడుకు దగ్గరగా ఉండటం వలన కాబోలు.అయితే పూర్వం సంపర నియోకవర్గం అక్కడ కొంత ఇక్కడ కొంత ఎలా ఉండేదో పూర్వం కొత్తపల్లి మండలం కూడా అలాగే వున్నట్టు కనబడుతుంది. ఇసుకపల్లి పూర్తిగా వేరే పరగణాలో ఉండేది. ఉప్పాడ గ్రామం గురించి ఆఖరున తెలుసుకుందాం.


కొమరిగిరి

   1353 లో వేమారెడ్డి తరువాత పెద వెంకప్ప జమిందారీ ఏలుబడిలో కొవ్వాడ ,కొత్తపల్లి,  పొన్నాడ ఉన్నాయి. పెద వెంకప్ప తరువాత విస్సామ అనే మహిళ పరిపాలించింది.1399 లో కొమరగిరికి చెందిన గోగ్గయ రాజు పిఠాపురం కుంతీమాదవస్వామికి బృందావనం చేయించి ఇచ్చాడు. వేంగీరాజ్య పాలకుడు రెడ్డిపరిపాలకుడు కాటమవేమారెడ్డి అతని కుమారుడు కుమారగిరి రెడ్డి పేరు మీద కొమరగిరి 1422 లో ఏర్పడింది. చెల్లూరు పరగణాలో ఉన్న కొమరగిరిని కూమారగిరిరెడ్డి విష్ణుభట్టారకుడు అనే బ్రాహ్మణుడికి కరణీకంగా ఇచ్చాడు.అతను అగ్రహారం కట్టించాడు. ఓ ఐదు బ్రాహ్మణ కుటుంబాలు శొంటివారు,ఆదిరాజు వారు ,వెదురూరు వారు,కంభంపాటి వారు ఉండేవారు. కొండెవరంలో కొంత భూమిని దానం చేసి తామ్రపత్రాలు రాసి వంశపారంపర్య హక్కులిచ్చాడు. ఆంధ్రాకు బ్రాహ్మణులు తమిళనాడు నుండి ఎక్కువగా వచ్చారు. వంద సంవత్సరాల తరువాత అగ్రహారం అగ్నికి ఆహుతి అయ్యింది.మద్దాల అప్పలరాజు అనే ఆయన మరలా ఇళ్ళుకట్టించాడు.కొమరగిరికి ఉత్తరాన చెరువు తవ్వించాడు. దక్షిణం వైపు తమ్మవరం కూడా ఆనాటి నుండి ఉంది. తమ్మసాని ఉండేది మేడలో అందుకే తమ్మవరం అని పేరు వచ్చింది.కొమరగిరి మాదన్న అనే వెలమవారు విష్ణుఆలయాన్ని కట్టించాడు. కొమరగిరిలో మల్యాల వెంకట్రావు ఒక శివాలయం కట్టించాడు.అరవైపుట్ల భూమి కేటాయించి ఉత్సవాలు చేసేవాడు.కొమరగిరిని కుమారగిరిరెడ్డి 14 సంవత్సరాలు పరిపాలించాడు.ఒకప్పుడు మండలానికి తలమానికమై భాసిల్లన గ్రామం మండలం మూలలో నిశ్శబ్దంగా మనుగడ సాగించడం కాలం మార్పుగా భావించవచ్చు. ఈ కఫీయ్యత్తును  చెల్లూరు కరణం శీతన్న రాయిస్తే వెంకటశాస్త్రి రాసినట్లుంది.

నిస్సంకుల నాయన


కపిలేశ్వరపురం రాజు దేవుమహారాజు అనుగ్రహంతో నిస్సంకులనాయన అనే బ్రాహ్మణుడు పొన్నాడ,ఇసుకపల్లి కలిపి 21 గ్రామాలు కరణీకం రాయించుకున్నాడు. అతని దగ్గర గుమాస్తాలుగా పనిచే ముగ్గురు గుమాస్తాలు వడ్డావు మారకొండయ్య,నండూరి తిమ్మరాజు,తోలేటి వీర్రాజు, మోసంచేసి రాజమండ్రికి చెందిన కాటంపల్లి వీరయ్య తో చేతులుకలిపి 21 గ్రామాలను నిస్సంకుల నాయన నుంచి లాక్కుని పంచుకుంటారు. పంపకంలో 1573 లో అయ్యపటనేని మార్కండ్రాజు పొన్నాడకు కరణీకం రాయించుకున్నాడు.

1671—79 లో పిఠాపురం జంమిందారు తెలుగు రాయినంగారు

ప్రోలునాడు పరిపాలిస్తున్నపు అతని ఆఖరి కొడుకు రంగసాయి గొల్కొండ నవాబు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. మంచి చదరంగం ఆటగాడు. ఒకరోజు ఆటలో నవాబు అబ్దుల్ హుస్సేన్ ఓడిపోతే రంగసాయి కత్తితో పొడుకుని స్వామి భక్తిని ప్రదర్శిస్తాడు.హుస్సేన్ రంగసాయి ప్రేమకు ముగ్దుడై అతని అన్నలు రావుచందర్రావు,రావు జగ్గారావు ప్రొలునాడు అప్పగిస్తూ పిఠాపురం కోటను ఇస్తాడు. వీరి హయాంలోనే ఏలేరు నదీ నీళ్ళు కిమ్మూరులో పరగణాలో ఉన్న కొత్తపల్లి, ఇసుకపల్లికి ప్రొలునాడు( పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు) మండలాలకు పంచారు. ఆనాటి నుండి మనం ఏలేరు నీళ్ళు సాగుకు ఉపయోగిస్తున్నాం.


కొత్తపల్లి గ్రామం


కొత్తపల్లి గ్రామం కాకినాడ డివిజన్ లో ఎలా అయితే ఉందో ఆశ్చర్యంగా 1080ఆనాటి నుండి కొంకిపర్రు(కాకినాడ), 1420 చెల్లూరు పరిగణాలోను ఉంటూ వస్తుంది. గజపతులు బెజవాడలో రావు వంశీకులను గానుగ ఆడించి చంపడంతో  పిఠాపురం,పెద్దాపురం సంస్దానాలకు వచ్చేస్తారు.  వీరి చరిత్రను పిఠాపురం పెద్దాపురం, చిత్రాడ  రావు వంశీకుల క్రమాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే కొత్తపల్లి వేయి సంవత్సరాల నుండి ఉన్నా వేంగీ పరిపాలనలోనే ఉంది. ఇక పిఠాపురం పెద మహీపతిరావు పెద్దాపురం వత్సవాయిని ఆడపిల్లలకు కట్నకానుకలుగా కోరడంతో బహుశా కొత్తపల్లిని పెద్దాపురం వత్సవాయి ఇచ్చి ఉండవచ్చు అక్కడ నుండి కొన్ని రావు వారి కుటుంబాలు కొండెవరం, కొమరగిరి, కొత్తపల్లికి17 వ శతాబ్దం మొదటిలో తరలి వచ్చాయి. వీరి రాకతో కొండెవరం పిఠాపురం సంస్దానానికి దగ్గరగా ఉండటంతో కొండెవరం ఒ వెలుగు వెలిగింది. అది చెలికాని రామారావు వరకూ సాగింది.క్రమంగా అక్కడ ప్రభావం చూపేవారు తగ్గిపోవడంతో కొత్తపల్లి 1900 దశకంలో వెలుగులోకి వచ్చింది. ఇసుకపల్లి, పొన్నాడ, కొమరగిరి మెల్లగా ప్రాభవం కోల్పొయాయి. వీరి వంశీకుల చరిత్ర పిఠాపురం, పెద్దాపురం రావు వారి క్రమాన్ని చూస్తే తెలుస్తుంది.

ఉప్పాడ గ్రామం

ఇది కైఫియ్యత్తులో ఎక్కడా కనబడదు. సముద్రతీర ప్రాంతమైన కొమరగిరి అనే కనబడుతుంది.అయితే కైఫియతుల ప్రకారం

కొత్తపల్లి తరువాత సముద్రపు తీర ప్రాంతం వరకు దట్టమైన కీకారణ్యం అని చెప్పబడింది.

ఇది 1700 వరకు కీకారణ్యంగానే ఉంది. పిఠాపురం జంమిందారు ,కలెక్టర్లు తుపాకీతో వేటకు వచ్చేవారని చినపువ్వు తెనే కైఫియత్తులో తెలుస్తుంది. కోన ఫారెస్టు అంటే ఉప్పాడ మొదలు వేమవరం వరకూ అతి భయంకరమైన కీకారణ్యం అని చెప్పబడింది. 17 వ శతాబ్దం చివరలో గ్రామం ఏర్పడినట్లుంది నిర్దారించవచ్చు. బ్రాహ్మణులు కొత్తపల్లి నందు ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు వారిలో పాలంకి వారు ఆయుర్వేదం, సన్నిది రాజు

 వారు పౌరహిత్యం చేస్తూ ఉప్పాడలో స్ధిరపడి వుండవచ్చు. వీరితొ పాటే గ్రామం అభివృద్ది చెంది వుండవచ్చు. ఎందుకంటే 17 వ శతాబ్దం చివరలో సన్నిదిరాజు జగ్గకవి రచించిన కురవంజీ అనే తిన్నడు కధను స్వయంగా రాసి వీధి నాటకంగా ప్రదర్శింపచేసేవాడు. వీరి వంశీకులు ఇప్పటికీ పౌరహిత్యం చేస్తున్నారు.ఇక మత్య్సకారులు 1700 శతాబ్దంలో నుండి పూరి, మచిలీపట్నం, బర్మా,ఒరిస్సా,విశాఖ ప్రాంతాలనుండి వలసలు వస్తూ కొనఫారెస్టు వెంబడి స్దిర నివాసం ఏర్పరచుకున్నట్టు ఖాయంగా కనబడుతుంది.


కృతఙ్ఞతలు

బల్లోజు

తూర్పుగోదావరి జిల్లా

కైఫియ్యత్తులు నుండి




Wednesday, October 28, 2020

ఆత్రేయపుం పూతరేకులు


ఆత్రేయపురం పూతరేకులు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పట్టుపరికిణీ మల్లే దండల్లో మురిసి పోతున్నారు అను, రత్న. ఇద్దరూ అక్కచెల్లెళ్ళే కాని ఒకటే హృదయం ఇద్దరిదీ.ఇల్లంతా బందుమిత్రులతో సందడి సందడిగా వుంది. గుమ్మాలకు మామిడితోరణాలు వ్రేలాడుతూ ఉన్నాయి. పెళ్ళి బాజాలు శ్రావ్యంగా మ్రోగుతున్నాయి.

అక్కా చెల్లెళ్ళు  ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఇంటి ముందర తాటాకు పందిరిలోనికి  ఇంటిగదుల్లోకి ఒకటే పరుగులు. వారు పరిగెడుతుంటే కాళ్ళగజ్జెలు చేసే చప్పుడు పెళ్ళిసందడిని మరింత పెంచుతూవుంది. పెళ్ళి పెద్దలు కిళ్ళీలు నములుతూ అను, రత్నలు చేసే అల్లరికి చిరునవ్వులు చిందిస్తూ కబుర్లాడుకుంటున్నారు. అది అను , రత్నల  పెద్దక్క కనకదుర్గ పెళ్ళి రోజు.చాన్నాళ్ళకు వాళ్ళింటిలో పెళ్ళి జరుగుతుంది. పనులు పురమాయిస్తూ అను ,రత్నల నాన్నగారు శ్రీధర్ హడావిడిగా తిరుగుతున్నారు. "ఏమండోయ్ బావగారు  పెళ్ళి కొడుకుది ఏ ఊరు" అని అడిగాడు పెళ్ళి పెద్దల్లో ఒకరైన గంగాధరం కిళ్ళీ ఊస్తూ. "అబ్బాయిది ఆత్రేయపురం"  అంటూ మరో పనిలో పడ్డాడు పెళ్ళికూతురు తండ్రి శ్రీధర్ . ఆత్రేయపురం అనగానే పెళ్ళి పెద్దల్లో కూర్చున్న ప్రభాకరం అనే ఆయన  "ఒహోహో బలే ఊరు సంబంధం అండి. ఆత్రేయపురం పూత రేకులకు చాలా ప్రసిద్ది" అన్నాడు. "దాని గురించి వివరంగా చెప్పండి" అంటూ మడత కుర్చీలో కూలబడ్డాడు  పెళ్ళి పెద్ద రవిబాబు. పూతరేకుల తయారీ గురించి చెపుతుంటే అను, రత్న పరుగు ఆపి నీలిరంగు కుర్చీల్లో వచ్చి  కూర్చున్నారు. ఇద్దరి బుగ్గలు గిల్లుతూ ఆ పెళ్ళి పెద్ద చెప్పడం మొదలు పెట్టాడు" పూతరేకులు లేనిది పెళ్ళి సారెలు నిండుగా ఉండవు. పూతరేకులు రెండు రకాలు బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు, చెప్పాలంటే బెల్లంతో చేసినవి బాగుంటాయి. బొండా రకపు బియ్యంను నానబెట్టి రుబ్బుతారు. రుబ్బిన పిండిని నీటిలో కలుపుతారు . నీరులా ఉన్న ఆ బియ్యం నీటిలో ఓ చేతిరుమాలంత వస్త్రం ముంచి  ప్రత్యేకమైన మట్టితో తయారుచేసిన కుండపై పూతలా పూస్తారు. ఈ కుండ బోర్లించి ఉంటుంది. ఆ కుండ మూతి వద్ద రధ్రం ఉంటుంది. ఆ రధ్రం నుండి కొబ్బరాకులతో అతి చిన్న మంటను పెట్టి కుండను వేడిచేస్తారు. పూతలా పూసిన బియ్యం నీరు కొద్ది క్షణాలలోనే రేకులుగా తయారవుతుందన్నమాట". అని చెపుతుంటే  రఘురాం అనే ఆయన అందుకుంటూ" ఏమండీ ఇది ఏదైనా పెద్ద పరిశ్రమంటారా? " అని అడిగాడు సందేహంగా. "అబ్బే అదేం లేదండి ఇది కుటీర పరిశ్రమే. దాదాపు మూడు వందల కుటుంబాలు తయారీలో ఉంటాయి" అన్నాడు ప్రభాకరం"బాబాయ్ మరి పూతరేకులు తీయగా ఉంటాయి కదా!" అడిగింది అను. నెయ్యి వాసన కూడా వస్తుంది " అంది రత్న  త్వరగా చెప్పమని అక్కచెల్లెళ్ళు ఇద్దరూ తొందర చేయసాగారు. " ఆగండి ఆగండర్రా చెపుతున్నాను. పూతరేకులు తయారైన తరువాత రేకులు చుట్టండం మరొకరు చేస్తారు". " ఏంటి బాబాయ్  రేకులు చేసినవారు చూట్టరా ? ఆశ్చర్యపోతూ అడిగింది రత్న . "ఆహ లేదమ్మా పూతరేకులు ఒకరు చేస్తే చుట్టడం మరొకరు చేస్తారు. ఎక్కువగా మహిళలు పూతరేకులు చేస్తే చుట్టడం ఎక్కువగా మగవారు చేస్తుంటారు"." బాబాయ్  పూతరేకులు ఎలా చుడతారు?" అడిగింది అను.

"పూతరేకు తీసుకుని అందులో గుమగుమలాడే వేడి నెయ్యిని పూస్తారు ఆ తరువాత బాదం, జీడిపప్పు, బెల్లం పౌడరు జల్లి రెండు అంచులు దగ్గర చేసి మడతపెడతారు . ఈ పనిలో కుటుంబంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుంటారు.ఇలా రోజుకు వెయ్యి నుండి రెండువేల పూతరేకులు వరకూ ఒకో కుటుంబం తయారు చేస్తుంది. పది పది చొప్పున చక్కటి అట్టపెట్టెల్లో పేర్చి దేశ విదేశాలకు పంపిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఆత్రేయపురం పూతరేకుల తయారీని ప్రొత్సహిస్తూ ఋణాలను మంజూరు చేస్తుంది కూడా". "బలే ఉంది బాబాయ్ తయారీ విధానం" అన్నారు అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ . ఇలా వీరు మాట్లాడుతుండగా లోపలనుండి అను, రత్నల  అమ్మ నీరజ పూతరేకులు పళ్ళెంలో పట్టుకు వచ్చి పందిరిలోని పెద్దలందరికీ పంచి పెట్టింది. అను, రత్నలు గబ గబా తిని " అబ్బా నోటిలో పెట్టుకోగానే ఉత్తినే కరిగిపోతున్నాయ్ " అనగానే పందిరిలో  ఉన్న పెద్దలందరూ పకపకా నవ్వేశారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పొట్టిక్కలు

 


పొట్టిక్కలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


 కపిలేశ్వరం జంమిందారు కోట చామంతి పూల దండలతో కళకళలాడుతుంది. దసరా పండగ బలే చేస్తారు జమిందారుగారు. కోటలో విందు  జరిగే పందిరి కిటకిటలాడుతుంది. ఫలాహారల సమయం కావడంతో వంటవాళ్ళు వంటలన్నీ వరుసగా పేరుస్తున్నారు. పొట్టిక్కలు, ఇడ్లీలు,మినప గారెలు, పెసరెట్టు, పూరీలు,ఊతప్పాలు, పాయసం,అన్నీ ఉన్నాయి అక్కడ.విందుకు వచ్చిన వారందరూ పొట్టిక్కలను లొట్టలేసుకు తినడంతో ప్రక్కనే ఉన్న ఇడ్లీకి ముఖం మాడిపోయింది.

ఉండబట్టలేక పొట్టిక్కలను సూటిపోటి మాటలతో హేళన చేస్తూ "ఏంటమ్మా పొట్టిక్క పెద్ద ఫోజు కొడుతున్నావ్ నేను ఇడ్లీని తెలుసా. మా పుట్టిల్లు చెన్నై నగరం. సాంబారుతో నన్ను తింటే ఆహా ఓహొ అంటారు అందరూ. కాస్త కారం పొడి నెయ్యి తగించి మరి తింటే ఉంటుందీ ఆ మజాయే వేరు తెలుసా "అంది. పొట్టిక్క చాలా మంచిది. నెమ్మదస్తురాలు. పొట్టిక్క సాంబారు ఇడ్లీతో " సోదరా ఇడ్లీ నన్ను కూడా పొట్టిక్క ఇడ్లీ అనే పిలుస్తారు. మాది కేరళ రాష్ట్రం. కోనసీమ వాసులు కొబ్బరి కాయల వ్యాపారం కోసం నిత్యం మా ప్రాంతానికి వస్తూ పోతూ ఉండటంతో మీ ఆంధ్రాకు కూడా పరిచయమయ్యాను. రావులపాలెం, అంబాజీపేట వాసులు అక్కున చేర్చుకున్నారు. నన్నూ నీలాగే మినపపిండి, ఇడ్లీరవ్వతో చేస్తారు. అయితే ఉత్తి ఆవిరి పట్టరు అదే నా ప్రత్యేకత. నన్ను నాలుగు పసన ఆకులతో చేసిన బుట్టలో వండుతారు. ఆ ఆకులలో వండటం వలన నాకు మంచి రుచి వస్తుంది. నన్ను బొంబాయి చట్నీతో కలిపి తింటే చెప్పానని కాదుకాని మరలా మరలా వడ్డించుకు తింటారు  నువ్వు ఏం కుళ్ళుకోకులే  మనం ఇద్దరం సోదరులమే అంది పొట్టిక్క". 

"బలే బలే ఎంత బాగా మాట్లాడుతున్నావో  

నువ్వు నా లాగే మంచి పేరు తెచ్చుకో  పొట్టిక్క" అంటూ మెచ్చుకుంది ఇడ్లీ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


 

యానాం కాథలిక్ చర్చి

    యానాం కేథలిక్ చర్చి




సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



ఆ రోజు1996  నవంబరు 6.పాండిచ్చేరి శాసనసభ సమావేశాల్లో తీరికలేకుండా ఉన్న యానాం శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావుగారు పదే పదే మ్రోగుతున్న ఫోను అందుకున్నారు. అవతల నుండి వచ్చిన సమాచారం తీవ్ర ఆవేదన కలిగించింది. హుటాహుటిన హెలీకాప్టరులో యానాం బయలుదేరారు.యానాం సెయింట్ ఆన్స్ రోమన్ కేథలిక్ చర్చి ఫాదర్ జోసఫ్ అనితోథన్ ఓ ప్రక్క చర్చి ఆవరణలోని తన గదిలో గాబరాగా పచార్లు చేస్తున్నారు. ఆయన మనస్సు ఆవేదనతో నిండిపోయి వుంది. బంగాళాఖాతంలో వచ్చిన తీవ్ర తుఫాను యానాం పరిసరప్రాంతాలకు తీవ్ర నష్టం చేకూర్చింది.యానాం చర్చి ఆవరణలో ఫాదర్ గాంగ్ లోఫ్ పెంచిన  బొటానికల్ గార్డెన్ తుడిచిపెట్టుకుపోయింది.ఎంతో కాలంగా కాకినాడ పరిసరప్రాంత విద్యార్ధులకు విజ్ఞానాన్ని అందించిన గార్డెన్ తన హయాంలోనే కనుమరుగవ్వండం ఫాదర్ అనిథోతన్ తట్టుకోలేకపోతున్నారు. తుఫాను చేసిన నష్టం విని చర్చిని చూడడానికి ఎమ్మెల్యే కృష్ణారావుగారు వస్తూండటంతో ఇంకా కంగారుగా ఉంది.ఆలోచనలలోంచి బయటకు రాకుండానే ఎమ్మెల్యేగారు ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు. 

 జరిగిన నష్టం వేదన కలిగించడంతో ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకోలేదు. కొంతసేపటికి కృష్ణారావుగారే మాట్లాడుతూ "ఫాదర్ ఈ ఉధ్యానవనంతో నాకు చాలా అనుభందం ఉంది బడి గంట కొట్టగానే పిల్లలందరం పరుగు పరుగున చర్చి దగ్గరకు వచ్చేవారం ఇక్కడ ఫాదర్ గాంగ్ లోఫ్ పిల్లలకు పాలు, పళ్ళు, బిస్కట్లు పంచేవారు  అవి తిని అందరం చీకటి పడేవరకూ ఆడుకుని ఇంటికి వెళ్ళేవారం. అవి ఇక గురుతులుగానే ఉండిపోతాయి." ఎమ్మేల్యే గారి గొంతులో జీర కనపడింది.

ఫాదర్ ఎమ్మేల్యే గారి ఆవేదనను గమనించి మాట మారుస్తూ " సార్ యానాం చర్చి మన దేశంలోని  పురాతనమైన చర్చిల్లో ఇదీ ఒకటి. నీలిమందు వ్యాపారం కోసం వచ్చిన ఫ్రెంచివారు వారి ప్రార్దనలకోసం 1768 నిర్మించారు. అయితే తుఫానుకు చర్చి దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు 1787 లో ఒకసారి కూలిపోయింది. చర్చి నిర్మాణం తిరిగి1835 లో ప్రారంబమై 1846 లో పూర్తయ్యింది. అప్పటి నుండి ఈ తుఫాను వరకూ ఏ నష్టం జరుగలేదు ఇప్పుడు ఇలా జరగడం బాధిస్తుంది.

 ఎమ్మేల్యే కృష్ణారావుగారు మాట్లాడుతూ "  ఫాదర్ ఈ చర్చి మా యానాం పట్టణానికి తలమానికం.  రోమన్ గోథిక్ శైలిలో నిర్మించారు. పర్నీచరు అంతా రంగూన్ టేకుతో చేయబడింది.అందమైన గాజుదీపాలు,అద్దాలు, గంటలు,పూజా సామాగ్రి అంతా ఫ్రాన్సు దేశం నుండే వచ్చింది.ఇది ఓ  చారిత్రక చిహ్నం."

" అవునండి, చర్చి గోపురంలో అమర్చిన గడియారం మరీ ప్రత్యేక మైనది. చర్చికి దూరప్రాంతం నుండి వచ్చేవారు  ఆలయంలోని గోడల పై చుట్టు ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన క్రీస్తు జీవిత విశేషాల చిత్తరువులు చూస్తూ ఎంత ఆనందిస్తారో "అన్నారు ఫాదర్ .

వాచ్ మన్ తెచ్చిన పొగలు కక్కే టీ కప్పును అందుకుంటూ "నిజంగా ఫాదర్. మనదేశంలో అయితే పుదుచ్చేరి, కారైకల్ ,మాహెలలో కూడా ఇటువంటి నిర్మాణాలున్నాయి. ఫ్రాన్సు దేశంలో ఎక్కువగా ఇటువంటివి కనిపిస్తాయి" అన్నారు ఎమ్మేల్యేగారు. 

 ఫాదర్ అనిథోతన్ కూడా తేనీటిని త్రాగుతూ

"ఈ చర్చి ఆవరణలో ఉన్న లుర్దూ మాతను విశ్వాసులు దర్శించండం ఇటీవల పెరిగింది సార్ "

"అవును ఫాదర్ ఆసంఘటనను మా తాతగారు చెపుతుంటే వినేవాడిని 1943 లో విలియమ్ బి ఒడెన్ అనే పది టన్నుల ఓడ సాక్రమౌంట్ లైట్ హౌస్ దగ్గర యానాం సముద్రం మధ్య ఇసుకలో కూరుకుపోతే ఓడను బయటకు తీయడానికి అమెరికా నుండి వచ్చిన ఇంజనీర్ స్వీని సాధ్యంకాక మేరీమాత పై భారం వేసి ప్రార్దన చేయగా ఓడ అతి సులువుగా కదిలి అందరినీ ఆశ్చర్య పరచిందని "

"అవుసార్ మనం చూస్తున్న రాక్ టెంపుల్  ఆయన భార్య అల్బెర్టా స్వీని దానికి గుర్తుగానే నిర్మించారు. దక్షిణంవైపు  ఉన్న మేరీమాత విగ్రహం మంగుళూరు నుండి రప్పించారండి".

ఫాదర్  స్వరం తగ్గించి "సార్  పురావస్తు శాఖ వారు చర్చికి నిధులు మంజూరు చేస్తారని చెప్పారు పనేమైనా ముందుకు వెళుతుందంటారా సార్ "అని అడిగారు.

మాటలపనిలోపడి అసలు విషయం చెప్పడం మరచిపోయాను పురావస్తుశాఖ నుండి నిధులు మంజూరైయ్యాయి త్వరలోనే ఆలయ పునరుద్దరణ పనులు ప్రారంభమవుతాయి అందుకే కాంట్రాక్టరు డేవిడ్ రాజుకు కబురు పంపాను వస్తూ ఉండవచ్చు"

 అని చెప్పేలోగా మోటారుబైకు ఆపి కాంట్రక్టరు పావులూరి డేవిడ్ రాజు లోపలికి వస్తూ ఎమ్మేల్యేగారికి ఫాదర్ కు నమస్కారం చేసి కూర్చున్నాడు.

ఎమ్మేల్యేగారు రాజు వైపు తిరిగి "రాజు చర్చికి నిధులు మంజూరైయ్యాయి పునరుద్దరణ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. యానాం కేథలిక్ చర్చి పురాతన స్వరూపం మారకుండా మరో రెండువందలయేళ్ళు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం చేయాలి" అని నిధుల మంజూరు ఉత్తర్వులు రాజు చేతిలో పెట్టారు ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుగారు.

ఉత్వర్వులు తీసుకున్న రాజు "మేరీమాతకు సేవ చేసే భాగ్యం దొరికిందనుకుంటానండి  మరలా మార్చి నెలలో జరిగే లుర్దూమాత ఉత్సవాలకు సిద్దం చేస్తాను సార్ "అని వినయంగా చెప్పాడు ఎమ్మేల్యే గారికి.

 ఫాదర్ నవ్వుతూ భక్తిభావంతో కనులు మూసి "ఆమెన్ "  అంటూ పైకి లేచారు .



సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




కొండెవరం యుద్దం

 


             కొండెవరం యుద్దం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



శ్రీరామనవమి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరగా ఉన్న కొండెవరంలో బాగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు పేరు పొందిన కళాకారులను రప్పిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. జానపదకళారూపాలు కనీసం ఓ నాలుగురోజులైనా ప్రదర్శిస్తారు. అందులో తప్పెటగుళ్ళు, కోలాటం, డప్పు వాయిద్యం, బుర్రకథ,హరికథ తప్పక ఉంటాయి. ఆ యేడు ఘనంగా  నవమి వేడుకలు నిర్వహించాలని ఆలయ కమిటీ 

మీటింగు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంది. గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆలయ ధర్మకర్త .ఆయన అధ్యక్షతనే సభ జరుగుతుంది. "భక్తులారా! చుట్టుప్రక్కల ఊళ్ళలో మన ఊరి శ్రీరామనవమి ఉత్సవాలకు ఉన్న మంచి పేరు మీ అందరికీ తెలుసు. ఆ పేరును మరింత పెంచేలా ఈ యేడు  వేడుకలు నిర్వహించాలి. అందుకు ఎలాంటి కార్యక్రమాలు ఉండాలో సూచించండి" అని కూర్చున్నారు. కమిటీ సభ్యుల్లో సత్యనారాయణ లేచినిలబడి అయ్యా మన ఊరి చరిత్ర 300  ఏళ్ళ క్రితం నాటిది. కొండెవరం యుద్దం లేదా చెందుర్తి యుద్దం లేదా చందవోలు యుద్దంగా పిలుస్తారు. ఆనాటి కథను మనకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగే వాళ్ళు ఒకరున్నారు వారిని పిలిపిద్దాం అన్నాడు. సభలో ఒకటే అలజడి "ఈ చరిత్ర ఎవరికీ తెలియదు తప్పకుండా పిలిపించండి" అని సభ్యులు గోలచేయసాగారు. "ఆగండి ఆగండి,  గోల చేయడం సభా మర్యాదకాదు నిశ్శబ్దం పాటించాలి " అని  అధ్యక్షుడు గదమాయించి  "సత్యనారాయణ గారు మీరు చెప్పింది బాగుంది వివరాలు చెప్పండి" అన్నారు . సత్యనారాయణ మాట్లాడుతూ "జముకుల కథ చెప్పే వారు ఉన్నారండి వారు కొండెవరం యుద్దం కథాగానం చేస్తారు. మన ఊరి కథను మనవారికి తెలియజేద్దాం" అని ముగించి కూర్చున్నాడు సత్యనారాయణ. "తప్పకుండా జముకుల కథ ఉంటుంది. నవమి మొదటిరోజే ఏర్పాటు చేద్దాం" అని సభ ముగించారు. ఈవిషయం బడిలోని సోషలు మాస్టారు కామేశ్వరరావుగారికి తెలిసింది. ఆయన పిల్లలను ఉద్దేశించి చెపుతూ పిల్లలూ" మీకు నేనిచ్చే ప్రాజెక్టువర్కు ఏంటో తెలుసా?"  "చెప్పండి సార్" పిల్లలు ఒకటే అరుపులు బల్లలపై దరువులు. ఏమిటంటే నవమికి జముకులవారు చెప్పే మన కొండెవరం యుద్దం చరిత్రగానాన్ని విని చక్కగా కథలా రాసి చూపించాలి. అదే ఈ నెల ప్రాజెక్టువర్కు " అని చెప్పగానే  "ఒకే సార్ " అంటూ పిల్లలు బల్లలు చరచసాగారు. 

నవమి కార్యక్రమాలలో  ఆ యేడు జముకుల కథ హైలెట్ అయ్యింది.

పిల్లలు ఆలకించి వీరావేశం పొందారు. ఇంటికి పోయి ప్రాజెక్టువర్కు పూర్తిచేసారు. బడిలొ మాస్టారుకు చూపించారు. సోషలు మాస్టారు  విద్యార్ది రమణ రాసిన ప్రాజెక్టు వర్కును ఎంపిక చేసి తరగతిలో ఇలా చదవడం ప్రారంబించారు.

"అది 1758 సెప్టెంబరు నెల బుస్సీ అధికారంలోని  ఫ్రెంచివారు విజయనగరం రాజులను ఇబ్బందులు పాలుజేస్తున్నారు. యుద్దానికి సై అంటున్నారు. బలహీనుడైన విజయనగరం ఆనందగజపతిరాజు బ్రిటీష్ వారి సహాయం కోరక తప్పలేదు .బ్రిటీష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ కొంతమంది సైనికులను రాబర్ట్ ఫోర్డ్ కు ఇచ్చి యుద్దానికి పంపాడు. ఫ్రెంచివారిని తరిమి కోస్తా ఆంధ్రాపై ఎప్పటినుండో పట్టుసాదిద్దామనుకుంటున్న బ్రిటీష్ సైన్యానికి ఆనందగజపతిరాజు ఆహ్వనం కోతికి కొబ్బరికాయ దొరికినట్లయ్యింది. 


కొండెవరం నుండి చెందుర్తి వరకూ దీనినే ఒకప్పుడు చందవోలు అని పిలిచేవారు ఈ ప్రాంతమంతా ఘోరమైన యుద్దం జరిగింది. ఫ్రెంచివారు ఓడిపోతున్న సమయంలో  ఆనందగజపతిరాజు నుండి, బ్రిటీష్ సేనలనుండి ప్రమాదాన్ని పసిగట్టిన పెద్దాపురం వత్సవాయి గజపతిరాజు ఫ్రెంచివారికి సహయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ యుద్దం విజయనగరం రాజులు, బ్రిటీష్ వారు ఓ ప్రక్క మరియు పెద్దాపురం రాజులు ఫ్రెంచివారు ఓ ప్రక్క ఉండి చేసిన యుద్దం అన్నమాట. బ్రిటీష్ వారు నైజాం రాజులతో సంధి కుదుర్చుకోవడంతో  విజయనగరం ఆనందగజపతరాజు ఓడిపోయాడు. ఇది భారతదేశంలో జరిగిన అతి నిర్ణయాత్మక యుద్దంగా గుర్తించబడింది. అని  మాస్టారు చదవడం ముగించారు. చక్కగా వివరంగా రాసిన రమణను విద్యార్దులు చప్పట్లతో అభినందించారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




జాంథానీ

       

           ఉప్పాడ జాంథానీ చీరలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



       తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ మీదుగా ఎర్రటి మారుతి కారు ఉప్పాడ గ్రామానికి పరుగులు పెడుతుంది. బీచ్ రోడ్డు పైకి దూసుకు వచ్చే కెరటాలకు ఓ ప్రక్క భయం మరో ప్రక్క ఆనందంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణకు ,లక్ష్మికి విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు .ఇద్దరూ కవలపిల్లలు కూడా కావడంతో ఒకే తరగతి చదువుతున్నారు.లక్ష్మి ఆలోచనలన్నీ చీరల చుట్టూ తిరుగుతున్నాయి. ఎనిమిదవ తరగతి ఆంగ్లపాఠం "ద స్టొరీ ఆఫ్ ఐకత్" చెప్పేప్పుడు విన్నాను ఉప్పాడ జాంథానీ చీరల గురించి, అదే ఆలోచిస్తుంటే సముద్రపు కెరటం ఒకటి కారు అద్దాలను దబ్బున తాకింది. లక్ష్మి కెవ్వున కేక పెట్టి సీటులో కూలబడింది . తల్లి దుర్గావతి వాట్స్ యాప్ చాటింగ్ లోంచి బయటకు వస్తూ ఇద్దరినీ గోలచేయకుండా కూర్చోమని కసిరింది. తండ్రి గంగాధర్ డ్రైవింగ్ చేస్తూ ఎత్తు బ్రిడ్జి దగ్గర కొంతసేపు ఆపి సముద్రం అందాలు చూపించాడు. రాళ్ళ మధ్య నిలబడి సముద్రపు అలలు కనిపించేలా ఫోటోలు తీసుకున్నాం. మరలా ఉప్పాడ వైపు పోనిచ్చాడు కారుని నాన్న. కాకినాడకు  ఉప్పాడకు మధ్య దూరం 20 కి.మీ .



     కృష్ణకు అంత ఆసక్తి లేదుగాని లక్ష్మికి మాత్రం జాంథానీ చీరల తయారీ ఎప్పుడు ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. తల్లి దుర్గావతి నాన్నను జాంథానీ చీర ఎప్పుడు కొంటారని పోరుపెట్టడం రోజూ చూస్తునే ఉంది. ఆ చీర చాలా ఖరీదని అమ్మ ఎవరితోనో చెబుతుంటే విన్నది లక్ష్మి. ఒక్కో చీర ఐదువేల నుండి లక్షవరకూ కూడా ఉంటుందని చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఉప్పాడ గ్రామంలోకి ప్రవేశించే సరికి బీచ్ రోడ్డు సెంటరు కనిపించింది. మలుపు తిరిగి పిఠాపురం రోడ్డుకు టర్న్ తీసుకుంది కారు. ఉప్పాడ కొత్తపల్లి జంటగ్రామాలు రెండు గ్రామాలలో చీరలు నేస్తారు కాని ఉప్పాడ చీరలుగానే ప్రసిద్ది. "పూర్వం జైపూర్ మహారాణి ఉప్పాడను ఆనుకుని ఉన్న అమీనాబాదలో వీరరాఘవులు అనే చేనేత కార్మికుడితో చీరలు నేయించుకునేవారట అందుకే ఇది గొప్పవారి చీరగా బావించి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. కాని ఇటీవల దేశవ్యాప్తంగా బాగా పేరుపడింది." కారు నడుపుతూ చెపుతున్నాడు నాన్న. ఉప్పాడ సినిమా సెంటరుకు వచ్చేసరికి ఎక్కడ చూసినా  చీరల షాపులే. ప్రతీ ఇల్లు ఓ బట్టల దుకాణమే . అందుకే అన్నట్టున్నారు చేనేతను కుటీర పరిశ్రమ అని. కారు ఆపితే అందరం దిగాం నాన్న ఎవరికో ఫోను చేస్తే వచ్చి చీరల షాపులకు తీసుకువెళ్ళారు.అమ్మ అతనితో ఒకసారి చీర ఎలా నేస్తారో చూపించమని అడిగింది. అలాగేనంటూ అతను తలాడించి చీరలు నేచే ఇళ్ళకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలు చీర నేయడం కనిపించింది. ఓ ప్రక్క కుర్చీలో సేదతీరుతున్న మాస్టర్ వీవరు దగ్గర ఉండి నేయిస్తున్నాడు. చీరకు కావలసిన ముడి సరకునంతా ఇతనే సమకూరుస్తాడు. మా అందరికీ కుర్చీలు వేయించాడు. అక్కడే తిరుగుతున్న ఓ అమ్మాయికి చెవిలో ఏదో చెపితే  అది విని అమ్మాయి హడావిడిగా బయటకు పరిగెత్తింది.

"సార్ చీరలు కొనుగోలుకు వచ్చాం కాని కొనేముందు జాంథానీ చీరల తయారీ దాని విశిష్ఠత తెలుసుకోవాలనుకుంటున్నాం"  అన్నాడు నాన్న మాట కల్పించుకుంటూ . "తప్పకుండా జాంథానీ చీర పుట్టింది బంగ్లాదేశ్ దేశంలో. "జాం "అంటే పూలు "థానీ" అంటే గుత్తి అంటే పూలగుత్తి" అంటుంటే నేను" ప్లవర్ బోకే అన్నమాట " అన్నాను. ఆయన నవ్వేస్తూ "అంతేనమ్మా చీరను చేతిలోనికి తీసుకుంటే ఆ బావన కలుగుతుంది కాబట్టే ఆ పేరు వచ్చింది,  ఏం చదువుతున్నావ్ ?" అని అడిగారు నన్ను మురిపెంగా చూస్తూ మాస్టర్ వీవర్ ." ఎనిదవ తరగతి అండి " అని బదులిచ్చాను. అమ్మ మధ్యలో మాట్లాడకు చెప్పనీ" అంది విసుగు ప్రదర్శిస్తూ. "పరవాలేదండి పిల్లలు ప్రశ్నలు వేస్తూ సందేహాలు తీర్చుకోవాలి." అన్నాడు మాస్టర్ వీవరు. 

       "అతి సున్నితమైన దారపు నూలుపోగులను సన్నని చేతివేళ్ళు కలిగిన చిన్నవయస్సు వారే నేస్తారు. దీనిని పెద్ద వయస్సు వారు నేయలేరు"  అన్నాడు మాస్టరు వీవరు అన్నయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం.  "ఎందుకని ? అడిగాను ఆశ్చర్యం ప్రదర్శిస్తూ. "ఎందుకంటే జాంథానీ దారపు పోగులు అతి సన్నగా సుతి మెత్తగా ఉంటాయి పెద్దవారి చేతులకు దారాలు తెగిపోతాయి అందుకని చిన్నవయస్సు వారే నేస్తారు." చెప్పాడు మాస్టర్ వీవరు. అన్నయ్య కృష్ణ "చీరలు నేచే వాళ్ళను ఏమంటారు? అని అడిగాడు."మగ్గం నేతగాళ్ళు లేదా నేతగాళ్ళు"  అంటారు." "జాంథానీ చీరలు యంత్రాలమీద నేస్తారండీ ?" అని అడిగాడు నాన్న.

"లేదండి పూర్తిగా చేనేత మగ్గం మీదే నేస్తారు. వెండి జరీతో నేయడం వల్ల దీని ఖరీదు ఎక్కవ  అందుకే దీనికి అంత డిమాండ్ కూడా "

" ఏ రకమైన డిజైన్ల చీరలు పేరు పొందాయంటారు? " అమ్మ అడిగింది. 

" కాటను చీరలు, పట్టుచీరలను మగ్గం పై నేస్తారు. ఇక చీరలలో రకాలంటే పల్లులు, అంచు లతలు, ఆల్ ఓవర్ ఉంటాయి. ఇక డిజైన్లు అయితే మల్లెపందిరి,త్రిశూల, మధులత , బోర్డరు చిలకలు, దండా చిలుకలు, దర్బారు, శ్రీలత  పేరుబడ్డాయి". బయటకు వెళ్ళిన అమ్మాయి గబగబా వస్తూ సర్వింగ్ ప్లేటులో బూందీ, ఉప్పాడ కజ్జికాయ స్వీటు తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది. నేను అన్నయ్య ఆత్రంగా తింటుంటే అన్నయ్యకు పొలమారింది. అమ్మ హేండ్ బేగ్ లోనుండి వాటర్ బోటిల్ తీసి తాగిపించింది. 

నాన్న మాస్టరు వీవరుతో "బుటా వర్కు అని విన్నాను. ఏమిటి కాస్త వివరంగా చెప్పండి" అని అడిగాడు. "బుటావర్కునే చుక్కతీయడం అంటారు. చిన్న చిన్న ఆకులు, రెమ్మలు, పువ్వులు డిజైన్లుగా చీరమీద ఖచ్చితమైన దూరం, సైజుతో  చీర మీద చేతితో అల్లుతారు. ఈ బుటా పనితనమే జాంథానీకి ప్రత్యేకత తీసుకువచ్చింది." అని ఒకించిత్ గర్వం తొణికిసలాడే స్వరంతో అన్నాడు మాస్టర్ వీవరు.

      "అమ్మా మగ్గం చూపించమనవే"  అంటూ అడిగాను నేను ఖాళీ చేసిన పేపరు ప్లేటును క్రిందపెడుతూ" నా మాట విని మాస్టర్ వీవర్ "రండి చూపిస్తాను" అంటూ కుర్చీలోంచి పైకి లేచాడు. అందరం అతని వెనుకే అనుసరించాము. ఆయనే మగ్గం పనిని వివరిస్తూ "మగ్గాలు గుంట మగ్గాలు,స్టాండు మగ్గాలుగా అని ఉంటాయి. మగ్గంపై ముగ్గురు పనిచేస్తారు. మధ్యలో కూర్చున్నవారు  చిలక లాగుతూ ,సప్పాలు తొక్కుతూ మగ్గాన్ని ఆడిస్తే అటూ ఇటూ ఉన్నవారు  చుక్కతీస్తుంటారు. 

 ఇదిగో చూడండి  ఈ పొడవాటి దారపు పోగులను పడుగు అంటారు. కోర అనే తెల్లటి దారాలకు రంగులు అద్ది తయారుచేస్తారు. అడ్డంగా అల్లే దారాన్ని  పేక అంటారు."

"మగ్గం టకు టికూ మని శబ్దం వస్తుందేమిటండీ" అమాయకంగా అడిగాడు అన్నయ్య. అందరూ నవ్వేశారు " మగ్గానికి క్రిందనున్న సప్పాలతో తొక్కి మగ్గం పైనున్న చిలుకను లాగినప్పుడు  రెండు వరుసలలో ఉన్న పడుగు క్రిందది పైకి పైది క్రిందకు వెడుతుంది అప్పుడు అడ్డునేత నాడి అనే పరికరంలో బిగించిన దారపుకండె అటూ ఇటూ అల్లుతూ ఉంటుంది . ఆ నాడి చేసే శబ్దమే నువు విన్నది "  అన్నాడు మాస్టర్ వీవరు . నాన్న మధ్యలో మాట్లాడుతు "రాట్నం మీద కండెలు చుడతారు ఇందుకేనేమో "అన్నాడు. "నిజం చెప్పారు కండెలు చుట్టేవారు ప్రత్యేకంగా ఉంటారు. పెళ్ళిళ్ళకు ప్రత్యేక ఆర్డరుపై అతి ఖరీదైన చీరలు నేస్తూ ఉంటాం రాజకీయ ప్రముఖులు, సీనీ తారలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ వుంటారు." "నేత పనిలో ఎటువంటి కష్టనష్టాలు ఉన్నాయంటారు ?  అమ్మ అడింగింది మాస్టరు వీవరును. "లేకేం చుక్క తీసేవారికి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గుంట మగ్గాలలో పని చేసేవారికి దోమల ద్వారా బోదకాలు వంటి రోగాలుకు గురవుతున్నారు." అందరం ముఖాలు చూసుకున్నాం ఇక వెడదామన్నట్టు. "నమస్కారమండి చాలా విషయాలు మాకు తెలియజేసారు. మంచి నాణ్యమైనవి ఓ రెండు చీరలు తీసుకుంటాను చూపించండి" అన్నది అమ్మ. "పదండి మా షాపు మా ఇంటి దగ్గరే ఉంది" అంటూ ముందుకు నడిచాడు మాస్టరు వీవరు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



ALIVI